breaking news
officers harassment
-
కేఎస్ఆర్టీసీ సిబ్బంది సమ్మె
సమస్యల పరిష్కారానికి డిమాండు దొడ్డబళ్లాపురం: సమస్యలు పరిష్కరించడంతో పాటు, అధికారుల వేధింపుల నుంచి తమను రక్షించాలంటూ దొడ్డబళ్లాపురం కేఎస్ఆర్టీసీ బస్ డిపో కార్మికులు, డ్రైవర్లు, కండెక్టర్లు మెరుపు సమ్మెకు దిగారు. ఆదివారం ఉదయం ఆరు గంటలకు డిపోకు వచ్చిన సుమారు వంద మందికి పైగా కార్మికులు విధులు బహిష్కరించి డిపో ముందు బైఠాయించి అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేసారు. ఈ సందర్భంగా ఉద్యోగులు మాట్లాడుతూ... డిపో నుంచివేరే డిపోకి ఏడు సంవత్సరాల క్రితమే బదిలీ అయినప్పటికీ ఇప్పటికీ వారిని ఇక్కడే కొనసాగిస్తున్నారన్నారు. దూర ప్రాంతాలకు వెళ్లి కుటుంబ సభ్యులను చూసి రావాలంటే డిపో మేనేజర్ సెలవు ఇవ్వడం లేదని, ఇచ్చినా ఒక్క రోజు మాత్రమే ఇస్తారని దూరపు ప్రాంతాలకు వెళ్లాలంటే కనీసం రెండు రోజులు పడుతుందని వాపోయారు. విధులకు రావడం కాస్త ఆలస్యమైనా ఆరోజు సెలవుగా నమోదు చేస్తారన్నారు. దొడ్డబళ్లాపురం డిపోకు ఇతర డిపోలలో మూలకు పడేసిన బస్సలను ఇస్తున్నారని, ఆ బస్సులు మార్గమధ్యలోనే ఎక్కడ బడితే అక్కడ నిలిచి పోవడంతో ప్రయాణికులు గొడవకు దిగుతున్నారని డ్రైవర్లు, కండక్టర్లు ఆవేదన వ్యక్తం చేసారు. స్టీరింగ్, గేర్, క్లచ్‌లు కండీషన్లో లేవని చెబితే ఇష్టం ఉంటే పనిచేయండి లేదంటే ఇంటికి వెళ్లండి అంటూ అధికారులు దుర్భాషలాడుతున్నారని ఆరోపించారు. డిపో మెకానిక్‌లు మాట్లాడుతూ డిపోలో మెకానిక్ సిబ్బంది చాలా తక్కువగా ఉన్నారన్నారు. 24 గంటలూ పని చేయించడంతో పాటు సెలవులో ఉన్నా ఫోన్ చేసి మరీ పిలిపించుకుంటారన్నారు. ఈ నెల పేమెంట్ స్లిప్‌లో కార్మికులు విధులు నిర్వహించిన దినాలను కూడా సెలవుగా చేర్చి తక్కువ వేతనం ఇచ్చారని వాపోయారు. కార్మికుల సమ్మె సమాచారం అందుకున్న డీటీఓ శివ ప్రకాశ్ ఘటనా స్థలానికి విచ్చేసి కార్మికుల సమస్యల గురించి తెలుసుకుని పరిష్కరిస్తానని హామీ ఇవ్వడంతో సమ్మె విరమించారు. -
అధికారుల వేధింపులతో ఆర్థిక ఇబ్బందులు
ప్రైవేట్ ట్రావెల్స్ వర్కర్స్ అసోసియేషన్ ఆరోపణ రాజమండ్రి, న్యూస్‌లైన్ : అధికారుల వేధింపుల కారణంగా ప్రైవేటు ట్రావెల్స్‌పై ఆధాపడి జీవిస్తున్న 20వేల కుటుంబాలు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని ప్రైవేట్ ట్రావెల్స్ వర్కర్స్ అసోసియేషన్ పేర్కొంది. అసోసియేషన్ రాష్ట్రస్థాయి సమావేశం ఆదివారం తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో జరిగింది. రాష్ట్రం నలుమూలల నుంచి ట్రావెల్స్ నిర్వాహకులు, డ్రైవర్లు, గ్యారేజీ కార్మికులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సంఘం గౌరవాధ్యక్షులుగా ఎన్నికైన వైఎస్సార్సీపీ ట్రేడ్ యూనియన్ తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షుడు అడపా వెంకట రమణ (గెడ్డం రమణ) మాట్లాడుతూ, పాలెం సంఘటన తర్వాత ప్రైవేటు బస్సుల డ్రైవర్లను రవాణా శాఖ అధికారులు తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు. యాజమాన్యాలు చేసిన తప్పులకు డ్రైవర్లను ఇరికించి వారి కుటుంబాలను రోడ్డుపాలు చేస్తున్నారని ఆరోపించారు. గతంలో డ్రైవర్లకు స్టేషన్ బెయిల్ వచ్చేదని, ఇప్పుడైతే మూడు నెలల వరకూ బెయిలు ఇవ్వడం లేదన్నారు. ఏదైనా సంఘటన జరిగినప్పుడే అధికారులు స్పందిస్తున్నారని, అలాకాకుండా మొదటినుంచీ ఒకేలా వ్యవహరిస్తే యాజమాన్యాలు, వర్కర్లు దానికనుగుణంగా నడుచుకునేవారన్నారు. అధికారుల వేధింపులకు నిరసనగా ఆర్డీవో, ఆర్టీఏ కార్యాలయాల వద్ద ధర్నాలు నిర్వహిస్తామన్నారు. పాలెం బస్సు దుర్ఘటన బాధిత కుటుంబాలను పరామర్శించాలని ఈ సమావేశంలో నిర్ణయించారు.