breaking news
NAT
-
NTA Exam : అవకాశాన్ని వదులుకోవద్దు!
దేశవ్యాప్తంగా 46 సెంట్రల్ యూనివర్సిటీలకు 2025–26 విద్యాసంవత్సరానికి గాను నాలుగు సంవత్సరాల డిగ్రీ కోసం నేషనల్ టెస్టింగ్ ఎజెన్సీ (National Testing Agency) ‘కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్’ నోటిఫికేషన్ విడుదల చేసింది. మార్చి 1వ తేదీన రిజి స్ట్రేషన్ మొదలయ్యింది. ఈ ప్రక్రియ 23వ తేదీ వరకూ కొనసాగుతుంది. 37 సబ్జెక్టులకు ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు. అభ్యర్థులు డొమెయిన్ సబ్జెక్టు (ప్రధాన సబ్జెక్టు) నూ, నిర్దేశించిన 13 భాషలలో ఒక భాషనూ ఎంచుకోవాలి. జనరల్ స్టడీస్‌ను అభ్యర్థులందరూ రాయాలి. కనీస భాషా పరిజ్ఞానాన్ని పరీక్షించే విధంగా భాషకు సంబంధించిన ప్రశ్నలు ఉంటాయి. ఇంటర్మీడియట్, ప్లస్ 2, 12వ తరగతి పూర్తి చేసు కున్నటువంటి విద్యార్థులు ఈ పరీక్ష రాయడానికి అర్హులు. ప్రతి విద్యార్థి ఐదు సబ్జెక్టుల వరకు పరీక్ష రాయడానికి ఎన్టీఏ అవకాశం కల్పించింది. ఈ ఒక్క పరీక్ష ద్వారా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి సెంట్రల్ యూనివర్సిటీల్లో, అనుబంధ కళాశాలల్లో విద్యార్థులు తమ ర్యాంకు ద్వారా, రిజర్వేషన్ల ఆధారంగా సీటు పొందడానికి అవకాశం ఉంటుంది.కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన విద్యా విధానం (2020)లో భాగంగా అన్ని కేంద్ర విద్యా సంస్థలలో నాలుగేళ్ల డిగ్రీ కోర్సును గత రెండు సంవత్సరాల క్రితం నుండి ప్రారంభించారు. ఒక విద్యార్థి 8 సెమిస్టర్లను పూర్తి చేసుకుంటే ఆ విద్యార్థికి డిగ్రీతోపాటు ఎడ్యుకేషన్ సర్టిఫికెట్ తీసుకునే అవకాశం ఉంటుంది. దీని ద్వారా విద్యార్థి టీచర్ నియామకానికి సంబంధించి పరీక్షను నేరుగా రాయడానికి అర్హత సాధిస్తాడు. దీంతో పాటు పీజీ సర్టిఫికెట్ కూడా పొందుతాడు. ఈ కోర్సులో విద్యార్థి 75% శాతం మార్కులు సాధిస్తే నేరుగా పీహెచ్‌డీలో చేరడానికి అర్హత లభిస్తుంది. యూనివర్సిటీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్లుగా చేరడానికి అవసరమైన నెట్, సెట్ పరీక్షలు రాయడానికి విద్యార్థి అర్హత సాధిస్తాడు.సైన్సు చదివే విద్యార్థి ఆర్ట్స్ సబ్జెక్టు చదవడం, ఆర్ట్స్ చదివే విద్యార్థి సైన్సు సబ్జెక్టు చదవడానికి వీలు ఉండేలా ఈ కోర్సులు డిజైన్ చేశారు. విద్యార్థులకు అవసరమైన నైపుణ్యాలను పెంచుకోవడానికి కంప్యూటర్ శిక్షణతో పాటు, మాతృభాష, ఇతర భాషలను నేర్పే విధంగా బోధన ఉంటుంది. యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్, ఇఫ్లూ, మాను, సమ్మక్క సారక్క సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీలు తెలంగాణలో; తిరుపతిలోని జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం, అనంతపురంలోని సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (ట్రాన్సిట్ క్యాంపస్)లు ఏపీలో ఈ ఎంట్రెన్స్ టెస్ట్ ద్వారా ప్రవేశం కల్పిస్తున్నాయి. విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు. వివరాలకు ఎన్టీఏ వెబ్సైట్ (https://cuet.nta.nic)ను చూడవచ్చు– డా.చింత ఎల్లస్వామి, ములుగు -
ఒకే ఇంజనీరింగ్ ఎంట్రన్స్!
