breaking news
musayipeta
-
కెనరా బ్యాంక్‌లో చోరీకి విఫలయత్నం
సాక్షి, వెల్దుర్తి(తూప్రాన్): మాసాయిపేట కెనరాబ్యాంక్‌లో చోరీకి విఫలయత్నం జరిగింది. వెల్దుర్తి సెంట్రల్‌బ్యాంక్‌లో చోరీకి ప్రయత్నించిన ఘటన మరువకముందే మళ్లీ దుండగులు మరో బ్యాంకులో చోరీకియత్నించారు. గ్యాస్‌కట్టర్ సహాయంతో లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించగా సెక్యూరిటీ అప్రమత్తతతో దుండగులు పరారయ్యారు. బ్యాంక్‌లో ఎలాంటి చోరీ జరగకపోవడంతో బ్యాంక్ సిబ్బంది, ఖాతాదారులు ఊపిరి పీల్చుకున్నారు. గతంలోనూ కెనరాబ్యాంక్‌లో దుండగులు చొరబడి బంగారు నగలతో పాటు లాకర్లలోని నగదు ఎత్తుకెళ్లండంతో, చోరీ ప్రయత్నం ఘటన తెలుసుకున్న ఖాతాదారులు పెద్దఎత్తున తరలివచ్చారు. చివరికి లోనికి ప్రవేశించకుండానే దుండగులు పరారయ్యారని తెలుసుకుని ఇళ్లల్లోకి వెళ్లిపోయారు. సంఘటనకు సంబంధించిన వివరాలను చేగుంట ఎస్సై సత్యనారాయణ, బ్యాంక్ మేనేజర్ వినితాకృష్ణ వెల్లడించారు. సోమవారం అర్ధరాత్రి దాటాక సుమారు 2గంటల 30నిమిషాల సమయంలో బ్యాంక్‌లో అలారం మోగింది. దీంతో అక్కడే కాపలా ఉన్న సెక్యూరిటీ గార్డు గణేష్ అప్రమత్తమై బ్యాంకు చుట్టూ కలియతిరిగాడు. ఈ క్రమంలో బ్యాంక్ వెనుక భాగంలో ఇద్దరు దుండగులు కిటికీ గ్రిల్స్ గ్యాస్‌కట్టర్‌తో తొలగించి లోపలికి ప్రవేశించేందుకు ప్రయత్నిస్తున్నారు. సెక్యూరిటీ గట్టిగా అరుపులు చేస్తూ పట్టుకునేందుకు ప్రయత్నించడంతో దుండగులు గ్యాస్ సిలిండర్లను అక్కడే వదిలి పరారయ్యారు. సెక్యూరిటీ గార్డు ఇచ్చిన సమాచారంతో సంఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు, బ్యాంక్‌మేనేజర్ బ్యాంక్‌లో పరిశీలించి ఎలాంటి అపహరణ జరగలేదన్నారు. బ్యాంక్ వద్ద ప్రత్యేక సెక్యూరిటీ గార్డును ఉంచడంతో పాటు బ్యాంకులో రక్షణ చర్యలు తీసుకున్నట్లు బ్యాంక్ మేనేజర్ వినితాకృష్ణ తెలిపారు. ఖాతాదారులు ఆందోళన చెందవద్దన్నారు. -
ఇంకా ఆస్పత్రిలోనే...
