breaking news
Palla Srinivas
-
జిల్లా అభివృద్ధికి మాస్టర్‌ప్లాన్
విశాఖ రూరల్ : జిల్లా సమగ్రాభివృద్ధి బాధ్యత అందరిపై ఉందని కలెక్టర్ డాక్టర్ ఎన్.యువరాజ్ అన్నారు. భవిష్యత్తులో జిల్లా ఆర్థికాభివృద్ధి, ప్రజా శ్రేయస్సుకు తోడ్పడే అంశాలపై విశ్వవిద్యాలయాల నిపుణులు దృష్టి సారించి సమగ్ర ప్రణాళిక రూపొందిం చాలని కోరారు. రాష్ట్ర విభజన తర్వాత అందరి దృష్టి విశాఖపైనే ఉందని, జిల్లాలో ఐటీ, పరిశ్రమలు, వ్యవసాయం, పర్యాటకం, విద్య, ఆరోగ్యం తదితర ఏర్పాట్లు, వాటి అభివృద్ధికి సలహాలు, సూచనల కోసం మంగళవారం కలెక్టరేట్ సమావేశమందిరంలో మేధావులు, పారిశ్రామిక వేత్తలతో సమావేశం నిర్వహించారు. ఇందులో ఎంపీలు, ఎమ్మెల్యేలు, జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఏయూ రిజిస్ట్రార్ రామ్మోహనరావు మాట్లాడుతూ విశాఖ జిల్లాలో గ్రీన్, బ్లూ, వైట్ రివెల్యూషన్ అంతగా అభివృద్ధి చెందలేదన్నారు. వాటి అభివృద్ధికి పుష్కలంగా వనరులున్నాయని తెలిపారు. గీతం యూనివర్సిటీ వైస్‌చాన్సలర్ సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ జిల్లా అభివృద్ధికి విజన్ డాక్యుమెంట్ తయారు చేయాలని సూచించారు. అరకు ఎంపీ కొత్తపల్లి గీత మాట్లాడుతూ విశాఖ నుంచి అరకుకు అద్దాల రైలు వేయాలని సూచించారు. ఆంధ్రా సిమ్లాగా పేరొందిన లంబసింగిని కూడా పర్యాటకంగా అభివృద్ధి చేయాల్సిన అవసరముందని తెలిపారు. అనకాపల్లి ఎంపీ ముత్తంశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ జిల్లా అభివృద్ధికి మాస్టర్‌ప్లాన్ తయారు చేయాలని చెప్పారు. మాడుగుల ఎమ్మెల్యే బూడి ముత్యాలనాయుడు మాట్లాడుతూ పరిశ్రమల ఏర్పాటుకు వచ్చే పారిశ్రామిక వేత్తలకు నమ్మకాన్ని కలిగించాలని సూచించారు. పరిశ్రమలకు అవసరమైన నీటి వనరులు లేవని, పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యే విధంగా చూడాలన్నారు. జిల్లా సగటు జాతీయోత్పత్తిని పెంచుకోవాలని పెందుర్తి ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి అన్నారు. పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే గణబాబు మాట్లాడుతూ విశాఖను స్పోర్ట్స్ సిటీగా అభివృద్ధి చేయాలని సూచించారు. ఊటీ మారిదిగా అరకును డీనోటిఫై చేయాలని సూచించారు. దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌కుమార్ మాట్లాడుతూ విశాఖ పోర్టు నుంచి వెలువడే కాలుష్యం కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, పోర్టు కనీసం నియమాలు పాటించడం లేదని, సంస్థ విస్తరణకు వ్యతిరేకంగా అవసరమైతే కోర్టుకు వెళతామని తెలిపారు. గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ మాట్లాడుతూ పరిశ్రమల ఏర్పాటుకు జాప్యం జరగకుండా వారం రోజుల్లో సింగిల్ విండో పద్ధతిలో అన్ని అనుమతులు మంజూరు చేసేలా విధానాన్ని రూపొందించాలని సూచించారు. పరిశ్రమల అభివృద్ధితో పాటు వ్యవసాయ రంగాన్ని కూడా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని పాయకరావుపేట ఎమ్మెల్యేల వంగలపూడి అనిత అన్నారు. యలమంచిలి ఎమ్మెల్యే పంచకర్లరమేష్‌బాబు మాట్లాడుతూ చిన్నతరహా పరిశ్రమలను ప్రోత్సహించాలన్నారు. అనకాపల్లి ఎమ్మెల్యే పీలా గోవింద్ మాట్లాడుతూ అప్రెంటిస్ సీట్ల సంఖ్యను పెంచేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ఈ నెల 26న ముఖ్యమంత్రి జిల్లాకు వచ్చే అవకాశాలు ఉన్నాయని, ఈలోగా ప్రాథమిక అభివృద్ధి ప్రణాళికను రూపొందిస్తే ఆయన దృష్టికి వెళ్లవచ్చని సూచించారు. సమావేశంలో ఎమ్మెల్సీ ఎం.వి.ఎస్.