
సీజన్ ప్రారంభం కాగానే పొలాన్ని దున్ని, విత్తనాలు వేయటం రైతులు చేసే పని. దీన్ని ‘ఫ్లాట్ బెడ్ మెథడ్’ అంటారు. అయితే, ఎత్తు మడులు చేసి లేదా బోదెలు తోలి వాటిపై పత్తి తదితర పంటలు విత్తుకోవటం మేలని ఆదిలాబాద్ కేవీకే ప్రధాన శాస్త్రవేత్త డా. ప్రవీణ్‌కుమార్ సూచిస్తున్నారు. ఇది బహుళ ప్రయోజనాలున్న ‘రెయిజ్‌డ్ బెడ్ మెథడ్.
పంటలు సాగు చేస్తున్నది నల్ల రేగడైనా, ఎర్ర నేలైనా, బంక మట్టి అయినా సరే ఎత్తుమడులపై పంటలు విత్తుకోవటం ఉపయోగకరం. వర్షాలు తక్కువైనా, ఎక్కువైనా.. వర్షానికి వర్షానికి మధ్య ఎక్కువ రోజులు వ్యవధి వచ్చినా రైతులను ఎత్తుమడులు ఆదుకుంటాయని ఆయన తెలిపారు. గత మూడేళ్లలో ఎత్తుమడులపై విత్తుకోవటంలో సౌలభ్యాన్ని రైతులు గుర్తిస్తున్నారని, చాలా మంది ప్రయోజనం పొందుతున్నారని డా. ప్రవీణ్‌కుమార్ ‘సాక్షి సాగుబడి’తో చెప్పారు.
→ నల్లరేగడి, తేలికపాటి ఎర్రనేలల్లో ఎత్తుమడుల పద్ధతిలో పత్తిని సాగు చేయవచ్చు
→ పత్తిలో అంతరపంటగా కందిని విత్తుకుంటే.. ఒకవేళ ఏ కారణంగానైనా ఒక పంట దెబ్బతింటే, మరో పంట రైతును ఆదుకుంటుంది
→ ఎత్తుమడుల వల్ల మురుగు నీటి వ్యవస్థ మెరుగుపడుతుంది. వర్షపు నీరు పొలంలో నిలవకుండా, కాలువల ద్వారా బయటికి వెళ్లిపోతుంది. దీనివల్ల తొలిదశలో → మొక్క పెరుగుదల కుంట సాధారణ పద్ధతితో పోలిస్తే, ఎత్తుమడుల పద్ధతిలో 10–20% అధిక దిగుబడులకు అవకాశం
అడుగు–అడుగున్నర ఎత్తు మడి
పత్తి ముఖ్యంగా బరువైన నల్లరేగడి నేలలకు అనుకూలమైనప్పటికీ, రైతులు క్రమేణా తేలిక పాటి నేలల్లో సైతం సాగు చేస్తున్నారు. అధిక వర్షపాతం నమోదయ్యే సమయాల్లో పంటల సంరక్షణకు సమర్థవంతమైన మురుగు నీటి వ్యవస్థ కీలకం. ఎత్తుమడుల పధ్ధతిలో పత్తి సాగు చేయడం ద్వారా ఇలాంటి సమస్యలను దూరం చేయవచ్చు. ఎత్తుమడులు చేసుకోవడానికి ట్రాక్టర్‌తో అనుసంధానం చేసే రిడ్జర్ లేదా బెడ్ మేకర్‌ను ఉపయోగించుకోవచ్చు. 30–45 సెం.మీ.(అడుగు–అడుగున్నర)ల ఎత్తు మడులను ఏర్పాటు చేసుకోవాలి. మడి వెడల్పు నేల స్వభావం, ఆ ప్రాంతంలో నమోదయ్యే వర్షపాతాన్ని బట్టి ఎంత కావాలంటే అంత పెట్టుకోవచ్చు. సాళ్ల మధ్య 180/ 150/ 120 సెం.మీ., మొక్కల మధ్య 30/20/30 సెం.మీ. ల దూరంలో పత్తి పంటను సాగు చేయవచ్చు. సాధారణంగా ఒక ఎకరంలో ఎత్తుమడులు చేయడానికి సుమారు 45 నిమిషాల నుంచి ఒక గంట సమయం పడుతుంది.
ఎత్తుమడులపై పత్తి సాగుతో లాభాలు
ఎత్తుమడుల మీద విత్తిన విత్తనం సాధారణ పొలంలో కన్నా ఒకటి రెండు రోజులు ముందే మొలకెత్తుతుంది. సాంప్రదాయ పద్ధతితో పోలిస్తే మొలక శాతం ఎక్కువ. దాదాపు 90 శాతం వరకు మొలక వస్తుంది. ఎత్తుమడుల వల్ల మురుగు నీటి వ్యవస్థ మెరుగుపడుతుంది. వర్షపు నీరు పొలంలో నిలవకుండా, కాలువల ద్వారా బయటికి వెళ్లిపోతుంది. దీనివలన తొలిదశలో మొక్క పెరుగుదల కుంటుపడదు. భారీ వర్షాలు కురిసినప్పుడు నల్లరేగడి నేలల్లో వరద పారుతుంది. ఎత్తుమడుల వల్ల ఆ ప్రవాహంలో మొక్కలు కొట్టుకుపోకుండా కాపాడుతుంది.
