breaking news
Medicaid Health Department
-
తెలంగాణలో మెడికోలకు భారీగా స్టైఫండ్ పెంపు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో మెడికోలకు భారీగా స్టైఫండ్ పెరిగింది. ఒకేసారి 15 శాతం పెంచుతూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. మెడికల్, డెంటల్ స్టూడెంట్స్‌తో పాటు, సీనియర్ రెసిడెంట్ల గౌరవ వేతనాన్ని సైతం ప్రభుత్వం పెంచింది.ఈ పెంపుతో ఇంటర్న్‌లకు నెలకు రూ.29,792, పీజీ డాక్టర్లకు ఫస్ట్ ఇయర్లో రూ.67,032, సెకండ్ ఇయర్లో రూ.70,757, ఫైనల్ ఇయర్లో రూ.74,782 చొప్పున స్టైఫండ్ అందనుంది.సూపర్ స్పెషాలిటీ స్టూడెంట్లకు ఫస్ట్ ఇయర్లో రూ.1,06,461, సెకండ్ ఇయర్లో రూ.1,11,785, థర్డ్ ఇయర్లో రూ.1,17,103 చొప్పున స్టైఫండ్ అందనుంది. అలాగే, సీనియర్ రెసిడెంట్లకు డాక్టర్లకు ఇచ్చే గౌరవ వేతనాన్ని రూ.92,575 నుంచి రూ.1,06,461 పెంచుతున్నట్టు ప్రభుత్వం జీవోలో పేర్కొంది. -
AP: ప్రసవానికి ప్రభుత్వాస్పత్రికొస్తే రూ.11 వేలు
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ వైద్య రంగంలో అనేక విప్లవాత్మక సంస్కరణలతో దేశానికే ఆదర్శంగా నిలుస్తోంది.. ఏపీ ప్రభుత్వం. ప్రభుత్వాస్పత్రుల్లో ప్రసవం చేయించుకున్నవారికి కేంద్రం భాగస్వామ్యంతో రూ.11 వేలు అందిస్తోంది. ఉచిత వైద్యసేవలు, మందులు, ఆహారం, రవాణాకు ఈ రూ.11 వేలు అదనం కావడం విశేషం. ఈ మొత్తాన్ని కూడా నగదు రూపంలో నేరుగా లబ్ధిదారుల ఖాతాలో జమ చేస్తున్నారు. దేశంలో మరే రాష్ట్రంలోనూ ఇలా లేకపోవడం గమనార్హం. ప్రభుత్వాస్పత్రుల్లో ప్రసవాలను ప్రోత్సహించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఆశా కార్యకర్తలు, ఏఎన్ఎంల ద్వారా ఈ విషయాన్ని ప్రతి ఒక్కరికీ చేరవేయాలని ఆదేశించింది. ప్రభుత్వాస్పత్రులకు వస్తే అందే ప్రయోజనాలను వివరంగా చెప్పాలని సూచించింది. రవాణా నుంచి వైద్యసేవలన్నీ ఉచితంగానే.. ప్రభుత్వాస్పత్రులకు ప్రసవం కోసం వచ్చే గర్భిణులకు రవాణా నుంచి మందుల వరకు అన్నీ ఉచితమే. గర్భిణికి పురిటినొప్పులు రాగానే 108కు ఫోన్ చేస్తే ఆస్పత్రికి తీసుకెళతారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (పీహెచ్సీ) నుంచి బోధనాస్పత్రి వరకూ ఎక్కడైనా వైద్యం చేయించుకోవచ్చు. 372 పీహెచ్‌సీల్లో జీరో డెలివరీలు రాష్ట్రంలో 1,149 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలుండగా 372 పీహెచ్‌సీల్లో ఒక్క ప్రసవం కూడా జరగడం లేదు. ఇందులో అత్యధికంగా కృష్ణా జిల్లాలో 52 పీహెచ్‌సీలు ఉన్నాయి. వీటిలో కూడా సాధారణ ప్రసవాలు చేయాలని కుటుంబ సంక్షేమ శాఖ యోచిస్తోంది. ఇప్పటికే ఇద్దరు వైద్యాధికారులు, ముగ్గురు నర్సులు, లేబర్ రూమ్‌కు కావాల్సిన వసతులు అన్నీ పీహెచ్‌సీల్లో సమకూరుస్తున్నారు. ప్రస్తుతం ప్రభుత్వాస్పత్రుల్లో 40 శాతం మాత్రమే ప్రసవాలు