కారులో మంటలు : లక్షా 40 వేల నగదు దగ్ధం
గజపతినగరం : విజయనగరం జిల్లాలో ఓ కారు అగ్ని ప్రమాదానికి గురైంది. విజయనగరం నుంచి ఒడిశాకు వెళ్తున్న అల్టో కారులో శనివారం రాత్రి ప్రమాదం చోటుచేసుకుంది.
గజపతినగరం మండలం మారుపల్లి గ్రామం సమీపానికి చేరుకోగానే కారులో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. ఈ మంటల్లో కారు పూర్తిగా దగ్ధమవ్వడంతో పాటు కారులో ఉన్న లక్షా 40 వేల నగదు కాలి బూడిదైంది. మంటలను గమనించిన డ్రైవర్‌తో పాటు కారులో ఉన్న ప్రయాణికులు వెంటనే బయటకు దిగడంతో వారికి పెనుప్రమాదం తప్పింది. వాహనంలో గ్యాస్ లీక్ కావడం వల్లే ప్రమాదం జరిగినట్లు సమాచారం. వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించిన.. అప్పటికే కారు పూర్తిగా దగ్ధమైంది. బాధితులు ఒడిశా రాష్ట్రం సునాబిద జిల్లా నాల్కో కంపెనీకి చెందినవారిగా తెలుస్తోంది.