గర్భిణికి వర్క్ ఫ్రమ్ హోమ్‌ నిరాకరణ.. కంపెనీకి 188 కోట్ల జరిమానా | Employer ordered to pay 22.5M Dollars for newborns death after denying mom’s work from home request | Sakshi
Sakshi News home page

గర్భిణికి వర్క్ ఫ్రమ్ హోమ్‌ నిరాకరణ.. శిశువు మృతి.. కంపెనీకి 188 కోట్ల జరిమానా

Mar 21 2026 4:27 AM | Updated on Mar 21 2026 4:35 AM

Employer ordered to pay 22.5M Dollars for newborns death after denying mom’s work from home request

నిండు గర్భిణి అయిన ఉద్యోగికి వర్క్ ఫ్రమ్ హోమ్‌కు నిరాకరించిన ఓ కార్పొరేట్‌ కంపెనీకి అమెరికాలోని ఓహియో రాష్ట్రంలో గల హామిల్టన్ కౌంటీ కోర్డు భారీ జరిమానా విధించింది. ఆఫీస్‌కు రావాలని యాజమాన్యం ఒత్తిడి చేయడంతో తప్పనిసరి పరిస్థితుల్లో వెళ్లిన సదరు ఉద్యోగి.. నెలలు నిండకుండానే బిడ్డకు జన్మనిచ్చింది. హై రిస్క్‌తో జన్మించిన శిశువు కొన్ని గంటలకే మరణించడంతో సంస్థను బాధ్యురాలిగా తేల్చిన కోర్డు.. ఉద్యోగికి భారీ పరిహారం చెల్లించాలని ఆదేశించింది.

పూర్తి వివరాల్లోకి వెళితే.. చెల్సీ వాల్ష్ అనే మహిళ ఓహియో రాష్ట్రంలోని Total Quality Logistics అనే కంపెనీలో ఉద్యోగం చేస్తుంది. 2021లో ఆమె గర్భధారణ సమయంలో హై రిస్క్ ఉంటుందని డాక్టర్లు ముందే చెప్పారు. కదలికలు తగ్గించుకొని, తప్పనిసరి అనుకుంటే ఇంటి నుంచే పని చేయాలని సూచించారు.  

దీంతో వాల్ష్, కంపెనీని వర్క్ ఫ్రం హోమ్ అనుమతి కోరింది. కానీ అందుకు వారు తిరస్కరించారు. ఆఫీసుకు రావాలని ఒత్తిడి చేశారు. ఆప్షన్‌ లేక లీవ్‌ పెట్టాలని వెళ్లిన ఆమె.. అదే రోజు సమస్య తలెత్తడంతో ఆసుపత్రిలో చేరి, 20 వారాల 6 రోజుల వయసున్న శిశువుకు జన్మనిచ్చింది. హై రిస్క్‌పై జన్మించిన శిశువు కొన్ని గంటలకే మరణించింది.  

కంపెనీ వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ నిరాకరించడం వల్లే ఈ విషాదం జరిగిందని వాల్ష్‌ కోర్టును ఆశ్రయించగా, తీర్పు ఆమెకు అనుకూలంగా వచ్చింది. శిశువు మరణానికి సంస్థను బాధ్యురాలిగా తేల్చిన కోర్టు.. ఉద్యోగికి 22.5 మిలియన్ డాలర్ల (రూ. 188 కోట్లు) పరిహారం చెల్లించాలని ఆదేశించింది. అయితే, కోర్టు తీర్పుతో ఏకీభవించని కంపెనీ యాజమాన్యం.. పై కోర్టుకు వెళ్లింది.

 

Advertisement
 
Advertisement
Advertisement