breaking news
minister kaminenei srinivas
-
నీట్ జాతీయ పూల్‌లోకి ఏపీ: మంత్రి కామినేని
సాక్షి, ఢిల్లీ: నీట్ జాతీయ పూల్‌లోకి ఏపీ వచ్చిందని ఏపీ వైద్య,ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ కామినేని శ్రీనివాస్ తెలిపారు. మంగళవారం ఢిల్లీకి వచ్చిన ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. వైద్య విద్య సీట్ల భర్తీలో 371డి నిబంధన నుంచి ఏపీకి కేంద్రం మినహాయింపు ఇచ్చిందంటూ అందుకు ధన్యవాదాలు తెలిపారు. నీట్ జాతీయ పూల్‌లోకి ఏపీతోపాటు తెలంగాణ, జమ్ముకాశ్మీర్ వచ్చాయన్నారు. వచ్చే ఏడాది (2018-19) నుంచి 371డి నిబంధన నుంచి ఏపీకి మినహాయింపు లభించనుందని, జాతీయ పూల్‌లో చేరడంవల్ల వచ్చే ఏడాది నుంచి వైద్య సీట్లలో రాష్ట్ర విద్యార్ధులు ఎంబీబీఎస్, పీజీలో ఎక్కువ సీట్లకు పోటీపడే అవకాశం లభించడం కలిసి వచ్చే అంశమని చెప్పారు. దేశవ్యాప్తంగా 27,710 ఎంబీబీఎస్ సీట్లు ఉండగా ఏపీలో 1900 సీట్లు ఉన్నాయని, రాష్ట్రం జాతీయ పూల్ కింద 15 శాతం సీట్లు (285) కోల్పోయినా జాతీయస్థాయిలో 16 రెట్లు అధికంగా(4482) సీట్లకు పోటీపడే అవకాశం లభిస్తుందని వివరించారు. అలాగే దేశవ్యాప్తంగా 13,872 పీజీ సీట్లు ఉండగా మన రాష్ట్రంలో 660 సీట్లు ఉన్నాయని, వీటిలో 50శాతం అంటే 330 జాతీయ పూల్‌కు ఇస్తే దేశవ్యాప్తంగా 7236 పీజీ సీట్లకు పోటీపడేందుకు అవకాశం ఉందన్నారు. 371డి నిబంధన మినహాయింపు, ఫాతిమా మెడికల్ కళాశాల విద్యార్ధుల అంశంపై కేంద్ర మంత్రి నడ్డాతో మంగళవారం మరోసారి సమావేశం కానున్నట్లు కామినేని తెలిపారు. -
త్వరలో 500 డాక్టర్ పోస్టుల భర్తీ
గుమ్మఘట్ట: ప్రభుత్వాస్పత్రుల్లో మరింత మెరుగైన వైద్యసేవలందించేందుకు త్వరలో 500 పోస్టులు భర్తీ చేయనున్నట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాసరావు తెలిపారు. గుమ్మఘట్ట మండలం 75 వీరాపురం వద్ద ముఖ్యమంత్రి చంద్రబాబు బుధవారం పర్యటించనున్న నేపథ్యంలో అందుకు సంబంధించిన ఏర్పాట్లను మంగళవారం రాత్రి ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు, నియోజవర్గ ప్రత్యేక ఐఏఏస్ అధికారి చక్రధర్, ఆర్డీఓ రామారావులతో కలసి ఆయన పరిశీలించారు. మంత్రి మాట్లాడుతూ ఎన్టీఆర్ వైద్యసేల్లో భాగంగా 1044 రకాల వ్యాధులకు 2.5 లక్షల వరకు ఉచితంగా చికిత్సలు అందిస్తామన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఓపీ అతి తక్కువగా ఉన్న చోట మందుల ఏటీఎం ఏర్పాటు చేస్తామన్నారు. పూలకుంట, గుమ్మఘట్ట గ్రామాలలో వేరుశనగ పొలాలను సందర్శించి రెయిన్‌గన్ తడులను పరిశీలించారు. జెడ్పీటీసీ పూల నాగరాజు, డీఎంహెచ్ఓ వెంకటరమణ, ఎంపీపీ గిరిమల్లప్ప, మునిసిపల్ చైర్మన్ రాజశేఖర్‌బాబు, ఏడీ మద్దిలేటి, తహసీల్దార్ అఫ్జల్ఖాన్,ఎంపీడీఓ జి.