మెడికల్, డెంటల్ కోర్సుల్లో ప్రవేశాలకు అనుసరిస్తున్న జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష (నీట్) తరహాలో దేశవ్యాప్తంగా ఇంజనీరింగ్‌లో ప్రవేశాల కోసం ఒకే ప్రవేశ పరీక్షను నిర్వహించాలన్న అంశం మళ్లీ తెరపైకి వచ్చింది. దీనికి సంబంధించి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) కసరత్తు మొదలుపెట్టింది. నీట్ విధానం విజయవంతం కావడంతో ఇంజనీరింగ్‌కు ఒకే ప్రవేశ పరీక్షను నిర్వహించేందుకు ఎన్టీఏ చర్యలు చేపడుతోంది. ఇంజనీరింగ్‌లో ప్రవేశాలకు ఒకే ప్రవేశ పరీక్షను నిర్వహించాలని అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) చేసిన సిఫారసులకు కేంద్ర ప్రభుత్వం రెండేళ్ల కిందటే ఆమోదం తెలిపింది. అయితే అప్పట్లో జాతీయస్థాయి పరీక్షల నిర్వహణకు ఏజెన్సీని ఏర్పాటు చేయాలన్న అంశం ప్రతిపాదన దశలోనే ఆగిపోయింది. ఏడాది కిందట ఎన్టీఏను ఏర్పాటు చేసిన సమయంలో దేశవ్యాప్తంగా ఒకే ప్రవేశ పరీక్ష ద్వారా ప్రవేశాలు చేపట్టాలని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ నిర్ణయం తీసుకుంది. ఎన్టీఏ ఏర్పాటైన వెంటనే ఇది సాధ్యం కాదన్న ఆలోచనతో గతేడాది ఈ అంశాన్ని పక్కన పెట్టింది. అయితే వచ్చే విద్యా సంవత్సరం (2020–21) నుంచి అమలు చేసేందుకు కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా వివిధ రాష్ట్రాల్లో ఆన్లైన్ ప్రవేశ పరీక్షల విధానం, ఇంజనీరింగ్‌లో ప్రవేశాల విధానాలపై ఎన్టీఏ అధ్యయనం చేయాలని నిర్ణయించింది. దీనిలో భాగంగా త్వరలోనే రాష్ట్రానికి రానుంది. – సాక్షి, హైదరాబాద్ జేఈఈ పరిధిలోకే అన్ని రాష్ట్రాలు.. ఇంజనీరింగ్‌లో ప్రవేశాలకు ఒకే ప్రవేశ పరీక్ష విధానం అమల్లోకి వస్తే దేశంలోని అన్ని రాష్ట్రాలు జేఈఈ మెయిన్ ర్యాంకుల ఆధారంగానే ప్రవేశాలు చేపట్టాల్సి వస్తుంది. ప్రస్తుతం మధ్యప్రదేశ్, హరియాణా, నాగాలాండ్, ఒడిశా, ఉత్తరాఖండ్, వివిధ రాష్ట్రాల్లోని మరో 9 యూనివర్సిటీలు ఈ ర్యాంకుల ఆధారంగానే తమ రాష్ట్రాల్లోని యూనివర్సిటీ కాలేజీలు, ప్రభుత్వ, ప్రైవేటు కాలేజీల్లో ఇంజనీరింగ్ ప్రవేశాలు చేపడుతున్నాయి. గతంలో గుజరాత్, మహారాష్ట్ర కూడా జేఈఈ మెయిన్ ర్యాంకుల ఆధారంగానే ప్రవేశాలు చేపట్టినా 2016లో జేఈఈ మెయిన్ నుంచి వైదొలిగాయి. తాజాగా ఎన్టీఏ ఆలోచనల నేపథ్యంలో భవిష్యత్తులో అన్ని రాష్ట్రాలు ఒకే ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్ష ద్వారా తమ రాష్ట్రాల్లోని ఇంజనీరింగ్ కాలేజీల్లో ప్రవేశాలు చేపట్టాల్సి ఉంటుంది. జనవరిలో నిర్వహించబోయే జేఈఈ మెయిన్ కోసం ఇప్పటికే నోటిఫికేషన్ ఇచ్చి దరఖాస్తులను స్వీకరించినందున 2020–21 నుంచి ఇది అమల్లోకి రావొచ్చని ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. ఈలోగా రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం కుదురుతుందని భావిస్తున్నామని, ఏదైనా తేడా వచ్చినా 2021–22 నుంచి తప్పనిసరిగా దీని పరిధిలోకి రావాల్సి ఉంటుందని ఆ అధికారి చెప్పారు. 