breaking news
Parliment Bill
-
పేరు సరే... తీరు మారేనా?
2005లో నాటి యూపీఏ–1 ప్రభుత్వం ‘మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ చట్టం’ పేరిట, గ్రామీణ కుటుంబాల వారికి సాలీనా వంద పని దినాల ఉపాధి హామీ చేస్తూ ఒక పథకాన్ని ప్రవేశ పెట్టింది. దాని కింద అర్హులైన గ్రామీణ పేదలకు వారు పనిని కోరిన 15 రోజుల లోగా ఉపాధిని కల్పించవలసి ఉంటుంది. అలా జరగకుంటే, వారికి నిరుద్యోగ భృతిగా, నిర్దిష్ట మొత్తాన్ని అందించవలసి ఉంటుంది. గ్రామీణ పేదలకు, వారికి రోజువారీ కూలీ పనులు దొరకని రోజులలో, వారికి ఉపాధిని కల్పించడం ద్వారా, వారి కొనుగోలు శక్తినీ, మార్కెట్ డిమాండ్‌నూ కాపాడటం ఈ పథకం లక్ష్యం. ఈ పథకం తన ఉద్దేశిత లక్ష్యాలను అత్యద్భుతంగా నిర్వహించగల్గింది. దీనికి తార్కాణమే 2008లో అమెరికా కేంద్రంగా ఏర్పడిన ఆర్థిక సంక్షోభ ప్రభావంతో ప్రపంచ వ్యాప్తంగా ప్రజల కొనుగోలు శక్తీ, మార్కెట్ డిమాండ్ పతనమైన కాలంలో ఈ జాతీయ ఉపాధి హామీ చట్టం మన దేశ ఆర్థిక వ్యవస్థను నిలబెట్టింది. ఆ సంక్షోభ తీవ్రతకు తార్కాణమే, 2007–08 కాలం వరకూ సగటున 9%గా ఉన్న మన దేశీయ ఆర్థిక వృద్ధి రేటు 2008–09లో 6.7%కి పతనం కావడం. అదా ఘనత?ఈ క్రమంలోనే 2009 ఫిబ్రవరిలో, దేశ బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన నాటి ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ ఈ పథకానికి కేటాయింపులను, అంతకు ముందరి సంవత్సరపు బడ్జెట్లో కంటే 144% మేరన భారీగా పెంచారు. తద్వారా నాడు ఆర్థిక మందగమనాన్ని అధిగమించేందుకు ఈ పథకాన్ని యూపీఏ ప్రభుత్వం ఆసరాగా చేసుకుంది. ఈ పథకానికి కేటాయింపులను పెంచడం వలన అప్పటి (2008–09) ప్రభుత్వ ద్రవ్య లోటు, దేశ స్థూల జాతీయ ఉత్పత్తిలో 6.2%కి పెరిగింది. ఈ ద్రవ్య లోటు, అంతకు ముందరి ఆర్థిక సంవత్సరం (2007–08)లో కేవలం 2.7%గా ఉండటం గమనార్హం. అంటే, నాటి యూపీఏ ప్రభుత్వం సంక్షోభ పరిస్థితులలో ప్రజల కొను గోలు శక్తిని కాపాడేందుకుగానూ ప్రభుత్వ వ్యయాలకు లక్ష్మణ రేఖగా భావించబడే ద్రవ్య లోటు పరిమితులను కూడా దాటేందుకు వెనుకాడలేదు. అయితే, యూపీఏ–2 హయాం చివరి నాటికే, ఈ పథకం అమలులో మొదలైన అలసత్వం, మోదీ నేతృత్వంలోని ఎన్డీయే పాలనలో మరింత తీవ్రతరమైంది. ఈ సందర్భంలోనే మోదీ, జాతీయ ఉపాధి హామీ చట్టాన్ని కాంగ్రెస్ పార్టీ 60 ఏళ్ల పాలనా వైఫల్యాలకు సజీవ తార్కాణంగా పేర్కొనడాన్ని గుర్తు చేసు కోవచ్చు. అంతకాలం తరువాత కూడా ప్రజలకు జీవనోపాధిగా ఈ పథకం అవసరం ఏర్పడిందనేది మోదీ మనోగతం. విమర్శ బాగానే ఉంది. కానీ, నేడు మోదీ హయాంలోనూ 80 కోట్ల మందికి, ధాన్యం గింజలను ఉచితంగా పంచే ‘ప్రధాన మంత్రి గరీబ్ కల్యాణ్ అన్న యోజన’ పథకం అమలులో ఉండటం ఏ ‘ఘనత’కు తార్కాణం?