Ohio Court
-
గర్భిణికి వర్క్ ఫ్రమ్ హోమ్ నిరాకరణ.. కంపెనీకి 188 కోట్ల జరిమానా
నిండు గర్భిణి అయిన ఉద్యోగికి వర్క్ ఫ్రమ్ హోమ్‌కు నిరాకరించిన ఓ కార్పొరేట్ కంపెనీకి అమెరికాలోని ఓహియో రాష్ట్రంలో గల హామిల్టన్ కౌంటీ కోర్డు భారీ జరిమానా విధించింది. ఆఫీస్‌కు రావాలని యాజమాన్యం ఒత్తిడి చేయడంతో తప్పనిసరి పరిస్థితుల్లో వెళ్లిన సదరు ఉద్యోగి.. నెలలు నిండకుండానే బిడ్డకు జన్మనిచ్చింది. హై రిస్క్‌తో జన్మించిన శిశువు కొన్ని గంటలకే మరణించడంతో సంస్థను బాధ్యురాలిగా తేల్చిన కోర్డు.. ఉద్యోగికి భారీ పరిహారం చెల్లించాలని ఆదేశించింది.పూర్తి వివరాల్లోకి వెళితే.. చెల్సీ వాల్ష్ అనే మహిళ ఓహియో రాష్ట్రంలోని Total Quality Logistics అనే కంపెనీలో ఉద్యోగం చేస్తుంది. 2021లో ఆమె గర్భధారణ సమయంలో హై రిస్క్ ఉంటుందని డాక్టర్లు ముందే చెప్పారు. కదలికలు తగ్గించుకొని, తప్పనిసరి అనుకుంటే ఇంటి నుంచే పని చేయాలని సూచించారు. దీంతో వాల్ష్, కంపెనీని వర్క్ ఫ్రం హోమ్ అనుమతి కోరింది. కానీ అందుకు వారు తిరస్కరించారు. ఆఫీసుకు రావాలని ఒత్తిడి చేశారు. ఆప్షన్ లేక లీవ్ పెట్టాలని వెళ్లిన ఆమె.. అదే రోజు సమస్య తలెత్తడంతో ఆసుపత్రిలో చేరి, 20 వారాల 6 రోజుల వయసున్న శిశువుకు జన్మనిచ్చింది. హై రిస్క్‌పై జన్మించిన శిశువు కొన్ని గంటలకే మరణించింది. కంపెనీ వర్క్ ఫ్రమ్ హోమ్ నిరాకరించడం వల్లే ఈ విషాదం జరిగిందని వాల్ష్ కోర్టును ఆశ్రయించగా, తీర్పు ఆమెకు అనుకూలంగా వచ్చింది. శిశువు మరణానికి సంస్థను బాధ్యురాలిగా తేల్చిన కోర్టు.. ఉద్యోగికి 22.5 మిలియన్ డాలర్ల (రూ. 188 కోట్లు) పరిహారం చెల్లించాలని ఆదేశించింది. అయితే, కోర్టు తీర్పుతో ఏకీభవించని కంపెనీ యాజమాన్యం.. పై కోర్టుకు వెళ్లింది. -
కూతుర్ని చంపాడంటూ అమాంతం గాల్లోకి ఎగిరి..
అల్లారు ముద్దుగా పెంచుకున్న కూతురును ఓ దుర్మార్గుడు హత్య చేశాడు. ఆ నిందితుడిపై పగపై రగిలిపోయాడు. శిక్ష పడుతుందని రెండేళ్ల నుంచి ఎదురుచూశాడు. చివరికి కోర్టులో అతడ్ని ప్రవేశపెట్టగా ఆ తండ్రి తీవ్ర ఆవేశంతో ఊగిపోయాడు. ఈ రోజు నా చేతిలో నువ్వు చస్తావు అంటూ ఒక్క ఉదుటున నిందితుడి మీదకు దూకాడు. అధికారులు కంట్రోల్ చేయడంతో నిందితుడ్ని వదిలేశాడు. గురువారం నాడు అమెరికాలోని ఓహియో కోర్టులో ఈ సంఘటన జరిగింది. వాన్ టెర్రీ కూతురు షిరెల్డా టెర్రీ రెండేళ్ల కిందట దారుణ హత్యకు గురైంది. 2013లో మాడిసన్ ముగ్గుర్ని హత్య చేసి వారి మృతదేహాలను బ్యాగ్ లో తీసుకెళ్తుంటే పోలీసులు అరెస్ట్ చేశారు. అంగెలా డిస్కిన్స్(38), షెటిషా షీలే(18), షిరెల్డా టెర్రీ(18)లను ఈస్ట్ క్లీవ్ లాండ్ లోని తన నివాసంలో అతి దారుణంగా హతమార్చాడు. ఓహియో కోర్టులో కేసు గురువారం విచారణకు వచ్చింది. నిందితుడు మాడిసన్ కు మరణశిక్ష విధించారు. అయినా వాన్ టెర్రీ కోపం చల్లారలేదు. అమాంతం గాల్లోకి ఎగిరి నిందితుడిపై దూకాడు. ఇంతలో అధికారులు ఒక్కసారిగా అప్పమత్తమై నిందితుడు మాడిసన్ ను పక్కకు జరిపారు. దాదాపు పది మంది వ్యక్తులు ఆయనను పట్టుకుని వెనక్కి లాగుతున్నా కొంత సేపటి వరకు కంట్రోల్ చేయలేకపోయారు. అప్పటికీ దుఖంలో ఉన్న ఆ తండ్రి నన్ను వదలండీ సార్.. వాడు మా కుటుంబాన్ని టచ్ చేశాడు. ఆ నీచుడ్ని నా చేతులతోనే చంపేస్తాను. నా కూతుర్ని పొట్టన పెట్టుకున్న పాపాత్మున్ని శిక్షిస్తాను అంటూ కన్నీటి పర్యంతమయ్యాడు. ఈ దృశ్యం అక్కడి అధికారులతో పాటు కోర్టుకు హాజరైన వారిని కంటతడి పెట్టించింది.


