ప్రపంచంలోనే అత్యంత చిన్న కెమెరా.. సైజ్‌ ఎంతో తెలుసా? | Sakshi
Sakshi News home page

Micro Camera: ప్రపంచంలోనే అత్యంత చిన్న కెమెరా తయారీ

Published Thu, Dec 2 2021 1:16 PM

This Cool Microscopic Camera Is the Size Of a Grain Of Salt - Sakshi

సాధారణంగా మనం రోజూ వాడే ఫోన్లలో ఉండే కెమెరాలే మనకు కనిపించే అతి చిన్న కెమెరాలు కదా. వాటి సైజు ఎంతుంటుంది.. పప్పు గింజంత. కానీ కంటికి కనిపించీ కనిపించని పరిమాణంలో కెమెరాను చూసుంటారా? ప్రిన్స్‌టన్‌ యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్‌ వాషింగ్టన్‌ శాస్త్రవేత్తలు తయారుచేసి చూపించారు. మనం వాడే సన్నరకం ఉప్పులోని రేణువంత పరిమాణంలో ఉండే కెమెరాను రూపొందించి ‘వావ్‌’ అనిపించారు. సాధారణ కెమెరాలు తీస్తే ఫొటోలు కలర్‌ఫుల్‌గా, స్పష్టంగా ఎలా వస్తాయో ఆ స్థాయిలో తీసేలా ఈ అర మిల్లీమీటర్‌ కెమెరాను రూపొందించారు.    

ఎలా తయారు చేశారు? 
ఈ కెమెరా తయారీకి అర మిల్లీమీటర్‌ పరిమాణంలోని గ్లాస్‌ లాంటి ‘ ఆప్టికల్‌ మెటాసర్ఫేస్‌’ను వాడారు. సాధారణ కెమెరాల్లో సూర్యకాంతిని అదుపుచేయడానికి గాజు లేదా ప్లాస్టిక్‌ లెన్సులు వాడతారు. మరి ఈ చిన్న కెమెరాలో ఏం వాడి ఉంటారు? అంటే.. హెచ్‌ఐవీ వైరస్‌ సైజులో ఉండే స్తూపాకార పరికరాలు (సిలిండ్రికల్‌ పోస్ట్స్‌) 16 లక్షలు ఉపయోగించారు. అసలే కంటికి సరిగా కనిపించనంత సైజులో ఉన్న ఈ అతి చిన్న కెమెరాలోనూ సిలిండ్రికల్‌ పోస్టులను అద్భుతంగా అమర్చారు.
చదవండి: హోండూరస్‌ తొలి మహిళా అధ్యక్షురాలిగా షియోమరా


చిన్న కెమెరాతో తీసినది.. రెగ్యులర్‌ కెమెరాతో

పైగా వీటిల్లో ఒక్కో పోస్టుకూ ప్రత్యేకమైన ఆకారం ఉంటుంది. యాంటెన్నా లాగా ఇవి పని చేస్తాయి. వీటిపై పడిన కాంతికి అవి ఎలా స్పందించాయో మెషీన్‌ లెర్నింగ్‌ అల్గారిథం ద్వారా గుర్తించి దాని ఆధారంగా ఫొటోను ముద్రిస్తారు. వీటిల్లో ముందువైపు ఆప్టికల్‌ టెక్నాలజీని, రెండోవైపు న్యూరల్‌ టెక్నాలజీని వాడారు. ఇప్పటివరకు తయారు చేసిన ‘కలర్‌ మెటా సర్ఫేస్‌’ రకం కెమెరాల్లో స్పష్టమైన ఫొటోలు తీసేది ఇదే. తన సైజుకన్నా 5 లక్షల రెట్లు పెద్దవైన వస్తువులను కూడా సులభంగా ఫొటోలు తీసేస్తుంది. 
చదవండి: పడుచు కుర్రాడనుకుంటున్నారా.. అసలు వయసు తెలిస్తే.. షాకవుతారు

సమస్యలున్నాయా? 
గతంలో చిన్న సైజు కెమెరాలతో తీసే ఫొటోలు సరిగా వచ్చేవి కావు. ఈ కొత్త కెమెరాతో ఆ సమస్యను అధిగమించారు. అయితే ఫొటోల చివర్లో కాస్త అస్పష్టంగా ఉన్నట్టు కనిపించినా అంత చిన్న సైజు కెమెరా మామూలు కెమెరాలతో పోటీ పడి ఫొటోలు తీయడం గొప్పే. పైగా సాధారణ కాంతిలో కూడా అద్భుతంగా ఇది పని చేస్తుంది.    

ఎక్కడెక్కడ వాడొచ్చు? 
చిన్న సైజు రోబోల్లో ఈ కెమెరాలను వాడొచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. వ్యాధులను గుర్తించడానికి, చికిత్స చేయడానికి వైద్యులు కూడా ఉపయోగించవచ్చని అంటున్నారు. మున్ముందు మన ఫోన్లకు వెనకాల మూడు కెమెరాలు అక్కర్లేదని, వెనకభాగమంతా పెద్ద కెమెరా అయిపోతుందని చెబుతున్నారు. ప్రస్తుతం ఈ కెమెరా క్వాలిటీ పెంచడంపై శాస్త్రవేత్తలు దృష్టి పెట్టారు. వస్తువులను గుర్తుపట్టే ‘సెన్సింగ్‌’ సాంకేతికతను కూడా జోడించాలని చూస్తున్నారు.  
– సాక్షి సెంట్రల్‌డెస్క్‌

Advertisement
 
Advertisement
 
Advertisement