కేటాయింపులేవీ?నిజానికి, ద్రవ్యోల్బణాన్ని పరిగణనలోకి తీసు కుంటే, ఈ పథకానికి కేటాయింపులు, ఏటికేడు తగ్గి పోతున్నాయి. 2025–26 బడ్జెట్లో కేటాయింపు రూ. 86 వేల కోట్లు. అంతకు ముందరి బడ్జెట్(2024– 25)లోనూ కేటాయింపులు దరిదాపు అంత మొత్తమే. 2025–26 బడ్జెట్‌ను ప్రవేశ పెట్టిన ఫిబ్రవరి 1, 2025 నాటికి, దాని ముందరి బడ్జెట్ కాలానికి సంబంధించిన రూ. 9,860 కోట్ల నిధుల లోటు ఉంది. 2025 జన వరి 25 నాటికి చెల్లించకుండా ఉండిపోయిన, కూలీల వేతనం బకాయి రూ. 6,948 కోట్లు. అంటే, వీటన్నింటినీ ఈ సరికొత్త 2025–26 బడ్జెట్ కేటాయింపులో భర్తీ చేసుకోవాలి.మరో కోణాన్ని తప్పనిసరిగా చెప్పుకోవాలి. ఈ పథకం సాలీనా 100 రోజుల పని దినాలను హామీ చేసింది. వాస్తవంలో అనేక సంవత్సరాలుగా తలసరిన ఒక్కో కూలీకి లభిస్తోన్న పని దినాలు 50 మాత్రమే. ఫిబ్రవరి 2025 గణాంకాల ప్రకారం, లభించిన పని దినాలు 44 మాత్రమే. అలాగే, వేతనాల చెల్లింపులకు ఆధార్ అనుసంధానం పేరిట అదనపు చిక్కుముడులు, డిజిటల్ హాజరు అంటూ సృష్టించిన సంక్లిష్టతల నేపథ్యంలో గ్రామీణ పేదలకు ఉద్దేశించిన ఈ పథకం మరికొంత దూరమయ్యింది. నేడు సరికొత్తగా కేంద్ర ప్రభుత్వం తెచ్చిన ‘వీబీ – జీ రామ్ జీ’ బిల్లులోని బయో మెట్రిక్ ధ్రువీకరణలు, జియో స్పేషియల్ టెక్నాలజీల తప్పనిసరి అమలు వంటివన్నీ పేద ప్రజానీకానికి ఈ పథకాన్ని మరింత దూరం చేసేవే. వీటన్నింటికి తోడు...ఇదంతా చాలదన్నట్లుగా ఈ సరికొత్త పథకం తీరు ‘సొమ్మొకడిది సోకొకడిది’గా మారుతోంది. గతంలో, 90% నిధులను కేంద్ర ప్రభుత్వం భరించేది. మిగతా 10% మాత్రమే రాష్ట్ర ప్రభుత్వాల వాటాగా ఉండేది. ఇప్పుడు కేంద్రం వాటాను 90% నుంచి 60%కి తగ్గించుకొని, రాష్ట్రాల వాటాను 10% నుంచి 40%కిపెంచేశారు. 2017లో అమలులోకి వచ్చిన జీఎస్టీ వలన పన్నుల ఆదాయంలో కేంద్రం వాటా పెరిగిపోయింది. ఆర్థిక వనరుల విషయంలో కేంద్రం పెత్తనం పెరిగింది. ఇప్పుడు ఈ సరికొత్త ఉపాధి పథకం రూపంలో రాష్ట్రా లపై మరింత భారాన్ని పెడుతున్నారు. అదీ కథ!ఇక, ‘ఉట్టికెక్కలేనమ్మ, స్వర్గానికి ఎగురుతాను అన్నట్టుగా’ ఈ కొత్త పథకం, దాని పాత రూపంలోని వంద రోజుల పని దినాల హామీ స్థానంలో... 125 రోజుల ఉపాధిని వాగ్దానం చేస్తోంది. పథకానికి బడ్జెట్ కేటాయింపులు తగిన మేర లేకపోవడం, రకరకాల బ్యురాక్రటిక్ ఆటంకాల వలన ఈ పథకం ఇప్పటికే అరకొరగా నడు స్తోంది. అలాంటిది పని దినాలను 125 రోజులకు పెంచుతున్నామంటూ చేస్తోన్న సరికొత్త వాగ్దానం, నిజంగా అమలు జరిగేనా? పాత పథకం పేరులోని మహాత్మా గాంధీ పేరును తొలగించి వేయడం నేడు వివాదానికి మరొక కేంద్ర బిందువు అవుతోంది. పథకం పేరు నుంచి గాంధీని మినహాయించడం కూడా, ఆయన ఆత్మకు కొంత శాంతిని కల్గించడమేనేమో! సత్యాన్ని నమ్ముకున్న గాంధీజీ పేరు... అసత్యానికి మేలి ముసుగుగా ఉపయోగపడకపోవడం కాస్తంత మంచిదే!