Ministry of Textiles
-
సిల్క్ మార్క్.. పట్టుకు పట్టం
పట్టు నాడి పట్టుకోవడం కష్టం. తాకితే... మృదువుగా ఉంటుంది. పట్టుకుంటే మెత్తగా జారిపోతుంది. అసలు పట్టును తెలుసుకోవడం ఓ పరీక్ష. నకిలీని ‘పట్టు’ కోవడానికీ ఉందో పరీక్ష.మన అమ్మమ్మలు, నానమ్మలు పట్టుచీరలు కట్టుకున్నారు. పట్టుదారం మృదుత్వాన్ని ఆస్వాదించారు. పట్టుచీర కొనేటప్పుడు ఇది అసలుదా నకిలీదా అని తెలుసుకోవాల్సిన అవసరం ఆ తరానికి రాలేదు. ఎందుకంటే అప్పుడు పట్టుచీరలన్నీ అసలువే. అందుకే ప్రభుత్వం నియమాలు, నిబంధనల పట్టికలేవీ జారీ చేయలేదు. ‘ఇది అసలైన పట్టు’ అని ఒక గుర్తింపునిచ్చే వ్యవస్థను ఏర్పాటు చేయలేదు. నకిలీలు మార్కెట్లో రాజ్యమేలుతున్న తరుణంలో మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్, సెంట్రల్ సిల్క్ బోర్డ్ ఆధ్వర్యంలో సిల్క్ మార్క్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా 2004, జూన్ 17వ తేదీన ‘సిల్క్ మార్క్ లేబిల్’ పేరుతో ఒక లోగోను ఆవిష్కరించింది. బంగారు ఆభరణాల స్వచ్ఛతను, కచ్చితత్వాన్ని నిర్ధారించడానికి నిర్దేశించిన ‘బిఐఎస్ హాల్‌మార్క్’ వంటిదే ఇది కూడా. సిల్క్‌మార్క్ లేబిల్ అంటే... సదరు పట్టు వస్త్రం అసలైన పట్టుదారంతో తయారైనదే అని నిర్ధారించే లేబిల్ అన్నమాట. పట్టులు నాలుగే! పట్టు పేరుతో మార్కెట్లో దొరికే వస్త్రాల్లో సగం అసలైన పట్టు వస్త్రాలు కాదు. అలాగే నేత విధానాలను కూడా పట్టులో రకాలుగానే వ్యవహరించడంలో నెలకొన్న అయోమయం అది. మనదేశంలో లభించే పట్టు రకాలు మల్బరీ, టస్సర్, ముగా, ఎరీ అనే నాలుగు. ఎనభై శాతం వస్త్రాలు మల్బరీ పట్టు ఆధారంగా తయారయ్యేవే. అన్నింటిలోకి మృదువైన పట్టుదారం కూడా మల్బరీదే. ఇక కంచిపట్టు, ధర్మవరం పట్టు, గద్వాల పట్టు, పోచంపల్లి పట్టు, పైథానీ, బెనారస్ సిల్క్ అని పిలుచుకునే వన్నీ పట్టులో రకాలు కాదు. నేత విధానంలో రకాలు. ప్రపంచంలో ముప్పైకి పైగా దేశాల్లో పట్టు ఉత్పత్తి అవుతోంది. పట్టు ఉత్పత్తిలో చైనా తొలిస్థానంలో ఉంటే మనదేశం రెండవస్థానంలో ఉంది. క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయవచ్చు పట్టుచీర మీద ఉన్న సిల్క్ మార్క్ లేబిల్ క్యూఆర్ కోడ్ ఉంటుంది. ఆ కోడ్నును స్కాన్ చేస్తే ఆ చీరను తయారు చేసిన వీవర్ వివరాలతోపాటు షోరూమ్ వివరాలు కూడా తెలుస్తాయి. నకిలీ కోడ్లను గుర్తించడం ఎలాగో కూడా తెలుసుకోవాలి. ఇలాంటి మోసాలను అరికట్టడానికి ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోంది. కానీ వినియోగదారుల్లో చైతన్యమే అసలైన నియంత్రణ. బంగారు జరీ ప్యూర్ బై ప్యూర్ పట్టు చీర అంటే సహజమైన పట్టు దారాన్ని వెండి లేదా బంగారు ద్రవంలో ముంచి తయారు చేసిన జరీతో నేసినది. ఒకప్పుడు