breaking news
Multiple benefits
-
ఎత్తు మడులపై విత్తితే మేలు!
సీజన్ ప్రారంభం కాగానే పొలాన్ని దున్ని, విత్తనాలు వేయటం రైతులు చేసే పని. దీన్ని ‘ఫ్లాట్ బెడ్ మెథడ్’ అంటారు. అయితే, ఎత్తు మడులు చేసి లేదా బోదెలు తోలి వాటిపై పత్తి తదితర పంటలు విత్తుకోవటం మేలని ఆదిలాబాద్ కేవీకే ప్రధాన శాస్త్రవేత్త డా. ప్రవీణ్‌కుమార్ సూచిస్తున్నారు. ఇది బహుళ ప్రయోజనాలున్న ‘రెయిజ్డ్ బెడ్ మెథడ్. పంటలు సాగు చేస్తున్నది నల్ల రేగడైనా, ఎర్ర నేలైనా, బంక మట్టి అయినా సరే ఎత్తుమడులపై పంటలు విత్తుకోవటం ఉపయోగకరం. వర్షాలు తక్కువైనా, ఎక్కువైనా.. వర్షానికి వర్షానికి మధ్య ఎక్కువ రోజులు వ్యవధి వచ్చినా రైతులను ఎత్తుమడులు ఆదుకుంటాయని ఆయన తెలిపారు. గత మూడేళ్లలో ఎత్తుమడులపై విత్తుకోవటంలో సౌలభ్యాన్ని రైతులు గుర్తిస్తున్నారని, చాలా మంది ప్రయోజనం పొందుతున్నారని డా. ప్రవీణ్‌కుమార్ ‘సాక్షి సాగుబడి’తో చెప్పారు. → నల్లరేగడి, తేలికపాటి ఎర్రనేలల్లో ఎత్తుమడుల పద్ధతిలో పత్తిని సాగు చేయవచ్చు→ పత్తిలో అంతరపంటగా కందిని విత్తుకుంటే.. ఒకవేళ ఏ కారణంగానైనా ఒక పంట దెబ్బతింటే, మరో పంట రైతును ఆదుకుంటుంది→ ఎత్తుమడుల వల్ల మురుగు నీటి వ్యవస్థ మెరుగుపడుతుంది. వర్షపు నీరు పొలంలో నిలవకుండా, కాలువల ద్వారా బయటికి వెళ్లిపోతుంది. దీనివల్ల తొలిదశలో → మొక్క పెరుగుదల కుంట సాధారణ పద్ధతితో పోలిస్తే, ఎత్తుమడుల పద్ధతిలో 10–20% అధిక దిగుబడులకు అవకాశంఅడుగు–అడుగున్నర ఎత్తు మడిపత్తి ముఖ్యంగా బరువైన నల్లరేగడి నేలలకు అనుకూలమైనప్పటికీ, రైతులు క్రమేణా తేలిక పాటి నేలల్లో సైతం సాగు చేస్తున్నారు. అధిక వర్షపాతం నమోదయ్యే సమయాల్లో పంటల సంరక్షణకు సమర్థవంతమైన మురుగు నీటి వ్యవస్థ కీలకం. ఎత్తుమడుల పధ్ధతిలో పత్తి సాగు చేయడం ద్వారా ఇలాంటి సమస్యలను దూరం చేయవచ్చు. ఎత్తుమడులు చేసుకోవడానికి ట్రాక్టర్‌తో అనుసంధానం చేసే రిడ్జర్ లేదా బెడ్ మేకర్‌ను ఉపయోగించుకోవచ్చు. 30–45 సెం.మీ.(అడుగు–అడుగున్నర)ల ఎత్తు మడులను ఏర్పాటు చేసుకోవాలి. మడి వెడల్పు నేల స్వభావం, ఆ ప్రాంతంలో నమోదయ్యే వర్షపాతాన్ని బట్టి ఎంత కావాలంటే అంత పెట్టుకోవచ్చు. సాళ్ల మధ్య 180/ 150/ 120 సెం.మీ., మొక్కల మధ్య 30/20/30 సెం.మీ. ల దూరంలో పత్తి పంటను సాగు చేయవచ్చు. సాధారణంగా ఒక ఎకరంలో ఎత్తుమడులు చేయడానికి సుమారు 45 నిమిషాల నుంచి ఒక గంట సమయం పడుతుంది.ఎత్తుమడులపై పత్తి సాగుతో లాభాలుఎత్తుమడుల మీద విత్తిన విత్తనం సాధారణ పొలంలో కన్నా ఒకటి రెండు రోజులు ముందే మొలకెత్తుతుంది. సాంప్రదాయ పద్ధతితో పోలిస్తే మొలక శాతం ఎక్కువ. దాదాపు 90 శాతం వరకు మొలక వస్తుంది. ఎత్తుమడుల వల్ల మురుగు నీటి వ్యవస్థ మెరుగుపడుతుంది. వర్షపు నీరు పొలంలో నిలవకుండా, కాలువల ద్వారా బయటికి వెళ్లిపోతుంది. దీనివలన తొలిదశలో మొక్క పెరుగుదల కుంటుపడదు. భారీ వర్షాలు కురిసినప్పుడు నల్లరేగడి నేలల్లో వరద పారుతుంది. ఎత్తుమడుల వల్ల ఆ ప్రవాహంలో మొక్కలు కొట్టుకుపోకుండా కాపాడుతుంది. వర్షాభావ పరిస్థితుల్లో మడుల్లో నిల్వ ఉన్న నీళ్లు పంటకు ఉపయోగపడతాయి. సాంప్రదాయ పద్ధతిలో పత్తి మొక్కల కింది కొమ్మలకు మొదట్లో వచ్చే 5 నుండి 10 కాయలు కుళ్లిపోతూ ఉంటాయి. ఎత్తుమడుల చేయడం వలన గాలి, వెలుతురు బాగా తగిలి కాయకుళ్లు, ఇతర చీడపీడల ఉధృతి తక్కువగా ఉంటుంది. యాంత్రీకరణ ద్వారా కలుపు యాజమాన్యం సులభమవుతుంది. తద్వారా కూలీల ఖర్చు ఆదా అవుతుంది. మందులు పిచికారీ చేయడం, పత్తి ఏరటం, పంటకోత, పంట అవశేషాల ఏరివేత మరింత సులభతరం అవుతాయి. సాధారణ పద్ధతితో పోలిస్తే, ఎత్తుమడుల పద్ధతిలో 10–20 శాతం అధిక దిగుబడులు సాధించవచ్చు. నల్లరేగడి నేలలు, తేలికపాటి ఎర్రనేలల్లో ఎత్తుమడుల పద్ధతిలో పత్తిని సాగు చేయవచ్చు. పత్తిలో అంతరపంటగా కందిని విత్తుకుంటే, ఒకవేళ ఏ కారణంగానైనా ఒక పంట దెబ్బతింటే, మరో పంట రైతును ఆదుకుంటుంది.– డాక్టర్ ప్రవీణ్‌కుమార్ (99896 23829), ప్రధాన శాస్త్రవేత్త, కృషి విజ్ఞాన కేంద్రం, ఆదిలాబాద్, ప్రొ. జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వ విద్యాలయంతడి పెట్టాల్సిన అవసరం రాలేదుసున్నక్కడి (ఎర్రనేల) నేల 3 ఎకరాలు, నల్లరేగడి 6 ఎకరాలు, చెలక (ఇసుక) భూమి 3 ఎకరాల్లో గత సంవత్సరం ఎత్తుమడుల (కట్టల)పైన పత్తి పెట్టాం. కాయకుళ్లే కనిపించలేదు. మామూలుగా పత్తి సాగు చేసిన వారికి కాయకుళ్లు నష్టం కలిగించింది. మాకు ఆ సమస్య రాలేదు. అధిక సాంద్రతలో ఎకరానికి 14.5 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. వర్షాలు త్వరగా ఆగిపోవటం వల్ల కట్టలపై పంట పెట్టిన పొలాల్లో చివరి తడి పెట్టాల్సిన అవసరం రాలేదు. నీటి తేమను నిలుపుకునే శక్తి కట్టల వల్ల వచ్చింది. వేరే పొలాలకు చివరి తడి పెట్టాల్సి వచ్చింది. వర్షాలు ఎక్కువ కురిసినా పంటకు ఇబ్బంది ఉండదు. ఈ పద్ధతిలో పత్తి పంట రెండు నెలలు ముందే పూర్తయ్యింది. రెండేళ్లు ఇతర పొలాలు చూసిన తర్వాతే మేం ఈ పద్ధతిలో వేశాం. ఈ సంవత్సరం చాలా మంది రైతులు ఆసక్తి చూపుతున్నారు. అయితే, వర్షం బాగా కురిసి, కట్ట పూర్తిగా తడిచిన తర్వాతనే విత్తనం పెట్టుకోవాలి. – కట్ల కుమారస్వామి (88858 75575), యాపల్‌గూడ, ఆదిలాబాద్ జిల్లాఎత్తుమడులతో బాగా ఉపయోగంగత మూడేళ్ల నుంచి 12 ఎకరాల సుంకడి (నలుపు ఎరుపు కాని తెల్ల రాయితో కూడిన) భూమిలో ఎత్తుమడుల (కట్టల)పై పత్తిని అధిక సాంద్రతలో సాగు చేస్తున్నాను. కాయకుళ్లు తెగులు అసలు రాలేదు. ఎకరానికి 17–18 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. ఈ పద్ధతి బబాగా ఉపయోగకరంగా వుంది. ఇరుగు పొరుగు రైతులు ఎలా చెయ్యాలని అడుగుతున్నారు. – గంధి శంకర్ (84988 00958), యాపల్గూడు, ఆదిలాబాద్ జిల్లా -
ట్రాక్టరు చిన్నది.. పనితనం పెద్దది!