వర్షాభావ పరిస్థితుల్లో మడుల్లో నిల్వ ఉన్న నీళ్లు పంటకు ఉపయోగపడతాయి. సాంప్రదాయ పద్ధతిలో పత్తి మొక్కల కింది కొమ్మలకు మొదట్లో వచ్చే 5 నుండి 10 కాయలు కుళ్లిపోతూ ఉంటాయి. ఎత్తుమడుల చేయడం వలన గాలి, వెలుతురు బాగా తగిలి కాయకుళ్లు, ఇతర చీడపీడల ఉధృతి తక్కువగా ఉంటుంది. యాంత్రీకరణ ద్వారా కలుపు యాజమాన్యం సులభమవుతుంది. తద్వారా కూలీల ఖర్చు ఆదా అవుతుంది. మందులు పిచికారీ చేయడం, పత్తి ఏరటం, పంటకోత, పంట అవశేషాల ఏరివేత మరింత సులభతరం అవుతాయి. సాధారణ పద్ధతితో పోలిస్తే, ఎత్తుమడుల పద్ధతిలో 10–20 శాతం అధిక దిగుబడులు సాధించవచ్చు. నల్లరేగడి నేలలు, తేలికపాటి ఎర్రనేలల్లో ఎత్తుమడుల పద్ధతిలో పత్తిని సాగు చేయవచ్చు. పత్తిలో అంతరపంటగా కందిని విత్తుకుంటే, ఒకవేళ ఏ కారణంగానైనా ఒక పంట దెబ్బతింటే, మరో పంట రైతును ఆదుకుంటుంది.
– డాక్టర్ ప్రవీణ్‌కుమార్ (99896 23829), ప్రధాన శాస్త్రవేత్త,
కృషి విజ్ఞాన కేంద్రం, ఆదిలాబాద్,
ప్రొ. జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వ విద్యాలయం
తడి పెట్టాల్సిన అవసరం రాలేదు
సున్నక్కడి (ఎర్రనేల) నేల 3 ఎకరాలు, నల్లరేగడి 6 ఎకరాలు, చెలక (ఇసుక) భూమి 3 ఎకరాల్లో గత సంవత్సరం ఎత్తుమడుల (కట్టల)పైన పత్తి పెట్టాం. కాయకుళ్లే కనిపించలేదు. మామూలుగా పత్తి సాగు చేసిన వారికి కాయకుళ్లు నష్టం కలిగించింది. మాకు ఆ సమస్య రాలేదు. అధిక సాంద్రతలో ఎకరానికి 14.5 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. వర్షాలు త్వరగా ఆగిపోవటం వల్ల కట్టలపై పంట పెట్టిన పొలాల్లో చివరి తడి పెట్టాల్సిన అవసరం రాలేదు. నీటి తేమను నిలుపుకునే శక్తి కట్టల వల్ల వచ్చింది. వేరే పొలాలకు చివరి తడి పెట్టాల్సి వచ్చింది. వర్షాలు ఎక్కువ కురిసినా పంటకు ఇబ్బంది ఉండదు. ఈ పద్ధతిలో పత్తి పంట రెండు నెలలు ముందే పూర్తయ్యింది. రెండేళ్లు ఇతర పొలాలు చూసిన తర్వాతే మేం ఈ పద్ధతిలో వేశాం. ఈ సంవత్సరం చాలా మంది రైతులు ఆసక్తి చూపుతున్నారు. అయితే, వర్షం బాగా కురిసి, కట్ట పూర్తిగా తడిచిన తర్వాతనే విత్తనం పెట్టుకోవాలి.
– కట్ల కుమారస్వామి (88858 75575),
యాపల్‌గూడ, ఆదిలాబాద్ జిల్లా
ఎత్తుమడులతో బాగా ఉపయోగం
గత మూడేళ్ల నుంచి 12 ఎకరాల సుంకడి (నలుపు ఎరుపు కాని తెల్ల రాయితో కూడిన) భూమిలో ఎత్తుమడుల (కట్టల)పై పత్తిని అధిక సాంద్రతలో సాగు చేస్తున్నాను. కాయకుళ్లు తెగులు అసలు రాలేదు. ఎకరానికి 17–18 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. ఈ పద్ధతి బబాగా ఉపయోగకరంగా వుంది. ఇరుగు పొరుగు రైతులు ఎలా చెయ్యాలని అడుగుతున్నారు.
– గంధి శంకర్ (84988 00958),
యాపల్‌గూడు, ఆదిలాబాద్ జిల్లా