శర్మ, ఏజేసీ నరిసింహారావు పాల్గొన్నారు. గ్రామ స్థాయి నుంచే వ్యవసాయ ప్రణాళిక వ్యవసాయ కార్యాచరణ ప్రణాళికను గ్రామ స్థాయి నుంచే రూపొందించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్.యువరాజ్ సూచించారు. వ్యవసాయాధికారులతో జిల్లాలో ఖరీఫ్ 2014కు సంబంధించిన గ్రామ స్థాయి వ్యవసాయ ప్రణాళికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంపిక చేసిన గ్రామాల్లో ముఖ్యమైన పంటల్లో ఉత్పాదకతను పెంచి వ్యవసాయ సాగు ఖర్చులు తగ్గించాలని చెప్పారు. వ్యవసాయ పనులను గ్రామీణ ఉపాధిహామీ పథకాలతో అనుసంధానం చేయాలని, పంటలు కోసిన తర్వాత వచ్చే నష్టాలను నివారించాలన్నారు. వ్యవసాయ శాఖద్వారా అమలవుతున్న పథకాలన్నింటినీ ఎంపిక చేసిన గ్రామాల్లో అమలు చేయాలని సూచించారు. రాయితీపై విత్తనాలు, ఎరువులు సరఫరాచేయాలన్నారు. -
టైం బాగాలేదు
గంటాకు అడుగడుగునా గండాలే విశాఖ ఎంపీ సీటు బీజేపీకే.. గంటా..పంచకర్ల సీట్లపై తొలగిన సందిగ్ధత చింతలపూడి..పీలా రుసరుస టీడీపీలో నిరసన సెగలు సాక్షి, విశాఖపట్నం : ఏ ముహూర్తాన టీడీపీ తీర్థం పుచ్చుకున్నామో గానీ.. అస్సలు టైం బాలేదు. మన్లో ఎవరో.. ఐరెన్ లెగ్‌లున్నట్టున్నారు..! ఇదీ మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు గ్యాంగ్ అంతర్మథనం. గత కొన్ని రోజులుగా టీడీపీలో రాష్ట్రంలోని అన్ని సీట్ల కంటే గంటా బృందం సీట్లపై అనిశ్చితే ఎక్కువ. అది కూడా కేవలం గంటా వల్లే కావడం ఆ పార్టీ స్థానిక నేతలకు మింగుడుపడట్లేదు. ఇపుడు స్థానాలపై స్పష్టత వచ్చినా.. గంటా బృందానికి ఆనందంమాత్రం లేదు. టీడీపీలో చేరినప్పటి నుంచీ గంటా పోటీ చేసే స్థానం జరుగుతోన్న కసరత్తు అంతా ఇంతా కాదు. తొలుత అనకాపల్లి నుంచి బరిలో దిగాలనుకున్న ఆయనకు సొంత సర్వేతో భ్రమలు తొగాయి. గాజువాకపై పెట్టుకున్న ఆశలు పల్లా శ్రీనివాస్‌తో అడుగంటాయి. తర్వాత భీమిలిపై కన్నేశారు. పార్టీ అధిష్టానం మాత్రం శుక్రవారం వరకు ఆయన్ని విశాఖ లోక్‌సభ స్థానం నుంచే బరిలో దించేందుకు ప్రయత్నించింది. పొత్తుల్లో భాగంగా ఈ స్థానాన్ని బీజేపీకి కేటాయించినా వారికి కాకినాడ అప్పగిస్తూ దీన్ని గంటాకు కేటాయించాలనుకున్నారు. ఈ స్థానంలో వైఎస్సార్ సీపీ అభ్యర్థితో పోటీపడి గెలిచే అవకాశాల్లేవని తేలడంతో పోటీకి గంటా ససేమిరా అంటూ వచ్చారు. కాకినాడ కంటే తమకు విశాఖ ఎంపీ స్థానమే కావాలని బీజేపీ తేల్చిచెప్పింది. దీంతో గంటా స్థానంపై స్పష్టత వచ్చినట్టు తెలిసింది. ఆయనకు భీమిలి, పంచకర్ల రమేష్‌బాబు యలమంచిలి, పీలా గోవింద్ అనకాపల్లి అసెంబ్లీ స్థానం నుంచి, అనకాపల్లి లోక్‌సభ స్థానం నుంచి అవంతి శ్రీనివాసరావు బరిలో నిలిచేందుకు జాబితా సిద్ధమైనట్టు సమచారం. దీంతో గంటాను నమ్ముకుని టీడీపీ తీర్థం పుచ్చుకున్న గాజువాక ఎమ్మెల్యే చింతలపూడి వెంకటరామయ్య, యలమంచిలి ఎమ్మెల్యే కన్నబాబు అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు. మరోవైపు యలమంచిలి స్థానాన్ని పంచకర్లకు కేటాయిస్తారన్న సమాచారంతో ఆ స్థానంపై ఆశలు పెట్టుకున్న సుందరపు విజయ్‌కుమార్ కత్తులు నూరుతున్నారు. కాగా భీమిలి స్థానం కేటాయిస్తున్నారన్న ఆనందం గంటాలో లేశమాత్రమైనా కానరావట్లేదని ఆ పార్టీ నేతలే చెప్పుకుంటున్నారు. జీవీఎంసీలో భీమిలి మున్సిపాలిటీతోపాటు, సమీపంలోని ఐదు గ్రామపంచాయితీల విలీనానికి గంటాయే కారణమని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇప్పటి వరకు గంటా బృందానికి చెందిన అవంతి శ్రీనివాసరావు ఇక్కడ బరిలో నిలిస్తే మూకుమ్మడిగా ఓడించడానికి స్థానికులు సన్నద్ధమయ్యారు.