breaking news
Parliaments monsoon session
-
నేటి నుంచి వర్షాకాల సమరం
సాక్షి, న్యూఢిల్లీ: పలు రాష్ట్రాల్లో ప్రధాన ప్రతిపక్ష పార్టీల్లో చీలికలు, ఎంపీల ఫిరాయింపులు, ప్రభుత్వ అనుకూల కూటముల్లో చేరికల మధ్య పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. వచ్చే నెల 13వ తేదీ వరకు కొనసాగనున్నాయి. ప్రాంతీయ పార్టీల్లో నెలకొన్న విభేదాల కారణంగా అధికార ఎన్డీయే బలం పెరగడం, అనైక్యతతో కొట్టుమిట్టాడుతున్న విపక్షాల ‘ఇండియా’ కూటమి కొంత బలహీనపడిన నేపథ్యంలో ఈ సమావేశాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ సమావేశాల్లో ఐదు కొత్త బిల్లులు, రెండు పెండింగ్ బిల్లులను ప్రవేశపెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం కసరత్తులు చేస్తోంది. అయోధ్యలోని రామాలయంలో కోట్ల కొలది విరాళాల చోరీ, నీట్ వంటి ప్రతిష్టాత్మక ప్రవేశ పరీక్షల ప్రశ్నాపత్రాల లీకేజీలు, మోదీ సర్కార్ విదేశాంగ విధానంపై నిలదీసేందుకు ప్రతిపక్షాలు అస్త్రశ్రస్తాలతో సిద్ధమయ్యాయి. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో తగిన సంఖ్యాబలం లేక వీగిపోయిన మహిళా రిజర్వేషన్ల బిల్లు, లోక్‌సభ నియోజకవర్గాల డీలిమిటేషన్ రాజ్యాంగ సవరణ బిల్లులను ఈసారి అజెండాలో లేకపోయినా వీటిపై ముందుకెళ్లాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. దేశంలో పన్నుల వ్యవస్థను మరింత సరళీకృతం చేయడం, కొన్ని నిబంధనలను సవరించడం, పన్ను చెల్లింపుదారులకు సౌలభ్యం కల్పించడమే లక్ష్యంగా ఆదాయపు పన్ను(సవరణ) బిల్లు–2026ను వర్షాకాల సమావేశాల్లో ప్రవేశపెట్టనున్నారు. విదేశీ నిధులు స్వీకరించే సంస్థలకు సంబంధించిన నిబంధనల్లో మార్పులు, పారదర్శకత పెంపు, పర్యవేక్షణను బలోపేతం కోసం విదేశీ విరాళాల నియంత్రణ(సవరణ) బిల్లు, ఎంఎస్ఎంఈ రంగానికి రుణ సౌలభ్యం, వ్యాపార నిర్వహణలో సరళీకరణ, పెట్టుబడుల ప్రోత్సాహం కోసం సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల సంస్కరణ బిల్లు, పుట్టిన తేదీ నమోదు, డిజిటల్ రికార్డులు, పరిపాలనా ప్రక్రియలను మరింత సమర్థవంతంగా మార్చే ప్రతిపాదనతో జనన నమోదు చట్ట సవరణ బిల్లుతోపాటు జాతీయ పతాకం, జాతీయ గీతం, రాజ్యాంగ విలువలకు సంబంధించిన చట్టాలను నవీకరించేందుకు జాతీయ గౌరవ అవమాన నివారణ(సవరణ) బిల్లు–2026ను కేంద్రం ప్రవేశపెట్టనుంది. రెండు పెండింగ్ బిల్లులను తదుపరి ఆమోదం కోసం పార్లమెంట్ ముందుకు తీసుకురానుంది. ఇందులో సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల సంఖ్యను పెంచేందుకు వీలుగా సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్య(సవరణ) బిల్లు ఉంది. పెరుగుతున్న కేసుల భారం తగ్గించి, పెండింగ్ కేసుల పరిష్కారాన్ని వేగవంతం చేయడమే ధ్యేయంగా ఈ బిల్లును రూపొందించారు. ఉన్నత విద్యా రంగంలో సంస్కరణల కోసం వికసిత్ భారత్ విద్యా అధిష్టాన్ బిల్లు–2025ను సైతం కేంద్రం ప్రవేశపెట్టనుంది. అవినీతి, ధరల పెరుగుదల.. వర్షాకాల సమావేశాల్లో మోదీ ప్రభుత్వం విధానాలను ఎండగట్టేందుకు కాంగ్రెస్ సహా ప్రతిపక్షాలు సిద్ధమయ్యాయి. విద్యా వ్యవస్థలో పెరుగుతున్న అవినీతి, రాజ్యాంగబద్ధ సంస్థల దురి్వనియోగం, విపక్షాలను విచ్ఛిన్నం చేయడం, ధరల పెరుగుదల, విదేశాంగ విధానంలో వైఫల్యాలు, వ్యూహాత్మక తప్పిదాలు, ఇథనాల్ బ్లెండింగ్ విధానాలు, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనార్టీలపై దాడులు వంటి అంశాలపై ప్రభుత్వాన్ని నిలదీసేందుకు కాంగ్రెస్ సన్నద్ధమైంది. సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ నిరాహార దీక్షను భగ్నం చేయడంపైనా ఆందోళన చేపట్టాలని ప్రతిపక్షాల నిర్ణయించాయి. విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని ఉభయ సభల్లో డిమాండ్ చేయబోతున్నాయి. 