breaking news
mothilal ora
-
హూడా, వోరాలపై సీబీఐ చార్జిషీట్
న్యూఢిల్లీ: భూ కేటాయింపు కేసులో హరియాణా మాజీ ముఖ్యమంత్రి భూపిందర్‌సింగ్ హూడా, కాంగ్రెస్ నేత మోతీలాల్ వోరాలపై సీబీఐ చార్జిషీట్ దాఖలు చేసింది. పంచకులలో అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ (ఏజేఎల్)కు కేటాయించిన స్థలం విషయంలో అవకతవకలు జరిగాయని దర్యాప్తు సంస్థ ఆరోపించింది. పంచకులలోని స్థలం మోతీలాల్ వోరా చైర్మన్‌గా ఉన్న ఏజేఎల్‌కు కేటాయించిన విషయంలో ఖజానాకు రూ.67 లక్షలు నష్టం వాటిల్లిందని ప్రత్యేక కోర్టులో సీబీఐ చార్జిషీట్ దాఖలు చేసింది. ఏజేఎల్ గాంధీ కుటుంబ సభ్యులు, ఇతర కాంగ్రెస్ పెద్దల అధీనంలో నడుపబడుతున్న సంస్థ. నేషనల్ హెరాల్డ్ పత్రిక ఏజేఎల్ ఆధ్వర్యంలో వెలువడుతున్న విషయం విదితమే. -
కాంగ్రెస్ గల్లా పెట్టె ఖాళీ..
న్యూఢిల్లీ: కేంద్రంలో అధికారాన్ని కోల్పోయిన నాటి నుంచి కాంగ్రెస్ పార్టీ నిధులలేమితో సతమతమవుతోంది. పార్టీ కార్యాలయాల సిబ్బందికి, పార్టీ హోల్టైమర్లకు జీతాలు చెల్లించలేక, అటు పార్టీ కార్యదర్శులకు పెట్రోలు భత్యాలు ఇవ్వలేక దిక్కుతోచని పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతోంది. అధికారంలో ఉన్నంతకాలం విరాళాల సూటు కేసులు పట్టుకొని క్యూలో నిలిచి ఉన్న పారిశ్రామికవేత్తలు ఇప్పుడు పూర్తిగా మొహం చాటేయడంతో పార్టీకి ఈ పరిస్థితి దాపురించింది. వాస్తవానికి గత పార్లమెంట్ ఎన్నికల్లోనే కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందనే విశ్వాసం కోల్పోయిన కార్పొరేటర్లు రూటు మార్చి బీజేపీ తలుపుతట్టారు. దాంతో ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ గల్లపెట్టా పూర్తిగా ఊడ్చుకుపోయింది. అధికారంలోఉన్న రాష్ట్రాల్లో మినహా మిగతా రాష్ట్ర శాఖల కార్యాలయాల పరిస్థితి కూడా కేంద్ర పార్టీ కార్యాలయంలానే తయారైంది. అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో క్యాష్తో కళకళలాడుతున్న ఒక్క కర్ణాటక నుంచి మినహా మరే రాష్ట్రం నుంచి కేంద్ర కార్యాలయానికి నిధులు అందడం లేదని పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది. ఇప్పుడు పార్టీ గల్లాపెట్టెను మళ్లీ నింపేందుకు అత్యవసర చర్యలు తీసుకోవాలని, అనవసర ఖర్చులను తగ్గించుకోవాలని కేంద్ర పార్టీ నాయకత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా పార్టీ కోశాధికారి మోతీలాల్ వోరా పార్టీ క్యాడర్‌కు మార్గదర్శకాలను సూచించారు. పార్టీ ప్రధాన కార్యదర్శి బాధ్యతలు నిర్వహిస్తున్న పార్టీ పార్లమెంట్ సభ్యులు పార్టీ నుంచి నెలకు చెల్లిస్తున్న రూ.15 వేల పెట్రోలు భత్యాన్ని వదులుకోవాలని వారికి వోరా సూచించారు. ఎంపీ కింద ప్రభుత్వం నుంచి అందుతున్న జీత భత్యాలతోనే సర్దుకోవాలని చెప్పారు. పార్టీ కార్యక్రమాలకు ఇక విమానాల్లో వెళ్లరాదని, అద్దె విమానాలను అసలు వాడరాదని ఆదేశించారు. రైళ్లలో ప్రయాణించడం అన్ని విధాల శ్రేయస్కరమని సూచించారు. కార్యకర్తలందరు ఇన్నాళ్లుగా పార్టీ కోసం ఇస్తున్న వంద రూపాయలతో పాటు అదనంగా మరో రూ.250 విరాళంగా ఇవ్వాలని కోరారు. ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ సభ్యులు పార్టీ యూనిట్‌కు ఏడాదికి ఇస్తున్న రూ.300 నుంచి రూ.600కు పెంచారు. ప్రస్తుతం కొనసాగుతున్న పార్టీ సభ్యత్వ నమోదు ముగిసిన తర్వాత మళ్లీ నిధుల సేకరణకు తీసుకోవాల్సిన చర్యలను వివరిస్తామని మోతీలాల్ వోరా పార్టీ యూనిట్లకు తెలియజేశారు.