breaking news
Mexican Army soldiers
-
మెక్సికో డ్రగ్ డాన్ మెంచో హతం.. ఇదీ మా విజయమే: ట్రంప్
మెక్సికో సిటీ: మాదకద్రవ్యాల అక్రమ రవాణాకు స్వర్గధామమైన మెక్సికోలో అంతర్జాతీయ డ్రగ్స్ ముఠా అధినేత నెమెసియో రూబెన్ ఒసెగుయెరా సెర్వాంటిస్ అలియాస్ ఎల్ మెంచోను మెక్సికో సైన్యం పక్కా వ్యూహంతో దాడి చేసి హతమార్చింది. సొంత రాష్ట్రం జలిస్కోలోని తపల్పా పట్టణంలో ఎల్ మెంచో దాక్కున్నాడని అమెరికా ఇచ్చిన కాస్తంత నిఘా సమాచారంతో రంగంలోకి దిగిన మెక్సికో సైన్యం ఆ ప్రాంతాన్ని తమ అ«దీనంలోకి తెచ్చుకుంది. అతను పారిపోకుండా రహదారులను కాలిపోతున్న వాహనాలతో దిగ్బంధించింది. సైన్యం మెరుపుదాడితో వెనువెంటనే అప్రమత్తమైన మెంచో అనుచరులు అత్యంత అధునాతన ఆయుధాలతో సైనికులపైకి కాల్పులు జరిపారు. సైన్యం సైతం కాల్పులతో దీటుగా బదులిచ్చింది. ఈ హోరాహోరీ కాల్పుల్లో ఎల్ మెంచో తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే అతడిని విమానంలో సమీప సిటీకి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే ఎల్ మెంచో చనిపోయినట్లు వైద్యులు ధ్రువీకరించారు. మెంచోతోపాటు మరో ఆరుగురు డ్రగ్స్ ముఠా సభ్యులు హతమయ్యారు. మరో ఇద్దరిని అరెస్ట్‌చేశారు. ఆయుధాలతో నిండిన వాహనాలను, రాకెట్ లాంచర్లు, ఇతర ఆయుధాలను సైన్యం స్వా«దీనం చేసుకుంది. వేర్వేరు ఘటనల్లో మొత్తం 30 మంది నేర అనుమానితులు సైతం చనిపోయారని మెక్సికో సిటీ పోలీస్ చీఫ్ ఒమర్ గార్సియా హర్ఫNఛ్ చెప్పారు. మిచోవాకన్లో మరో నలుగురు చనిపోయారు. తమ బాస్ మరణించడంతో పట్టరాని ఆవేశంతో డ్రగ్స్ ముఠా సభ్యులు దేశంలో వేర్వేరు చోట్ల దాడులకు పాల్పడ్డారు. ఆరు ఘటనల్లో మొత్తం 25 మంది నేషనల్‌గార్డ్ సైనికులు ప్రాణాలు కోల్పోయారు. మెంచో ఆట కట్టించినందుకు సైన్యాన్ని మెక్సికో అధ్యక్షురాలు క్లాడియా షీన్బామ్ అభినందించారు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి డ్రగ్స్ ముఠాల ఆటకట్టించాలన్న ప్రజా డిమాండ్లు, అంతర్జాతీయ ఒత్తిళ్లకు తలొగ్గి అమెరికా నుంచి నిఘా సాయం తీసుకున్నారు. తమ ముఠా నాయకుడు చనిపోయాడన్న పట్టరాని ఆగ్రహంతో మాదకద్రవ్యాల ముఠా సభ్యులు పేట్రేగిపోయారు. వీధుల్లోకి వచ్చి దుకాణాలు, బ్యాంకులు, వాహనాలకు నిప్పుపెట్టారు. తపల్పా పట్టణంలో జరిగిన ఆపరేషన్‌లో ముఠా సభ్యులు జరిగిన నేషనల్‌గార్డ్ సభ్యుడు ప్రాణాలు కోల్పోయాడు. పుయెర్టో వల్లాట్రాలోని జైలులో జైలు గార్డ్‌ను ఎల్ మెంచో అనుచరులు చంపేశారు. గ్వాడలజారాలో రాష్ట్ర ప్రాసిక్యూటర్ కార్యాలయంపై దాడి చేసి ఒకరిని చంపేశారు. అమెరికాలోకి అక్రమంగా ఫెంటానిల్ మాదకద్రవ్యాన్ని సరఫరాచేస్తూ ఎల్ మెంచో అతిపెద్ద నేరం