అన్నీ ప్యూర్ బై ప్యూర్ పట్టుచీరలే. ఇప్పుడు హాఫ్ఫైన్ వస్తున్నాయి... అంటే పాలియెస్టర్ని వెండి లేదా కాపర్‌లో అద్దిన జరీతో తయారు చేసినవి. ఇక టెస్టెడ్ జరీ అంటే విస్కోస్ని కాపర్‌తో కోట్ చేస్తారు. గోల్డ్ జరీ పట్టుచీర కావాలంటే వీవర్కి డిజైన్‌ను బట్టి రెండు లేదా మూడు గ్రాముల బంగారం ఇచ్చి చేయించుకోవాలి. నిప్పులాంటి పరీక్ష! ఇక చీరను నేసిన దారం స్వచ్ఛమైన పట్టుదారమేనా లేక పట్టును పోలిన సింథటిక్ దారమా అనేది తెలుసుకోవడానికి ఫ్లేమ్ టెస్ట్ చేయాలి. చీరలో ఒక చివర నుంచి రెండు దారాలను కత్తిరించి తీసుకుని వాటిని వెలిగించాలి. దారం మెల్లగా కాలుతూ, కొంతకాలి ఆగిపోతూ, వెంట్రుక కాలిన వాసన వస్తూ, బూడిద మెత్తటి ΄÷డిలా రాలితే అది స్వచ్ఛమైన పట్టుదారం. దారం వేగంగా కాలిపోతూ, పేపర్ కాలిన వాసనతో గరుకు బూడిద రాలితే అది నకిలీ పట్టు. కొన్నింటికి నకిలీ పట్టు దారాలను కాల్చినప్పుడు వ్యర్థం జిగురుగా ముద్దలా వస్తుంది. మరో విషయం ఏమిటంటే అసలైన పట్టుదారంతో నేసిన పవర్లూమ్ చీరకు సిల్క్ మార్క్ ఉంటుంది, ఉండాలి కూడా. ఎందుకంటే సిల్క్‌మార్క్ అనేది పట్టుకు కొలమానమే కానీ చేతితో నేసిన వాటిని పవర్ మగ్గం మీద నేసిన వాటినీ వర్గీకరించే వ్యవస్థ కాదు. సిల్క్‌మార్క్ ఉన్న చీరల్లో కూడా ఏది చేతితో నేసిన నేత, ఏది పవర్ లూమ్ మీద నేసిన చీర అనేది తెలుసుకోవడం కూడా ఓ కళ. సిల్క్‌మార్క్ ఉన్న పవర్లూమ్ చీర ధర సిల్క్‌మార్క్ ఉన్న చేనేత చీర ధరలో దాదాపు సగమే ఉండాలి. ఆ తేడాను గుర్తించాలి, గౌరవించాలి. అప్పుడే చేనేత కళ కొనసాగుతుంది. పదివేల పురుగుల శ్రమ ఒక పట్టుచీర తయారు కావాలంటే పదివేల పట్టుగూళ్లు కావాలి. పట్టు పురుగుల పెంపకం అంటే పసిపిల్లలను పెంచినట్లే. ఆ రైతు శ్రమ ఉంటుంది. ఆ తర్వాత పట్టుగూడు నుంచి దారం తీసే వాళ్ల శ్రమ. ఆ దారంతో మగ్గం మీద చీరను నేసే చేనేతకారుల శ్రమ. ఒక పట్టుచీర ధరలో పట్టు రైతుకు దక్కేది, దారం తీసిన వాళ్లకు దక్కేది, చేనేతకారులకు దక్కేది స్వల్పమే. శ్రమించకుండా భారీ ఆదాయం తీసుకునే వాళ్లు పట్టుదారం కొనే ట్రేడర్, పట్టుచీరను అమ్మే దుకాణదారులు మాత్రమే. చేనేతకారులు, దారం తయారు చేసే వాళ్లు మధ్య దళారుల దోపిడీకి గురవుతున్నారు. వ్యవస్థ ఉంది కానీ... అవగాహన లేదు! నకిలీ పట్టు చీరలను అసలైన పట్టుచీరలుగా నమ్మిస్తున్న మోసాన్ని నివారించడం కోసం ప్రభుత్వం ఒక వ్యవస్థను ఏర్పాటు చేసి ‘సిల్క్ మార్క్ లేబిల్’ని తయారు చేసింది. ఇది జరిగి పదేళ్లయినా ఈ విషయం తెలిసిన వాళ్లు ఒక్క శాతం కూడా లేరు. వినియోగదారులు చైతన్యం అయినప్పుడే ఈ మోసానికి అడ్డుకట్ట పడుతుంది. సిల్క్‌మార్క్ పట్ల అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో సిల్క్ మార్క్ లేబిల్నే నా బిజినెస్‌కి లోగోగా పెట్టుకున్నాను. ప్రతి ఒక్కరూ అసలైన పట్టుచీరలే కొనాలని చెప్పను. అసలైన పట్టుచీరకు అంత ధర పెట్టడం ఇష్టం లేని వాళ్లు పట్టును పోలిన సింథటిక్ చీర కొనుక్కోవడం తప్పుకాదు. అయితే ఆ విషయం తెలిసి చేయాలి తప్ప, అసలైన పట్టుచీరనే కొనుక్కున్నామనే భ్రమలో నకిలీ పట్టు చీరలను కొని మోసపోకూడదు. రెండేళ్లపాటు కంచి, వెంకటగిరి, ధర్మవరం, బనారస్, గద్వాల్వంటి చేనేతకారుల గ్రామాల్లో పర్యటించిన తర్వాత నాకు తెలిసిన విషయాలివి. – కల్యాణి, రామి సిల్క్స్, హైదరాబాద్ – వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధిఫొటో : ఎస్. ఎస్. ఠాకూర్ -
పండుగకు ముందే బతుకమ్మ చీరలు
సాక్షి, హైదరాబాద్: బతుకమ్మ పండుగ సందర్భంగా ఏటా రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తున్న బతుకమ్మ చీరలను ఈ ఏడాది నిర్ణీత గడువులోగా లబ్దిదారులకు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. మూడేళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేస్తుండగా, గతేడాది ముందస్తు అసెంబ్లీ ఎన్నికల మూలంగా చీరల పంపిణీలో జాప్యం చోటుచేసుకుంది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది ఎలాంటి అవాంతరాలు లేకుండా పండుగ నాటికి చీరల పంపిణీ చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ ఏడాది రాష్ట్రంలో బతుకమ్మ చీరల కోసం రూ.320 కోట్లు విలువ చేసే 6.84 కోట్ల మీటర్ల వ్రస్తాన్ని ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించారు. ఈ మేరకు సిరిసిల్లలోని వివిధ యాజమాన్యాల పరిధిలో ఉన్న మరమగ్గాలకు చీరల నేత అప్పగించారు. ఇప్పటివరకు 4.67 కోట్ల మీటర్ల వస్త్ర ఉత్పత్తి జరగ్గా.. కోటి చీరలకు గాను 60 లక్షల చీరల తయారీ పూర్తయింది. జిల్లాల వారీ లక్ష్యాలకు అనుగుణంగా ఇప్పటివరకు 25 లక్షల చీరలను సరఫరా చేయగా, ఈ నెలాఖరులోగా 50 లక్షల చీరలను జిల్లాలకు చేరవేస్తారు. ప్రత్యేక లోగోతో బతుకమ్మ చీరలు.. ఈ ఏడాది బతుకమ్మ చీరల తయారీలో కొన్ని ప్రత్యేకతలు ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. బంగారు జరీ వర్ణం అంచుతో.. వృద్ధుల కోసం ఆరు గజాలు, మిగతా వారికి ఫ్యాన్సీ చీరలు తయారు చేస్తున్నారు. 80 రంగుల్లో ఉన్న చీరలకు జాతీయ ఫ్యాషన్ టెక్నాలజీ సంస్థ (నిఫ్ట్) నిపుణులు డిజైనింగ్ చేశారు. ఏటా లక్షల సంఖ్యలో చీరల తయారీ జరుగుతున్న నేపథ్యంలో గద్వాల, పోచంపల్లి చీరల తరహాలో సిరిసిల్ల చీరలకు ప్రత్యేక గుర్తింపును తీసుకురావాలనే యోచనలో ప్రభుత్వం ఉంది. సిరిసిల్ల చీరలకు ప్రాచుర్యం తెచ్చేందుకు బతుకమ్మ చీరలపై శిరిశాల లేదా శ్రీశాల పేరిట ప్రత్యేక లోగోను తయారు చేయాలని చేనేత శాఖ నిర్ణయించింది. మూడేళ్లలో రూ. 