40 లక్షల మందికి నిర్వహణ సాధ్యమయ్యేనా? ఇంజనీరింగ్‌లో ప్రవేశాలకు దేశవ్యాప్తంగా ఒకే పరీక్ష విధానం అమల్లోకి వస్తే రాష్ట్రమే కాదు దేశంలోని అన్ని రాష్ట్రాల విద్యార్థులు జేఈఈ మెయిన్ పరీక్ష రాయాల్సి ఉంటుంది. ప్రస్తుతం దేశంలోని ఎన్ఐటీ, ట్రిపుల్ఐటీ, కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సహకారం పొందే ఇతర జాతీయ స్థాయి విద్యా సంస్థల్లో (జీఎఫ్‌టీఐ) ప్రవేశాల కోసం జేఈఈ మెయిన్ పరీక్ష రాస్తున్నారు. ఐఐటీల్లో ప్రవేశాలు పొందాలనుకునే వారు జేఈఈ మెయిన్ పరీక్ష రాసి, అందులో అర్హత సాధించిన టాప్ 2.40 లక్షల మంది జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు హాజరవుతున్నారు. మొత్తానికి జేఈఈ మెయిన్ పరీక్షకు ప్రస్తుతం దేశవ్యాప్తంగా సుమారు 13 లక్షల మంది విద్యార్థులు హాజరవుతున్నారు. వారిలో తెలంగాణ నుంచి 75 వేల మంది, ఆంధ్రప్రదేశ్ నుంచి మరో 80 వేల మంది వరకు విద్యార్థులు ఉంటున్నారు. కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదన కార్యరూపం దాలిస్తే జేఈఈ మెయిన్ పరీక్ష ర్యాంకుల ఆధారం గానే అన్ని రాష్ట్రాల్లోని ఇంజనీరింగ్ కాలేజీల్లో ప్రవేశాలు చేపట్టాల్సి వస్తుంది. అప్పు డు తెలంగాణ, ఏపీ నుంచే 3.5 లక్షల మంది విద్యార్థులు జేఈఈ మెయిన్‌కు హాజరుకానుండగా దేశవ్యాప్తంగా దాదాపు 40 లక్షల మంది విద్యార్థులకు జేఈఈ మెయిన్ నిర్వహించాల్సి వస్తుందని ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ తుమ్మల పాపిరెడ్డి చెప్పారు. అయితే అంత మందికి ఈ పరీక్ష నిర్వహణ ఆచరణ సాధ్యమవుతుందా లేదా అనే అంశంపైనా ఎన్టీఏ ఆలోచనలు చేస్తోంది. దీనిలో భాగంగా వివిధ రాష్ట్రాల్లో పరిస్థితులను అధ్యయనం చేయనుంది. ఆ తరువాత ఒకే పరీక్ష విధానాన్ని అమల్లోకి తెస్తే రాష్ట్రంలో నిర్వహిస్తున్న ఎంసెట్ ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్ష రద్దు కానుంది. -
ఎన్ఏటీ వర్క్‌షాప్ ప్రారంభం
న్యూఢిల్లీ: ఐఐటీ అభ్యర్థుల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న నేషనల్ అథారిటీ టెస్ట్(ఎన్ఏటీ)పై అంతర్జాతీయ నిపుణుల సలహాలు, సూచనల కోసం కేంద్ర మానవవనరుల అభివృద్ధి శాఖ రెండురోజుల వర్క్‌షాప్ గురువారం ప్రారంభమైంది. తొలిరోజున నిపుణుల ప్రజెంటేషన్ జరిగింది. ఆప్టిట్యూడ్ టెస్ట్‌లో అంతర్జాతీయ అనుభవాన్ని వాడుకుని భవిష్యత్ కార్యాచరణ కోసం హెచ్ఆర్డీ మంత్రిత్వ శాఖ ఈ వర్క్‌షాప్ నిర్వహిస్తోంది.