breaking news
MLA vanamadi Venkateswara rao
-
'దేశం' గూండా గిరీ..
ఆయనో అధికారి పార్టీ ప్రజా ప్రతినిధి. ప్రభుత్వ నిధులు పక్కదారి పట్టకుండా సద్వినియోగమయ్యేలా చూడాల్సిన బాధ్యతాయుత స్థానంలో ఉన్న ఎమ్మెల్యే. సొంత ప్రయోజనాల కోసం ప్రభుత్వ సొమ్ముతో వేసిన రహదారిని జేసీబీతో నిర్దాక్షిణ్యంగా తన అనుచరులతో ధ్వంసం చేయించారు. 120 మీటర్లు ... సుమారు రూ.6 లక్షల వ్యయంతో నిర్మించిన రహదారిని ఎందుకు తవ్వేస్తున్నారని అడ్డగించిన స్థానికులపై కన్నెర్ర చేయడంతో వారు మిన్నకుండిపోయారు. అ పంచాయతీ అధికారులు మాత్రం ఎమ్మెల్యే అనుచరుల ఒత్తిడికి తలొగ్గి ‘రోడ్డా... మేము వేయలేదే’ అంటూ ముఖం చాటేస్తున్నారు. అదే నిజమైతే ఎవరి సొమ్ముతో ఆ రోడ్డు వేశారు? వేసిన రోడ్డును ఎమ్మెల్యే మనుషులు తొలగిస్తుంటే ఎందుకు మౌనం వహించారనే ప్రశ్నలకు సమాధానాలు లేవు. సాక్షి, కాకినాడ: కాకినాడ మహాలక్ష్మి నగర్ శివారు ప్రాంతంలో సుమారు 15 రోజుల క్రితం గ్రావెల్ వేశారు. రెండు రోజుల కిందట సిమెంట్ రోడ్డు 50 శాతం పూర్తి చేశారు. మిగిలిన 50 శాతం శనివారం ప్రారంభిస్తుండగా ‘దేశం’ మద్దతుదారులు అక్కడకు చేరుకుని వీరంగం చేశారు. ఓ జేసీబీని తీసుకొచ్చి దగ్గరుండి మరీ ధ్వంసం చేసేశారు. కాకినాడ సిటీ నియోజకవర్గానికి చెందిన ప్రజాప్రతినిధి అన్న, అతని కుమారులు స్వయంగా దగ్గరుండి అక్కడి స్థానికులను నియంత్రిస్తూ ఈ విధ్వంసానికి పాల్పడ్డారు. విషయం తెలుసుకున్న స్థానికులు అక్కడకు చేరుకుని జేసీబీకి అడ్డుగా నిలబడ్డారు. పంచాయతీ స్థలంలో ప్రభుత్వ సొమ్ముతో వేసిన స్థలాన్ని ఎలా తవ్వేస్తారంటూ ఎదురుతిరగడంతో కొద్దిసేపు తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. తమ స్థలంలో పంచాయతీ రోడ్డు ఎలా వేస్తున్నారంటూ ఎమ్మెల్యే అనుయాయులు ఎదురు తిరగడంతో స్థానికులు అధికార పార్టీకి ఎదురు వెళ్లలేక వెనుకడుగు వేశారు. స్థానిక ప్రజాప్రతినిధి ఎకరాల కొద్ది స్థలాన్ని రహదారి మీదుగా కొనుగోలు చేయడంతో ఈ ఇబ్బందులు పెడుతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇది ముమ్మాటికీ ప్రభుత్వ స్థలమేనని, గతంలో ఈ ప్రాంతంలో కొందరు వ్యక్తులు పాకలు వేసుకున్న విషయాన్ని గుర్తు చేస్తున్నారు. అప్పట్లో వారిపై కేసులు పెట్టి బలవంతంగా తీయించేశారని, దీన్ని ఏళ్ల తరబడి రహదారిగానే వినియోగిస్తున్నామని స్థానికులు చెబుతున్నారు. ఎవరు వేశారు ఈ రహదారిని...? ఆ రహదారిని తాము వేయలేదంటూ ఇప్పుడు తూరంగి పంచాయతీ కార్యదర్శి జొన్నాడ నరసింహరావు చెబుతున్నారు. అలాంటప్పుడు బయట వ్యక్తులెవరో 120 మీటర్ల రహదారిని సుమారు రూ.6 లక్షల వ్యయంతో ఎందుకు వేస్తారని నిలదీస్తున్నారు. ఎమ్మెల్యేకు చెందిన స్థలం కావడంతో పంచాయతీ అధికారులు భయపడి ఈ వ్యవహారంపై వెనుకడుగు వేశారని స్థానికులు మండిపడుతున్నారు. సర్వేలోను ‘పచ్చ’ పాతం: ఎమ్మెల్యేకు చెందిన స్థలానికి సంబంధించి సర్వేలో కూడా