breaking news
No one injured
-
లారీ - బస్సు ఢీ: తప్పిన ప్రమాదం
నిజామాబాద్ : నిజామాబాద్ జిల్లా నాగిరెడ్డిపేట మండల కేంద్ర శివారులో బుధవారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఎదురెదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సు, లారీ ఢీకొన్నాయి. అయితే ఈ ప్రమాదంలో ఎవరికి ఎటువంటి గాయాలు కాలేదు. ఇద్దరికి మాత్రం స్వల్పగాయాలతో బయటపడ్డారు. బస్సు ముందు భాగం మాత్రం దెబ్బతిన్నది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
చిన్నారులతో చెలగాటం
నడుస్తుండగానే ఊడిన స్కూల్ బస్సు చక్రం -భయకంపితులైన చిన్నారులు -ప్రాణ భయంతో రోదనలు -తప్పిన భారీ ప్రమాదం -ఓవర్‌లోడే కారణం! -రవాణా శాఖ సర్టిఫికెట్ ఇచ్చిన మరుసటి రోజే ఘటన -విస్మయం కలిగిస్తున్న అధికారుల తీరు గజ్వేల్: రోజూలాగే పిల్లలను ఎక్కించుకొని వస్తున్న స్కూల్ బస్సు చక్రం.. నడుస్తుండగానే ఊడిపోయాయి.. దీంతో ఒక్కసారిగా కుదుపు, భారీ శబ్దాలు.. ఏం జరుగుతుందో తెలియని చిన్నారులు భయకంపితులై గజగజ వణికిపోయారు.. చిన్న పిల్లలు రోదించారు.. డ్రైవర్ బస్సును నిలిపేయడం, ఆ సమయంలో రోడ్డుపై నుంచి వాహనాల రాకపోకలు లేకపోవడంతో ప్రాణాపాయం నుంచి బయటపడ్డ చిన్నారులంతా ఊపిరి పీల్చుకున్నారు. పలువురు చిన్నారులకు స్వల్ప గాయాలయ్యాయి. కలకలం సృష్టించిన ఈ ఘటన మంగళవారం గజ్వేల్‌లో చోటుచేసుకున్నది. పట్టణంలోని శ్రీ కృష్ణవేణి టాలెంట్ స్కూల్‌కు చెందిన ఏపీ 23వై 4510 బస్సు.. వర్గల్, జబ్బాపూర్, సింగాయపల్లి, చౌదర్పల్లి గ్రామాల నుంచి సుమారు 75 మందికిపైగా పిల్లలను ఎక్కించుకొని బయల్దేరింది. పట్టణంలోని కస్తూర్బా పాఠశాల వద్దకు రాగానే బస్సు వెనుక భాగంలోని ఎడుమవైపు ఉన్న టైర్ ఊడిపోయింది. బోల్ట్ పగిలిపోవడంతో చక్రం బయటకు వచ్చింది. దీంతో బస్సుకు ఒక్కసారిగా కుదుపు. ఈ ఘటనతో పిల్లలంతా భయకంపితులయ్యారు. బస్సు రోడ్డు కిందికి దూసుకెళ్తూ ఆగిపోయింది. కొన్ని క్షణాలపాటు ఏం జరిగిందో తెలియక చిన్నారులు కలవరపడ్డారు. కొందరు ప్రాణభయంతో గట్టిగా రోదించారు. ప్రమాదం నుంచి బయటపడ్డామని తెలుసుకొని ఊపీరి పీల్చుకున్నారు. సమయానికి బస్సుకు బ్రేకులు పడటం, ఈ సమయంలో ఆ మార్గం నుంచి వాహనాలేవీ రాకపోడంతో పెను ప్రమాదం తప్పినట్లయ్యింది. బస్సుడ్రైవర్ ఆంజనేయులు పాఠశాల నిర్వాహకులకు సమాచారమందించడంతో వేరొక బస్సును అక్కడికి పంపించారు. పిల్లలంతా దానిలో స్కూల్‌కు చేరుకున్నారు. సమాచారం తెలుసుకున్న తల్లిదండ్రులు పాఠశాల వద్దకు చేరుకొని తమ పిల్లలను చూసుకుని కన్నీరు పెట్టుకున్నారు. కొందరు బస్సు నిర్వహణ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓవర్‌లోడ్ కారణమా? నిత్యం 35 నుంచి 40 మంది పిల్లలతో వచ్చే బస్సు మంగళవారం అందుకు భిన్నంగా 75 మందికిపైగా పిల్లలను ఎక్కించుకొని వచ్చిందని విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థులు చెబుతున్నారు. ఆయా రూట్లో వచ్చే మరో బస్సు మొరాయించడంతో ఒకే బస్సులో పిల్లలను ఎక్కించటం కారణంగా ఈ ఘటన జరిగిందని చెబుతున్నారు. కానీ ఈ ఘటన జరిగిన సమయంలో 45మంది విద్యార్థులున్నారని విద్యాశాఖ అధికారులు, 36 మంది ఉన్నారని పోలీసులు చెప్పడం గమనార్హం. పోలీసులు ఈ ఘటనకు సంబంధించి డ్రైవర్‌పై కేసు నమోదు చేశారు. క్లీన్ సర్టిఫికెట్ ఇచ్చిన మర్నాడే.. చక్రాలు ఊడిపోయిన బస్సుకు సోమవారం రోజే రవాణా శాఖ అధికారులు ఫిట్నెస్ క్లీన్ సర్టిఫికెట్ ఇవ్వడం.. ఇది గడిచిన 24 గంటలకే బస్సు ప్రమదానికి గురికావడం విస్మయం కలిగిస్తున్నది. స్కూల్ బస్సుల భద్రతపై ప్రత్యేక