breaking news
P. Satyaprasad
-
28,074 దాటితే మరింత పెరుగుదల
అమెరికా,జపాన్, చైనా స్టాక్ సూచీలు నాన్‌స్టాప్‌గా పెరుగుతున్నాయి. అమెరికా షేర్లు ఆల్‌టైమ్ రికార్డుస్థాయిలో ట్రేడవుతుండగా, జపాన్ నికాయ్ 15 సంవత్సరాలు, చైనా షాంఘై 8 సంవత్సరాల గరిష్టంలోనూ వున్నాయి. చివరికి సంక్షోభంలో వున్నాయంటూ ప్రచారం జరుగుతున్న యూరప్ దేశాల సూచీలు కూడా ఆల్‌టైమ్ రికార్డుస్థాయికి చేరువలో వున్నాయి. ఇలా ప్రధాన సూచీలతో పోలిస్తే భారత్ వెనుకబడి వుంది. ఇదే కారణం కావొచ్చు. గతవారం విదేశీ ఇన్వెస్టర్లు ఇక్కడి మార్కెట్లలో అమ్మకాల స్పీడు తగ్గించి, స్వల్పంగా కొనుగోళ్లకు శ్రీకారం చుట్టారు. దాంతో వారి ఫేవరిట్ ఐటీ షేర్లు ఇన్ఫోసిస్, టీసీఎస్‌లు, ఫార్మా షేరు సన్‌ఫార్మాలు నెలరోజుల గరిష్టస్థాయి వద్ద ముగిసాయి. ఆర్బీఐ పాలసీ నేపథ్యంలో బ్యాంకింగ్ షేర్లూ ఎలాగూ హెచ్చుతగ్గులకు లోనయ్యే అవకాశాలున్నందున, సూచీల్లో గణనీయమైన వెయిటేజి వున్న టీసీఎస్, ఇన్ఫోసిస్, సన్‌ఫార్మాలు ఈ వారం ట్రెండ్‌కు కీలకం కానున్నాయి. ఇక సూచీల సాంకేతికాంశాలకొస్తే... సెన్సెక్స్ సాంకేతికాంశాలు..., మే 22తో ముగిసిన వారంలో బీఎస్ఈ సెన్సెక్స్ కీలకమైన 28,071 పాయింట్ల గరిష్టస్థాయివరకూ పెరిగినప్పటికీ, ఆ స్థాయిలో స్థిరపడలేక 27,957 వద్ద ముగిసింది. ఏప్రిల్ 15 నాటి 29,095 పాయింట్ల గరిష్టస్థాయి నుంచి మే 7నాటి 26,424 పాయింట్ల కనిష్టస్థాయివరకూ జరిగిన 2,671 పాయింట్ల పతనంలో 61.8 శాతం రిట్రేస్‌మెంట్ స్థాయి 28,074 పాయింట్లు. క్రితం వారం దాదాపు ఇదేస్థాయిని సెన్సెక్స్ పరీక్షించింది. ఈ వారం 28,074 స్థాయిని అధిగమించగలిగితే తర్వాతి వారాల్లో 29,000 శిఖరాన్ని తిరిగి అధిరోహించే ఛాన్స్ వుంటుంది. 28,074పైన క్రమేపీ 28,530 స్థాయిని అందుకోవొచ్చు. అటుపైన మరో కీలక నిరోధం 28,650 స్థాయి వద్ద ఎదురవుతున్నది. ఇది మార్చి 4నాటి 30,025 పాయింట్ల నుంచి మే 7వరకూ జరిగిన క్షీణతలో 61.8 శాతం రిట్రేస్‌మెంట్ స్థాయి. ఈ వారం తొలి నిరోధాన్ని దాటలేకపోతే గతంలో వరుసగా మూడు వారాల పాటు అవరోధం కల్పించిన 27,500-600 శ్రేణి ఇకముందు మద్దతును అందించవచ్చు. ఈ మద్దతుశ్రేణిని కోల్పోతే తదుపరి మద్దతులు 27,100, 26,750 పాయింట్లు. నిఫ్టీ నిరోధం 8,520 ఎన్ఎస్ఈ నిఫ్టీ గత మార్కెట్ పంచాంగంలో సూచించిన 8,300-8,355 అవరోధశ్రేణిని అధిగమించిన తర్వాత క్రమేపీ 8,489 పాయింట్ల వరకూ ర్యాలీ జరిపింది. చివరకు 197 పాయింట్ల భారీలాభంతో 8,459 పాయింట్ల వద్ద ముగిసింది. ఈ వారం సైతం అప్‌ట్రెండ్ కొనసాగితే 8,520 పాయింట్ల వద్ద తక్షణ నిరోధం ఎదురవుతున్నది. ఇది ఏప్రిల్ 15-మే 7ల మధ్య జరిగిన 848 పాయింట్ల పతనంలో 61.8 శాతం రిట్రేస్‌మెంట్ స్థాయి. అందుచేత తదుపరి రోజుల్లో మరింత పెరగాలంటే 8,520 స్థాయిపైన నిఫ్టీ స్థిరపడాల్సివుంటుంది. ఆపైన అవరోధస్థాయిలు 8,620, 8,690 పాయింట్లు. ఈ వారం తొలి నిరోధాన్ని దాటలేకపోతే 8,300-8,355 పాయింట్ల శ్రేణి వద్ద నిఫ్టీకి తక్షణ మద్దతు లభిస్తున్నది. ఈ శ్రేణిని ముగింపులో కోల్పోతేనే తర్వాతి క్షీణత వుండవచ్చు. ఈ శ్రేణి దిగువన మద్దతులు 8.200. 8.090 పాయింట్లు. మే నెల డెరివేటివ్స్ ముగింపు సందర్భంగా గత శుక్రవారం వరకూ ఆప్షన్ బిల్డప్ పరిమితంగానే జరిగింది. అదే రోజున 8,500, 8,600 స్ట్రయిక్స్ వద్ద కాస్త ఎక్కువగా 49 లక్షలు, 46 లక్షల షేర్ల చొప్పున కాల్ బిల్డప్ వుంది. 8,400 స్ట్రయిక్ వద్ద మాత్రం అదనంగా పుట్‌రైటింగ్ జరగడంతో 16 లక్షల షేర్లు శుక్రవారం యాడ్ అయ్యాయి. ఈ స్ట్రయిక్ వద్ద 52.50 లక్షల షేర్ల పుట్ బిల్డప్ వుంది. ఈ వారం 8,400 స్థాయిని నిఫ్టీ కోల్పోతే మరింత క్షీణించవచ్చని, 8,500 స్థాయిని దాటితే 8,600 వరకూ పెరగవచ్చని ఈ ఆప్షన్ బిల్డప్ సూచిస్తున్నది. - పి. సత్యప్రసాద్ -
అవరోధ శ్రేణి 27,500-600
మార్కెట్ పంచాంగం భారత్ సూచీలు మూడు వారాల నుంచి దాదాపు 4 శాతం శ్రేణిలో తీవ్ర హెచ్చుతగ్గులకు లోనవుతున్నాయి. క్రితం వారం ఈ శ్రేణి 2.5 శాతానికి పరిమితమయ్యింది. ఇలా ఒడిదుడుకుల శాతం క్రమేపీ తగ్గి, ఒక్కసారిగా విస్తృతంకావడం సర్వసాధారణం. ప్రస్తుతానికి భారత్ మార్కెట్ దీర్ఘకాలిక ట్రెండ్ బుల్లిష్‌గానూ, స్వల్పకాలిక ట్రెండ్ బేరిష్‌గానూ వుంది. రాబోయే ఒకటి, రెండు వారాల్లో ఈ శ్రేణి విస్తృతమై, ఎటో ఒకవైపు మార్కెట్ వేగంగా కదలవచ్చు. అలా కదిలే దిశ తో దీర్ఘకాలిక ట్రెండ్ బేరిష్‌గా మారడం లేదా స్వల్పకాలిక ట్రెండ్ బుల్లిష్‌గా రూపాంతరం చెందడం జరగవచ్చు. ఇక ఈ వారం