breaking news
Parvathipuram Sub Plan
-
ఏరియా ఆస్పత్రిలో రక్తం నిల్వలు నిల్
పార్వతీపురం: స్థానిక ఏరియా ఆస్పత్రిలోని రక్తనిధిలో నిల్వలు నిండుకున్నాయి. వేసవి కారణంగా రక్తదాతలు ముందుకురాకపోవడంతో మంగళవారం నాటికి 8 ప్యాకెట్ల(యూనిట్ల) రక్తం మాత్రమే నిల్వ ఉంది. ఈ విషయమై రక్తనిధి ఇన్చార్జి జి.వాసుదేవరావు మాట్లాడుతూ పార్వతీపురం సబ్‌ప్లాన్ ప్రాంతంతోపాటు సమీప శ్రీకాకుళం జిల్లా, ఒడిశా తదితర ప్రాంతాలకు చెందిన రోగులు ఆస్పత్రికి అధికంగా వస్తున్నారని చెప్పారు. వీరిలో పలువురికి రక్తం అవసరమవుతోందని చెప్పారు. కానీ రక్తదానం చేసేందుకు కొద్దిమంది మాత్రమే ముందుకు వస్తుండటంతో అవసరాలు తీరడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి రోజు 8 నుండి 10 ప్యాకెట్ల(యూనట్ల) రక్తం అవసరమవుతుందని తెలిపారు. దీనికితోడు అన్-స్క్రీన్డ్ రక్తం నిల్వ చేసేందుకు ఫ్రిజ్ లేదని చెప్పారు. మరోవైపు ఏపీసాక్స్ కి ట్ల పంపిణీ ఆగిపోయిందన్నారు. దీంతో అవస్థలు తప్పడం లేదన్నారు. రక్తదానానికి ఎప్పుడూ ముందుకొచ్చే దాతలు తప్ప కొత్తవారు రావడం లేదన్నారు. దీనిపై స్వచ్ఛంద సంస్థల వారు స్పందించాలని విజ్ఞప్తి చేశారు. రక్తదానంపై యువతకు అవ గాహన కల్పించాలని సూచించారు. -
ఇంకా బయటేనా..?
గిరి బాలలు బడి బయటే ఉండిపోతున్నారు. దశాబ్దాలుగా విద్యకు దూరంగా ఉంటున్నారు. అయినా ఇక్కడి అధికారులు పరిశీలన ఊసెత్తరు. టీచర్లు స్కూలు ముఖమే చూడరు. ఇప్పటికీ ఇక్కడి బాలలు పశువులు మేపుకుంటూ, కొండల్లో కట్టెలు కొట్టుకుంటూ రోజులు గడిపేస్తున్నారు. అక్షరాల వెలుగులు అందక అజ్ఞానపు చీకటిలో మిగిలిపోతున్నారు. పార్వతీపురం: పార్వతీపురం సబ్-ప్లాన్ గ్రామాల్లోని గిరిజన పిల్లలు బడి బయటే ఉండిపోతున్నారు. తల్లిదండ్రులకు అవగాహన లేకపోవడం, చదు వు వల్ల కలిగే ప్రయోజనాలు తెలియకపోవడంతో పిల్లలు స్కూలు గడప తొక్కకుండానే బాల్యం గడిపేస్తున్నారు. పార్వతీపురం సబ్-ప్లాన్‌లోని మండలాల్లో కొన్ని గిరిజన గ్రామాలలోని టీచర్లు నెలల తరబడి బడి ముఖం చూడకపోవడంతో బడులు తెరచుకునే పరిస్థితులు లేవు. కొమరాడ, సాలూ రు, పాచిపెంట, గుమ్మలక్ష్మీపురం, కురుపాం, జియ్యమ్మవలస తదితర మండలాల్లోని పలు గిరిశిఖర గ్రామాలకు టీచర్లు పబ్లిక్‌గా డుమ్మా కొడుతున్నారు. సంబంధిత ఉన్నతాధికారుల పర్యవేక్షణ, పనిష్మెంట్లు లేకపోవడంతో ఐటీడీఏ, ఎంపీపీ యాజమాన్యాల్లో పనిచేస్తున్న పాఠశాలలు కనీసం నెలకొకమారు కూడా తెరచుకున్న పాపాన పోలేదు. వేలల్లో జీతాలు తీసుకుంటున్న కొంత మంది టీచర్లు ఆయా గ్రామాల్లో యువకులకు *1000లు, *2000లు ఇచ్చి బడులు నడిపిస్తున్నారు. ఈ విషయం అందరికీ తెలిసినా... సంబంధిత ఉన్నతాధికారుల హస్తం కూడా ఉండడంతో గిరిశిఖర బడులు తెరచుకోకుండా ఉన్నాయి. దీంతో ఆయా గ్రామాల పిల్లలు బడికి దూరంగా పశువులు కాపర్లుగా, అడవిలో అటవీ సంపాదన సేకరించేందుకు పరిమితమవుతున్నారు. అంతంత మాత్రమే డ్రాపౌట్స్ చేరిక సీతానగరం మండలంలో 62 పాఠశాలలుండగా, ఏడుగురు బడి ఈడు పిల్లలున్నారని, ముగ్గురు బడిబయటే ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. అలాగే పార్వతీపురం మండలంలో 56 పాఠశాలలుండగా, 35 మంది బడి బయట ఉన్న పిల్లలున్నారు. గుమ్మలక్ష్మీపురం మండలంలో 188 పాఠశాలలుండగా దాదాపు 137 మంది వరకు బడిబయట పిల్లలున్నారు. ఇక గరుగుబిల్లి మండలంలో 35 మంది డ్రాపౌట్స్ ఉండగా, 9 మంది మాత్రమే చేరారు. అలాగే బలిజిపేట మండలంలోని 38 మంది డ్రాపౌట్స్ ఉండగా 9 మంది మాత్రమే పాఠశాలల్లో చేరారు. ఇలా కనీసం 50 శాతం కూడా బడిబయట ఉన్న పిల్లల్ని బడిలోకి చే రలేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా నాయకులు, అధికారులు గిరి ప్రాంతంలోని పిల్లల భవిష్యత్‌పై దృష్టి పెట్టాలని, పిల్లలను బడికి పంపించేలా ఏర్పాట్లు చేయాలని పలువురు కోరుతున్నారు.