breaking news
Microscopic
-
ఇండియా చిప్.. ఇంకెప్పుడు?
‘చంద్రయాన్–3’విజయాన్ని కోట్ల మంది భారతీయులు సంబరంగా ఆస్వాదించారు. కానీ అందులోని ఇబ్బందికర వాస్తవాల్ని కొందరే అర్థం చేసుకున్నారు. అదేంటంటే ఉపగ్రహంలోని కీలక ఎల్రక్టానిక్ వ్యవస్థల్లో వాడిన చాలా సెమీకండక్టర్ చిప్‌లు ఇప్పటికీ మన దగ్గర పరిమితంగానే తయారవుతున్నాయి. ఉపగ్రహంలోనే కాదు. మనం వాడే స్మార్ట్ ఫోన్లు... ల్యాప్‌టాప్‌లు.. టీవీలు.. కార్లలో కూడా!. సెమీ కండక్టర్ చిప్ అంటే ప్రతి ఆధునిక యంత్రానికీ మెదడు. చాలా రకాల చిప్‌లను ఇండియా డిజైన్ చేస్తోంది. కానీ తయారు చేయటంలేదు. అందుకే... స్వదేశీ చిప్ మన కల. మరి సాకారానికి ఎన్నేళ్లు పడుతుంది? ఎంతవరకూ వచ్చాం? ఇంకెంత దూరం?సాక్షి, బిజినెస్మనిషి చేసిన అద్భుతం... సెమీకండక్టర్ చిప్. వందల కోట్ల ట్రాన్సిస్టర్లు.. మైక్రోస్కోపిక్ స్విచ్‌లు.. కాంతిని మించిన వేగంతో లెక్కలు.. సైజు మాత్రం వేలిగోటి కన్నా స్వల్పం!. ఇదీ... చిప్ స్వరూపం. భూమి సూర్యుడి చుట్టూ తిరుగుతున్నట్టు డిజిటల్ ప్రపంచం యావత్తూ ఈ చిప్‌ల చుట్టూనే తిరుగుతోంది. చిప్ కనక లేకుంటే ఫోన్లు.. ఇంటర్నెట్.. ఏఐ.. ఎలక్ట్రిక్ వాహనాలు.. శాటిలైట్లు.. ఆధునిక రక్షణ వ్యవస్థలు.. ఏవీ లేనట్టే. టెక్నాలజీకి గుండె లాంటి ఈ చిప్‌లను 21వ శతాబ్దపు ఇంధనంగా ఎకనమిస్టులు పోలుస్తున్నది ఇందుకే. సెమీకండక్టర్ టెక్నాలజీని నియంత్రించే దేశాలకు ఆర్థికంగా, వ్యూహాత్మంగా అత్యంత ప్రాధాన్యమిస్తున్నది కూడా ఇందుకే. ఇండియా వెనకబడిందెక్కడ? భారత్‌లో టెకీల సంఖ్య తక్కువేమీ కాదు. వాళ్లలో ఎన్విడియా, ఇంటెల్, క్వాల్కామ్, ఏఎండీ వంటి చిప్ దిగ్గజాల దగ్గర పనిచేస్తున్న వాళ్లూ ఎక్కువే. పైపెచ్చు చిప్ డిజైన్‌లో ఇండియాకు మంచి పేరుంది. ప్రపంచవ్యాప్తంగా వాడుతున్న అనేక చిప్‌ల డిజైన్‌లో భారతీయుల పాత్ర ఎంతో కీలకం. మరి తయారీ మాత్రం తైవాన్, దక్షిణ కొరియా వంటి దేశాల్లోనే ఎందుకు జరుగుతోంది? నిజానికి చిప్ డిజైన్ కష్టమైనదే. కానీ వాటి తయారీ ఇంకా కష్టం. ఆధునిక సెమీకండక్టర్ ఫ్యాక్టరీ నిర్మించాలంటే ఆ టెక్నాలజీలో దశాబ్దాల అనుభవం కావాలి. బిలియన్ల కొద్దీ డాలర్లు కావాలి. అత్యాధునిక యంత్రాలు.. అత్యంత స్వచ్ఛమైన నీరు.. నిరంతరాయ విద్యుత్... వందలకొద్దీ అనుబంధ పరిశ్రమలు కావాలి. ఎందుకంటే ఒక్క ధూళి కణం కూడా మొత్తం చిప్‌ను దెబ్బతీయగలదు మరి!!. అందుకే అతికొద్ది దేశాలే ఈ తయారీ సామర్థ్యాన్ని సాధించగలిగాయి. కోవిడ్‌తో మారిన పరిస్థితి... కోవిడ్ మహమ్మారి ప్రపంచాన్ని చుట్టేసిన సమయంలో... చిప్‌ల కోసం కొద్దిమందిపై ఆధారపడితే ఎలా ఉంటుందో ప్రతి దేశానికీ తెలిసొచ్చింది. చిప్‌ల కొరతతో ఫ్యాక్టరీలు మూతపడ్డాయి. ఆటోమొబైల్ ఉత్పత్తి ఆగిపోయింది. ఎల్రక్టానిక్స్ దొరకటం కష్టమైంది. దేశాలు కళ్లు తెరిచాయి. అమెరికా చిప్స్ చట్టం తెచ్చింది. యూరప్ సొంత సెమీకండక్టర్ పాలసీలు ప్రకటించింది. చైనా ఒకవంక ఎగుమతులను నియంత్రిస్తూనే పెట్టుబడులు పెంచింది. భారత్ కూడా చిప్‌ల డిజైన్‌కే పరిమితం కాకూడదని నిర్ణయించుకుంది. తయారీలోకి అడుగుపెట్టే ప్రణాళికలు ప్రకటించింది. చిప్‌ల తయారీ రాత్రికిరాత్రే సాధ్యం కాదు కాబట్టే.. ఇండియా దశలవారీగా ముందుకు వెళుతోంది. డిజైన్... తయారీ... ప్యాకేజింగ్... ఎల్రక్టానిక్స్ ఉత్పత్తి అనేవి ఒక్కొక్కటిగా సాధించడానికి ప్రయత్నిస్తోంది. ఎందుకంటే ఈ ప్రక్రియలు ఒకదానికొకటి దన్నుగా నిలుస్తాయి. అడుగులు పడుతున్నాయి... దాదాపుగా అంతర్జాతీయ చిప్ డిజైన్ కంపెనీలన్నిటికీ ఇండియాలో ఇంజనీరింగ్ సెంటర్లున్నాయి. వాటిలోని