అధికారులు ‘పచ్చ’పాతంతో వ్యవహరించారని స్థానికులు విమర్శిస్తున్నారు. గతంలో పంచాయతీ స్థలంగా ఉన్న ఆ ప్రాంతాన్ని సదరు ప్రజాప్రతినిధి అధికారంలోకి రాగానే ప్రైవేటు స్థలంగా చూపిస్తున్నారని ధ్వజమెత్తారు. రోడ్డు దౌర్జన్యంగా తవ్వుతుంటే అడ్డుకున్న మహిళలపై ప్రజా ప్రతినిధికి చెందిన వ్యక్తులు దాడి చేయడంతో పలువురు గాయపడ్డారు. విషయం తెలుసుకున్న తూరంగి మాజీ సర్పంచి బలగం ప్రసన్నకుమార్, ఎస్సీ నాయకులు సిద్ధాంతపు రాజు, మల్లాడి రామచంద్రరావు తదితరులు ఎమ్మెల్యే అనుచరులతో చర్చలు జరిపినా ఫలితం లేకపోయింది. కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావును ఆందోళనకారులు కలిశారు. అందరితో మాట్లాడిన తరువాతే ఏమైందీ తాను చెప్పగలనని వనమాడి చెప్పినట్లు ఆందోళనకారులు వివరించారు. -
ఎన్నికల హామీని ఏట్లో కలిపారు..
సాంబమూర్తినగర్ (కాకినాడ) : ఎన్నికల హామీని ఏట్లో కలిపారని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు (కొండబాబు)పై డెయిరీ ఫారం సెంటర్లోని రాజీవ్ గృహకల్పవాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన తీరును నిరసిస్తూ బుధవారం ఆందోళనకు దిగారు. ఇందుకు సంబంధించి గృహకల్ప లబ్ధిదారులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. డెయిరీఫారం సెంటర్లోని రాజీవ్ గృహకల్పలో 2003లో అప్పటి ప్రభుత్వం 4,800 గృహాలను నిర్మించి నిరుపేదలకు అందించింది. లబ్ధిదారులు కొంత సొమ్ము చెల్లించగా మిగిలినది వాయిదా పద్ధతిలో చెల్లించేందుకు వివిధ బ్యాంకులు నిబంధనల మేరకు రుణాలు మంజూరు చేశాయి. ఒక్కో లబ్ధిదారుడు నెలకు రూ.500 చెల్లించాల్సి ఉంది. ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా బరిలో నిలిచిన కొండబాబు రుణాలు తిరిగి చెల్లించవద్దని, తాను ఎమ్మెల్యేగా గెలిస్తే రద్దు చేయిస్తానని హామీ ఇచ్చారు. ఆ హామీతో తమ రుణాలు రద్దవుతాయని ఆశించిన లబ్ధిదారులు వాటిని చెల్లించడం మానేశారు. కాగా గృహ నిర్మాణ శాఖ, బ్యాంకుల అధికారులు బుధవారం అక్కడకు చేరుకుని రుణాలు చెల్లించలేదంటూ ఒక్కో ఇంటికీ తాళాలు వేయడం ప్రారంభించారు. దీనిపై ఆగ్రహించిన లబ్ధిదారులు రోడ్డుపై బైఠాయించి అధికారులను అడ్డుకున్నారు. ఏళ్ల తరబడి రుణాల వసూలుకు రాని బ్యాంకు అధికారులు అకస్మాత్తుగా రావడం ఏమిటని ప్రశ్నించారు. రాజకీయ కక్షసాధింపులో భాగంగానే ఈ విధంగా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే ఉద్దేశపూర్వకంగానే కొందరి గృహాలకు తాళాలు వేయిస్తున్నారని విమర్శించారు. ఎమ్మెల్యే రాజకీయ దురుద్దేశానికి అధికారులు వత్తాసు పలుకుతున్నారని ఆరోపించారు. పరిస్థితి అదుపు తప్పుతుండడంతో అధికారులు ఆందోళన చేస్తున్న లబ్ధిదారులతో చర్చించారు. తాళాలు తీసే వరకూ ఆందోళన విరమించేది లేదని, అధికారులను కదలనివ్వమని భీష్మించడంతో అధికారులు ఇళ్లకు వేసిన తాళాలు తీయించారు. దాంతో వివాదం సద్దుమణిగింది.