breaking news
mistakes in online records
-
భూముల రీ సర్వే: క్లరికల్ తప్పిదాలు సరిచేసేందుకు 4 ఆప్షన్లు
సాక్షి, అమరావతి: భూముల రీ సర్వే ప్రక్రియ తర్వాత భూ యజమానులకు జారీచేసే భూ హక్కు పత్రాల్లో ఎలాంటి తప్పుల్లేకుండా చూసేందుకు రాష్ట్ర రెవెన్యూ యంత్రాంగం చర్యలు తీసుకుంటోంది. తొలిదశలో సర్వే పూర్తయిన రెండువేల గ్రామాల్లో జారీచేస్తున్న పత్రాల్లో కొన్నిచోట్ల క్లరికల్ తప్పులు దొర్లడంతో వాటిని సరిచేసేందుకు వెబ్‌ల్యాండ్‌లో కొత్తగా నాలుగు ఆప్షన్లు ఇచ్చారు. పట్టాదారు మృతిచెందడం, ల్యాండ్ పార్సిల్ నంబర్ సంబంధిత ఖాతాకు సరిపోకపోవడం, పాత సర్వే నెంబరు తప్పుపడడం, ఆర్ఓఆర్, షేప్ ఫైల్లో విస్తీర్ణం సరిపోకపోవడం వంటి వాటి కారణంగా తప్పుగా నమోదైనట్లు తహసీల్దార్లు గుర్తించారు. దీంతో ఈ నాలుగు ఆప్షన్లు ప్రత్యేకంగా ఇచ్చి క్లరికల్ తప్పులను సరిదిద్దే అవకాశం కలి్పంచారు. ఈ తప్పులన్నీ సరిదిద్దిన తర్వాతే ఆయా గ్రామాల్లో తుది ఆర్ఓఆర్ను అప్డేట్ చేయాలని భూ పరిపాలన ప్రధాన కమిషనర్ రెవెన్యూ యంత్రాంగానికి నిర్దేశించారు. ఏ జిల్లాల్లో ఎన్ని తప్పులు వచ్చాయి?ఎన్ని సరిదిద్దారనే అంశాలను కూడా కమిషనర్ సమీక్షించి ఆర్ఓఆర్ పక్కాగా రూపొందేలా చర్యలు తీసుకుంటున్నారు. తుది ఆర్ఓఆర్ను ఖరారుచేయడానికి ముందు పట్టాదారుల వ్యక్తిగత సమాచారం, ఫొటో వంటి వివరాలన్నీ మరోసారి పరిశీలించాలని తహసీల్దార్లకు ఆదేశాలిచ్చారు. ఇవన్నీ పూర్తయిన తర్వాత తుది ఆర్ఓఆర్ రూపొందించి భూ హక్కు పత్రాలు జారీచేయాలని స్పష్టంచేశారు. భూహక్కు పత్రాలను ఈనెల మొదటి వారంలోనే జారీచేయాలని నిర్దేశించారు. -
వెబ్‌ల్యాండ్ వింతలెన్నో
సాక్షి ప్రతినిధి, ఏలూరు : తాళ్లపూడి మండలం వేగేశ్వరపురం గ్రామానికి చెందిన అడ్డాల వీరాస్వామి, అతని అన్నదమ్ములకు అదే గ్రామంలోని సర్వే నంబర్లో 80 సీ–1లో కొంత భూమి ఉంది. వెబ్‌ల్యాండ్ మాత్రం ఆ భూమి వారిది కాదని చెబుతోంది. వారి పొలాన్ని సమీపంలో గల ఎత్తిపోతల పథకానికి చెందిన సర్వే నంబర్ 80 సీ–2లో ఉన్నట్టుగా చూపిస్తోంది. పెద్దేవం గ్రామానికి చెందిన ఎలిగంటి సత్యనారాయణకు చెందిన 20 సెంట్ల భూమిని మిగులు భూమిగా చూపిస్తోంది. ద్వారకాతిరుమల మండ లం ఎం.నాగులపల్లికి చెందిన తూంపాటి ప్రభాకరరావు అనే రైతుకు 114, 118 సర్వే నంబర్లలో గల భూమి వెబ్‌ల్యాండ్‌లో వేరేవారి పేరుతో కనిపిస్తోంది. పెదవేగి మండలం కొప్పాకకు చెందిన సత్యనారాయణకు చెందిన అర ఎకరం భూమి అతనిది కానేకాదని.. వెబ్‌ల్యాండ్ ప్రకారం ఆ భూమి ప్రభుత్వానిదని రెవెన్యూ అధికారులు తేల్చేశారు. ఆ పొలాన్ని అమ్ముకుని ఆర్థిక ఇబ్బందుల నుంచి గట్టెక్కుదామన్న ఉద్దేశంతో రిజిస్ట్రేషన్ కార్యాలయానికి వెళితే ఈ విషయం బయటపడింది. ఇలాంటి రైతులంతా రెవెన్యూ అ«ధికారుల చుట్టూ తిరుగుతుంటే.. ఇప్పటికిప్పుడు తామేమీ చేయలేమని చేతులెత్తేస్తున్నారు. నిండా తప్పులే వెబ్‌ల్యాండ్‌కు సంబంధించి జిల్లాలో 100 శాతం రికార్డులను ఆన్లైన్ చేయగా, వాటిలో 40 శాతం రికార్డులు తారుమారైనట్టు ప్రాథమికంగా తెలుస్తోంది. 