మన టెకీలు స్మార్ట్ఫోన్లు, ఆటోమొబైల్స్, కమ్యూనికేషన్ పరికరాలు, ఏఐకి ప్రాసెసర్లు డిజైన్ చేస్తున్నారు. కానీ డిజైన్ పూర్తయ్యాక విదేశాల్లో తయారవుతున్నాయి. ఆ తయారీ చిత్రాన్ని మార్చడానికి దేశంలోనే తొలి కమర్షియల్ సెమీకండక్టర్ ఫ్యాబ్రికేషన్ ప్లాంట్‌ను టాటా ఎల్రక్టానిక్స్ సంస్థ గుజరాత్లో నిర్మిస్తోంది. తైవాన్‌కు చెందిన పీఎస్ఎంసీ దీనికి టెక్నాలజీ అందిస్తోంది. ఆటోమొబైల్స్, పారిశ్రామిక యంత్రాలు, కన్జూమర్ ఎల్రక్టానిక్స్‌లో వాడే 28ఎన్ఎం మెచ్యూర్– నోడ్ చిప్స్‌ను తయారు చేస్తారు. దీంతోపాటు టాటా సంస్థ అస్సాంలో సెమీకండక్టర్ ప్యాకేజింగ్ ప్లాంట్‌నూ నిర్మిస్తోంది. అంటే గుజరాత్లో తయారయ్యే చిప్‌లను అస్సాంలో ప్యాకింగ్ చేస్తారన్న మాట. గుజరాత్‌లోనే అమెరికా మెమొరీ చిప్స్ దిగ్గజం మైక్రాన్ కూడా భారీ ప్లాంట్ నిర్మిస్తోంది. ఇక్కడ మైక్రాన్ సంస్థ సిలికాన్ వేఫర్స్ తయారీ బదులు వాటి అసెంబ్లీ, టెస్టింగ్, ప్యాకేజింగ్ చేసి విదేశాలకు ఎగుమతి చేస్తుంది. చెన్నైకి చెందిన ‘సీజీ పవర్’కూడా జపనీస్ కంపెనీ రెనెసాస్ ఎలక్ట్రానిక్స్, థాయ్‌లాండ్ సంస్థ స్టార్స్ మైక్రోతో జట్టుకట్టి గుజరాత్లో చిప్ ‘ఓశాట్’ప్లాంట్‌ను నిర్మించింది. చిప్‌ల టెస్టింగ్, ప్యాకేజింగ్ వంటివి చేసే ఈ ప్లాంట్‌లో వాణిజ్య ప్రాతిపదికన ఉత్పత్తి ఇప్పటికే ఆరంభమైంది. మరోవైపు చైనా దిగ్గజం ఫాక్స్‌కాన్‌తో హెచ్‌సీఎల్ సంస్థ జట్టుకట్టి... డిస్ప్లే డ్రైవర్ చిప్స్ తయారీ ప్లాంటును నిర్మిస్తోంది. ఆటోమొబైల్స్, స్మార్ట్ఫోన్లు, టీవీల్లోని డిస్ప్లే స్క్రీన్లను ఈ చిప్‌లు నియంత్రిస్తాయి. డబ్బుకన్నా... టెక్నాలజీ ముఖ్యం భారత్‌లో సెమీకండక్టర్ ఫ్యాబ్ తయారీ చేపడతామని గతంలోనే వేదాంతా గ్రూప్– ఫాక్స్‌కాన్ ప్రకటించాయి. కానీ వారికి సరైన టెక్నాలజీ భాగస్వామి దొరకలేదు. దీంతో ఫాక్స్‌కాన్ తప్పుకుంది. ప్రాజెక్టు మూలనపడింది. నిజానికి సెమీకండక్టర్ ఫ్యాక్టరీకి డబ్బులకన్నా టెక్నాలజీ ప్రధానం. పెట్టుబడులు ఎలాగైనా వస్తాయి. కానీ టెక్నాలజీ మాత్రం కొందరి దగ్గరే ఉంది. ఉదాహరణకు చిప్‌ల తయారీకి అవసరమైన డిజైన్ సాఫ్ట్‌వేర్‌లో (ఈడీఏ టూల్స్) కెడెన్స్, సినాప్సిస్, సీమెన్స్ వంటి అతికొద్ది సంస్థలదే ఆధిపత్యం.తయారీకి అత్యంత కీలకమైన లిథోగ్రఫీ యంత్రాలను నెదర్లాండ్స్‌కు చెందిన ఒక్క ఏఎస్ఎంఎల్ సంస్థే తయారు చేస్తోంది. తైవాన్‌కు చెందిన టీఎస్ఎంసీ, దక్షిణ కొరియాకు చెందిన శామ్సంగ్ వంటి సంస్థలు తయారీ ప్రక్రియలో పట్టు సా«ధించడానికి కొన్ని దశాబ్దాలు శ్రమించాయి. మరి ఇంత క్లిష్టమైన టెక్నాలజీని రాత్రికి రాత్రే కొనుగోలు చేయాలంటే సాధ్యమా? అందుకే భారత్ ఈ ప్రక్రియను సొంతంగా ఆది నుంచీ మొదలుపెట్టడం... పునరావిష్కరించడం వంటి ప్రయత్నాలు చెయ్యకుండా అంతర్జాతీయ దిగ్గజాలతో జట్టుకడుతోంది. భారత్‌లో ‘చిప్’తయారవుతుందా? నిజానికి భారత్‌లో చిప్ తయారు చేయడానికి, దాన్ని ‘భారతీయ చిప్’అనడానికి చాలా తేడా ఉంది. విదేశీ టెక్నాలజీతో... విదేశీ సంస్థల భాగస్వామ్యంతో... వాటి లైసెన్సింగ్ ఒప్పందాల ప్రకారమే దేశంలో తొలుత చిప్‌లు తయారయ్యే అవకాశం కనిపిస్తోంది. ఇదేమీ అసహజం కాదు కూడా. ఎందుకంటే భారత్‌లో తొలి మారుతీ కారు తయారయ్యింది సుజుకీ సంస్థ టెక్నాలజీతోనే. ఏళ్లు గడుస్తున్న కొద్దీ భారత ఇంజనీరింగ్ సామర్థ్యాలు పెరిగాయి. టాటా మోటార్స్, మహీంద్రా వంటి దేశీ సంస్థలు కూడా కార్ల తయారీలోకి ప్రవేశించాయి. ఇపుడు భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద ఆటోమొబైల్ ఉత్పత్తిదారులలో ఒకటిగా ఎదిగింది. సెమీకండక్టర్ పరిశ్రమ కూడా ఇదే తరహాను అనుసరించే అవకాశముంది. ఎందుకంటే సెమీకండక్టర్ వ్యవస్థను నిర్మించడానికి తైవాన్ దాదాపుగా నాలుగు దశాబ్దాలు శ్రమించింది.