20 మంది టీఎంసీ ఎంపీలు ఎన్డీయేకు మద్దతు పలకడం, శివసేన(యూబీటీ)లో చీలికలు, డీఎంకే దూరం జరగడం వంటి పరిణామాల నేపథ్యంలో విపక్షాల ఐక్యత, బలం కాస్తంత తగ్గింది. ఇలాంటి పరిస్థితుల్లో పార్లమెంట్ సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వాన్ని విపక్ష నాయకులు ఎంతమేరకు ఎదుర్కొంటారన్నది చూడాల్సి ఉంది. సమావేశాలు వాడీవేడిగా జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ‘వందేమాతరం’ను అవమానిస్తే మూడేళ్ల జైలుసవరణ బిల్లును ప్రవేశపెట్టనున్న అమిత్ షా జాతీయ గేయం ‘వందేమాతరం’ను అవమానించడం, ఆలాపనను ఉద్దేశపూర్వకంగా అడ్డుకోవడం నేరంగా పరిగణించేలా కేంద్ర ప్రభుత్వం కొత్త చట్టం తీసుకురానుంది. ఇందుకు సంబంధించిన ‘ప్రివెన్షన్ ఆఫ్ ఇన్సల్ట్స్ టు నేషనల్ ఆనర్ (సవరణ) బిల్లు–2026’ను నేడు రాజ్యసభలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రవేశపెట్టనున్నారు. ఈ బిల్లుకు ఇప్పటికే కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ సవరణ చట్టం అమల్లోకి వస్తే, ఇప్పటివరకు జాతీయ జెండా, రాజ్యాంగం, జాతీయ గీతం ‘జనగణమన’కు ఉన్న చట్టపరమైన రక్షణ ‘వందేమాతరం’కూ వర్తించనుంది. కొత్త బిల్లు ప్రకారం ఎవరైనా ఉద్దేశపూర్వకంగా వందేమాతరం గానాన్ని అడ్డుకున్నా, ఆలాపిస్తుండగా అంతరాయం కలిగించినా వారికి మూడేళ్ల వరకు జైలు శిక్ష, జరిమానా లేదా రెండూ విధించేలా చట్టం చేయనున్నారు. ఈ బిల్లుకు పార్లమెంట్ ఉభయ సభల ఆమోదం లభించి, రాష్ట్రపతి ఆమోదం అనంతరం చట్టంగా అమల్లోకి వస్తుంది. దేశభక్తి భావనను మరింత బలోపేతం చేయడం, స్వాతంత్య్ర సమరంలో వందేమాతరం పోషించిన చారిత్రక పాత్రకు తగిన గుర్తింపు కల్పించాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఈ సవరణను తీసుకొస్తోంది. -
కరోనా నిబంధనలు పాటిస్తూ పార్లమెంట్‌కు
న్యూఢిల్లీ: పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని ఉభయసభల సెక్రెటరీ జనరల్స్ అధికారులను ఆదేశించారు. మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం వంటి నిబంధనలు పాటిస్తూ ఈ సమావేశాల్లో ఎంపీలు స్వయంగా పాల్గొనే అవకాశం ఉందని చెప్పారు. లోక్‌సభ, రాజ్యసభ సమావేశాలు పార్లమెంట్ ప్రాంగణంలోని ఆయా సభల్లోనే జరిగే వీలుందని వెల్లడించారు. లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, రాజ్యసభ చైర్మన్ ఎం.వెంకయ్య నాయుడు శనివారం సమావేశమయ్యారు. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో పార్లమెంట్ వర్షాకాల సమావేశాలను ఎలా నిర్వహించాలన్న దానిపై చర్చించారు. అయితే, ఈ సమావేశాలను ఎప్పటి నుంచి ఎప్పటిదాకా నిర్వహించాలో ఇంకా తేదీలు నిర్ణయించలేదు. వాస్తవానికి సెప్టెంబర్ 22వ తేదీలోగా ప్రారంభించాల్సి ఉంది. -
నిమిషానికి రూ.29వేలు