1–బి నమూనాలో రైతుల పేరిట ఉండే పట్టాదార్ పాస్‌బుక్‌లో పేర్కొన్న సర్వే నంబర్లు నమోదు చేయకుండా తప్పుల తడకగా మార్చేశారు. పట్టా భూములు దేవాదాయ శాఖ భూములుగా, పంట, మురుగు కాలువ, కుంట, డొంకలుగా నమోదయ్యాయి. వెబ్‌ల్యాండ్‌లోని భూముల రికార్డుల్లో భర్త/తండ్రి పేర్లు 80 శాతం ఖాళీగా ఉన్నాయి. ‘పట్టాదార్ పాస్ పుస్తకాల అవసరమే లేదు. వాటికి అసలు విలువే లేదు. భూముల లావాదేవీలన్నీ వెబ్‌ల్యాండ్‌లోనే నిర్వహించుకోవచ్చు’ అని చెప్పిన సర్కారు దానిని తప్పుల కుప్పగా మార్చేయడంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. గతంలో రైతులు తమ వద్ద ఉండే పట్టాదార్ పాస్ పుస్తకాలను చూసుకుని ఆనందపడేవారు. అవసరమైన రుణాలను వాటి ద్వారానే పొందేవారు. ప్రస్తుత వాటిని రద్దు చేయడంతో తమ భూమి ఉంటుందో, ఉండదో అనే అనుమానాలతో సతమతం అవుతున్నారు. సర్వే చేసిందెక్కడ.. వెబ్‌ల్యాండ్ ఆధారంగా రెవెన్యూ రికార్డులు క్రమబద్ధీకరించి భూముల వివరాలను ఆన్లైన్లో పొందుపరచాలంటే గ్రామస్థాయిలో సర్వే నిర్వహించాలి. గ్రామంలో ఎంత భూమి ఉందో ముందుగా గుర్తించాలి. భూముల పూర్తి వివరాలు సేకరించాలి. గ్రామ సభలు నిర్వహించాలి. అనంతరం రెవెన్యూ రికార్డుల్లో మార్పులు చేసి ప్రజల ఆమోదంతో వెబ్‌ల్యాండ్‌ను రూపొందించాలి. ఇలా చేస్తే తప్పులు వచ్చే అవకాశం ఉండబోదని రెవెన్యూ వర్గాలు పేర్కొంటున్నాయి. వేరొకరి పేరు చూపిస్తోంది.. మా తండ్రి తైలం సంపతిరావు పేరున ఎకరం పొలం ఉంది. ఆయన పేరు ఆన్లైన్లో చూపడం లేదు. ఆ భూమి ఆకుల లక్ష్మి అనే ఆమె పేరిట ఉన్నట్టు వస్తోంది. రెవెన్యూ అధికారులకు ఎన్నోసార్లు ఫిర్యాదు చేశాను. ఇంకా సరి చేయలేదు. భూమి వివరాలు మారితే గాని మా అన్నదమ్ములం పంచుకోవడానికి అవకాశం ఉండదు.– తైలం సత్తిబాబు, రైతు, వేగేశ్వరపురం, తాళ్లపూడి మండలం న్యాయం జరగడం లేదు.. యర్ర గుంటపల్లిలో సర్వే నంబర్ 561/2లో 81 సెంట్లు, 562/5 లో 1.53 ఎకరాల భూమి కలిపి 2.34 ఎకరాల భూమికి 1986లో ఎల్డీ నంబర్–473 బీ, 96 పట్టా ఇచ్చారు. ఎఫ్ఎంబీ, ఆర్ఎస్ఆర్, 10–1 అడంగల్‌లో నమోదు చేశారు. కొబ్బరి, మామిడి మొక్కలు వేసి, భూమి శిస్తు చెల్లిస్తున్నాను. నా భూమిని వేరే వ్యక్తుల పేరుతో నమోదు చేశారు. రెవెన్యూ అధికారులకు చెప్పినా న్యాయం జరగడం లేదు. మ్యుటేషన్‌కు ఆన్లైన్లో దరఖాస్తు పెట్టాను.– తుల్లిమెల్లి కుటుంబరావు, రైతు,యర్రగుంటపల్లి, చింతలపూడి మండలం సమస్యలు పరిష్కరిస్తున్నాం వెబ్ ల్యాండ్‌లో జిల్లా రైతులకు సంబంధించి సమస్యలు ఉంటే తక్షణమే స్పందించి పరిష్కరిస్తున్నాం. భూ యజమానులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా రెవెన్యూ శాఖ చర్యలు తీసుకుంటోంది. తప్పులు నమోదైతే సవరణలకు అవకాశం కల్పిస్తున్నాం. త్వరలోనే ఎటువంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటాం.– పి.కోటేశ్వరరావు, జాయింట్ కలెక్టర్ సమస్యలున్న మాట వాస్తవమే రాష్ట్ర వ్యాప్తంగా 95శాతం భూములను వెబ్‌ల్యాండ్‌లో పొందుపరిచాం. కొన్నిచోట్ల సమస్యలు తలెత్తిన మాట వాస్తవమే. రిజిస్ట్రేషన్ శాఖ 2007వ సంవత్సరం భూముల వివరాలనే ఇప్పటికీ పరిగణలోకి తీసుకోవడం వల్లే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది. కలెక్టర్ పరిధిలో భూముల నోటిపికేషన్, డీ నోటిఫికేషన్ కలెక్టర్ పరిధిలో ఉంటే సమస్య రాదు. ఆ రెండు ప్రక్రియల్ని కలెక్టర్‌కు అప్పగించాలని ప్రభుత్వానికి నివేదించాం. ఈ మేరకు నిర్ణయం వస్తే వెబ్‌ల్యాండ్‌లో సమస్యలు వచ్చే అవకాశం ఉండదు.– నంబూరి తేజ్‌భరత్, ఆర్డీవో, రాష్ట్ర వెబ్‌ల్యాండ్ కమిటీ సభ్యుడు