జరుగుతున్నాయి. వీటిని భారీగా పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వాస్పత్రులకు వస్తే లాభాలెన్నో.. ► గర్భిణి దశలోనే ప్రభుత్వాస్పత్రుల్లో వైద్య పరీక్షలకు వస్తే స్టాఫ్ నర్స్, పీహెచ్ఎన్, ఎంపీహెచ్ఎస్, మెడికల్ ఆఫీసర్లు ప్రత్యేక ట్రాకింగ్ సిస్టమ్ ద్వారా పరిశీలిస్తారు. ► సాధారణ ప్రసవాలను ప్రోత్సహిస్తారు. సిజేరియన్ అవసరమైతే బాధ్యతగా చేస్తారు. ► ప్రసవం సమయంలో రక్తం అవసరమైతే ప్రభుత్వమే సమకూరుస్తుంది. ► బాలింతకు ఆస్పత్రిలో ఉన్నన్ని రోజులు ఉచితంగా పోషకాహారం అందిస్తారు. ► చిన్నారులకు ఉచితంగా వ్యాక్సిన్లు ఇస్తారు. ► ఆస్పత్రి నుంచి డిశ్చార్జి కాగానే తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్‌లో ఇంటికి ఉచితంగా చేర్చుతారు. ► బిడ్డ పుట్టగానే ఆధార్ నమోదు చేస్తారు.. పుట్టిన తేదీ ధ్రువీకరణ పత్రం ఇస్తారు. బాలింతలకు భారీగా ఆసరా గతంలో ఎప్పుడూ లేని విధంగా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్య ఆసరా ఇస్తోంది. సాధారణ ప్రసవానికి రూ.5 వేలు, సిజేరియన్ ప్రసవానికి రూ.3 వేలు ఇస్తోంది. తల్లి కోలుకునే సమయంలో ఈ మొత్తం వారికి ఎంతో భరోసానిస్తోంది. దీనికి తోడు ప్రధానమంత్రి మాతృత్వ వందన యోజన, జననీ సురక్ష యోజనల కింద మరికొంత సొమ్ము సమకూరుతోంది. -
తీరు మారకపోతే సస్పెన్షనే : మంత్రి శిద్దా ఆగ్రహం
ఈ సారి చూసేది ఉండదు, సస్పెన్షనే అని రిమ్స్ డైరక్టర్ డాక్టర్ అంజయ్యపై మంత్రి శిద్దా రాఘవరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. రిమ్స్‌లో మెడికోల బాలికల వసతి గృహాల్లో ఉన్న సమస్యలను పరిష్కరించకపోవడంతో శనివారం మెడికోలు నిరసన వ్యక్తం చేసిన ఘటనపై స్పందించిన మంత్రి రిమ్స్‌ను సందర్శించి నిప్పులు చెరిగారు. చేతకాకపోతే సెలవు పై వెళ్లిపోవాలని, పనిచేసే అధికారులు రిమ్స్‌కు వస్తారని హెచ్చరించారు. ఒంగోలు సెంట్రల్ : ‘రిమ్స్ పరిస్థితిని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చూశా.. వైద్య ఆరోగ్యశాఖ మంత్రి వచ్చినప్పుడు చూశా. ఈసారి చూసేది ఉండదు.. సస్పెన్షనే అని రిమ్స్ డెరైక్టర్ డాక్టర్ అంజయ్యపై రాష్ట్ర రవాణా, రోడ్లు, భవనాల శాఖ మంత్రి శిద్దా రాఘవరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. రిమ్స్ కళాశాల విద్యార్థినుల వసతి గృహాల్లో ఉన్న సమస్యలను పరిష్కరించకపోవడంతో శనివారం మెడికోలు నిరసన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై మెడికోలను విచారించేందుకు మంత్రి ఆదివారం మధ్యాహ్నం రిమ్స్‌లోని బాలికల వసతి గృహాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థినులు నాలుగు రోజులుగా వసతి గృహాల్లో విద్యుత్ సౌకర్యం లేదని, మంచినీటి వసతి లేదని, శానిటేషన్‌కు తామే డబ్బులు చెల్లిస్తున్నామని..