రైతుల్లో చిన్న రైతులు 80% మంది ఉన్నప్పటికీ.. వీరికి అనువైనవి, అందుబాటులో ఉండే వ్యవసాయ యంత్ర పరికరాలు మాత్రం తక్కువే! ఈ కొరత తీర్చడానికి చిన్నపాటి ట్రాక్టర్‌ను ఒక గ్రామీణ రైతు శాస్త్రవేత్త తయారు చేశాడు. చదువు తక్కువే అయినా గొప్ప ప్రజ్ఞ చూపారు. పత్తి, మిరప, అపరాలు, కూరగాయ పందిరి తోటల్లో.. ఇంకా చెప్పాలంటే 40 అంగుళాల వెడల్పు సాళ్లుండే మెట్ట, ఆరుతడి పంటలు, పండ్ల తోటలన్నిటిలోనూ సేద్యపు పనులకు చక్కగా ఉపయోగపడుతుంది. దుక్కి, పైపాటు చేయటం, బోదెలు తోలటం, ఎరువులు వేయటం, కషాయాలు/జీవామృతం పిచికారీ చేయటం, 6 క్వింటాళ్ల వరకు సరుకు రవాణా.. ఈ అన్ని పనులకూ ఉపయోగపడే అతి చిన్న ట్రాక్టరు రైతులకు అందుబాటులోకి వచ్చింది. చాలా తక్కువ బరువు(200 కిలోలు) ఉండటం, ముందు – వెనక్కి వెళ్లేందుకు గేర్లు కూడా ఉండటం విశేషం. ఇటువంటి రైతు శాస్త్రవేత్తలను ప్రభుత్వం ప్రోత్సహిస్తే చిన్న రైతులకు ప్రయోజనం చేకూరుతుంది. జిల్లోజు సైదాచారి స్వస్థలం సూర్యాపేట జిల్లా ఆత్మకూర్ (ఎస్) మండలంలోని కందగట్ల గ్రామం. చదివింది ఏడో తరగతే. అయితే, చిన్న రైతులకు ఉపయోగపడే వ్యవసాయ పరికరాలను తయారు చేయటంలో దిట్ట. ఇనుప ఎడ్లబండ్లు, ఇనుప నాగళ్లు, ఎడ్లతో ఉపయోగించే రోటవేటర్‌ను తయారు చేసి ఆ ప్రాంత రైతుల అభిమానాన్ని చూరగొన్న సైదాచారి.. మరో అడుగు ముందుకేసి చిన్న రైతుకు ఉపయోగపడే చిన్నపాటి ట్రాక్టరును తయారు చేసి అందర్నీ ఆకర్షిస్తున్నారు. కూలీల కొరతతో సాగు కనాకష్టంగా మారుతున్న తరుణంలో ఖరీదైన వ్యవసాయ యంత్రాలను కొనుగోలు చేసే స్థోమత లేని కొద్దిపాటి వ్యవసాయం ఉన్న రైతులకు సైదాచారి తయారు చేసే యంత్రపరికరాలు అక్కరకొస్తున్నాయి. మెట్ట పంటల సాగుకు అన్నివిధాలా ప్రయోజనకారిగా ఉండడంతో రైతులు ఆసక్తి చూపుతున్నారు. సైదాచారి తండ్రి గ్రామంలో రైతులకు వ్యవసాయ పనిముట్లు తయారు చేయడంతోపాటు మరమ్మతులు చేసేవారు. ఏడో తరగతి వరకు చదువుకున్న సైదాచారి అప్పట్లో కుటుంబ పరిస్థితుల దృష్ట్యా కార్పెంటర్ పని నేర్చుకున్నారు. సాదాసీదా పనిముట్లతో సరిపెట్టుకోకుండా తక్కువ ఖర్చుతో చిన్న రైతులకు ఉపయోగపడే సరికొత్త యంత్రాలు తయారు చేయాలన్న తపనతో తాజాగా మినీ ట్రాక్టరును ఆవిష్కరించారు. ఆయన చేపట్టిన వినూత్న ప్రయోగాలకు భార్య జ్యోతి తోడూ నీడగా నిలుస్తున్నారు. మినీ ట్రాక్టరును రూపొందించే క్రమంలో రెండేళ్ల క్రితం టిల్లర్‌ను రూపొందించారు. దానికి మంచిపేరే వచ్చినా రైతులు స్వయంగా వాటిని నెడుతూ బలాన్ని ప్రయోగించాల్సి ఉండడంతో.. ఆ ఇబ్బందులు లేని మినీ ట్రాక్టరును లక్ష్యంగా పెట్టుకొని, పట్టుదలతో సాధించారు. మినీ ట్రాక్టరు తయారీ ఇలా.. 