‘వీబీ – జీ రామ్ జీ’ పథకం, దాని పాత రూపంలోని వంద రోజుల పని దినాల హామీ స్థానంలో... 125 రోజుల ఉపాధిని వాగ్దానం చేస్తోంది. బడ్జెట్ కేటాయింపులు తగిన మేర లేకపోవడంతో ఆ పథకం ఇప్పటికే అరకొరగా నడుస్తోంది. అలాంటిది పని దినాలను పెంచుతున్నామంటూ చేస్తున్న వాగ్దానం నిజంగా అమలు జరిగేనా?డి.పాపారావు-వ్యాసకర్త సామాజిక, ఆర్థిక రంగాల విశ్లేషకులుమహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని రద్దు చేస్తూ, కేంద్ర ప్రభుత్వం ‘వికసిత్ భారత్ – గ్యారెంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ అజీవికా మిషన్ (గ్రామీణ)‘ (వీబీ–జీ రామ్ జీ) అనే నూతన బిల్లును లోక్‌సభలో ఆమోదించింది. ‘వికసిత్ భారత్–2047’ లక్ష్యంలో భాగంగా ఈ మార్పులు చేస్తున్నట్లు ప్రభుత్వం చెబుతున్నప్పటికీ, దీని వెనుక ఉన్న నిబంధనలు గ్రామీణ శ్రామిక వర్గం హక్కులను కాలరాసేలా ఉన్నాయి. ఈ బిల్లులో 8 అధ్యాయాలు, 37 సెక్షన్లు, రెండు షెడ్యూళ్లు ఉన్నాయి. ఎమ్జీ నరేగా చట్టం గ్రామీణ వయో జనులకు 100 రోజుల పనిని హక్కుగా కల్పిస్తూ, డిమాండ్ ఆధారిత బడ్జెట్ కేటాయింపులతో నడుస్తోంది. అయితే, నూతన బిల్లు ఈ చట్ట మౌలిక సూత్రాలనే దెబ్బతీస్తోంది.నిధులకు లోబడి...పాత చట్టం ప్రకారం, పనులు అడిగిన వారందరికీ బడ్జెట్ పరిమితి లేకుండా నిధులు ఇవ్వాల్సిన బాధ్యత కేంద్రంపై ఉండేది. కానీ, నూతన బిల్లులోని సెక్షన్4(5) ప్రకారం, కేంద్రం ప్రతి రాష్ట్రానికీ ఎంత బడ్జెట్ ఇవ్వాలో ముందే నిర్ణయిస్తుంది. దీనివల్ల పని హక్కు అనేది నిధుల లభ్యతకు లోబడి ఉంటుంది. సెక్షన్ 4(6) ప్రకారం, కేంద్రం కేటాయించిన నిధుల కంటే ఎక్కువ ఖర్చయితే ఆ భారాన్ని పూర్తిగా రాష్ట్రాలే భరించాలి. నిధుల కొరతతో ఉన్న రాష్ట్ర ప్రభుత్వాలు ఈ భారంతో ఉపాధి పనులకు స్వస్తి చెప్పే ప్రమాదం ఉంది.కొత్త బిల్లులోని సెక్షన్ 6(2) ప్రకారం, వ్యవసాయ సీజన్లో కూలీల లభ్యత కోసం 60 రోజుల పాటు ఉపాధి పనులను నిషేధిస్తున్నారు. ఇది రైతులకు మేలు చేస్తుందని ప్రభుత్వం వాదిస్తున్నప్పటికీ, వాస్తవ గణాంకాలు మరోలా ఉన్నాయి. ఉపాధి పనులు చేసే వారిలో 36% దళిత, గిరిజనులు కాగా, మిగిలిన 64% మందిలో మెజారిటీ చిన్న , సన్నకారు రైతులే ఉన్నారు. వీరు తమ సొంత పనులు లేనప్పుడే ఉపాధి పనులకు వెళ్తున్నారు. గత గణాంకాలను పరిశీలిస్తే... 70– 80% పని దినాలు ఫిబ్రవరి నుండి జూన్ మధ్య, అంటే వ్యవసాయ పనులు లేని కాలంలోనే జరుగు తున్నాయి. ఈ నేపథ్యంలో 60 రోజుల నిషేధం అనేది ‘బోడి గుండుకీ మోకాలికీ ముడివేయడం’ వంటిదే. ఇది కనీస మద్దతు ధర (ఎమ్ఎస్పీ) వంటి ప్రధాన సమస్యల నుండి రైతుల దృష్టిని మళ్లించే కుట్రగా కనిపిస్తోంది.