వేల మంది సప్లయర్లు, యంత్రాల తయారీదారులు, కెమికల్ కంపెనీలు, పరిశోధక సంస్థలు సహకరించడం వల్లే ఇది సాధ్యమైంది కూడా. భారత్ ఇపుడు తన ప్రయాణాన్ని ప్రారంభించింది. కానీ అవకాశాలైతే అపారం. ఏఐ, ఎలక్ట్రిక్ వాహనాలు, 5జీ, రోబోటిక్స్, ఆధునిక రక్షణ వ్యవస్థలకు రానున్న దశాబ్దాల్లో వందల కోట్ల అదనపు చిప్‌లు అవసరమవుతాయి. డిమాండ్ పెరుగుతూనే ఉంటుంది. ఒకవేళ భారత్ డిజైన్– తయారీ– ప్యాకేజింగ్– రీసెర్చ్‌లతో కూడిన పూర్తిస్థాయి చిప్ ఇన్ఫ్రాను నిర్మించగలిగితే అది ప్రపంచంలో అత్యంత ప్రధానమైన టెక్నాలజీ హబ్‌గా మారుతుంది. ఇదీ... రోడ్ మ్యాప్ ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులు పూర్తయితే... భారతదేశంలో 2027–28లో సెమీకండక్టర్ల తయారీ వాణిజ్యపరంగా మొదలయ్యే అవకాశముంది. అది కేవలం ఆరంభమే. అంతర్జాతీయ సంస్థలతో పోటీపడే స్థాయిలో సెమీకండక్టర్ పరిశ్రమను నిర్మించాలంటే మరో దశాబ్దానికి పైనే పడుతుంది. కాకపోతే తొలిసారిగా భారత్ ఈ రంగంలో వీక్షకుడి స్థాయి నుంచి ఆటగాడి స్థాయికి చేరుకుంది. ట్రాక్‌పై అడుగుపెట్టింది. అనుకున్నట్లుగా అన్నీ జరిగితే త్వరలోనే ఫోన్లమీదే కాకుండా ఫోన్లలోని చిప్‌పై కూడా ‘మేడిన్ ఇండియా’అని చూడొచ్చు. -
డాక్టర్ రోబో..! ఎంత దూరం నుంచైనా..
మనిషి నిర్మించిన యంత్రాల్లో అద్భుతమైనదీ, మానవుడికి ఇప్పుడు దాదాపుగా ప్రత్నామ్నాయం లాంటిది ‘రోబో’. అప్పట్లో కేవలం సైన్స్ ఫిక్షన్లా ఉన్న ‘ రోబో’లు ఇప్పుడు మానవ దేహ నిర్మాణానికి ఉండే పరిమితులను అ«ధిగమించి పనిచేస్తున్నాయి. దాంతో కొన్ని సమయాల్లో ఫిక్షన్కూ, వాస్తవానికీ మధ్య ఉండే సన్నటి రేఖ కూడా చెరిగిపోయిందా అనిపిస్తుంటుంది. ఎందుకంటే మానవుడు చేయడానికి కొంత ఇబ్బంది పడేవీ, లేదా పూర్తిగా చేయలేకపోయే ఎన్నింటినో ‘రోబో’ అలవోకగా చేసేస్తుంది.అందులో సర్జరీలూ ఉండటం విశేషం. సర్జరీలో మనిషి చేయి కొన్ని సంక్లిష్టమైన చోట్లకు చేరడం సాధ్యం కాకపోవచ్చు. కానీ ‘యంత్రుడి’ వేళ్లు అలాంటి చోట్లకూ చేరగలవు. నిజానికి ఈ పనులు రోబో చేస్తున్నట్టు అనిపించినా మళ్లీ వాటిని నిజానికి చేసేది నిపుణులైన శస్త్రచికిత్సకులే. కొన్ని కష్టసాధ్యమైన శస్త్రచికిత్సల్ని రోబోలు ఎలా చేస్తున్నాయో, ఏయే వైద్యవిభాగాల్లోని ఏయే శస్త్రచికిత్సలు జరుగుతున్నాయో తెలపడంతో పాటు రోబోలకు సంబంధించి అనేక అంశాలను ఈ కథనంలో చూద్దాం.రోబోటిక్ టెలీ సర్జరీతో వైద్యరంగంలో కొత్త అధ్యాయం ఈ రోబో శస్త్రచికిత్సలని చెప్పవచ్చు. ప్రస్తుతం రోబోటిక్ టెలీ సర్జరీ ప్రపంచ వైద్యరంగంలో విప్లవాత్మక సాంకేతికతగా గుర్తింపు పొందుతోంది. అమెరికాలో దాదాపు పదేళ్ల క్రితమే ఈ విధానం ప్రయోగాత్మకంగాప్రారంభమైంది. యుద్ధరంగంలోని సైనికులకు నేరుగా వెళ్లి శస్త్రచికిత్స చేసే అవకాశం ఉండకపోవడంతో... సమరరంగంలో ఉన్నవారికీ సర్జరీలు చేసే ఉద్దేశంతో మొదలైన ఈ ప్రయోగాత్మక శస్త్రచికిత్సలు ఇప్పుడు పూర్తిస్థాయిలో అవసరమైన బాధితులకు అందుతున్నాయి.మన భారతదేశంలో మాత్రం గత మూడేళ్లుగా ఈ సాంకేతికత మరింత వేగంగా అభివృద్ధి చెందుతూ, వైద్య సేవలను మరింత మందికి అందునా సుదూరప్రాంతాల్లోని పేషెంట్స్‌కు పెద్ద పెద్ద నగరాల్లో ఉండే అత్యంత నిపుణులైన శస్త్రచికిత్సల నైపుణ్యాలను అందుబాటులోకి తీసుకువస్తోంది. మన ఇండియా వంటి విశాలమైన దేశంలో, ఒక రాష్ట్రంలో ఉన్న నిపుణులైన వైద్యులు మరో రాష్ట్రంలో ఉన్న పేషెంట్లకు ప్రత్యక్షంగా అక్కడికి వెళ్లకుండానే రోబోటిక్ టెలీ సర్జరీ ద్వారా శస్త్రచికిత్సలు చేయగలగడం ఈ సాంకేతికత తాలూకు ప్రధాన ప్రయోజనం. దీంతో నాణ్యమైన వైద్య సేవలు దూర ప్రాంతాల రోగులకు కూడా అందుబాటులోకి వస్తున్నాయి.