చేశాడని ట్రంప్ సర్కార్ గతంలోనే ఆగ్రహం వ్యక్తంచేసింది. ఎల్ మెంచో అరెస్ట్‌కు వీలుగా కీలక సమాచారం ఇచ్చిన వాళ్లకు ఏకంగా 1.5 కోట్ల డాలర్లు(దాదాపు రూ.136.35 కోట్లు) బహుమతిగా ఇస్తామని అమెరికా ప్రభుత్వం ప్రకటించింది. ఎల్ మెంచో సారథ్యంలోని సీజేఎన్‌జీ ముఠాను విదేశీ ఉగ్రసంస్థగా ట్రంప్ సర్కార్ ఈనెలలోనే ప్రకటించింది. గతంలో వేరే డ్రగ్స్ ముఠాలో పనిచేసిన ఎల్ మెంచో 2009లో అందులోంచి బయటికొచ్చి సొంతంగా ‘ది జలిస్కో న్యూ జనరేషన్ కార్టెల్(సీజేఎన్‌జీ) పేరుతో కొత్తడ్రగ్స్ ముఠాను తయారుచేసి మాదకద్రవ్యాల అక్రమ సరఫరాతోపాటు బెదిరింపులు, హత్యలు, అపహరణల వంటి నేరాలకు పాల్పడ్డాడు. భారతీయులకు భారత సర్కార్ అడ్వైజరీ.. ముఠా సభ్యుల విధ్వంసం నేపథ్యంలో అక్కడి భారతీయులు అప్రమత్తంగా ఉండాలని మోదీ సర్కార్ సోమవారం ఒక అడ్వైజరీ జారీచేసింది. ‘జలిస్కో రాష్ట్రంలోని పుయెర్టో వల్లాట్రా, ఛపాలా, గ్వాడలజారా సిటీలతోపాటు మిచోవాకన్, గుయెరియో, న్యూవో లియాన్ రాష్ట్రాల్లో ఉండే భారతీయులు ఘర్షణలు జరిగే వైపు వెళ్లకండి. తదుపరి నోటీస్ వచ్చేదాకా సురక్షిత ప్రాంతాలకే పరిమితంకండి. సైన్యం జాడలేని ప్రాంతాల్లో బయట తిరగకండి. మీ షెల్టర్లలోనే ఉండిపోండి. స్థానిక అధికారుల సూచనలను పాటించండి’’అని మెక్సికోలోని భారత రాయబార కార్యాలయం తన సామాజిక మాధ్యమ ‘ఎక్స్’ఖాతాలో ఒక పోస్ట్పెట్టింది. మూడు దశాబ్దాలుగా మారణ హోమం 59 ఏళ్ల ఎల్ మెంచో పశి్చమ మెక్సికోలోని మిచోవకన్ రాష్ట్రంలో 1966లో అగిలిలా పరిధిలోని మారుమూల గ్రామంలో జని్మంచాడు. ఇతని కుటుంబం అవకాడో పంట సాగుచేసేది. ఐదో తరగతిలోనే బడి చదువు మానేసిన మెంచో టీనేజీలోనే అక్రమ గంజాయి పంట సాగుకు గార్డ్‌గా పనిచేసేవాడు. తర్వాత మెరుగైన జీవితం కోసం 1980 దశకంలో అక్రమంగా కాలిఫోరి్నయా రాష్ట్రంలోకి చొరబడ్డాడు. హెరాయిన్ సరఫరా చేస్తూ 1994లో అమెరికా పోలీసులకు దొరికిపోయాడు. మూడేళ్ల జైలుశిక్ష అనుభవించాడు. తర్వాత మరో నేరం చేస్తూ పట్టుబడ్డాడు. దీంతో పోలీసులు దేశబహిష్కరణ చేసి మెక్సికోకు తిప్పి పంపారు. 30 ఏళ్ల వయసులో స్వదేశం వచ్చాక పోలీస్బలగాల్లో పనిచేశాడు. అప్పుడు మాదకద్రవ్యాల ముఠాల గుట్టుమట్టు తెల్సుకుని ఉద్యోగం వదిలేసి మిలేనియో కార్టెల్‌లో చేరాడు. అక్కడే ముఠా నేతల్లో ఒకరి చెల్లిని పెళ్లాడి కీలక నేతగా ఎదిగాడు. తర్వాత కార్టెల్‌లో విభేదాలు, ముఠాపై సైన్యం దాడులతో వేరే ముఠాలతో చేతులు కలిపాడు. అవి రెండు ముక్కలవడంతో చివరకు సొంతంగా 2009లో జలిస్కో న్యూ జనరేషన్ కార్టెల్‌ను ఏర్పాటుచేసుకుని మెక్సికోలోనే అతిశక్తివంతమైన ముఠాల్లో ఒకటిగా దానిని విస్తరింపజేశాడు. మూడు దశాబ్దాలపాటు ఎన్నో