మునయ్య, ఏఓ శ్రీనివాస్‌రావ్‌తో పాటు ఇతర శాఖల అధికారులు, ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు. -
రేపు మంత్రి కామినేని రాక
అనంతపురం అర్బన్: వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ ఈనెల 14 జిల్లాకు విచ్చేస్తున్నారు. ఆ రోజు రాత్రి 7.30 గంటలకు ఆయన జిల్లాకు చేరుకుంటారు. రాత్రికి ఇక్కడే బస చేస్తారు. 15వ తేదీ జరగనున్న స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో ముఖ్యమంత్రితో పాటు మంత్రి పాల్గొంటారు. -
రిమ్స్‌కే రోగమొచ్చింది
జిల్లాకే పెద్ద దిక్కుగా నిలవాల్సిన రిమ్స్ మంచాన పడింది. అరకొర సదుపాయాలు, వైద్యుల నిర్లక్ష్యం, సిబ్బందికి జీతాలు ఇవ్వలేని ప్రభుత్వం వైఫల్యాలు రిమ్స్ అభివృద్ధికి ప్రతిబంధకాలుగా నిలిచాయి. మరోవైపు జిల్లాలో స్వైన్‌ఫ్లూ విజృంభిస్తోంది. ఇప్పటికే ఇద్దరు మృత్యువాత పడగా మరో ఐదుగురు ఈ లక్షణాలతో చికిత్స పొందుతున్నారు. ఇంత జరుగుతున్నా అక్కడ పూర్తిస్థాయి వైద్యసేవలు అందించలేని నిస్సహాయ స్థితిలో అధికారులున్నారు. జులై నెలలో ఇదే ఆసుపత్రికి ఆరోగ్య శాఖా మంత్రి కామినేని శ్రీనివాసరావు వచ్చి పలు ఆదేశాలిచ్చినా ఒక్క అడుగూ ముందుకు పడలేదు. తరువాత మంత్రి శిద్దా, కలెక్టర్ విజయకుమార్ వచ్చి కన్నెర్ర చేసినా పట్టించుకునే నాథుడే కరవాయే. వందసీట్లెప్పుడు...? మరో వైపు జిల్లాకు ప్రతిష్టాత్మకంగా నిర్మించిన రిమ్స్ పూర్తి కాకుండానే కునారిల్లే పరిస్థితికి వచ్చింది. ఎంబీబీఎస్ నాల్గో సంవత్సరం ప్రారంభమైనా నిర్మాణ పనులు ఇంకా సా...గుతూనే ఉన్నాయి. దీంతో ఏ ఏడాదికాయేడు రిమ్స్ సీట్లను ఎంసీఐ ఇవ్వకపోవడం, మళ్లీ ప్రభుత్వం కదిలి అనుమతులు తెప్పించడం జరుగుతూ వస్తోంది. ఈ ఏడాది కూడా వంద సీట్లకు అనుమతిచ్చే పరిస్థితి కనపడటం లేదు. ప్రతిసారీ మెడికల్ కౌన్సిల్ తనిఖీలకు వచ్చే ముందు హడావుడిగా పనులను చేయడం తనిఖీలు అయిన అనంతరం నత్తతో పోటీ పడుతూ నిర్మాణాలు చేయడం కాంట్రాక్టర్లకు రివాజుగా మారింది. జీతాలకూ కనా కష్టం రిమ్స్‌లో కాంట్రాక్టు సిబ్బందికి జీతాలిచ్చి ఏడు నెలలయింది. వీరికి జీతాలు ఎప్పుడు వస్తాయో తెలియదు. వారికి కాంట్రాక్టు పొడిగింపులో కూడా నిర్లక్ష్యం కనపడుతోంది. మరోవైపు రిమ్స్‌కు ప్రొఫెసర్ల కొరత తీవ్రంగా ఉంది. జనరల్ సర్జరీ,అనాటమీ, ఫిజియాలజీ, పీడియాట్రిక్స్,అర్ధ్రోపెడిక్స్, రేడియాలజీ, టి.