భారతదేశంలో రోబోటిక్ టెలీ సర్జరీకి శ్రీకారం చుట్టిన వారిలో డాక్టర్ సుధీర్ శ్రీవాత్సవ ప్రముఖులు. ఆయన ఢిల్లీలోని ఒక ఆసుపత్రి నుంచి మరో ఆసుపత్రికి దూర నియంత్రణ ద్వారా తొలి గుండె బైపాస్ శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించారు. తర్వాత కిడ్నీ, ప్రోస్టేట్ తదితర సంక్లిష్ట శస్త్రచికిత్సలు కూడా ఈ విధానంలో విజయవంతంగా నిర్వహితమయ్యాయి.ఈ రంగంలో మరో ముఖ్యమైన మైలురాయిగా డా. చంద్రమోహన్ వడ్డి (ప్రస్తుత ఈ కథన / ఆర్టికల్) రచయిత కూడా ఢిల్లీలోని రోబోటిక్ కన్సోల్ నుంచి హైదరాబాద్‌లో ఉన్న కేవలం 16 నెలల చిన్నారికి ప్రపంచంలోనే అత్యంత చిన్న వయస్సులో రోబోటిక్ టెలీ సర్జరీని విజయవంతంగా నిర్వహించారు. ఈ విజయం తాలూకు కేసు వివరాలు ఇటీవల ఇండియన్ జర్నల్ ఆఫ్ యూరాలజీలో ప్రచురితమయ్యాయి.అటు తర్వాత దేశంలోని పలుప్రాంతాల మధ్య, అలాగే ఒక దేశం నుంచి మరో దేశానికి కూడా రోబోటిక్ టెలీ సర్జరీలు విజయవంతంగా నిర్వహితమవుతున్నాయి. ఇటీవల చైనా నుంచి హైదరాబాద్‌లోని పేషెంట్కూ టెలీ సర్జరీ నిర్వహించడం ఈ సాంకేతికత ప్రపంచవ్యాప్తంగా ఎంత వేగంగా విస్తరిస్తోందో తెలియజేస్తోంది. భవిష్యత్తులో రోబోటిక్ టెలీ సర్జరీ ద్వారా దూరప్రాంతాల్లోని రోగులకు అత్యున్నత స్థాయి వైద్య సేవలను వేగంగా, సురక్షితంగా అందించడానికి విస్తృత అవకాశాలు ఉన్నాయని వైద్య నిపుణులు అభిప్రాయం.ఇటీవలి చైనా కేస్ స్టడీ : ఇటీవలే మన భారతీయ డాక్టర్ ఒకరు చైనా నుంచి దాదాపుమూడు వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న మన హైదరాబాద్‌లోని పేషెంట్‌కు రోబో సహాయంతో శస్త్రచికిత్స చేశారు. దాదాపు 90 నిమిషాల పాటు నిర్వహించిన ఈ సర్జరీలో సుదూరంలో ఉన్న ఊహాన్ నగరంలోని టాంగ్జీ హాస్పిటల్లోంచి... దేశ దేశాంతరాలు దాటి మరీ మన హైదరాబాద్‌లోని పేషెంట్‌కు శస్త్రచికిత్స చేయడం... ఆ చేసిన వైద్యుడు కూడా డాక్టర్ సయ్యద్ మొహమ్మద్ గౌస్ అనే మన భారతీయ డాక్టర్ కావడం మన దేశవాసులందరికీ గర్వకారణమైన విషయం. అల్ట్రాఫాస్ట్ 5జీ ఇంటర్నెట్ కనెక్టివిటీతో జరిగిన ఈ సర్జరీ చేసింది. మన ఖ్యాతిని ఇనుమడింపజేసిన ఈ విషయాన్ని భారత్‌లోని చైనా ఎంబసీ స్పోక్స్‌పర్సన్ యూ జింగ్ తన ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు. ‘‘3000 కిలోమీటర్ల దూరంలోని హైదరాబాద్ పేషెంట్‌కు 5జీ టెక్నాలజీ సహాయంతో సరిహద్దులను అధిగమించి జీవితాన్ని రక్షించే వైద్య సహాయం అందించడం ఓ అద్భుతం’’ అని ఆమె ‘ఎక్స్’లో ప్రస్తావించారు.ఆపరేషన్‌కు ముందర ఇక్కడ హైదరాబాద్‌లో కూడా డాక్టర్లు అవసరమైన ఉపకరణాలను, హై–డెఫినిషన్ కెమెరాలను సిద్ధం చేసుకోవడం వంటి పనులు చేశాక... అక్కడ వూహాన్‌లోని టాంగ్జీ హాస్పిటల్లో డాక్టర్ గౌస్ శస్త్రచికిత్స మొదలు పెట్టగానే ఇక్కడి రోబోటిక్ హస్తాలు శస్త్రచికిత్స చేయాల్సిన భాగాన్ని 3–డీ చిత్రాల్లో చూస్తూ తమ పనులు పూర్తి చేశాయి. హైస్పీడ్ 5జీ నెట్వర్క్ కావడంతో కేవలం 200 మిల్లీసెకండ్స్లోనే డాక్టర్ ఆజ్ఞలు పేషెంట్‌కు చేరి సజావుగా సర్జరీ జరగడంతో పాటు అది విజయవంతమూ అయ్యింది. అయితే సమాంతరంగా ఇక్కడ హైదరాబాద్‌లో కూడా ఏదైనా ఎమర్జెన్సీ అవసరమైతే రంగంలోకి దూకడానికి సిద్ధంగా డాక్టర్లంతా శస్త్రచికిత్స జరుగుతున్నంత సేపూ అప్రమత్తంగా అక్కడే ఉన్నారు.