తాగుబోతులు వసతి గృహ పరిసరాల్లో సంచరిస్తున్నారని, రోడ్ల మీద లైట్లు లేక భయంతో ఉంటున్నామని మంత్రి దృష్టికి తెచ్చారు. మొత్తం 260 మంది బాలికలు వసతి గృహంలో ఉంటున్నామన్నారు. దీనిపై స్పందించిన మంత్రి.. రిమ్స్ డెరైక్టర్‌ను మందలించారు. ఏదో ఒక హెడ్ నుంచి నిధులు వెచ్చించి సమస్యలు పరిష్కరించాలన్నారు. బాలికల వసతి గృహానికి విద్యుత్ అంతరాయంపై మంత్రి ప్రశ్నించడంతో విద్యుత్ శాఖ డీఈ రామ్మూర్తి సమాధానమిస్తూ వారం రోజుల్లో సమస్య పరిష్కరిస్తామని..అండర్ గ్రౌండ్ కేబుల్‌ను తెప్పిస్తున్నామని చెప్పారు. విద్యుత్ పునరుద్ధరించడం కూడా చేతకాకపోతే ఎందుకు, సెలవుపై వెళ్లాలని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రత్యేకంగా లైన్ వేసి విద్యుత్‌ను పునరుద్ధరించాలని సూచించారు. అనంతరం రిమ్స్ ప్రాంగణంలోని ఆర్వో ప్లాంట్ పనిచేయకపోవడంతో మంచినీరు రావడం లేదని విద్యార్థినులు తెలపగా..దానికి స్పందించిన నిర్మాణ శాఖ డీఈ జగన్నాథరావు మాట్లాడుతూ ఆర్వో ప్లాంట్‌లో చిన్నచిన్న విడిభాగాలు విజయవాడ నుంచి త్వరలోనే తెప్పిస్తామన్నారు. దీనికి ఆగ్రహించిన మంత్రి విజయవాడ నుంచి తెప్పించడానికి ఎన్ని రోజుల సమయం పడుతుందని ..ఉన్న అధికారులంతా సెలవుపై వెళ్లిపోవాలని..పనిచేసే అధికారులు రిమ్స్‌కు వస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జీతాలు తీసుకుంటూ పనిచేయకపోతే ఎట్లా..చేతకాకపోతే తప్పుకోండి అన్నారు. రిమ్స్‌లో శానిటేషన్, మంచినీటి వసతి లేదని, ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారికి కూడా వైద్యం చేయడం లేదని, మందులు ఉండవని తనకు అనేక ఫిర్యాదులు వచ్చాయన్నారు. శనివారం యాక్సిడెంట్ కేసులో రిమ్స్‌కు వచ్చిన క్షతగాత్రులకు రాజశేఖర్ అనే వైద్యుడు చికిత్స చేయకుండా ప్రైవేటు వైద్యశాలకు వెళ్లాలని ఉచిత సలహా ఇవ్వడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం ఒకరు మృతి చెందారని..దీనికి ఎవరిని బాధ్యులను చేయాలని ప్రశ్నించారు. రిమ్స్‌లో భవన నిర్మాణాలను డిసెంబర్ 3వ తేదీకల్లా పూర్తి చేయాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. ఈ విషయంపై హైదరాబాద్‌లో వైద్య ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్‌తో సమావేశం నిర్వహించి చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు. ప్లేట్లెట్ మిషన్ జిల్లాకు తెప్పిస్తామని చెప్పారు. ఈ సందర్భంగా రిమ్స్ డెరైక్టర్ మాట్లాడుతూ రిమ్స్‌కు రోజూ మూడున్నర లక్షల లీటర్ల నీరు అవసరమని..కార్పొరేషన్‌వారు ఆమేరకు సరఫరా చేయడంలేదని తెలిపారు. కొంత మేరకు పాత రిమ్స్ నుంచి పైపులైన్ల ద్వారా మంచినీటిని తెప్పిస్తున్నామన్నారు. మంత్రి వెంట ఆర్డీవో కమ్మ శ్రీనివాసరావు, తహశీల్దార్ మూడమంచు వెంకటేశ్వర్లు, ఒంగోలు డీఎస్పీ, ఒన్‌టౌన్ సీఐ, ఎస్సై, వైద్యులు ఉన్నారు.