కళ్లు తెరవని వరుణ్‌గౌడ్... నెమ్మదిగా తేరుకుంటున్న ప్రశాంత్... శతవిధాలుగా ప్రయత్నిస్తున్న వైద్యులు సాక్షి, సిటీబ్యూరో: మూసాయిపేట ఘటనలో తీవ్రంగా గాయపడిన వరుణ్‌గౌడ్(7) ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉంది. గత పది రోజులుగా ఆ చిన్నారి కళ్లు కూడా తెరువలేదు. ప్రశాంత్(6) పరిస్థితి ఇంకా విషమంగానే ఉంది. శరత్(6), నితిషా(7)లు నెమ్మదిగా కోలుకుంటున్నారు. మూసాయిపేట్ రైల్వేక్రాసింగ్ ఘటనలో 18 మంది మృతి చెందగా, 20 మంది క్షతగాత్రులు సికింద్రాబాద్ యశోద ఆస్పత్రిలో చేరారు. వీరిలో వైష్ణవి, తరుణ్‌లు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఇటీవలే మృతి చెందగా, 14 మంది డిశ్చార్జ్ అయిన విషయం తెలిసిందే. మిగిలిన నలుగురినీ ప్రాణాపాయం నుంచి కాపాడేందుకు ఆస్పత్రికి చెందిన 40 మంది వైద్య నిపుణులు, 100 మంది పారా మెడికల్ స్టాఫ్ అహర్నిశలు శ్రమిస్తున్నట్లు ఆస్పత్రి మెడికల్ డెరైక్టర్ డాక్టర్ లింగయ్య స్పష్టం చేశారు. పది రోజులుగా అదే స్థితి... వెంకటాయపల్లికి చెందిన మల్లేష్, లత దంపతులకు రుచిత గౌడ్(8), వరుణ్ గౌడ్(7), శృతి గౌడ్(6) ముగ్గురు పిల్లలు. వీరందరినీ కాకతీయ టెక్నో స్కూల్లో చదివిస్తున్నారు. ఘటన జరిగిన రోజు శృతి అక్కడికక్కడే మరణించింది. తీవ్రంగా గాయపడిన రుచితగౌడ్, వరుణ్‌గౌడ్‌లను యశోద ఆస్పత్రికి తరలించారు. రుచిత పూర్తిగా కోలుకోవడంతో గురువారం వైద్యులు ఆమెను డిశ్చార్జ్ చేశారు. కుమారుడు వరుణ్‌గౌడ్ పరిస్థితి మాత్రం అత్యంత విషమంగా ఉంది. మెదడు దెబ్బతింది. కుడి కాలర్ ఎముక విరిగింది. ఛాతి ఎముకలు విరిగి ఊపిరితిత్తులకు ఆనుకోవడంతో ఒత్తిడికి అవి దెబ్బతిన్నాయి. ఎడమ మోకాలి కార్టిలేజ్‌పై చర్మం అంతా ఊడిపోయింది. ఐదు రో జుల క్రితం ఆయనకు ప్లాస్లిక్ సర్జరీ చేశారు. ప్రస్తుతం వెంటిలేటర్‌పై ఉన్నాడు. ఇప్పటి వరకు కళ్లు కూడా తెరువలేదు. శరీరంలో ఎలాంటి కదలిక లేదు. తరచూ ఫిట్స్ వస్తున్నాయి. గత పది రోజుల నుంచి మృత్యువుతో పోరాడుతున్నాడు. పూర్తిగా మందులే వినియోగిస్తున్నారు. మరో మూడు రోజులు గడిస్తే కానీ ఇప్పుడే ఏమీ చెప్పలేమని వైద్యులు స్పష్టం చేస్తున్నారు. మిగతా పిల్లల్లాగే తన కుమారుడు వరుణ్‌గౌడ్ కూడా కోలుకుని క్షేమంగా ఇంటికి తిరిగి రావాలని అతని తల్లిదండ్రులు కనిపించిన దేవుడినల్లా ప్రార్థిస్తున్నారు. కొడుకు ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడనే తీపి కబురు కోసం కళ్లలో ఒత్తులు వేసుకుని ఆశగా ఎదురు చూస్తున్నారు. ప్రశాంత్ మెదడు చుట్టూ నీరు... వెంకటాయపల్లికి చెందిన స్వామి, నర్సమ్మ దంపతుల రెండో కుమారుడు ప్రశాంత్(6) ఆరోగ్య పరిస్థితి ఇంకా విషమంగానే ఉంది. వరణ్‌గౌడ్‌తో పోలిస్తే ఇతని పరిస్థితి కొంత మెరుగ్గా ఉందని చెప్పవచ్చు. పుర్రె ఎముక విరిగి మెదడుకు ఆనుకుంది. తలపై చర్మం ఊడిపోవడంతో ప్లాస్టిక్ సర్జరీ చేశారు. తొడ భాగంలోని కొంత చర్మాన్ని తీసి తలపై అమర్చారు. మెదడు చుట్టూ నీరు చేరుతుండటంతో మూడు రోజుల క్రితం సర్జరీ చేసి, నీటిని బయటికి తీసేశారు. ముఖంపై గాయాలు ఇంకా మాన లేదు. ఎడమ చేయి విరగడంతో శస్త్రచికిత్స చేసి కట్టుకట్టారు. నాలుగు రోజుల క్రితం వెంటిలేటర్ తొలగించారు. సహజ పద్ధతిలో ఆక్సిజన్ అందిస్తున్నారు. అయితే ఇప్పటికే రెండు మూడు సార్లు ఫిట్స్ రావడంతో వైద్యుల పరిశీలనలో ఉంచారు. మరోసారి ఫిట్స్ వస్తే...మళ్లీ వెంటిలేటర్ అమర్చాల్సి ఉంటుందని ఆ చిన్నారికి శస్త్రచికిత్స చేసిన సీనియర్ న్యూరోసర్జన్ డాక్టర్ బి.జె.రాజేశ్ తెలిపారు.