దృష్టిసారించామని రవాణా శాఖ ఓ వైపు ఊదరగొడుతుండగా సాక్షాత్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలోనే వారి డొల్లతనం బయటపడటం చర్చనీయాంశంగా మారుతున్నది. గతేడాది వెల్దుర్తి మండలం మాసాయిపేట రైల్వే గేటు వద్ద జరిగిన మహావిషాదం తాలూకూ చేదు జ్ఞాపకాలు నేటికీ బాధిత కుటుంబాలను కంటికి కునుకు లేకుండా చేస్తున్నాయి. ఈ క్రమంలో స్కూల్ బస్సుల భద్రతపై ప్రత్యేక దృష్టి సారించాల్సిన అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై నిరసన వెల్లువెత్తుతున్నది. డీఈఓకు నివేదిక.. ఫిట్నెస్ సర్టిఫికెట్ ఇచ్చిన మర్నాడే ఘటన జరిగిందనే విషయాన్ని ఎంఈఓ ఉదయ్‌భాస్కర్‌రెడ్డి ధ్రువీకరించారు. జరిగిన ఘటనపై డీఈఓకు నివేదిక ఇస్తామన్నారు. ఫిట్నెస్ లేని పది స్కూలు వాహనాల సీజ్ సంగారెడ్డి టౌన్: ఫిట్నెస్ సర్టిఫికెట్ లేకుండానే పిల్లల్ని చేరవేస్తున్న వివిధ పాఠశాలలకు చెందిన పది వాహనాలను సీజ్ చేశామని మోటర్ వెహికల్ ఇన్స్పెక్టర్ చక్రవర్తి తెలిపారు. మంగళవారం పటాన్చెరులో నాలుగు, జహీరాబాద్‌లో నాలుగు, సంగారెడ్డిలో రెండు వాహనాలను సీజ్ చేశామని చెప్పారు. ఖేడ్‌లో 4 బస్సులు .. మనూరు: నారాయణఖేడ్‌లో నాలుగు స్కూల్ బస్సులను మంగళవారం సీజ్ చేశారు. జహీరాబాద్ ఎంవీఐ గణేష్ బస్సులను స్వయంగా తనిఖీ చేశారు. పూర్తి స్థాయి ఫిట్నెస్ లేదని గుర్తించి ఆ మేరకు చర్యలు తీసుకున్నారు. బోధి పాఠశాలకు చెందిన రెండు, కాకతీయ, బ్రిలియంట్ స్కూళ్లకు చెందిన ఒక్కొక్క బస్సు సీజ్ అయిన వాటిలో ఉన్నాయి. ఎందుకింత నిర్లక్ష ్యం పిల్లలకు మంచి చదువులు చెప్పించాలని, వేల రూపాయల ఫీజులు చెల్లించి ప్రైవేటు స్కూళ్లకు పంపుతున్నం. పిల్లల భద్రతను మీకు అప్పగిస్తున్నం. వారి భద్రతను పట్టించుకోకుండా కెపాసిటీకి మించి పిల్లలను తీసుకెళ్లడం నిర్లక్ష్యమే. బస్సు టైర్లు బాగున్నాయా లేదా, ప్రమాదం జరిగే పరిస్థితులుంటే వాటిని బిగించడం లాంటి పనులు అస్సలు పట్టించుకోవడం లేదు. - కారింగుల సుదర్శన్‌రెడ్డి (పేరెంట్, సింగాయపల్లి) చాల భయమైంది నేను నాలుగో తరగతి చదువుతున్న. పొద్దున మా స్కూల్ బస్సులో అందరితోపాటు ఎక్కిన. మధ్యలో బస్సు సప్పుడు చేసుకుంటూ ఒక్కసారిగా ఆగింది. చాల భయమైంది. తరువాత మమ్ములను వేరే దానిలో బడికి తీసుకుపోయిండ్రు. -విఘ్నేష్(విద్యార్థి, సింగాయపల్లి) -
పాఠశాల విద్యార్థులకు తృటిలో తప్పిన ప్రమాదం
మెదక్: మెదక్ జిల్లా గజ్వేల్ మండలం సంగాపూర్ సమీపంలో పాఠశాల బస్సుకు తృటిలో ప్రమాదం తప్పింది. పాఠశాలకు విద్యార్థులను తీసుకువెళ్తున్న బస్సు వెనుక చక్రం ఊడిపోయింది. ఆ విషయం గమనించిన డ్రైవర్ వెంటనే అప్రమత్తమై... బస్సును నిలిపివేశాడు. దాంతో బస్సులోని 50 మంది విద్యార్థులను బస్సు నుంచి దింపివేశాడు. అయితే మెదక్ జిల్లాలో ఆర్టీఏ అధికారులు వాహనాలు తనిఖీలు ముమ్మరం చేశారు. అనుమతులు లేని నాలుగు బస్సులను అధికారులు సీజ్ చేశారు. -
చెట్టును ఢీ కొన్న ఆర్టీసీ బస్సు
ఒంగోలు: ప్రకాశం జిల్లా సంతమాగులూరు వద్ద ఆర్టీసీ బస్సు చెట్టును ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్ తోపాటు 33 మంది ప్రయాణికులకు గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించే క్రమంలో ఈ ప్రమాదం జరిగిందని ప్రత్యక్ష సాక్షులు వెల్లడించారు. బస్సు ముందు భాగం ధ్వంసమైంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అలాగే ఇదే మండలంలోని ఏల్చూరు వద్ద ఆటో బోల్తా పడింది. ఈ ఘటనలో ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అతి వేగమే ఆటో ప్రమాదానికి కారణమని స్థానికులు ఆరోపిస్తున్నారు.