క్యాబ్స్‌లో ఏసీ ఆన్‌ చేస్తే వాతే..! డ్రైవర్ల నిర్ణయం..!

Online Cab Services Charging Extra for AC on From From April 1 - Sakshi

రష్యా-ఉక్రెయిన్‌ వార్‌ నేపథ్యంలో క్రూడాయిల్‌ ధరలు భారీగా పెరిగిన విషయం తెలిసిందే. దేశవ్యాప్తంగా  ఎన్నికల నేపథ్యంలో ఇంధన ధరలు స్థిరంగానే కొనసాగాయి. కాగా గత వారం రోజుల నుంచి ఇంధన ధరలు భారీగా పెరుగుతూ వస్తున్నాయి. దీంతో క్యాబ్‌  డ్రైవర్లు షాకింగ్‌ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.  

ఎసీ ఆన్‌ చేస్తే ఎక్స్‌ట్రా..!
ఇంధన ధరల పెంపుతో క్యాబ్‌ డ్రైవర్లు భారీగా ప్రభావితమవుతున్నట్లు తెలుస్తోంది. దీంతో క్యాబ్స్‌లో ప్రయాణికులు ఏసీని ఆన్‌ చేయమని కోరితే దానికి అదనంగా వసూలు చేస్తామని డ్రైవర్లు నిర్ణయించుకున్నట్లు జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి. కాగా ఈ నిర్ణయం ఏప్రిల్‌ 1 నుంచి అమలులోకి రానుంది. వాహనాల్లో ఎసీను స్విచ్‌ ఆన్‌ చేయాలంటే అదనంగా చెల్లించాలనే బోర్డులను ఆయా క్యాబ్‌ సంస్థల డ్రైవర్లు ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. ఏసీలను ఆన్‌ చేసినందుకుగాను రూ. 50 నుంచి రూ. 100 మేర అదనపు ఛార్జీలను వసూలు చేస్తామనే స్టికర్స్‌ను క్యాబ్‌ సంస్థల డ్రైవర్లు కారులో ఏర్పరిచారు. 

భారీ నష్టం..!
ఆయా క్యాబ్‌ కంపెనీలు అందించిన సర్వీసులకు గాను క్యాబ్‌ డ్రైవర్లు వారికి ప్రతి రైడ్‌లో 25 నుంచి 30 శాతం వరకు చెల్లించాల్సి ఉంటుంది. ఏసీ ఆన్ చేయడంతో కారు మైలేజ్‌ సుమారు మూడు నుంచి నాలుగు కిలోమీటర్ల మేర తేడా వస్తుందని క్యాబ్ డ్రైవర్లు పేర్కొంటున్నారు. ఇంధన ధరలు పెరగడంతో ఇక భారం మోయలేమని తెలంగాణ గిగ్‌ అండ్‌ ప్లాట్‌ఫాం వర్కర్‌ యూనియన్‌ పేర్కొంది.  ఏసీని ఆన్‌ చేస్తే క్యాబ్‌ అగ్రిగేటర్లకు కమిషన్‌ ఇవ్వడం అసాధ్యమని యూనియన్‌ పేర్కొంది. క్యాబ్‌ ప్రయాణికులకు ఈ విషయంపై  అవగాహన కల్పిస్తోన్నట్లు పేర్కొంది. అంతేకాకుండా ప్రస్తుత క్యాబ్‌ ఛార్జీలపై రవాణా శాఖ జోక్యం చేసుకోవాలని తెలంగాణ గిగ్‌ అండ్‌ ప్లాట్‌ఫాం వర్కర్‌ యూనియన్‌ కోరింది.

చదవండి: ఓటీటీ దెబ్బకు ఇండియన్‌ బిగెస్ట్‌ సినిమా బ్రాండ్ల విలీనం..!

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top