‘ద ఇంటర్నేషనల్ హెపాటో ΄్యాంక్రియాటో బిలియరీ అసోసియేషన్’, చైనీస్ చాప్టర్ ఆధ్వర్యంలో నిర్వహించిన 26 డెమాన్స్ట్రేషన్స్లో ఈ శస్త్రచికిత్స కూడా ఒకటి. ఇందులో లైవ్‌గా శస్త్రచికిత్స చేసి చూపినవారిలో... భారత్, బ్రెజిల్, జార్జియా, గ్రీస్, ఉజ్బెకిస్తాన్ దేశాల నుంచి వచ్చిన వైద్యనిపుణులున్నారు.చూడగలిగే రేంజ్ కూడా ఎక్కువే... రోబో చేతుల సహాయంతో సర్జరీ చేస్తున్నప్పుడు... డాక్టర్ తాను శస్త్రచికిత్స నిర్వహిస్తున్న అవయవాన్నీ, అందులోని భాగాల్నీ (ఫీల్డ్‌ను) 3–డీ ఇమేజ్‌లో తెరపై స్పష్టంగా చూస్తుంటారు. ఆ వర్చువల్ ఇమేజ్ చాలా పెద్దగా, స్పష్టంగా ఉండటంతో అక్కడి నరాలూ, రక్తనాళాలు చాలా పెద్దగా (మాగ్నిఫికేషన్‌తో) కంటికి కనిపిస్తుంటాయి. ఈ అంశం కూడా సాంప్రదాయికమైన శస్త్రచికిత్స కంటే రోబో చేసే సర్జరీని మరింత ప్రత్యేకంగా నిలుపుతుంది. అంటే... సంప్రదాయ శస్త్రచికిత్సలో సదరు అవయవభాగం కాస్త వెనక ఉంటే అది స్పష్టంగా కనిపించక... తెగకూడని భాగం ప్రమాదవశాత్తూ తెగేందుకు అవకాశం ఉంటే ఉండవచ్చుగానీ... చాలా ఎక్కువ మాగ్నిఫికేషన్‌తో అన్ని అవయవాలూ, నరాలూ, రక్తనాళాలూ కనిపిస్తున్నప్పుడు మరి దేన్నీ టచ్ చేయకుండా కేవలం కోయాల్సిన భాగంలోనే కోత పడటమూ, రక్షించాల్సిన అవయవాలకు ఏమాత్రం దెబ్బతగలకుండా చూసుకోవడం సాధ్యమవుతాయి.స్పష్టత ఎక్కువ... మెరుగుదలా ఎక్కువే... సంప్రదాయ శస్త్రచికిత్సలో నేరుగా చూసేవాటితో పోలిస్తే... ఇక్కడ రోబోటిక్ శస్త్రచికిత్సలో.... డాక్టర్లు తాము తొలగించాల్సిన హానికరమైన చిన్న కణుతుల్నీ, గడ్డలనూ... లేదా కుట్లు వేయాల్సిన అత్యంత సన్నటి సూచర్స్ వంటి వాటిని (అంటే కొన్నిసార్లు పెన్సిల్లోపలి లెడ్ కంటే సన్నటి రక్తనాళాల్నీ, అలాంటి అవయవాల్ని) స్పష్టంగా చూడగలుగుతుంటారు. దాంతో తాము చేయాల్సిన పనుల్ని నైపుణ్యంతో మరిత సమర్థంగానూ చేయగలుగుతారు. ఇక్కడ నిశితత్వం కూడా ఎక్కువే. అంటే ఉదాహరణకు తొలగించాల్సిన కణజాలాన్ని అత్యంత ఖచ్చితంగా అవసరమైనంత మేరకే తొలగించవచ్చు. అదే నేరుగా మనిషి చేతితో చేసే శస్త్రచికిత్సల్లో హానికర కణజాలాన్ని మళ్లీ పెరగకుండా నివారించేందుకు కొంత ఆరోగ్యకరమైన కణజాలాన్నీ తొలగించాల్సి రావచ్చు. కానీ రోబో సాయంతో అదెంతో ఆక్యురేట్‌గా జరుగుతుంది. కాబట్టి మున్ముందు హానికర కణజాలం మళ్లీ పెరగకుండా ఉండేందుకే అవకాశాలు మరింత ఎక్కువగా ఉంటాయి. ఎందుకు మరింత సురక్షితమంటే... కోత చాలా చిన్నగా, ఖచ్చితంగా ఉండటంవల్ల కోలుకునే సమయం తగ్గుతుంది. గాయమూ వేగంగా మానుతుంది. కోతా, గాయం తక్కువ కావడం వల్ల ఇన్ఫెక్షన్కు అవకాశాలు బాగా తక్కువ. అంతేకాదు... సర్జరీకి పట్టే సమయమూ, అవసరమైన మత్తుమందూ, రక్తస్రావం... ఇఅన్నీ తక్కువే. దాంతో శస్త్రచికిత్స మరింత సురక్షితం కావడంతో కోలుకోవడమూ చాలా వేగంగా జరుగుతుంది.ఏయే శాఖల్లో ఏయే శస్త్రచికిత్సలు? మొదట్లో రోబో సహాయంతో నిర్వహించే శస్త్రచికిత్సలు... మెదడు వంటి కీలకమైన, సున్నితమైన ప్రదేశాల్లో చాలా లోతుగా ఉండి, మానవ హస్తంగా అంత తేలిగ్గా చేరలేని భాగాల్లోనే జరిగేవి. ఉదాహరణకు... మెదడు కణితి తొలగింపు చికిత్సల్లో ట్యూమర్ చాలా స్పష్టంగా కనిపిస్తుంటే... చిన్న రంధ్రంనుంచి అత్యంత నిశితంగా, ఎంతో నైపుణ్యంతో శస్త్రచికిత్స నిర్వహించడానికి రోబో చక్కగా సహాయపడుతుంది. బాధితులు త్వరగా కోలుకుంటారు. అలాగే మూర్ఛవ్యాధికి సాధారణంగా మందులతోనే చికిత్స జరుగుతుంది. అయితే ఎంతకీ తగ్గని కేసుల్లో అత్యంత సునిశితంగా శస్త్రచికిత్స నిర్వహించడానికి రోబో సహాయం తీసుకోవడం వల్ల సర్జరీ మరింత ఎక్కువ సురక్షితంగా జరుగుతుంది.