సాంకేతికాంశాలకొస్తే... సెన్సెక్స్ సాంకేతికాంశాలు... మే 15తో ముగిసిన వారంలో బీఎస్ఈ సెన్సెక్స్ 27,544-26,750 పాయింట్ల శ్రేణి మధ్య హెచ్చుతగ్గులకు లోనై, చివరకు అంతక్రితంవారంతో పోలిస్తే 219 పాయింట్ల స్వల్పలాభంతో 27,324 పాయింట్ల వద్ద ముగిసింది. వరుసగా మూడు వారాల నుంచి 27,500-600 శ్రేణి అవరోధం కల్పిస్తున్నందున, ఈ స్థాయిని భారీ ట్రేడింగ్ పరిమాణంతో దాటి స్థిరపడితేనే తదుపరి పెరుగుదల సాధ్యపడుతుంది. అటుపైన స్థిరపడితే క్రమేపీ 27,830 స్థాయికి పెరగవచ్చు. అనూహ్యమైన సానుకూల వార్తలేవైనా వెలువడితే 28,090 పాయింట్ల స్థాయికి సైతం ర్యాలీ జరిపే చాన్స్ వుంది. సెన్సెక్స్ తిరిగి అప్ట్రెండ్లోకి ప్రవేశించాలంటే 28,090 పాయింట్ల స్థాయిని అధిగమించాల్సివుంటుంది. ఈ వారం తొలి నిరోధ శ్రేణిని దాటలేకపోతే 26,750 స్థాయి వద్ద తక్షణ మద్దతు లభిస్తున్నది. మార్కెట్‌ను తీవ్ర నిరుత్సాహానికి లోనుచేసే వార్తలేవైనా వెలువడితే మరోదఫా 26,420 పాయింట్ల స్థాయిని పరీక్షించవచ్చు. ఈ స్థాయిని కూడా కోల్పోతే 26,250 పాయింట్ల వద్దకు పతనం కావొచ్చు. నిఫ్టీ నిరోధం 8,355 ఎన్ఎస్ఈ నిఫ్టీ గత మార్కెట్ పంచాంగంలో అంచనాలకు అనుగుణంగా 8,335 పాయింట్ల సమీపంలో నిరోధాన్ని చవిచూసి, 8,090 పాయింట్ల వద్దకు పతనమయ్యింది. తదుపరి స్వల్పంగా కోలుకోవడంతో చివరకు 71 పాయింట్ల లాభంతో 8,262 పాయింట్ల వద్ద ముగిసింది. మూడు వారాల నుంచి 8,300-8,355 పాయింట్ల శ్రేణి నిఫ్టీకి 8 దఫాలు అవరోధం కల్పించినందున, ఈ శ్రేణిని అధిగమించిన తర్వాతే ఆపైన పెరిగే అవకాశం వుంటుంది. ఈ శ్రేణిని అధిక ట్రేడింగ్ పరిమాణంతో దాటితే 8,420 పాయింట్ల వద్దకు పెరగవచ్చు. ఆపైన స్థిరపడితే 8,505 పాయింట్ల స్థాయిని అందుకోవచ్చు. ఈ వారం తొలి అవరోధ శ్రేణిని అధిగమించలేకపోతే 8,090 పాయింట్ల వద్ద తొలి మద్దతు లభిస్తున్నది. ఈ స్థాయిని కోల్పోతే వేగంగా 7,960 పాయింట్ల స్థాయికి క్షీణించవచ్చు. గత డిసెంబర్లో మద్దతునిచ్చిన ఈ స్థాయిని నష్టపోతే, ప్రతికూల పరిస్థితుల్లో 7,730 పాయింట్ల వద్దకు పతనమయ్యే ప్రమాదం వుంటుంది. నిఫ్టీ తిరిగి అప్ట్రెండ్లోకి ప్రవేశించాలంటే 8,505 స్థాయిపైన కొద్ది ట్రేడింగ్ సెషన్లపాటు స్థిరపడాల్సి ఉంటుంది. - పి. సత్యప్రసాద్