బి., సైకాలజీ, జనరల్ మెడిసిన్ తదితర విభాగాలలో ఫ్రొఫెసర్ల కొరత తీవ్రంగా ఉంది. రిమ్స్‌లో అత్యాధునిక పరికరాలున్నా సిబ్బంది కొరతతో వాటిని ఉపయోగించే పరిస్థితి లేకుండాపోతోంది. పరికరాలు సరఫరా చేసి నాలుగేళ్లు గడుస్తున్నప్పటికీ వాటిని వాడకపోవడంతో పనికి రాకుండా పోయే ప్రమాదం ఉంది. రిమ్స్‌లో ఎన్ని వెంటిలేటర్లున్నాయనే విషయం వైద్యులకే తెలియని పరిస్థితి ఉంది. మందిలించినా మార్పు లేదు.. జిల్లా కేంద్రంలో ఉన్న వైద్య కళాశాల అయినప్పటికీ, ట్రామా సెంటర్ ఉన్నప్పటికీ దాదాపు 50 శాతానికి పైగా కేసులను గుంటూరు జనరల్ అసుపత్రికి రిఫరల్ చేసి వైద్యులు చేతులు దులుపుకుంటున్నారు. గుంటూరు గైనిక్ విభాగం వారు రిమ్స్ నుంచి రిఫరల్ కేసులన్నింటిటినీ నమోదు చేసి ఈ నివేదికను డీఎంఈ కి పంపారు. దీంతో డీఎంఈ రిమ్స్ అధికారులను చీవాట్లు పెట్టారు. జాతీయ రహదారుల శాఖ అంబులెన్సును, రిమ్స్‌కు చెందిన రెండు అంబులెనన్సులను, బ్లడ్ బ్యాంక్‌లోని అంబులెన్సులను ఉపయోగించకుండా ఖాళీగా పెట్టారు. రిమ్స్ క్యాజువాలిటీ విభాగంలో వీల్‌చైర్ లు కూడా అవసానదశకు చేరుకున్నాయి. ఇవి కూడా సిబ్బంది చేతులు తడిపితేనే నడుస్తాయి. ఎ.ఆర్.టి. సెంటర్లో ఎయిడ్స్ మందులు కూడా పూర్తిస్థాయిలో ఉండటం లేదు. వేళకు రారాయే... గతంలో రిమ్స్‌ను సంధర్శించిన సమయంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ రిమ్స్‌లో వైద్యులు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకూ విధుల్లో ఉండాల్సిందేనని ఆదేశించారు. దీన్ని ఎవరూ పట్టించుకోవడం లేదు. ఇప్పటికీ మెజార్టీ వైద్యులు ఉదయం 9 గంటలకు సంతకాలు పెట్టి 12 గంటలకు వెళ్లిపోతున్నారు. తిరిగి సాయంత్రం 4 గంటలకు వచ్చి సంతకాలు పెడుతున్నారు. రాత్రి వేళల్లో స్పెషలిస్టు వైద్యుడు కాదు కదా, మాములు వైధ్యులు కుడా ఉండటంలేదు. వీరి పై పూర్తి స్థాయిలో పర్యవేక్షణ కొరవడింది. గతంలో భారతీయ వైద్య మండలి తనిఖీకి వచ్చిన సమయంలో దాదాపు 13 కారణాలను ఎత్తి చూపింది. వీటిలో ముఖ్యంగా ఆడిటోరియం నిర్మాణం, అత్యాధునిక ఎక్స్‌రే మిషన్, ముఖ్యమైన విభాగాలకు ప్రత్యేకంగా ఆపరేషన్ ధియేటర్లు, వైద్యుల కొరత ఉన్నాయి. వీటిలో ఆడిటోరియం నిర్మాణం ఇంకా పూర్తి కాలేదు. ఎంసీఐ తనిఖీలకు వచ్చే లోపు పూర్తి కాదు కూడా.