5 హెచ్‌పీ సామర్ధ్యం గల చైనా ఇంజిన్, రెండు టిల్లర్ టైర్లు, మరో రెండు ఆటో టైర్లను, సామిల్లులో వాడే బేరింగ్లను సైదాచారి మినీ ట్రాక్టరు తయారీలో వాడారు. బెల్టుల సాయంతో టైర్లు తిరిగేలా రూపకల్పన చేశారు. ఇనుప అబ్బులు, డిస్క్‌లను సొంతంగా తీర్చిదిద్దారు. ముందుకు, వెనక్కి వెళ్లేలా గేర్లను అమర్చి చిన్న ట్రాక్టరును ప్రయోజనకరంగా, అందంగా ఆవిష్కరించారు. ఈ క్రమంలో సైదాచారికి జీవిత భాగస్వామి జ్యోతి ప్రోద్భలం ఎంతో ఉంది. సైదాచారి ఒక మనిషి సహాయంతో రూ.70 వేల ఖర్చుతో 15 రోజులకు ఒక ట్రాక్టరును శ్రద్ధగా తయారు చేస్తున్నారు. ఇప్పటి వరకు ఆరు మినీ ట్రాక్టర్లను రూ. 90 వేల చొప్పున విక్రయించారు. మినీ ట్రాక్టరుతో పాటు దీనికి జోడించి (20 కిలోల)ఎరువులు వేసే డబ్బా, గొర్రు, గుంటక, కూరగాయ తోటలకు బోదెలు పోసే పరికరాన్ని కూడా ఇస్తున్నారు. ట్రాలీని విడిగా కొనుక్కోవాల్సి ఉంటుంది. 6 క్వింటాళ్ల వరకు బరువు లాగే శక్తి ఈ మినీ ట్రాక్టరుకు ఉంది. మినీ ట్రాక్టరు గురించి ఆ నోటా ఈ నోటా తెలుసుకున్న రైతులు అనేక జిల్లాల నుంచి వచ్చి కొనుగోలు చేస్తున్నారు. లీటరు డీజిల్‌తో ఎకరం దుక్కి 3 అడుగుల ఎత్తు, 27 అంగుళాల వెడల్పు, 50 అంగుళాల పొడవుతో.. కేవలం 200 కిలోల కన్నా తక్కువ బరువుండే తన మినీ ట్రాక్టర్.. మెట్ట/ఆరుతడి పంటల సాగుకు ఎంతో ప్రయోజనకారని సైదాచారి చెబుతున్నారు. 10 ఎకరాలు సాగుచేస్తున్న రైతు అవసరాలన్నింటినీ తీర్చగలద.ని, లీటర్ డీజిల్‌తో సుమారు ఎకరం దున్నుకునేందుకు వీలుంది. పత్తి పంట 5 అడుగుల ఎత్తు పెరిగే వరకు పాటు చేసేందుకు, మందు చల్లేందుకు సులువుగా ఉంటుంది. మిర్చి, చెరకు, పసుపు, మల్బరీ, నిమ్మ తోటలతో పాటు కూరగాయల సాగులో దున్నకానికి అనుకూలంగా ఉంటుంది. 