breaking news
milk scam
-
‘పాల’కులపై కేసు
ముంబై: కాంగ్రెస్ నాయకులు అవినీతికి కేరాఫ్ అడ్రస్‌గా మారిపోతున్నారు. ఇప్పటికే ఆదర్శ్ కుంభకోణంలో నలుగురు మాజీ ముఖ్యమంత్రులు ఇరుక్కపోగా...తాజాగా రాష్ట్ర పాల కుంభకోణంలో మరో ఇద్దరు మాజీ ముఖ్య నేతలపై కేసు నమోదవడం సర్వత్రా చర్చనీయాంశం అవుతోంది. జల్గావ్ పాల ఉత్పాదక సంఘానికి రూ.3.18 కోట్ల నష్టాన్ని మిగిల్చారని 144 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. వీరిలో రాష్ర్ట పరిశ్రమల శాఖ మంత్రి నారాయణ్ రాణే, కేంద్ర హోంశాఖ మంత్రి సుశీల్ కుమార్ షిండే, తొమ్మిది మంది మంత్రులు, 12 మంది రాష్ట్ర కార్యదర్శులు ఉన్నారు. జల్గావ్కు చెందిన రైతు నాగరాజ్ జనార్ధన్ పాటిల్ ఫిర్యాదు మేరకు పోలీసులు ఈ కేసు నమోదు చేశారు. ఆరు నెలలు లేదా ఏడాదిలోపు జల్గావ్ పాల ఉత్పాదక సంఘం బోర్డు డెరైక్టర్లకు అప్పగించాల్సి ఉన్న జాతీయ డెయిరీ డెవలప్మెంట్ బోర్డు(ఎన్డీడీబీ)తోనే కొనసాగేలా 118 మంది గూడుపుఠాణి చేశారని ఫిర్యాదులో పేర్కొన్నాడు. దీనివల్ల ఎన్డీడీబీకి రూ.3.18 కోట్లు లాభం వచ్చిందన్నాడు. ఈ మేరకు చూసుకుంటే జల్గావ్ పాల ఉత్పాదక సంఘానికి ఆ మేరకు నష్టం కలిగించినట్టేనని అందులో పేర్కొన్నాడు. అయితే ఈ కుంభకోణంపై ఈ ఏడాది జూన్‌లోనే పాటిల్ కోర్టును ఆశ్రయించగా కేసు నమోదు చేయాలని పోలీసులను ఆదేశించిన సంగతి తెలిసిందే. కాగా, ఇటీవల ముగిసిన అసెంబ్లీ సమావేశాల్లో పాల కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రులు రాజీనామా చేయాలని ప్రతిపక్షాలు పట్టుబట్టిన సంగతి తెలిసిందే. -
మంత్రులు తక్షణమే తప్పుకోవాలి : బీజేపీ
నాగపూర్: పాలకుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రులంతా తక్షణమే తమ పదవులకు రాజీనామా చేయాలని బీజేపీ డిమాండ్ చేసింది. సోమవారం జరిగిన శాసనసభ సమావేశంలో ప్రతిపక్ష నాయకుడు ఏక్నాథ్ఖడ్సేతోపాటు, ఆ పార్టీ సభ్యుడు నానాపటోల్లు ఈ అంశాన్ని లేవనెత్తారు. వారంతట వారు తప్పుకోకపోతే ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రులందరినీ తక్షణమే కచ్చితంగా తప్పించాలని డిమాండ్ చేశారు. ఆరోపణలు ఎదుర్కొంటున్నవారిపై కేసు నమోదు చేయాలంటూ జల్గావ్ కోర్టు ఆదేశించిందని ఈ సందర్భంగా వారు గుర్తుచేశారు. అంతటితో ఆగకుండా నినాదాలు చేస్తూ వెల్‌లోకి దూసుకుపోయారు. దీంతో ఉపసభాపతి వసంత్ఫుర్కే సభను పదినిమిషాలపాటు వాయిదా వేశారు. తిరిగి సభా కార్యకలాపాలు ప్రారంభమైన తరువాత బీజేపీ సభ్యులు మరోసారి గందరగోళం సృష్టించారు. దీంతో ఉపసభాపతి రోజంతా సభను వాయిదావేశారు. కాగా జల్గావ్ మిల్క్ గ్రోయర్స్ అసోసియేషన్‌ను జాతీయ డెయిరీ డెవలప్మెంట్ కార్పొరేషన్‌కు బదలాయింపులో రూ. 3.18 కోట్ల మేర కుంభకోణం జరిగిందని బీజేపీ సభ్యులు సోమవారం విడుదల చేసిన ప్రకటనలో ఆరోపించారు.