breaking news
Minister for Social Welfare
-
అడ్డంగా దొరికిపోయిన మంత్రిగారి సతీమణి
-
అడ్డంగా దొరికిపోయిన మంత్రిగారి సతీమణి
బెంగళూరు: విద్యార్థి వసతి గృహాలకు ఆహారధాన్యాల సరఫరాకు సంబంధించిన కాంట్రాక్ట్ కేటాయింపులకు సంబంధించిన వ్యవహారంలో కమీషన్ తీసుకుంటూ రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి హెచ్. ఆంజనేయ భార్య విజయ ఓ ఛానల్ జరిపిన స్టింగ్ ఆపరేషన్లో అడ్డంగా చిక్కారు. ఈ దృశ్యాలు టీవీఛానళ్లలో ప్రసారమైన వెంటనే హెచ్. ఆంజనేయ తన మంత్రి పదవికి రాజీనామా చేయాలంటూ విపక్ష బీజేపీ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. వివరాలు... సాంఘిక సంక్షేమశాఖ పరిధిలోని హాస్టళ్లకు బియ్యం, పప్పుధాన్యాలు, నూనె తదితర పదార్థాల సరఫరాకు ఓ ఏడాదికి సంబంధించిన కాంట్రాక్ట్ తమకే అందేలా చూడాలంటూ ఓ ప్రైవేటు టీవీఛానల్ ప్రతినిధులు హెచ్.ఆంజనేయ భార్య విజయను సంప్రదించారు. ఇందుకు గాను ఆమెకు రూ.7 లక్షల నగదును కమీషన్ రూపంలో అందజేశారు. ఈ వ్యవహారాన్ని సదరు టీవీ ఛానల్ ప్రతినిధులు రహస్యంగా చిత్రీకరించి గురువారం ప్రసారం చేశారు. ఈ విషయం ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాలతో పాటు అధికారిక వర్గాల్లో తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. ఇదిలా ఉండగా దళిత వర్గానికి చెందిన తమను రాజకీయంగా అణగదొక్కాలనే ఉద్దేశంతో కొంతమంది తమపై ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని హెచ్. ఆంజనేయ తనను కలిసిన మీడియా ప్రతినిధులతో పేర్కొన్నారు. మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప ఈ విషయమై మాట్లాడుతూ...‘హెచ్.ఆంజనేయ మంత్రి పదవిలో కొనసాగడానికి అనర్హుడు. వెంటనే ఆయన తన పదవికి రాజీనామా చేయాలి. లేదంటే పోరాటానికి దిగుతాం’ అని హెచ్చరించారు.