అయితే... వైద్యశాస్త్ర విజ్ఞానం పెరుగుతున్న కొద్దీ రోబోల సర్జరీలు ఇప్పుడు రకరకాల వైద్యవిభాగాల్లోకి విస్తరించాయి. ఉదాహరణకు సంయుక్తంగా మొత్తం మూత్ర వ్యవస్థ (యూరో, నెఫ్రో, గైనిక్) విభాగాలతో పాటు ఇంకా అనేక విభాగాల్లో రోబో సహాయంతో శస్త్రచికిత్సలు జరుగుతున్నాయి. రోబోలు శస్త్రచికిత్సలు నిర్వహిస్తున్న దేహ వ్యవస్తలూ... ఆ వ్యవస్థల్లో ఏయే శస్త్రచికిత్సలను అవి నిర్వహిస్తున్నాయో చూద్దాం.ఇతరత్రా విభాగాల్లోని శస్త్రచికిత్సలివి... ∙విపుల్ ప్రొసీజర్ : పాంక్రియాస్ (క్లోమం)లోని ‘హెడ్’ అనే భాగాన్నీ, అలాగే చిన్నపేగుల్లోని ‘డియోడినమ్’ అనే భాగాన్ని, గాల్‌బ్లాడర్‌ను (పిత్తాశయాన్ని), బైల్ డక్ట్‌ను తొలగించే శస్త్రచికిత్సను ‘పాంక్రియాటికో–డియోడనెక్టమీ’ అంటారు. ఇది చాలా సంక్లిష్టమైన ప్రక్రియ. ఆయా భాగాల్లోని గడ్డల తొలగింపుతో పాటు... పాంక్రియాస్, చిన్నపేగులు, గాల్‌బ్లాడర్‌లోని కొన్ని జబ్బులు (డిజార్డర్స్)లో ఇది ఉపయోగపడుతుంది. ఉదాహరణకు క్రానిక్ పాంక్రియాటైటిస్, డియోడనల్ ట్రామా వంటి చికిత్సల్లో ఎంతో బాగా ఉపయోగపడుతుంది.థైరాయిడెక్టమీ..క్యాన్సర్‌కు గురైన థైరాయిడ్‌ను తొలగించడానికి చేసే సంప్రదాయ శస్త్రచికిత్స తర్వాత మెడ చుట్టూ గీత కనిపిస్తుంది. కానీ రోబో చేసే శస్త్రచికిత్స తర్వాత ఎలాంటి గీతా ఉండదు. అందంగా కనిపించాలని కోరుకునే యువతీ యువకులకూ / పెళ్లి కావాల్సిన యువతకు కాస్మటిక్‌గా ఇదో వరం.భవిష్యత్ ఆశారేఖగా ‘మైక్రో–రోబో’ చికిత్స! సెకండరీ నిమోనియా ఇన్ఫెక్షన్స్ చాలా ప్రమాదకరమైనవి. ఇవి ఎంతటి ప్రమాదాన్ని తెచ్చిపెడతాయన్నది డాక్టర్లతో పాటు చాలామంది పేషెంట్లకూ తెలిసిన విషయమే. తొలుత వచ్చిన ఇన్ఫెక్షన్ కారణంగా అటు తర్వాత ఊపిరితిత్తుల్లో నిమోనియా వస్తే దాన్ని ‘సెకండరీ నిమోనియా ఇన్ఫెక్షన్’ అంటారు. నేరుగా వచ్చే నిమోనియా కంటే దీంతో ప్రమాదం చాలా ఎక్కువ.ఇలాంటి ప్రమాదకరమైన నిమోనియాకి చాలా చాలా చిన్నవైన మైక్రోస్కోపిక్ ‘రోబో’లతో కొంతకాలం కిందట వైద్య పరిశోధకులు ఎలుకల్లో ఓ ప్రయోగాత్మకమైన చికిత్స నిర్వహించారు. అతి చిన్న ఆల్గైలను (పాచిలాంటి మొక్కలను) సేకరించి మైక్రోస్కోపులో చూస్తే తప్ప కనిపించనంతటి ఆ చిన్న చిన్న జీవమున్న మొక్కలపై ‘యాంటీబయాటిక్ నానోపార్టికిల్స్’ను పైపూతగా పూశారు. ఈ పూత... ఇన్ఫెక్షన్లను సమూలంగా నిర్మూలించే తెల్లరక్తకణాల్లోని ‘న్యూట్రోఫిల్స్’.వాటినే ఓ పూతలా పూసి నిమోనియాతో బాధపడుతున్న ఎలుకల ఊపిరితిత్తులోకి ఈ సజీవ ‘మైక్రో–రోబో’లను పంపారు. జీవమున్న ఈ మైక్రో రోబోలకు ‘మైక్రోబో’ (మైక్రో + రోబో = మైక్రోబో) అని పేరు పెట్టారు. యాంటీబయాటిక్ నానోపార్టికిల్స్ పూత ఉన్న ఈ ‘మైక్రోబో’లు ఊపిరితిత్తుల్లో కదులుతూ, ఈదులాడుతూ నిమోనియాకు కారణమైన అతి చిన్న సూక్ష్మజీవులను తుదముట్టించాయి. నిమోనియా వచ్చిన కేసుల్లో చాలావరకు ‘సూడోమొనాస్ ఆరిజినోసా’ అనే అత్యంత సూక్ష్మజీవులు ఇన్ఫెక్షన్ను కలిగించి, బాధితుల మరణానికి కారణమవుతుంటాయి.ఈ సూడోమొనాస్ ఆరిజినోసా మైక్రోబ్స్ కారణంగా నిమోనియా ఇన్ఫెక్షన్ గురైన వాటిల్లోని సగం ఎలుకల్లోకి ఈ మైక్రోబోలను పంపి, మరో సగానికి పంపకుండా వదిలేశారు. మైక్రో రోబోలు పంపిన ఎలుకలన్నీ బతికాయి. మిగతావి మూడు రోజుల్లో చనిపోయాయి. ఈ ప్రయోగ ఫలితాలు ‘నేచర్ మెటీరియల్స్’ అనే మెడికల్ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. ఇలాంటి పరిశోధనల ఫలితాలను బట్టి చూస్తే... భవిష్యత్తులో మరింత సూక్ష్మాతి సూక్ష్మమైన ప్రక్రియల నిర్వహణకు మైక్రో రోబోలు ఎలా పనిచేయగలవో అన్నది ఊహించవచ్చు. ఇది ప్రయోగదశలో ఉన్న మున్ముందు సాకారం కాబోయే చికిత్స ప్రక్రియ.