breaking news
MPs Salary
-
ఎంపీల వేతనాల్లో 30 శాతం కోత
సాక్షి, న్యూఢిల్లీ : పార్లమెంట్ సభ్యుల వేతనంలో 30 శాతం కోత విధించే బిల్లును లోక్సభ మంగళవారం ఏకగ్రీవంగా ఆమోదించింది. కోవిడ్-19తో తలెత్తిన అవసరాలను తీర్చే క్రమంలో ఎంపీల వేతనాల్లో రెండేళ్ల పాటు కోత విధిస్తూ పార్లమెంట్ సభ్యుల వేతనాలు, పెన్షన్ (సవరణ) బిల్లు, 2020కు లోక్సభ ఆమోదం తెలిపింది. ఇక నిత్యావసర వస్తువుల చట్టంలో సవరణలపై లోక్సభ చర్చిస్తోంది. బిల్లు సవరణలకు సభ ఆమోదం పొందేలా ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. మరోవైపు డీజీసీఏ, ఏఏఐబీ, బీసీఏఎస్లకు చట్టపరమైన అధికారాలను కల్పించే ఎయిర్క్రాఫ్ట్ సవరణ బిల్లు రాజ్యసభ ఆమోదం పొందడం పట్ల పౌరవిమానయాన మంత్రి హర్దీప్ సింగ్ పూరి హర్షం వ్యక్తం చేశారు. చదవండి : ఎంపీలకు కరోనా పరీక్షలు ఈ బిల్లు ఆమోదంతో భారత పౌరవిమానయాన రంగంలో భద్రత మౌలికసదుపాయాలు మరింత బలోపేతమవుతాయని ఆయన పేర్కొన్నారు. ఇక సరిహద్దు వివాదంపై రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ సభలో ప్రకటన చేశారు. సరిహద్దు సమస్య పరిష్కారం కాలేదని, భారత్-చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తత చల్లారలేదని పేర్కొన్నారు. చైనాతో సంప్రదింపులకు సిద్ధంగా ఉన్నా సరిహద్దులను గుర్తించేందుకు చైనా నిరాకరిస్తోందని తెలిపారు. మన బలగాలు దేశ గౌరవాన్ని ఇనుమడింపచేస్తున్నాయని, చైనా దూకుడుకు చెక్ పెట్టేందుకు భారత దళాలు అప్రమత్తంగా ఉన్నాయని చెప్పారు. చైనా మొండిగా వ్యవహరిస్తోందని, ఈ ఏడాది మే నుంచి సరిహద్దుల్లో భారీగా సాయుధ బలగాలను మోహరించిందని వివరించారు. -
వంద శాతం పెంపు సిఫార్సుపై పునఃసమీక్ష
న్యూఢిల్లీ: ఎంపీల జీతాలను, నియోజకవర్గ, ఆఫీసు అలవెన్సులను 100 శాతం పెంచాలన్న సిఫార్సులపై విమర్శలు చెలరేగడంతో ఎంపీల జీతాలు, అలవెన్సులపై ఏర్పాటైన పార్లమెంటరీ కమిటీ పునఃసమీక్షించనుంది. బీజేపీ ఎంపీ ఆదిత్యనాథ్ అధ్యక్షతన ఏర్పాటైన ఈ కమిటీ నేడు సమావేశం కానుంది. కమిటీ తమ నివేదికను ప్రభుత్వానికి సమర్పించలేదని, ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని చెప్పారు. సోమవారం తుది నిర్ణయం తీసుకుంటామన్నారు. చివరిసారిగా ఎంపీల జీతాలను 2010లో పెంచారు. ప్రస్తుతం ఒక్కో ఎంపీ రూ. 50 వేలు జీతంగా, రూ.45 వేలు నియోజకవర్గ అలవెన్సుగా.. రూ.45 వేలు ఆఫీసు అలవెన్సుగా మొత్తం నెలకు రూ.1.4 లక్షలు పొందుతున్నారు. దీనిని రూ. 2.8 లక్షలు చేయాలని కమిటీ ప్రభుత్వాన్ని కోరుతోంది. జీతాల పెంపునకు సంబంధించి పలువురు సభ్యులు సూచించిన డిమాండ్లపై పార్లమెంటరీ కమిటీ సానుకూలంగా ఉంది.