900 కోట్ల ఆర్డర్లు.. సిరిసిల్లలో వివిధ యాజమాన్యాల పరిధిలో 23 వేలకు పైగా మరమగ్గాలు ఉండగా, వీటిలో 17 వేలకు పైగా మగ్గాలపై బతుకమ్మ చీరల తయారీ కొనసాగుతోంది. రోజుకు తొమ్మిది లక్షల మీటర్ల బతుకమ్మ చీరల వస్త్ర ఉత్పత్తి జరుగుతుండగా.. సిరిసిల్ల మరమగ్గాల కార్మికులకు ఇతర ప్రభుత్వ పథకాలకు సంబంధించిన వస్త్ర ఉత్పత్తి ఆర్డర్లు క్రమం తప్పకుండా వస్తున్నాయి. బతుకమ్మతో పాటు రంజాన్, క్రిస్మస్ కానుకలు, కేసీఆర్ కిట్లు, యూనిఫామ్‌లకు సంబంధించిన వస్త్ర ఉత్పత్తి ఇక్కడే జరుగుతోంది. వివిధ ప్రభుత్వ పథకాలకు సంబంధించి మూడేళ్లలో రూ.900 కోట్ల మేర ఆర్డర్లు అందాయి. 9,435 మంది కారి్మకులు బతుకమ్మ చీరల తయారీతో ఉపాధి పొందుతుండగా.. గతంలో వీరి నెలవారీ ఆదాయం రూ.8,000 లోపే ఉండేది. ప్రస్తుతం సగటున ఒక్కో కారి్మకుడికి రూ.16 వేల నుంచి రూ.20 వేల వరకు ఆదాయం లభిస్తున్నట్లు చేనేత శాఖ అంచనా వేస్తోంది. -
చేనేతల రుణమాఫీకి రూ.110 కోట్లు
రాష్ట్రంలో చేనేత కార్మికుల రుణమాఫీ కోసం వచ్చేనెలలో రూ.110 కోట్లు విడుదల చేయనున్నట్లు మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. గుంటూరు జిల్లా మంగళగిరి మండలం ఎర్రబాలెంలో గురువారం ఉదయం ఆయన చేనేత, జౌళి శాఖ రాష్ట్ర కమిషనరేట్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఆప్కో కార్యాలయాన్ని విజయవాడలో ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. చేనేత కార్మికుల్లో నైపుణ్యం పెంచేందుకు మంగళగిరిలో శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు. -
చేనేత ప్రదర్శనలో ఆకలి కేకలు
శ్రీకాకుళం టౌన్: చేనేత వస్త్రాల విక్రయానికి ఏర్పాటు చేసిన ప్రదర్శనలో వివిధ జిల్లాల నుంచి వచ్చిన దుకాణదారులకు ఆకలిదప్పులు తప్పలేదు. రెండు దశాబ్దాలుగా ప్రదర్శన నిర్వహణ వ్యయాన్ని చేనేత జౌళిశాఖ పెంచకపోవడంతో అమ్మకందారులకు భోజనం కూడా పెట్టలేని పరిస్థితి నెలకొంది. ప్రభుత్వం చేనేత కార్మికులను ఆదుకుంటామని వేదికలపై చెప్పడం తప్ప క్షేత్రస్థాయిలో కనిపించడం లేదని వారు ఆవేదన చెందుతున్నారు. చేనేత వస్త్రాలను నేతకార్మికుల నుంచి సొసైటీల ద్వారా సేకరిస్తారు. వాటిని మార్కెట్లో విక్రయించి వచ్చిన లాభాలను జీతాలుగా పంచుకోవడం ఎన్నోఏళ్లుగా వస్తున్న ఆనవాయితీ. ఏడాదికొకసారి ప్రతి జిల్లాలో చేనేత వస్త్రాల విక్రయ ప్రదర్శన తప్పనిసరి. విక్రయ ప్రదర్శనకు చేనేత జౌళిశాఖ జిల్లా శాఖలకు అనుమతిస్తుంది. ఈ అనుమతి మేరకు ప్రదర్శన నిర్వహణకు ఆశాఖ ఉన్నతాధికారులు రూ. 2 లక్షల నిధులు చెల్లిస్తారు. 