breaking news
Online cab services sector
-
క్యాబ్‌లో ప్రయాణించే వారికి షాకింగ్ న్యూస్..!
రష్యా-ఉక్రెయిన్ వార్ నేపథ్యంలో క్రూడాయిల్ ధరలు భారీగా పెరిగిన విషయం తెలిసిందే. దేశవ్యాప్తంగా ఎన్నికల నేపథ్యంలో ఇంధన ధరలు స్థిరంగానే కొనసాగాయి. కాగా గత వారం రోజుల నుంచి ఇంధన ధరలు భారీగా పెరుగుతూ వస్తున్నాయి. దీంతో క్యాబ్ డ్రైవర్లు షాకింగ్ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఎసీ ఆన్ చేస్తే ఎక్స్ట్రా..! ఇంధన ధరల పెంపుతో క్యాబ్ డ్రైవర్లు భారీగా ప్రభావితమవుతున్నట్లు తెలుస్తోంది. దీంతో క్యాబ్స్‌లో ప్రయాణికులు ఏసీని ఆన్ చేయమని కోరితే దానికి అదనంగా వసూలు చేస్తామని డ్రైవర్లు నిర్ణయించుకున్నట్లు జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి. కాగా ఈ నిర్ణయం ఏప్రిల్ 1 నుంచి అమలులోకి రానుంది. వాహనాల్లో ఎసీను స్విచ్ ఆన్ చేయాలంటే అదనంగా చెల్లించాలనే బోర్డులను ఆయా క్యాబ్ సంస్థల డ్రైవర్లు ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. ఏసీలను ఆన్ చేసినందుకుగాను రూ. 50 నుంచి రూ. 100 మేర అదనపు ఛార్జీలను వసూలు చేస్తామనే స్టికర్స్‌ను క్యాబ్ సంస్థల డ్రైవర్లు కారులో ఏర్పరిచారు. భారీ నష్టం..! ఆయా క్యాబ్ కంపెనీలు అందించిన సర్వీసులకు గాను క్యాబ్ డ్రైవర్లు వారికి ప్రతి రైడ్‌లో 25 నుంచి 30 శాతం వరకు చెల్లించాల్సి ఉంటుంది. ఏసీ ఆన్ చేయడంతో కారు మైలేజ్ సుమారు మూడు నుంచి నాలుగు కిలోమీటర్ల మేర తేడా వస్తుందని క్యాబ్ డ్రైవర్లు పేర్కొంటున్నారు. ఇంధన ధరలు పెరగడంతో ఇక భారం మోయలేమని తెలంగాణ గిగ్ అండ్ ప్లాట్‌ఫాం వర్కర్ యూనియన్ పేర్కొంది. ఏసీని ఆన్ చేస్తే క్యాబ్ అగ్రిగేటర్లకు కమిషన్ ఇవ్వడం అసాధ్యమని యూనియన్ పేర్కొంది. క్యాబ్ ప్రయాణికులకు ఈ విషయంపై అవగాహన కల్పిస్తోన్నట్లు పేర్కొంది. అంతేకాకుండా ప్రస్తుత క్యాబ్ ఛార్జీలపై రవాణా శాఖ జోక్యం చేసుకోవాలని తెలంగాణ గిగ్ అండ్ ప్లాట్‌ఫాం వర్కర్ యూనియన్ కోరింది. చదవండి: ఓటీటీ దెబ్బకు ఇండియన్ బిగెస్ట్ సినిమా బ్రాండ్ల విలీనం..! -
ఓలా చేతికి ట్యాక్సీ ఫర్ ష్యూర్
డీల్ విలువ రూ.1,240 కోట్లు - రోజుకు 1,000 వాహనాలు ఓలా సేవల ఖాతాలోకి... - డిసెంబర్‌కల్లా 200 నగరాలకు హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఆన్లైన్ క్యాబ్ సేవల రంగంలో ఉన్న ఓలా క్యాబ్స్ భారీ డీల్‌కు తెరలేపింది. క్యాబ్ సేవల్లో ఉన్న పోటీ కంపెనీ ట్యాక్సీ ఫర్ ష్యూర్‌ను సుమారు రూ.1,240 కోట్లకు కొనుగోలు చేసింది. కంజ్యూమర్ ఇంటర్నెట్ రంగంలో ఫ్లిప్‌కార్ట్-మింత్రాల రూ.2,260 కోట్ల డీల్ తర్వాతి స్థానాన్ని ఇది కైవసం చేసుకుంది. ఇక డీల్ అనంతరం కూడా ట్యాక్సీ ఫర్ ష్యూర్ తన సేవలను కొనసాగిస్తుంది. ఒక లక్షకుపైగా వాహనాలతో క్యాబ్ సర్వీసుల్లో ఓలా దేశంలో అగ్రస్థానంలో ఉంది. రూ.49లకే కారులో ప్రయాణించే సౌకర్యాన్ని తీసుకొచ్చిన ట్యాక్సీ ఫర్ ష్యూర్ మార్కెట్‌ను ఒక ఊపు ఊపింది. ఉత్సాహభరిత విధానాన్ని ఈ కంపెనీ అమలు చేసిందంటూ ఓలా సీఈవో, సహ వ్యవస్థాపకులు భవీశ్ అగర్వాల్ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. ట్యాక్సీ ఫర్ ష్యూర్ వద్ద 15,000లకుపైగా వాహనాలున్నాయి. క్యాబ్ ఆపరేటర్లతో సరఫరా, పంపిణీ విధానంలో పనిచేస్తోంది. ఓలా అందుకు భిన్నంగా డ్రైవర్-ఓనర్ విధానాన్ని అమలు చేస్తోంది. రోజుకు 1,000 వాహనాలు.. ఓలా క్యాబ్స్ ప్రస్తుతం 67 నగరాల్లో సర్వీసులందిస్తోంది. 2015 డిసెంబర్ నాటికి 200 నగరాలకు విస్తరించాలని లక్ష్యంగా చేసుకుంది. రోజుకు 1,000 వాహనాలు జతకూడుతున్నాయి. ఇందులో కార్లు 70%, ఆటోలు 30% ఉంటాయని ఓలా మార్కెటింగ్ డెరైక్టర్ ఆనంద్ సుబ్రమణియన్ సాక్షి బిజినెస్ బ్యూరోకు తెలిపారు. ఎస్బీఐ సహకారంతో రోజు వారీ చెల్లింపుల విధానం భారత్‌లో సంచలనం సృష్టిస్తోందని అన్నారు. ‘భారత్‌లో 100 మందిలో కారు యజమానుల సంఖ్య కేవలం 3 శాతమే. అందుకే క్యాబ్స్‌కు డిమాండ్ గణనీయంగా ఉంటుంది. ఇక డ్రైవర్లకు కంపెనీ ఇచ్చే నగదు ప్రోత్సాహకాలను పెట్టుబడిగా భావించాలి. ప్రతిభ కనబరిచే డ్రైవర్లకు స్టార్‌రేటింగ్ ఆధారంగా ప్రోత్సాహకాలు ఇస్తున్నాం. అలాగే ఆకర్షించే చార్జీలు, ఆఫర్లు కస్టమర్లను ప్రోత్సహించేందుకే’ అని అన్నారు. 47 నగరాల్లో సేవలందిస్తున్న ట్యాక్సీ ఫర్ ష్యూర్ ఎకానమీ విభాగంలో మార్కెట్లో పట్టు సాధించిందని చెప్పారు. ఓలా మధ్య, ప్రీమియం విభాగాల్లో ఉందని తెలిపారు.