మానవ హస్తం కంటే రోబోతో సర్జరీలు కొంత ఈజీ... ఎందుకంటే... మానవ మణికట్టును అటు ఇటు తిప్పి చూసినప్పుడు కొంతవరకే తేలిగ్గా తిరగగలుగుతుంది. అయితే ఓ రోబో మణికట్టు మాత్రం ఎటువైపైనా దాదాపు 270 డీగ్రీల వరకు తిరిగేలా రూపొందిస్తారు. ఇక రోబో చేతులూ, వేళ్లూ సన్నగా, బాగా పొడుగ్గా ఉంటాయి. దాంతో సన్నటి ఇరుకైన చోట్లకు కూడా చేరగలుగుతాయ. అంతేకాదు... వాటికి అందించిన ఆదేశాల మేరకు ముందుగా నిర్దేశించిన మేరకు మాత్రమే కోసేలా... ఖచ్చితంగా అంతే గాటు పెట్టేలా చూస్తాయి. ఇలా మానవహస్తానికి కష్టసాధ్యమైన శస్త్రచికిత్స ప్రక్రియల్ని రోబో సహాయంతో డాక్టర్లు చేయగలుగుతారు.మూత్ర / గైనిక్ వ్యవస్థలో ... ∙మూత్రపిండాల శస్త్రచికిత్సలో : మూత్రపిండం నుంచి మూత్రాశయానికి (బ్లాడర్‌కు) మూత్రం తీసుకొచ్చే పైపులు... యురేటర్లలో ఏవైనా అడ్డంకులు ఏర్పడినప్పుడు ‘పైలో΄్లాస్టీప్రొసిజర్’ అనే శస్త్రచికిత్సతో దాన్ని చక్కదిద్దవచ్చు. (ఉదాహరణకు యురేటరో–పెల్విక్ జంక్షన్లో అడ్డంకి. దీన్నే యూపీజే అబ్స్టక్షన్ అని అంటారు). అలాగే మూత్రపిండాల్లో ఏర్పడ్డ గడ్డల (రీనల్ ట్యూమర్స్) తొలగింపు, కిడ్నీని పూర్తిగా తొలగించడానికి చేసే నెఫ్రెక్టమీ వంటి చికిత్సల్లో రోబోలు బాగా ఉపయోగపడతాయి.ప్రోస్టెక్టమీ :ప్రోస్టేట్ గ్రంథిని తొలగించే శస్త్రచికిత్సలో..గైనకాలజీలో: గర్భసంచికీ... అలాగే గర్భాశయ ముఖద్వారంలో క్యాన్సర్ (ప్రీ–మెలిగ్నెంట్ సర్విక్స్ అండ్ యుటెరస్) వచ్చే అవకాశముందని తెలిసినప్పుడు; ఫైబ్రాయిడ్, అడినోమయోసిస్ వంటి గడ్డల తొలగింపులో; ఎండోమెట్రియాసిస్ కేసుల్లో సమస్యాత్మకమైన / వ్యాధికి గురైన భాగాలను తొలగించడానికి రోబోలు చక్కగా ఉపయోగపడతాయి. మామూలుగా ఇలాంటి సమస్య ఉన్నప్పుడు బాధితుల్లో రుతుస్రావం సరిగా రాకపోవడం, తీవ్రమైన నొప్పి వంటి సమస్యలు ఎక్కువ. రోబో శస్త్రచికిత్సలతో వాటిని తేలిగ్గా సరిదిద్దవచ్చు. యుటెరస్ పెద్దదిగా ఉన్నప్పుడు రోబో చేసే శస్త్రచికిత్సతో తేలిగ్గా తొలగించవచ్చు. మరీ ముఖ్యంగా ఎండోమెట్రియమ్ శస్త్రచికిత్సలో అడ్హెషన్స్ వచ్చినప్పుడు (ఒక అవయవంలో ఒక భాగం ఇతర శరీర అవయవ భాగాలకు అతక్కుపోవడం) అది సర్జన్లకు ఓ సవాలుగా మారుతుంది. రోబో చేతులు వాటిని తేలిగ్గా విడదీస్తాయి.యూరో–గైనకాలజీ శస్త్రచికిత్సల్లో: పొత్తికడుపు కింది భాగంలోని అవయవాలు చాలా దగ్గరదగ్గరగా ఉంటాయి. అవి మరో అవయవంలోకి చొచ్చుకునిపోయి (హెర్నియా కేసులతో) బాధించేప్పుడు చేసే సాక్రోకాల్పోపెక్సీ చేయడానికీ; అలాగే దగ్గినప్పుడూ, ఒత్తిడికి గురైనప్పుడు తమ ప్రమేయం లేకుండా బాధితుల్లో మూత్రం పడిపోయే కేసుల్లో చేసే కాల్పోసస్పెన్షన్ప్రొసీజర్లలో, ఫిస్టులా రిపేర్ల వంటి కేసుల్లో సర్జరీ కాంప్లికేషన్లను తగ్గించేందుకు రోబోలు ఎక్కువగా సహాయపడుతుంటాయి.భవిష్యత్తులో మరింత చవగ్గా... ఇప్పుడు చాలా చోట్ల అమెరికన్ తయారీ రోబోలు ఉపయోగంలో ఉన్నాయి. ఇవి బాగా ఖరీదు కావడంతో ఈ శస్త్రచికిత్సలూ కాస్త ఖరీదే. అయితే భారతీయ రోబోలు అతి వేగంగా అందుబాటులోకి రానున్నాయి. ఎస్ఎస్ఐ మంత్ర ఇలాంటి వాటిల్లో ఒకటి. ఇవి అమెరికన్ రోబోల ఖరీదులో సగానికే దొరుకుతాయి. ఫలితంగా అవి అందుబాటులోకి వస్తే ఇప్పటివరకూ అడ్వాన్స్డ్గా పరిగణిస్తున్న లాపరోస్కోపీ సర్జరీల స్థానంలో ఇవి... అన్ని వర్గాల ప్రజలకూ అందుబాటులోకి వచ్చే అవకాశముంది. అందునా చాలా చవగ్గా కూడా.- డా. వి. చంద్రమోహన్, సీనియర్ యూరో సర్జన్. నిర్వహణ: యాసీన్ -
ప్రపంచంలోనే అత్యంత చిన్న కెమెరా.. సైజ్ ఎంతో తెలుసా?