పార్లమెంటు సమావేశానికయ్యే వ్యయం 18 రోజులకు రూ. 35 కోట్లు నాలుగు రోజులుగా స్తంభించిన ఉభయసభలు న్యూఢిల్లీ: నాలుగు రోజులుగా జరుగుతున్న పార్లమెంటు వర్షాకాల సమావేశాలు నిరసనలు, వాయిదాలతో తుడిచిపెట్టుకుపోయాయి. అధికార, విపక్ష సభ్యులు పోటాపోటీగా ప్లకార్డుల ప్రదర్శన, ఆరోపణలు, ప్రత్యారోపణలతో చర్చ జరగకుండా విలువైన పార్లమెంటు సమయాన్ని వృథా చేస్తున్నారు. దీని వల్ల ప్రజాధనం కూడా వృథా అవుతోంది. 18 రోజుల పాటు సాగే ఈ పార్లమెంటు వర్షాకాల సమావేశాలకు ఇలాగే అంతరాయం కలిగితే వృథా అయ్యే ప్రజాధనం ఎంతో తెలుసా...? సుమారు రూ. 35 కోట్లకు పైనే. అంటే సమావేశం జరిగే ప్రతి నిమిషానికి దాదాపు రూ. 29వేలు ఖర్చు చేస్తున్నట్లు లెక్క. సమావేశాలు అర్థవంతంగా జరగపోతే ఆ మేర ప్రజాధనానికి నష్టం వాటిల్లినట్లే. రోజులో లోక్‌సభ సగటున 6 గంటలు, రాజ్యసభ 5 గంటలు పనిచేస్తాయి. మొదటి రోజు నుంచే ఆరోపణలు ఎదుర్కొంటున్న బీజేపీ మంత్రులు, ముఖ్యమంత్రులను తొలగించనిదే ఎలాంటి చర్చ జరగనివ్వబోమంటూ ప్రతిపక్ష కాంగ్రెస్‌పార్టీ సమావేశాలు ప్రారంభమైన నాటి నుంచి నిరసనలకు దిగుతోంది. దీని వల్ల సభా కార్యక్రమాలు 6 శాతం మాత్రమే జరిగి, 94 శాతం అంతరాయం కలిగినట్లు ఓ నివేదిక తెలిపింది. ‘ప్రపంచ దృష్టి మనపై ఉంది. పార్టీ పంథా, ప్రాంతీయ ప్రయోజనాలు దృష్టిలో ఉంచుకోవడం అవసరమే అయినా.. సభ్యులు విశాల దృక్పథాన్ని అలవరచుకోవాలి’ అని ప్రధాని నరేంద్రమోదీ గురువారం ఓ కార్యక్రమం సందర్భంగా వ్యాఖ్యానించారు. పార్లమెంటుపై ప్రజలకు ఎన్నో అంచనాలు ఉన్నాయని తెలిపారు. చర్చల అవసరాన్ని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. అయితే ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రులు రాజీనామా చేయనిదే ఎలాంటి చర్చ ఉండబోదంటూ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ గురువారం స్పష్టం చేశారు. ప్రభుత్వం చర్చలకు అంగీకరించినప్పటికీ.. మంత్రుల రాజీనామా ప్రసక్తే లేదని ప్రతిపక్షాలు తెగేసి చెబుతున్నాయి. దీంతో సోనియా గాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రాను లక్ష్యంగా చేసుకొని బీజేపీ ప్రతిదాడికి దిగింది. వాద్రా కొన్ని రోజుల క్రితం ఫేస్బుక్లో కొన్ని వ్యాఖ్యలు చేశారు. పార్లమెంటు సమావేశాలు ప్రారంభమవుతాయని, వాటితో పాటే వారి దృష్టి మళ్లింపు ఎత్తుగడలు మొదలవుతాయని, ప్రజలను పిచ్చివాళ్లను చేయలేరని, దేశానికి ఇలాంటి నాయకులు నేతృత్వం వహిస్తుండడంపై చింతిస్తున్నట్లు .. వాద్రా వ్యాఖ్యానించారు. ఆయన పార్లమెంటు సభ్యులనే కాకుండా.. పార్లమెంటు మొత్తాన్నే కించపరిచారని, ఆయనను తక్షణం సభకు పిలిపించి మందలించాలని బీజేపీ నాయకులు పట్టుబడుతున్నారు. ప్రజాధనం వృథా అవుతుండడంపై సీపీఐ నేత డి.రాజా ఆందోళన వ్యక్తం చేశారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రులు, ముఖ్యమంత్రులను తొలగించి, సభా సజావుగా జరిగేలా చూడడం ప్రభుత్వ బాధ్యత అని పేర్కొన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సభకు అంతరాయం కలిగించడమే బీజేపీ ప్రథమ వ్యూహంగా వ్యవహరించిందని కాంగ్రెస్ ఆరోపించింది. దీనిపై బీజేపీ ఎంపీ బాబుల్ సుప్రియో స్పందిస్తూ.. షెడ్యూల్ కంటే ఎక్కువ సమయం సమావేశమైన ప్రభుత్వాలను ఎందుకు మనం ఆదర్శంగా తీసుకోకూడదు? అని ప్రశ్నించారు.