1994లో నిర్ణయించిన మేరకు ప్రదర్శన పది రోజుల పాటు ఉండాలి. అయితే రెండు దశాబ్దాలు దాటినా నిర్వహణ వ్యయం పెంచకపోవడంతో వచ్చిన అమ్మకందార్లకు భోజనాలు కూడా పెట్టుకోలేని స్థితిలో చేనేత జౌళిశాఖ ఉంది. గతంలో ప్రదర్శనకు 10 రోజులు అవకాశం ఉండేది. నిర్వహణ వ్యయం పెంచని అధికారులు ప్రదర్శనను ఎనిమిది రోజులకు తగ్గించారు. దీంతో అమ్మకాలు అంతంతమాత్రంగానే సాగుతున్నాయని అమ్మకందారులు వాపోతున్నారు. ఈ నెల 16 నుంచి 24 వరకు ప్రదర్శన జిల్లా కేంద్రంలో ఈ నెల 16 నుంచి 24వ తేదీ వరకు రైస్ మిల్లర్స్ హాల్ వరండాలో చేనేత వస్త్ర ప్రదర్శన నిర్వహించారు. ఆరు జిల్లాల నుంచి చేనేత వస్త్రాలతో దుకాణదారులు హాజరయ్యారు. చేనేత వస్త్రాలను విక్రయించేందుకు వచ్చిన వారు సొసైటీ సభ్యులే కావడంతో వారికి భోజన వసతి సౌకర్యాలు సొసైటీలే సమకూర్చుకోవాల్సి వస్తోంది. రోజూ ఒక్కో దుకాణంలో రూ. 5వేల వరకు విక్రయాలు జరుగుతున్నాయని, అందులోనే 12 శాతం నిధులు దుకాణంలో వినియోగించుకుంటున్నామని అమ్మకందారులు వాపోతున్నారు. చేనేత జౌళిశాఖ ఏడీ రాజారావు ఏమన్నారంటే... ఈ ఏడాది అక్టోబర్‌లో ఏర్పాటు చేసిన ప్రదర్శన వల్ల అమ్మకాల్లో గిరాకీ గుర్తించాం. అందువల్లే మూడు నెలల్లో మళ్లీ చేనేత ప్రదర్శన ఏర్పాటు చేశాం. రాష్ట్ర స్థాయిలో ప్రదర్శన నిర్వహణకు రూ. 2 లక్షలు మాత్రమే చెల్లిస్తున్నారు. వాటితోనే ప్రచారం, ప్రారంభోత్సవ కార్యక్రమం, ప్రదర్శన వద్ద మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నాం. పెరిగిన ధరలకు తగ్గట్టు నిర్వహణ వ్యయం పెంచాల్సి ఉంది. ఉన్నతస్థాయిలో అనేకమార్లు అడినప్పటికీ నిధులు పెంచక పోవడం వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయి. -
అతివలకు అండగా...
కుట్టు పనిలో అధునాతన శిక్షణ కేంద్ర ప్రభుత్వం అండదండలు ఉచిత సేవలందిస్తున్న అలీప్ సంస్థ శిక్షణ... అనంతరం ఉపాధి మహిళలు కొంగు బిగిస్తున్నారు... గరిటె తిప్పిన చేతితోనే అద్భుతాలు సృష్టిస్తున్నారు... వారిలో కళా నైపుణ్యానికి కేంద్ర జౌళి మంత్రిత్వ శాఖ మరింత చేయూతనిస్తోంది. ప్రభుత్వ అండదండలతో అలీప్ సంస్థ కుట్టు పనిలో, జూట్ వస్తువుల తయారీలో అధునాతన శిక్షణను ఉచితంగా అందిస్తోంది. ఉపాధి మార్గాలనుకూడా చూపుతోంది. ఈ అవకాశాన్ని వినియోగించుకొని అతివలు మరింత ముందడుగేయాలని కోరుతోంది. విశాఖపట్నం చొరవ, పట్టుదల ఉన్న మహిళలకు ఆకాశమే హద్దు. సంకల్పం ఉండాలే గానీ సాధించలేనిది ఏదీ లేదు. అతి తక్కువ ఖర్చుతో స్వయం ఉపాధిని కల్పించుకునే విధంగా వారిని తీర్చిదిద్దాలనే సదుద్దేశంతో అలీప్ సంస్థ నడుం బిగించింది. కేంద్ర ప్రభుత్వ నిధులతో ముందుకు సాగుతున్న ఈ సంస్థను ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంలో ప్రారంభించారు. రాష్ట్ర విభజన అనంతరం ఈ సంస్థ తమ శాఖను ఆంధ్రప్రదేశ్‌లో మొదటిగా విశాఖ నగరంలో ప్రారంభించింది. సీతమ్మధార