mumbai lady
-
హండ్రెడ్స్ ఆర్ వెయిటింగ్
ఒక మహిళ గర్జన ఇప్పుడు దేశాన్ని ఆకర్షిస్తోంది. రాజకీయ ర్యాలీలు, నిరసనల పేరుతో రోడ్లు బ్లాక్ చేసి, స్కూల్ పిల్లలను, అంబులెన్స్ లను, ఆఫీస్‌కి వెళ్లే వాళ్లను గంటలు గంటలు ఆపేయడం మామూలైపోయిన ఈ రోజుల్లో ఒక నిరసన స్వరం దేశానికి తన బాధ్యతను గుర్తు చేస్తోంది. ‘ఎవరూ మాట్లాడరులే’ అనే ధైర్యంతో ఇష్టారాజ్యంగా ఉన్న వారికి ‘సామాన్యులతో పెట్టుకోకు’ అని ఈ ఘటన చెప్పినట్టయ్యింది.అసలేం జరిగింది?ఏప్రిల్ 22, మంగళవారం ముంబైలోని వర్లీలో బిజెపి పార్టీ ‘మహిళా రిజర్వేషన్ బిల్లు’కి మద్దతుగా ఒక ర్యాలీ నిర్వహించింది. దాంతో వర్లీ జంభోరీ మైదాన్ నుంచి డోమ్ వరకు మొత్తం ట్రాఫిక్ జామ్ అయిపోయింది. సరిగ్గా అదే సమయంలో ఒక స్థానిక మహిళ తన బిడ్డను స్కూల్ నుంచి తీసుకురావడానికి వెళ్తూ గంటల తరబడి ట్రాఫిక్‌లో ఇరుక్కుపోయింది. విసుగెత్తి పోయిన ఆవిడ కారు దిగి, నేరుగా ర్యాలీ మధ్యలోకి వెళ్లి మహారాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి గిరీష్ మహాజన్ తో వాగ్వాదానికి దిగింది. ‘గెట్ అవుట్ ఆఫ్ హియర్! మీరు ట్రాఫిక్ జామ్ క్రియేట్ చేస్తున్నారు’ అని నిలదీసింది. ‘వందలమంది వెయిట్ చేస్తున్నారు. అక్కడ ఖాళీ గ్రౌండ్ ఉంది కదా’ అని పక్కనే ఉన్న ఖాళీ స్థలాన్ని చూపిస్తూ గట్టిగా అరిచింది. పోలీసులు జోక్యం చేసుకోబోతే వాళ్ల మీద కూడా ఆగ్రహం వ్యక్తం చేసి ‘సీనియర్ ఆఫీసర్స్తోనే మాట్లాడతా’ అని తెగేసి చెప్పింది. మంత్రి మహాజన్ సర్ది చెప్పబోయినా ఆవిడ వినలేదు. వెళ్లి మళ్లీ వచ్చి ‘మీకు అర్థం కాలేదా? వందల మంది వెయిట్ చేస్తున్నారు’ అని మళ్లీ గట్టిగా అడిగింది. ఈ సంఘటన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. వీఐపీ కల్చర్‌కి చెక్ పెట్టాలని చాలామంది కోరుతున్నారు. నగరాల్లో అసలే ట్రాఫిక్ జామ్‌లతో బాధ పడుతున్న జనం ఈ ర్యాలీలు, ప్రదర్శనల వల్ల మరెంత అవస్థ పడుతున్నారో అర్థం చేసుకోవాల్సిన సమయం వచ్చేసింది. జనం ఆగ్రహం ఇలా కట్టలు తెంచుకోక ముందే పాలనా వ్యవస్థలు మేలుకోవాలి. -
మాల్యాను తీసుకురండి.. అప్పుడు ఫైన్ కడతా!
ప్రజల్లో చైతన్యం, సామాజిక స్పృహ, జరుగుతున్న పరిణామాల పట్ల ఆగ్రహావేశాలు ఎంత తీవ్రంగా ఉన్నాయో ఈ సంఘటన చూస్తే తెలుస్తుంది. ముంబైలో మంచి ఆర్థిక నేపథ్యం ఉన్న ఓ మహిళ.. కావాలనే టికెట్ తీసుకోకుండా రైలెక్కి, టికెట్ కలెక్టర్ ఫైన్ కట్టమని అడిగినప్పుడు.. ముందు విజయ్ మాల్యాను తీసుకొచ్చి అరెస్టు చేసి, అతడు బ్యాంకులకు అప్పున్న 9వేల కోట్లు కక్కించాలని, అప్పుడే తాను రూ. 260 ఫైన్ కడతానని పట్టుబట్టారు. చివరకు కావాలంటే తాను ఏడు రోజుల జైలు శిక్ష అయినా అనుభవిస్తాను గానీ, మాల్యాను అరెస్టు చేస్తే తప్ప ఫైన్ మాత్రం కట్టేది లేదని స్పష్టం చేశారు. ఇద్దరు పిల్లల తల్లి అయిన ప్రేమలతా భన్సాలీ (44) దక్షిణ ముంబైలోని భులేశ్వర్ ప్రాంతంలో ఓ బహుళ అంతస్థుల భవనంలో ఉంటారు. ఆమె ముంబై సబర్బన్ రైల్లో టికెట్ లేకుండా ప్రయాణిస్తూ మహాలక్ష్మి రైల్వేస్టేషన్ వద్ద టికెట్ చెకింగ్ అధికారికి పట్టుబడ్డారు. టికెట్ లేనందుకు రూ.260 జరిమానా కట్టాలని అడిగితే, బ్యాంకులకు రూ. 9వేల కోట్ల అప్పున్న విజయ్ మాల్యాను అరెస్టు చేసి, ఆయనతో ఆ సొమ్ము కట్టించాలని.. అప్పుడు తాను జరిమానా కడతానని చెప్పారు. అలా ఒకటి, రెండు కాదు.. దాదాపు 12 గంటల పాలు రైల్వే అధికారులతో వాదిస్తూనే ఉన్నారు. విజయ్ మాల్యాను ఏమీ అనకుండా వదిలేసి, ఆయన వస్తానన్నప్పుడే రావాలంటూ సన్నాయినొక్కులు నొక్కుతున్న అధికారులు సామాన్యులను మాత్రం ఎందుకింత వేధిస్తున్నారని ప్రశ్నించారు. చివరకు ఆమె భర్త రమేష్ భన్సాలీని పిలిపించినా ఆయన కూడా ఈ విషయంలో తాను చేయగలిగింది ఏమీ లేదని.. అంతా ప్రేమలత ఇష్టమేనని స్పష్టం చేశారు. దాంతో ఏం చేయాలో తెలియక జుట్టుపట్టుకున్న రైల్వే పోలీసులు.. ఆమెను మేజిస్ట్రేట్ కోర్టులో ప్రవేశపెట్టారు. అక్కడ కూడా ఆమె జరిమానా మాత్రం కట్టనని, కావాలంటే జైలుకు వెళ్తానని చెప్పారు. ఈ విషయాన్ని పశ్చిమ రైల్వే సీనియర్ డివిజనల్ సెక్యూరిటీ కమిషనర్ ఆనంద్ విజయ్ ఝా తెలిపారు.