ప్రస్తుత చట్టం ప్రకారం వ్యయంలో 90%కేంద్రం, 10% రాష్ట్రాలు భరిస్తున్నాయి. నూతన బిల్లులో కేంద్రం వాటా 60%కి తగ్గించి, రాష్ట్రాల వాటాను 40%కి పెంచారు. దీనివల్ల దేశవ్యాప్తంగా రాష్ట్రాలపై సుమారు రూ. 37,500 కోట్ల అదనపు భారం పడుతుంది. తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే, ఆంధ్రప్రదేశ్‌పై 2,600 కోట్లు, తెలంగాణపై రూ. 1,300 కోట్ల అదనపు భారం పడనుంది.ప్రభుత్వం 100 రోజుల పనిని 125 రోజులకు పెంచుతున్నామని ప్రచారం చేస్తోంది. కానీ, పాత చట్టంలో ‘కనీసం 100 రోజులు’ అని ఉంది తప్ప, గరిష్ఠ పరిమితి లేదు. మోదీ హయాంలో గత ఏడాది కేవలం 8% లోపు కుటుంబాలు మాత్రమే 100 రోజుల పనిని పూర్తి చేయగలిగాయి. నిధుల కేటాయింపులను 4% నుండి 1.37%కి తగ్గించి, 125 రోజుల పని ఇస్తామనడం కేవలం ప్రజలను మభ్యపెట్టడమే! ప్రస్తుతం సగటున ఒక కుటుంబానికి 50 రోజుల పని కూడా దొరకడం లేదు.ఎమ్జీ నరేగాలో గ్రామసభల ద్వారా పనుల ప్రణాళిక జరిగేది. కానీ కొత్త బిల్లులో ‘నేషనల్ రూరల్ ఇ¯Œ ఫ్రాస్ట్రక్చర్ స్టాక్’ ద్వారా కేంద్రమే పనులను నిర్ణయిస్తుంది. ఇది గ్రామసభల హక్కులను కాలరాస్తూ, బ్యూరోక్రసీకి అధికారం కట్టబెడుతోంది. వేతన నిర్ణయంలో కూడా కనీస వేతన చట్టం–1948తో సంబంధం తెంచేశారు. ద్రవ్యోల్బ ణానికి అనుగుణంగా వేతనాలు పెరిగే అవకాశం ఇక ఉండదు. టెక్నాలజీ పేరుతో ఇప్పటికే ఆధార్, కేవైసీ నెపంతో కోట్లాదిమంది జాబ్ కార్డులను రద్దు చేశారు. బయోమెట్రిక్, ఫొటో అప్లోడ్ వంటి కఠిన నిబంధనల ద్వారా కూలీలను పనులనుండి దూరం చేసే ప్రయత్నం జరుగుతోంది.పేరు మార్పు – రాజకీయ ఎజెండాఈ పథకం నుండి మహాత్మాగాంధీ పేరును తొలగించి, హిందూత్వ ఎజెండా ప్రతిబింబించేలా ‘వీబీ–జీ రామ్ జీ’ అని పేరు మార్చారు. అక్షరాల కూర్పులో కూడా తమ రాజకీయ ఎజెండా నెరవేరేలా హిందీ, ఇంగ్లీష్ పదాలను కలిపారు. ఒక ఆరోగ్య కరమైన కుక్కను చంపాలనుకున్నప్పుడు అది ‘పిచ్చి కుక్క’ అని ప్రచారం చేసినట్లుగా, అద్భుతంగా అమలవుతున్న ఉపాధి హామీ చట్టాన్ని నీరుగార్చడానికి ప్రభుత్వం దానిపై తప్పుడు ప్రచారాలు చేస్తూ, కొత్త చట్టం ముసుగులో పేదల పొట్ట కొడుతోంది. దీనిపై శ్రామికులు ఉద్యమించాలి.బి.వెంకట్- వ్యాసకర్త అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘంజాతీయ ప్రధాన కార్యదర్శి -
ఉగ్ర ముద్ర తొలగించేలా.. పుతిన్ కీలక నిర్ణయం