20 కిలోల డబ్బాతో ఎరువు వేసుకోవచ్చు. స్ప్రే పంపును అనుసంధానం చేసుకుంటే 50 లీటర్ల ట్యాంకుతో పురుగుమందులను, కషాయాలను, ద్రవరూప ఎరువులను అరగంటలో ఎకరానికి పిచికారీ చేయవచ్చు. బోరులో మోటారు రిపేరు వస్తే.. ఒక్క మనిషే ఈ ట్రాక్టరు సాయంతో మోటారును బయటకు తీయవచ్చు. ఇలాంటి గ్రామీణ ఆవిష్కరణలకు ప్రభుత్వం ప్రొత్సాహం అందిస్తే తమకు తక్కువ ధరకు వ్యవసాయానుకూల ట్రాక్టరు దొరకుతుందని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. – జలగం మల్లయ్య, సాక్షి, ఆత్మకూర్(ఎస్), సూర్యాపేట జిల్లా ప్రభుత్వం ప్రొత్సహిస్తే తక్కువ ధరకే మినీ ట్రాక్టరు అందిస్తా! చిన్న రైతుల వ్యవసాయావసరాలకు అనుగుణంగా పనిముట్లను తయారు చేస్తున్నాను. అందులో భాగంగానే మినీ ట్రాక్టరును తయారు చేశాను. దీనికి రిపేర్లు రావు. చైన్లు మార్చుకోవాల్సి వస్తే, రైతులే కొత్త చైన్లు తెచ్చి మార్చుకోవచ్చు. ఇదెలాగో రైతుకు నేనే నేర్పిస్తా. ఒక వేళ బేరింగ్ పోతే మెకానెక్ దగ్గరకు వెళ్లాల్సి వస్తుంది. కేవలం 200 కిలోల బరువుండే ఇంత చిన్నదైన, ఇన్ని పనులు చేసే చిన్న ట్రాక్టరు నాకు తెలిసి దేశంలోనే మరెక్కడా లేదు. కూరగాయ పందిరి తోటల్లో కూడా నిశ్చింతగా దీన్ని ఉపయోగించవచ్చు. చిన్న, సన్నకారు రైతులు మెట్ట పొలాల్లో దీంతో సాగు చేసుకోవచ్చు. మామిడి, నిమ్మ తోటలతో పాటు పత్తి, మిర్చి, చెరుకు, పసుపు, కూరగాయల తోటల రైతులకు అనేక రకాలుగా ఉపయోగపడుతుంది. తక్కువ ఖర్చుతో ఫలితం ఎక్కువగా ఉంటుంది. ప్రభుత్వం ప్రొత్సహిస్తే చిన్న ట్రాక్టరును రూ. 90 వేల కన్నా తక్కువ ధరకే ఇవ్వగలుగుతా. చిన్న రైతులకు ఉపయోగపడే మరిన్ని పనిముట్లను తయారుచేసి తక్కువ ధరకు అందిస్తా. – జిల్లోజు సైదాచారి (99512 52280), కందగట్ల, ఆత్మకూర్(ఎస్) మండలం, సూర్యాపేట జిల్లా జాతీయ స్థాయి గుర్తింపునకు కృషి సైదాచారి గ్రామీణ ఆవిష్కర్తగా 20 ఏళ్ల నుంచి స్థానిక రైతుల అవసరాలకు అనుగుణంగా యంత్రపరికరాలు తయారు చేస్తున్నారు. మొదటి నమూనాను పాత విడి భాగాలతో తయారు చేయటం ద్వారా ఖర్చును, వనరులను ఆదా చేయటం.. తాను రూపొందించిన యంత్ర పరికరాలను మొదట తాను ఉపయోగించిన తర్వాతే ఇతరులకు ఇవ్వటం.. తక్కువ ఖర్చుతో చిన్న రైతులకు మెట్ట సేద్యంలో ఉపయోగపడే మినీ ట్రాక్టర్‌ను తయారు చేయటం ఆయన సృజనాత్మకతకు నిదర్శనాలు. పల్లెసృజన, నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్ ద్వారా ఈయన ఆవిష్కరణలకు జాతీయ స్థాయిలో గుర్తింపు తేవడానికి కృషి చేస్తాం. మార్చిలో