గ్రేటర్ కార్మికుల వేతనాలు పెంచుతాం
సాక్షి, సిటీబ్యూరో: జీహెచ్ఎంసీ కాంట్రాక్టు కార్మికులకు త్వరలోనే వేతనాలు పెంచుతామని, రెగ్యులర్ ఉద్యోగులకు రాష్ట్ర విభజనకు ముందే పీఆర్సీ అమలు, హెల్త్‌కార్డులు జారీ చేస్తామని మున్సిపల్‌శాఖ మంత్రి ఎం.మహీధర్‌రెడ్డి హామీ ఇచ్చారు. జీహెచ్ఎంసీలో గుర్తింపు యూనియన్ జీహెచ్ఎంఈయూ అధ్యక్షుడు యు.గోపాల్ మంగళవారం మంత్రిని ఆయన చాంబర్లో కలిసి జీహెచ్ఎంసీ కార్మికుల సమస్యలను వివరించారు. వీటి పరిష్కారానికి మంత్రి సానుకూలంగా స్పందించారని గోపాల్ తెలిపారు.
రాష్ట్రంలోని మున్సిపాలిటీల కంటే హైదరాబాద్ నగరంలో జీవన వ్యయం ఎక్కువైనందున జీహెచ్ంఎసీ కార్మికులకు సిటీ కాంపెన్సేటరీ అలవెన్స్ ఉంటుందని, తద్వారా వేతనాలు పెరుగుతాయని మంత్రి చెప్పారన్నారు. ఈ సందర్భంగా కార్మికులకు సంబంధించిన వివిధ అంశాలను పరిష్కరించాల్సిందిగా మంత్రికి వినతిపత్రం సమర్పించారు.