హత్యలు, దోపిడీలు, కిడ్నాప్లుచేసి సైన్యానికి కొరకరాని కొయ్యగా మారాడు. కొకైన్, మెథాంఫెటమైన్స్, ఫెంటానిల్ డ్రగ్స్‌తోపాటు శరణార్థులనూ అమెరికాలోకి తరలించాడు. తనను పట్టుకోవడానికి వచ్చిన పోలీసులపై, తమ ముఠాపై దాడి చేయడానికి వచ్చిన సైన్యంపై ఏకంగా డ్రోన్లతో దాడిచేసేవాడు. బాంబుపేలుళ్లు జరిపించేవాడు. దొరక్కుండా ఎక్కువగా గ్రామీణ ప్రాంతాలలో దాక్కునేవాడు. 2015లో ఏకంగా సైనిక హెలికాప్టర్‌పై దాడిచేసి నేలమట్టంచేశాడు. ఆన్లైన్ ద్వారా ముఠా సభ్యులను చేర్చుకునేవాడు. ఇదీ మా విజయమే: ట్రంప్ ఇప్పటికే చాలా యుద్ధాలను ఆపానని పలుమార్లు ప్రకటించుకున్న ట్రంప్ సోమవారం సైతం ఎం మెంచో మరణాన్ని సైతం తన విజయంగా అభివరి్ణంచుకున్నారు. అమెరికా అధ్యక్ష భవనం మహిళా ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ తన ‘ఎక్స్’ఖాతాలో ఒక పోస్ట్‌పెట్టారు. ‘‘ఎల్ మెంచోను హతమార్చడానికి మెక్సికో ప్రభుత్వానికి కీలకమైన నిఘా సమాచారాన్ని అమెరికాయే అందజేసింది. గతంలోనే మెంచో ముఠాను ట్రంప్ ఉగ్రసంస్థగా ప్రకటించి మంచిపని చేశారు. నార్కోటెర్రరిజానికి పాల్పడే వాళ్లకు తగిన శిక్ష వేస్తామని ట్రంప్ గతంలోనే పునరుద్ఘాటించారు’’అని ఆమె రాసుకొచ్చారు. దీంతో సంబరపడిన ట్రంప్ తన సొంత సామాజిక మాధ్యమం ‘ట్రూత్ సోషల్’లో ఒక పోస్ట్‌పెట్టారు. ‘‘మేం ఈ మధ్య చాలా విజయాలను సాధిస్తున్నాం. ఇది మరీ అతిశయోక్తిగా ఉన్నా వాస్తవం మాత్రం ఇదే’’అని రాసుకొచ్చారు. దీనిపై మెక్సికో ఆగ్రహం వ్యక్తంచేసింది. పలువురు నేషనల్‌గార్డ్ సభ్యుల ప్రాణత్యాగాల ఫలితంగానే మా ఆపరేషన్ విజయవంతమైంది. దాడికి అమెరికా కాస్తంత మాత్రమే నిఘా సమాచారం ఇచ్చింది. మిగతా పనంతా మేమే కష్టపడి పూర్తిచేశాం’’అని మెక్సికో కరాఖండిగా చెప్పేసింది. -
Mexico: డ్రగ్ మాఫియా డాన్ ‘ఎల్ మెంచో’ హతం
మెక్సికో సిటీ: ప్రపంచ దేశాలను వణికించిన డ్రగ్ మాఫియా డాన్, జలిస్కో న్యూ జనరేషన్ కార్టెల్ (సీజేఎన్‌జీ) అధినేత నెమీసియో ‘ఎల్ మెంచో’(59) మెక్సికో సైన్యం జరిపిన మెరుపు దాడిలో హతమయ్యాడు. ఆదివారం పశ్చిమ మెక్సికోలోని జలిస్కో రాష్ట్రం, తపాల్పా పట్టణంలో సైన్యం నిర్వహించిన రహస్య ఆపరేషన్‌లో ఈ పరిణామం చోటుచేసుకుంది. ఎల్ మెంచోను పట్టుకునే క్రమంలో జరిగిన ఎదురుకాల్పుల్లో ఆయన తీవ్రంగా గాయపడ్డాడని, మెరుగైన చికిత్స కోసం మెక్సికో సిటీకి తరలిస్తుండగా, మార్గం మధ్యలోనే ప్రాణాలు కోల్పోయాడని ఆ దేశ సైన్యం ఒక ప్రకటనలో తెలిపింది. సుమారు 15 మిలియన్ డాలర్ల(రూ. 136.15 కోట్లు) అమెరికన్ రివార్డు కలిగిన ఈ అంతర్జాతీయ నేరస్తుని అంతంతో మెక్సికోలో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.