రాష్ట్రపతి భవన్లో ఏర్పాటు చేసే ఫెస్టివల్ ఆఫ్ ఇన్నోవేషన్‌లో సైదాచారి మినీ ట్రాక్టర్‌ను ప్రదర్శింపజేయడానికి ప్రయత్నిస్తున్నాం. – విశ్రాంత బ్రిగేడియర్ పోగుల గణేశం (98660 01678), అధ్యక్షులు, పల్లెసృజన, సైనిక్‌పురి, సికింద్రాబాద్. మినీ ట్రాక్టర్‌తో అంతర సేద్యం మినీ ట్రాక్టర్‌కు అనుసంధానించిన ట్రాలీ రైతు శాస్త్రవేత్త సైదాచారి కుటుంబాన్ని అభినందిస్తున్న పల్లెసృజన అధ్యక్షులు గణేశం, ఉపాధ్యక్షులు శ్రీకర్ -
డీమ్యాట్‌తో బహుళ ప్రయోజనాలు
సాక్షి మదుపరుల అవగాహన సదస్సులో సీడీఎస్ఎల్ ఆర్ఎం సాక్షి, విశాఖపట్నం: ‘దేశ జనాభా 121 కోట్లు దాటింది. బ్యాంకు ఖాతాలు 46 కోట్లు. సెల్‌ఫోన్ వినియోగదారుల సంఖ్య 100 కోట్ల పైనే. అయితే డీమ్యాట్ ఖాతాల సంఖ్య 2.50 కోట్లే. స్టాక్ మార్కెట్లో మదుపు చేయాలనుకునే వారికి ముందుగా ఉండాల్సింది డిమ్యాట్ ఖాతానే. దీనివల్ల బహుళ ప్రయోజనాలున్నాయి.’ అని సీడీఎస్ఎల్ రీజనల్ మేనేజర్ శివప్రసాద్ అన్నారు. సాక్షి మైత్రి ఇన్వెస్టర్స్ క్లబ్ ఆదివారం విశాఖలో నిర్వహించిన మదుపరుల అవగాహన సదస్సులో ఆయన పలు విలువైన సూచనలు అందించారు. ఆదాయపు పన్నుశాఖ జారీ చేసిన పాన్‌కార్డు ఉన్న వ్యక్తులెవరైనా డీమ్యాట్ ఖాతాను ప్రారంభించేందుకు వీలుందని, ఇందులో ఎలక్ట్రానిక్ రూపంలో షేర్లను భద్రపర్చుకోవచ్చని వివరించారు. డీమ్యాట్ ఖాతాదారులు తప్పనిసరిగా నామినీని పేర్కొనాలని, అనుకోనిదేదైనా జరిగితే ఖాతాలో ఉన్న షేర్లను నామినీ ఖాతాలోకి వెంటనే బదిలీ చేయవచ్చన్నారు. స్టాక్ మార్కెట్లో అవగాహనతో మదుపు చేస్తే ఇతర పెట్టుబడి పథకాల కన్నా అధికంగానే రాబడి ఉంటుందని, చిన్న వయసు నుండే పెట్టుబడులు ప్రారంభించి, దీర్ఘకాలం కొనసాగించాలని ఆయన సూచించారు. రానున్న రోజుల్లో మార్కెట్ మరింత వృద్ధి చెందేందుకు అవకాశం ఉన్నందున ఆలస్యం చేయకుండా ఈక్విటీల్లో మదుపు చేసేందుకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. కోటక్ మ్యూచువల్ ఫండ్ ఏపీ, తెలంగాణా హెడ్ టి.విజయకుమార్, షేర్‌ఖాన్ లిమిటెడ్ సీనియర్ మేనేజర్ కృష్ణమూర్తి పవర్‌పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా మదుపు ప్రయోజనాలను వివరించారు. సదస్సులో అధిక సంఖ్యలో మదుపరులు పాల్గొన్నారు. తమ సందేహాలను మదుపరులు నిపుణులను అడిగి తెలుసుకున్నారు.