breaking news
MLA AKULA
-
సాక్షి మెగా ఆటో షో విజయవంతం
బంపర్ డ్రా విజేతను ఎంపిక చేసిన ఎమ్మెల్యే ఆకుల సాక్షి, రాజమహేంద్రవరం: కొనుగోలుదారులకు ఉపయుక్తంగా ఉండేలా ‘సాక్షి’ ఆధ్వర్యంలో తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో రెండు రోజుల పాటు నిర్వహించిన మెగా ఆటో షో విజయవంతమైంది. రాజమహేంద్రవరంలో తొలిసారి నిర్వహించిన ఈ షోకు ఉభయ గోదావరి జిల్లాల నుంచి ప్రజలు తరలివచ్చారు. 20 స్టాళ్లలో వివిధ ఆటోమొబైల్ కంపెనీలు తమ వాహనాలను ప్రదర్శనకు ఉంచారుు. అన్ని కంపెనీల వాహనాలు ఒకేచోట అందుబాటులో ఉండడంతో నచ్చిన వాహనాన్ని కొనుగోలుదారులు ఎంపిక చేసుకోవడం సులభంగా మారింది. పలువురు వాహనాలను కొనుగోలు చేయగా మరికొంతమంది అడ్వాన్ ్సలు చెల్లించి తమకు నచ్చిన వాహనాలను సొంతం చేసుకున్నారు. ప్రదర్శన సందర్భంగా పలు కంపెనీల డీలర్లు ప్రత్యేక ఆఫర్లు ఇచ్చారు. విశాల మైదానంలో ప్రదర్శన, వాహనాల పార్కింగ్ ఏర్పాటు చేయడం పట్ల డీలర్లు, సందర్శకులు సంతృప్తి వ్యక్తం చేశారు. రెండు రోజులపాటు కొనుగోలు చేసిన వాహనదారులకు బంపర్ డ్రాలో సిరి మోటార్స్, ‘సాక్షి’ సౌజన్యంతో అందించే యమహా ఫ్యాసినో టూ వీలర్ విజేతను ఆదివారం రాత్రి నగర ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ ఎంపిక చేశారు. విజేతగా నిలిచిన బొంతల ధనలక్ష్మికి ఫ్యాసినో వాహనాన్ని అందజేశారు. ఈ సందర్భం గా ఆకుల మాట్లాడుతూ.. ఇలాంటి ఆటో షోలు ఏర్పాటు చేయడం కొనుగోలుదారులకు ఎంతో ఉపయుక్తంగా ఉంటుందన్నారు. ‘సాక్షి’ మెగా ఆటో షో రాజమహేంద్రవరంలో ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. -
హోదాతో రాష్ట్రానికి ఒరిగేది లేదు
పోలవరం పూర్తి చేసే బాధ్యత కేంద్రానిదే సిటీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ రాజమహేంద్రవరం: ప్రత్యేక హోదాతో రాష్ట్రానికి ఒరిగేదేమీ ఉండదని సిటీ ఎమ్మెల్యే డాక్టర్ ఆకుల సత్యనారాయణ అన్నారు. ఆయన శనివారం స్థానిక ప్రెస్‌క్లబ్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ప్రత్యేక హోదా ఇచ్చినంత మాత్రాన రాష్ట్రం అభివృద్ధి చెందుతుందనుకోవడం పొరపాటన్నారు. ఈ రెండేళ్లలో రాష్ట్రానికి ఇవ్వాల్సిన నిధులను కేంద్రం ఇచ్చిందని ఆయన పేర్కొన్నారు. ప్రణాళికాబద్ధంగా రాష్ట్రాభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందన్నారు. పోలవరం ప్రాజెక్టును ఫూర్తి చేసే బాధ్యత కేంద్రానిదే అని ఆయన పేర్కొన్నారు. నాబార్డు ద్వారా ఈప్రాజెక్ట్‌కు అయ్యే ప్రతి పైసా రాష్ట్రాన్నికి చెల్లిస్తారన్నారు. రోడ్లు, నీరు ,విద్యుత్ సదుపాయం ఉన్నచోట పరిశ్రమలు వస్తాయని, మౌలిక సదుపాయలు పుష్కలంగా ఉన్న రాష్ట్రం హోదా లేకపోయినప్పటికి తర్వితగతిన అభివృద్ధి చెందుతుందన్నారు. దీనిపై మిత్రపక్ష టీడీపీ ఎమ్మెల్యేలు అనవసర రాద్ధాంతం చేస్తున్నారని మండిపడ్డారు. రాజధాని నిర్మాణానికి కేంద్రం నుంచి ఎన్ని నిధులు వచ్చాయో, ఎన్ని నిధులు ఖర్చు చేశారో ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఆ ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించాలి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి టీడీపీలో చేరిన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ప్రత్యక్ష ఎన్నికలకు సిద్ధం కావాలని టీడీపీ ప్రభుత్వానికి ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ సవాల్ విసిరారు. బీజేపీపై విమర్శలు చేయడం మానుకోవాలని అధికారపార్టీకి సూచించారు. బీజేపీ నగర అధ్యక్షుడు క్షత్రియ బాలసుబ్రహ్మణ్యం సింగ్, అయ్యాల గోపి, ఆడ్డాల ఆదినారాయణ మూర్తి తదితరులు పాల్గొన్నారు.