సాధారణంగా మనం రోజూ వాడే ఫోన్లలో ఉండే కెమెరాలే మనకు కనిపించే అతి చిన్న కెమెరాలు కదా. వాటి సైజు ఎంతుంటుంది.. పప్పు గింజంత. కానీ కంటికి కనిపించీ కనిపించని పరిమాణంలో కెమెరాను చూసుంటారా? ప్రిన్స్టన్ యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్ శాస్త్రవేత్తలు తయారుచేసి చూపించారు. మనం వాడే సన్నరకం ఉప్పులోని రేణువంత పరిమాణంలో ఉండే కెమెరాను రూపొందించి ‘వావ్’ అనిపించారు. సాధారణ కెమెరాలు తీస్తే ఫొటోలు కలర్ఫుల్గా, స్పష్టంగా ఎలా వస్తాయో ఆ స్థాయిలో తీసేలా ఈ అర మిల్లీమీటర్ కెమెరాను రూపొందించారు. ఎలా తయారు చేశారు? ఈ కెమెరా తయారీకి అర మిల్లీమీటర్ పరిమాణంలోని గ్లాస్ లాంటి ‘ ఆప్టికల్ మెటాసర్ఫేస్’ను వాడారు. సాధారణ కెమెరాల్లో సూర్యకాంతిని అదుపుచేయడానికి గాజు లేదా ప్లాస్టిక్ లెన్సులు వాడతారు. మరి ఈ చిన్న కెమెరాలో ఏం వాడి ఉంటారు? అంటే.. హెచ్ఐవీ వైరస్ సైజులో ఉండే స్తూపాకార పరికరాలు (సిలిండ్రికల్ పోస్ట్స్) 16 లక్షలు ఉపయోగించారు. అసలే కంటికి సరిగా కనిపించనంత సైజులో ఉన్న ఈ అతి చిన్న కెమెరాలోనూ సిలిండ్రికల్ పోస్టులను అద్భుతంగా అమర్చారు. చదవండి: హోండూరస్ తొలి మహిళా అధ్యక్షురాలిగా షియోమరా చిన్న కెమెరాతో తీసినది.. రెగ్యులర్ కెమెరాతో పైగా వీటిల్లో ఒక్కో పోస్టుకూ ప్రత్యేకమైన ఆకారం ఉంటుంది. యాంటెన్నా లాగా ఇవి పని చేస్తాయి. వీటిపై పడిన కాంతికి అవి ఎలా స్పందించాయో మెషీన్ లెర్నింగ్ అల్గారిథం ద్వారా గుర్తించి దాని ఆధారంగా ఫొటోను ముద్రిస్తారు. వీటిల్లో ముందువైపు ఆప్టికల్ టెక్నాలజీని, రెండోవైపు న్యూరల్ టెక్నాలజీని వాడారు. ఇప్పటివరకు తయారు చేసిన ‘కలర్ మెటా సర్ఫేస్’ రకం కెమెరాల్లో స్పష్టమైన ఫొటోలు తీసేది ఇదే. తన సైజుకన్నా 5 లక్షల రెట్లు పెద్దవైన వస్తువులను కూడా సులభంగా ఫొటోలు తీసేస్తుంది. చదవండి: పడుచు కుర్రాడనుకుంటున్నారా.. అసలు వయసు తెలిస్తే.. షాకవుతారు సమస్యలున్నాయా? గతంలో చిన్న సైజు కెమెరాలతో తీసే ఫొటోలు సరిగా వచ్చేవి కావు. ఈ కొత్త కెమెరాతో ఆ సమస్యను అధిగమించారు. అయితే ఫొటోల చివర్లో కాస్త అస్పష్టంగా ఉన్నట్టు కనిపించినా అంత చిన్న సైజు కెమెరా మామూలు కెమెరాలతో పోటీ పడి ఫొటోలు తీయడం గొప్పే. పైగా సాధారణ కాంతిలో కూడా అద్భుతంగా ఇది పని చేస్తుంది. ఎక్కడెక్కడ వాడొచ్చు? చిన్న సైజు రోబోల్లో ఈ కెమెరాలను వాడొచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. వ్యాధులను గుర్తించడానికి, చికిత్స చేయడానికి వైద్యులు కూడా ఉపయోగించవచ్చని అంటున్నారు. మున్ముందు మన ఫోన్లకు వెనకాల మూడు కెమెరాలు అక్కర్లేదని, వెనకభాగమంతా పెద్ద కెమెరా అయిపోతుందని చెబుతున్నారు. ప్రస్తుతం ఈ కెమెరా క్వాలిటీ పెంచడంపై శాస్త్రవేత్తలు దృష్టి పెట్టారు. వస్తువులను గుర్తుపట్టే ‘సెన్సింగ్’ సాంకేతికతను కూడా జోడించాలని చూస్తున్నారు. – సాక్షి సెంట్రల్‌డెస్క్ -
మ్యూజియంలో మైక్రోస్కోపిక్ మోనాలీసా
లండన్: ప్రపంచంలో అత్యంత ఖరీదైన... అందమైన పెయింటింగుల్లో మోనాలీసా ఒకటి. ఆమె.. ఇప్పుడు సాంకేతిక నిపుణుల చేతిలో కొత్త రూపం దాల్చింది. పారిస్ లౌన్రే మ్యూజియంలో అతి సూక్ష్మ రూపంలో దర్శనమిస్తోంది. నానో టెక్నాలజీని ఉపయోగించి రూపొందించిన ఆ వర్ణ చిత్రం ఓ పిక్సల్ కంటే తక్కువగా ఉండి, ఐఫోన్ రెటీనా డిస్ ప్లే లా నిజమైన మోనాలీసా కంటే సుమారు పదివేల రెట్లు తక్కువగా కనిపిస్తోంది. లేజర్ ప్రింటింగ్ టెక్నాలజీలో ఇప్పుడు అద్భుతాలను సృష్టించగల్గుతున్నారు. ఏ చిత్రాన్నైనా భిన్నంగా చూపించగల్గుతున్నారు. సుమారు 127.000 (డాట్స్ పర్ ఇంచ్) డిపిఐ రిజల్యూషన్ తో చిత్రాలు రూపొందే అవకాశం ఉండటంతో పాటు...అధిక నాణ్యత ఉండే ఈ కొత్త టెక్నాలజీపైనే అంతా ఆధారపడుతున్నారు. ముఖ్యంగా వార పత్రికలు వంటివి ప్రింట్ చేసేందుకు సుమారు మూడు వందల డిపిఐతో ఇది మంచి ఫలితాలనిస్తోంది. ఈ లేజర్ టెక్నాలజీతో ఓ కొత్త అప్లికేషన్ ను కూడా రూపొందించే అవకాశం ఉన్నట్లుగా డెబ్ మార్క్ టెక్నికల్ యూనివర్శిటీ పరిశోధక బృందం చెప్తోంది. దీంట్లో డేటాను కనిపించకుండా ఉండేంత సూక్ష్మ రూపంలో దాచుకునేందుకు వీలౌతుంది. సీరియల్ నెంబర్లు, బార్ కోడ్ లు వంటి వాటితో పాటు... ఇతర డేటానూ భద్రపరచుకోవచ్చని వారు అభిప్రాయపడుతున్నారు. దీంతో మోసాలకు పాల్పడేవారికి ముకుతాడు వేయొచ్చంటున్నారు అధ్యయనకారులు. ఇప్పుడు ఈ టెక్నాలజీని ప్రయోగాత్మకంగా మోనాలీసా చిత్రానికి వినియోగించి అతి సూక్ష్మరూపంలో రూపొందించి ప్రత్యేకతను చాటారు. కుడ్య రూపాలు, చిత్రాలకే కాక... అలంకరణలు, మొబైల్ ఫోన్లు వంటి ఉత్పత్తుల కోసం ఈ టెక్నాలజీని వినియోగిస్తున్నారు. కార్ల భాగాలు, వాయిద్య పరికరాల ప్యానెల్స్, బటన్స్ వంటి వస్తువుల తయారీ సులభతరం అవుతుండటంతో ఈ కొత్త విధానంపై విదేశీ కంపెనీలు సైతం ఆసక్తి చూపుతున్నాయి.