తమ నాయకుని మరణవార్త తెలియగానే కార్టెల్ ముఠా సభ్యులు జలిస్కో వ్యాప్తంగా విధ్వంసానికి దిగారు. సుమారు 20కి పైగా ప్రధాన రహదారులను ట్రక్కులు, కార్లతో దిగ్బంధించి నిప్పు పెట్టారు. ఈ హింసాత్మక ఘటనలు మిచోకాన్ రాష్ట్రంతో పాటు ప్యూర్టో వల్లర్టాకు కూడా వ్యాపించాయి. సైనిక చర్యలో ఎల్ మెంచోతో పాటు ఆరుగురు సాయుధ దుండగులు హతం కాగా, ముగ్గురు సైనికులు గాయపడ్డారు.ఘటనా స్థలంలో ఇద్దరు అనుమానితులను అరెస్టు చేసిన భద్రతా దళాలు, విమానాలను సైతం కూల్చివేయగల రాకెట్ లాంచర్లు, అత్యాధునిక ఆయుధాలను స్వాధీనం చేసుకున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో మెక్సికో అధ్యక్షురాలు క్లాడియా షీన్బామ్ దేశ ప్రజలు శాంతంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. కేంద్ర ప్రభుత్వం శాంతిభద్రతలను పర్యవేక్షిస్తోందని తెలిపారు. హింస చెలరేగిన కారణంగా జలిస్కో రాజధాని గ్వాడలజారాలో జనజీవనం స్తంభించిపోయింది. దుకాణాలు, పెట్రోల్ బంకులు మూతపడ్డాయి. బహిరంగ సభలను రద్దు చేయడంతో పాటు సోమవారం పాఠశాలలకు సెలవు ప్రకటించారు.అగ్రరాజ్యం అమెరికాకు కొకైన్, హెరాయిన్, ఫెంటానిల్ వంటి ప్రమాదకర మాదకద్రవ్యాలను సరఫరా చేయడంలో ఎల్ మెంచో ముఠాది కీలక పాత్ర. గతంలో పట్టుబడిన ‘ఎల్ చాపో’ గుజ్మాన్ తరహాలోనే ఎల్ మెంచోను ప్రమాదకర ఉగ్రవాదిగా అమెరికా పరిగణిస్తోంది. ఈ ఆపరేషన్‌లో మెక్సికో సైన్యానికి అమెరికా నిఘా వర్గాలు కీలక సమాచారాన్ని అందించాయి. ఎల్ మెంచో అంతం మెక్సికోకే కాక ప్రపంచవ్యాప్తంగా డ్రగ్స్ మాఫియాపై సాగుతున్న పోరాటంలో ఒక గొప్ప మలుపు అని అమెరికా విదేశాంగ శాఖ పేర్కొంది. డ్రగ్స్ నియంత్రణలో మెక్సికో వైఫల్యంపై గతంలో ఆగ్రహం వ్యక్తం చేసిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ పరిణామంపై సంతృప్తి వ్యక్తం చేశారని సమాచారం. Pray for Mexico pic.twitter.com/aIlvfONluW— Jeddy0xETH (@Jeddy0xETH_) February 23, 2026ఈ హింసాత్మక పరిస్థితుల దృష్ట్యా అమెరికా, కెనడా ప్రభుత్వాలు తమ పౌరులకు ట్రావెల్ అడ్వైజరీని జారీ చేశాయి. మెక్సికోలోని ప్రభావిత ప్రాంతాల్లో ఉన్నవారు తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఇళ్లకే పరిమితం కావాలని అమెరికా విదేశాంగ శాఖ సూచించింది. పలు అమెరికన్, కెనడియన్ విమానయాన సంస్థలు మెక్సికోకు నడిచే విమాన సర్వీసులను రద్దు చేశాయి. -
డేగలతో పరేడ్!
మంగళవారం పారిస్‌లో సంప్రదాయ బాస్టిల్లే డే మిలటరీ పరేడ్‌లో డేగలతో మెక్సికన్ ఆర్మీ సైనికులు కవాతు చేస్తున్న దృశ్యమిది. డేగలకు ప్రత్యేకంగా శిక్షణనిచ్చి, వాటిని వేటకు ఉపయోగించుకునే ఈ దళాన్ని ‘ఫాల్కనర్స్’గా పిలుస్తారు.