ప్రాంతంలో ఉన్న ఈ సంస్థ కార్యాలయంలో కుట్టు పనిలో, జూట్ వస్తువుల తయారీలో అధునాతన శిక్షణ అందిస్తున్నారు. జూట్ వస్తువులు ఆధునికులను సైతం ఆకట్టుకునేలా జూట్ వస్తువులు చూడముచ్చటగా ఉంటున్నాయి. అటువంటి వస్తువులను ఎలా తయారు చేస్తారో.. నేర్చుకుంటే బాగుణ్ను అనే ఆలోచన కలుగుంది. కానీ వాటిని నేర్చుకోవాలంటే తయారు చేసే సామగ్రి కావాలి. నేర్పించే శిక్షకులు ఉండాలి. అన్నింటికి మించి ఆర్థిక స్థోమత కలగాలి.. ఇన్ని ఆలోచనల మధ్య అద్భుతమైన జూట్ వస్తువుల తయారీని నేర్చుకోవాలనే ఉద్దేశాన్ని చాలామంది మానుకుంటున్నారు. ఉచితంగా ఈ కోరికను తీర్చేందుకు అలీప్ సంస్థ ముందుకు వచ్చింది. సామగ్రిని ఉచితంగా అందుబాటులో ఉంచడమే కాక, నిష్ణాతులైన ఉపాధ్యాయులచే శిక్షణ కల్పిస్తున్నారు. అంతేకాకుండా శిక్షణానంతరం ధ్రువ పత్రాన్ని కూడా అందజేస్తున్నారు. ఇంటిలో ఉపయోగించే కూరగాయల సంచులు, టేబుల్ కవర్లు, చేతి సంచులు, గోడకు తగిలించే సంచులు, డోర్ కర్టెన్లు వంటి వస్తువులెన్నింటినో మహిళలు స్వయంగా తయారు చేసుకొని ఉపాధి, ఉద్యోగం పొందవచ్చు. మగ్గం నేయడం.. అధునాతన సౌకర్యాలతో రూపొందించిన పరికరాల సా యంతో వస్త్రాలను అతి వేగంగా తయారు చేస్తున్నారు. కానీ మన్నికలో అవి తీసికట్టే. ఒకప్పుడు మగ్గాలపై దుస్తులు నేసేవారు. అవి తరతరాలు చూసేవి. మగ్గంపై దుస్తులను తయారు చేసే విధానంలో కూడా అలీప్ సంస్థ శిక్షణ కల్పిస్తుంది. ఆర్యా వర్క్ నేర్పడం కోసం నిపుణుడైన అధ్యాపకుడిని కూడా ఏర్పాటు చేసింది. టైలరింగ్‌లో అధునాతన శిక్షణ ఒకప్పుడు బట్టలు కుట్టాలంటే మెషీన్‌ను కాళ్లతో తొక్కేవారు. కానీ కాలానుగుణంగా పరికరాలు మారాయి. పరిజ్ఞానం పె రిగింది. ఆధునిక పద్ధతిలో దుస్తులు తయారవుతున్నాయి. దీనికి తగినట్లుగా అలీప్ సంస్థ శిక్షణ కల్పిస్తుంది. అత్యధిక వ్య యం కలిగిన మెషినరీని ఏర్పాటు చేసి నిష్ణాతులైన ఉపాధ్యాయులతో టైలరింగ్‌లో శిక్షణ కల్పిస్తుంది. అంతేకాకుండా శిక్షణ అనంతరం ధ్రువీకరణ పత్రంతోపాటు ఉపాధిని కూడా సంస్థ చూపిస్తుంది. మహిళలు సద్వినియోగపరచుకోవాలి.. సంస్థ కల్పిస్తున్న అవకాశాన్ని మహిళలు సద్వినియోగపరచుకోవాలి.. కేవలం భర్త సంపాదనపైన ఆధారపడకుండా మహిళలు తమ స్వయం ఉపాధిని పెంపొందించుకోవాలి. సమాజంలో మగవారితో సమానంగా ముందుకు సాగాలి. కేవలం ఖాళీగా టీవీల ముందు కూర్చొని కాలాన్ని వృధా చేసే బదులు సంస్థలో చేరి ఉచితంగా శిక్షణ పొందండి. ఇక్కడ శిక్షణ పొందిన అనేకమంది వివిధ పరిశ్రమలలో ఉపాధిని పొంది ఉన్నత స్థాయిలో ఉండటమే కాకుండా, తమ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. మా వద్దకు వస్తున్న వారిలో ఎక్కువమంది కుటుంబ బాధ్యత మోస్తున్న మహిళలే. -సునీత, మేనేజరు, అలీప్ సీతమ్మధార శాఖ