‘తాత్కాలిక’ సీఎంలుగా మిగిలిన ఆ ఇద్దరు
ఆదివారం రాజీనామా చేసిన తమిళనాడు ముఖ్యమంత్రి ఓ పన్నీర్‌సెల్వం(ఓపీఎస్) రాష్ట్ర చరిత్రలో మూడు సార్లు ‘తాత్కాలిక ముఖ్యమంత్రి’ పనిచేసిన రికార్డు సొంతం చేసుకున్నారు. కిందటి డిసెంబర్లో ఏఐడీఎంకే నాయకురాలు, సీఎం జె.జయలలిత మరణించాక ఆయన ముచ్చటగా మూడోసారి ‘తాత్కాలిక ముఖ్యమంత్రి’గా ప్రమాణం చేశారు. అంతకు ముందు జయ కోర్టు కేసుల కారణంగా ముఖ్యమంత్రి పదవికి తొలిసారి రాజీనామా చేసినప్పుడు 2001 సెప్టెంబర్ 21 నుంచి 2002 మార్చి ఒకటి వరకూ తాత్కాలిక హోదాతో సీఎంగా పనిచేశారు. రెండోసారి కూడా న్యాయపరమైన చిక్కుల కారణంగా(జైలు శిక్ష పడినప్పుడు) జయలలిత రాజీనామా చేశాక పన్నీర్‌సెల్వం 2014 సెప్టెంబర్ 29 నుంచి 2015 మే 22 వరకూ సీఎం పదవిలో ఉన్నారు.
ఏఐడీఎంకే మాతృక డీఎంకే 1967లో అధికారంలోకి వచ్చిన రెండేళ్లకే పార్టీ నేత సీఎన్ అన్నాదురై మరణించాక పన్నీర్‌సెల్వం మాదిరిగానే సీనియర్ మంత్రి వీఆర్ నెడుంజెళియన్ 1969 ఫిబ్రవరి 3 నుంచి పది వరకూ తొలిసారి తాత్కాలిక సీఎంగా పనిచేశారు. మళ్లీ 1987 డిసెంబర్లో ఏఐఏడీఎంకే పార్టీ స్థాపకుడు, సీఎం ఎంజీ రామచంద్రన్ మరణించాక డిసెంబర్ 24 నుంచి జనవరి 7 వరకూ రెండోసారి తాత్కాలిక ముఖ్యమంత్రిగా ఉన్నారు. రెండోసారి నెడుంజెళియన్‌ను తొలగించి ఎంజీఆర్ భార్య వి.ఎన్.జానకికి సీఎం పదవి అప్పగించారు. ఇప్పుడు పార్టీ ప్రధాన కార్యదర్శి వీకే శశికళ కోసం ఓపీఎస్‌తో రాజీనామా చేయించడం 30 ఏళ్ల నాటి నెడుంజెళియన్ ఉద్వాసనను గుర్తుచేస్తోంది. ఇలా నెడుంజెళియన్, పన్నీర్సెల్వలు తమిళనాడులో ఇద్దరు తాత్కాలిక సీఎంలుగా చరిత్రలో మిగిలిపోతారు.
(సాక్షి నాలెడ్జ్ సెంటర్)