మాస్కో: రష్యా కీలక నిర్ణయం తీసుకుంది. పలు సంస్థలపై వేసిన ఉగ్రవాద ముద్ర తొలగించేలా కొత్త చట్టాన్ని అమల్లోకి తెచ్చింది. ఉగ్రవాద ముద్రను తొలగించే హక్కును కోర్టులకు అప్పగించింది. సంబంధిత చట్టాన్ని రష్యా పార్లమెంట్ ఆమోదించింది. దీంతో ఆఫ్గాన్ తాలిబన్లు, సిరియా తిరుగుబాటు దారులతో సంబంధాలను ఏర్పరుచుకునేందుకు అవకాశం రష్యాకు కలగనుంది. రష్యా తెచ్చిన కొత్త చట్టం ప్రకారం.. కోర్టులు సదరు సంస్థలు ఉగ్రవాద కార్యకలాపాలకు దూరంగా ఉన్నట్లు గుర్తించాల్సి ఉంటుంది. అనంతరం, ఉగ్రవాద జాబితాలో ఆయా సంస్థలకు కోర్టులు విముక్తి కలిగిస్తాయి. ఇందుకోసం రష్యా ప్రాసిక్యూటర్ జనరల్ ఒక నిషేధిత సంస్థ ఉగ్రవాదానికి దూరంగా ఉందని వివరిస్తూ కోర్టుకు విజ్ఞప్తి చేయాల్సి ఉంటుంది. అప్పుడు న్యాయమూర్తి ఉగ్రవాద జాబితాలో సదరు సంస్థను తొలగిస్తూ ఆదేశాలు జారీ చేయొచ్చు. రష్యా ఉగ్రవాద జాబితాలో ఫిబ్రవరి 2003లో తాలిబాన్, 2020లో సిరియాను చేర్చింది. అయితే, 20 సంవత్సరాల యుద్ధం తర్వాత 2021 ఆగస్టులో బాధ్యతలు చేపట్టిన ఆఫ్గన్ తాలిబాన్ ప్రభుత్వంపై రష్యా మెరుగైన సంబంధాలను కొనసాగిస్తుంది. ఉగ్రవాదంపై పోరులో ఇప్పుడు తాలిబాన్ మిత్రదేశమని అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ పలు మార్లు వ్యాఖ్యానించారు. సిరియాలో ఆరు దశాబ్దాల అసద్‌ల కుటుంబ పాలన నుంచి సిరియాకు చెందిన హయత్ తహ్రీర్ అల్ షామ్ విముక్తి కలిగించింది. అదే సంస్థపై రష్యా విధించిన ఉగ్ర ముద్రను తొలగించాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. -
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సహకరించండి
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సీమాంధ్ర ఉద్యోగులు సహకరించాలని టీఎన్జీఓల జేఏసీ సూచించింది. రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను అడ్డుకునే ప్రయత్నం చేస్తే సహించేది లేదని స్పష్టం చేసింది. బుధవారం మధ్యాహ్నం భోజన విరామ సమయంలో కలెక్టరేట్ ఆవరణలో తెలంగాణ ఉద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. తెలంగాణ ప్రక్రియను వేగవంతం చేయాలని, వెంటనే పార్లమెంట్లో బిల్లు పెట్టాలని ఉద్యోగ జేఏసీ జిల్లా చైర్మన్ కె.రాజేందర్‌రెడ్డి, టీఎన్జీఓ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు కె.లక్ష్మణ్, ఎల్.రామ్మోహన్ డిమాండ్ చేశారు. తెలంగాణలో ఉన్న సీమాంధ్రుల భద్రతకు ఎలాంటి ఢోకా ఉండదని, వారి భద్రతకు ఇక్కడి ఉద్యోగులదే బాధ్యత అని అన్నారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటయినప్పటికీ అన్నదమ్ముల్లా కలిసే ఉందామని, తెలంగాణ ప్రక్రియను అడ్డుకునే వారికి ఇక్కడి ప్రజలు తగిన బుద్ధి చెబుతారని అన్నారు. ధర్నాలో ఉద్యోగ జేఏసీ నాయకులు మల్లారెడ్డి, కైలాసం, వెంకటేశ్వర్లు, విక్టర్ తదితరులు పాల్గొన్నారు.


