పండుగకు ముందే బతుకమ్మ చీరలు | Bathukamma sarees before the festival | Sakshi
Sakshi News home page

పండుగకు ముందే బతుకమ్మ చీరలు

Aug 25 2019 3:18 AM | Updated on Aug 25 2019 3:18 AM

Bathukamma sarees before the festival - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: బతుకమ్మ పండుగ సందర్భంగా ఏటా రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తున్న బతుకమ్మ చీరలను ఈ ఏడాది నిర్ణీత గడువులోగా లబ్దిదారులకు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. మూడేళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేస్తుండగా, గతేడాది ముందస్తు అసెంబ్లీ ఎన్నికల మూలంగా చీరల పంపిణీలో జాప్యం చోటుచేసుకుంది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది ఎలాంటి అవాంతరాలు లేకుండా పండుగ నాటికి చీరల పంపిణీ చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ ఏడాది రాష్ట్రంలో బతుకమ్మ చీరల కోసం రూ.320 కోట్లు విలువ చేసే 6.84 కోట్ల మీటర్ల వ్రస్తాన్ని ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించారు. ఈ మేరకు సిరిసిల్లలోని వివిధ యాజమాన్యాల పరిధిలో ఉన్న మరమగ్గాలకు చీరల నేత అప్పగించారు. ఇప్పటివరకు 4.67 కోట్ల మీటర్ల వస్త్ర ఉత్పత్తి జరగ్గా.. కోటి చీరలకు గాను 60 లక్షల చీరల తయారీ పూర్తయింది. జిల్లాల వారీ లక్ష్యాలకు అనుగుణంగా ఇప్పటివరకు 25 లక్షల చీరలను సరఫరా చేయగా, ఈ నెలాఖరులోగా 50 లక్షల చీరలను జిల్లాలకు చేరవేస్తారు. 

ప్రత్యేక లోగోతో బతుకమ్మ చీరలు.. 
ఈ ఏడాది బతుకమ్మ చీరల తయారీలో కొన్ని ప్రత్యేకతలు ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. బంగారు జరీ వర్ణం అంచుతో.. వృద్ధుల కోసం ఆరు గజాలు, మిగతా వారికి ఫ్యాన్సీ చీరలు తయారు చేస్తున్నారు. 80 రంగుల్లో ఉన్న చీరలకు జాతీయ ఫ్యాషన్‌ టెక్నాలజీ సంస్థ (నిఫ్ట్‌) నిపుణులు డిజైనింగ్‌ చేశారు. ఏటా లక్షల సంఖ్యలో చీరల తయారీ జరుగుతున్న నేపథ్యంలో గద్వాల, పోచంపల్లి చీరల తరహాలో సిరిసిల్ల చీరలకు ప్రత్యేక గుర్తింపును తీసుకురావాలనే యోచనలో ప్రభుత్వం ఉంది. సిరిసిల్ల చీరలకు ప్రాచుర్యం తెచ్చేందుకు బతుకమ్మ చీరలపై శిరిశాల లేదా శ్రీశాల పేరిట ప్రత్యేక లోగోను తయారు చేయాలని చేనేత శాఖ నిర్ణయించింది.

మూడేళ్లలో రూ. 900 కోట్ల ఆర్డర్లు.. 
సిరిసిల్లలో వివిధ యాజమాన్యాల పరిధిలో 23 వేలకు పైగా మరమగ్గాలు ఉండగా, వీటిలో 17 వేలకు పైగా మగ్గాలపై బతుకమ్మ చీరల తయారీ కొనసాగుతోంది. రోజుకు తొమ్మిది లక్షల మీటర్ల బతుకమ్మ చీరల వస్త్ర ఉత్పత్తి జరుగుతుండగా.. సిరిసిల్ల మరమగ్గాల కార్మికులకు ఇతర ప్రభుత్వ పథకాలకు సంబంధించిన వస్త్ర ఉత్పత్తి ఆర్డర్లు క్రమం తప్పకుండా వస్తున్నాయి. బతుకమ్మతో పాటు రంజాన్, క్రిస్మస్‌ కానుకలు, కేసీఆర్‌ కిట్లు, యూనిఫామ్‌లకు సంబంధించిన వస్త్ర ఉత్పత్తి  ఇక్కడే జరుగుతోంది. వివిధ ప్రభుత్వ పథకాలకు సంబంధించి మూడేళ్లలో రూ.900 కోట్ల మేర ఆర్డర్లు అందాయి. 9,435 మంది కారి్మకులు బతుకమ్మ చీరల తయారీతో ఉపాధి పొందుతుండగా.. గతంలో వీరి నెలవారీ ఆదాయం రూ.8,000 లోపే ఉండేది. ప్రస్తుతం సగటున ఒక్కో కారి్మకుడికి రూ.16 వేల నుంచి రూ.20 వేల వరకు ఆదాయం లభిస్తున్నట్లు చేనేత శాఖ అంచనా వేస్తోంది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement