breaking news
Matches management
-
హైదరాబాద్‌లోనే ఐపీఎల్ మ్యాచ్‌లు
సమ్మె విరమించిన హెచ్‌సీఏ సిబ్బంది హైదరాబాద్: హైదరాబాద్‌లో జరిగే ఐపీఎల్ మ్యాచ్‌ల నిర్వహణపై ఏర్పడిన సందిగ్ధత తొలగిపోయింది. హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్‌సీఏ) సిబ్బంది, గ్రౌండ్స్‌మెన్ సమ్మె నేపథ్యంలో మ్యాచ్‌లను తరలిస్తారనే ఊహాగానాలకు తెరపడింది. గత 14 రోజులుగా చేస్తోన్న సమ్మెను హెచ్‌సీఏ సిబ్బంది శుక్రవారం విరమించారు. కొంతకాలంగా తమకు బాకీగా ఉన్న జీతాలు, ఇతర అలవెన్సులు, బిల్లులను వెంటనే ఇవ్వాలంటూ సిబ్బంది ధర్నాకు దిగారు. హెచ్‌సీఏ తాత్కాలిక అధ్యక్షులు నరేందర్ గౌడ్, ఉపాధ్యక్షులు సురేందర్ అగర్వాల్, కార్యదర్శి జాన్ మనోజ్‌లు హామీ ఇవ్వడంతో సమ్మెను విరమిస్తున్నట్లు పేర్కొన్నారు. వెంటనే మ్యాచ్‌లకు గ్రౌండ్‌ను సిద్ధం చేసే పనిలో పడ్డారు. సిబ్బంది ధర్నాను విరమించడం పట్ల హెచ్‌సీఏ అధికారులు హర్షం వ్యక్తం చేశారు. -
రాష్ట్ర సంఘాలకు డబ్బులివ్వండి
• బీసీసీఐ ఒప్పందాలను గౌరవించండి • సీఓఏకు సుప్రీం కోర్టు ఆదేశం న్యూఢిల్లీ: మ్యాచ్‌ల నిర్వహణ కోసం సంబంధిత రాష్ట్ర సంఘాలకు నిధులు విడుదల చేయాలని సుప్రీం కోర్టు శుక్రవారం బీసీసీఐ పరిపాలక కమిటీ (సీఓఏ)ని ఆదేశించింది. హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ సంఘం (హెచ్పీసీఏ) సహా పలు రాష్ట్ర సంఘాలు మ్యాచ్ నిర్వహణ కోసం డబ్బులు కావాలంటూ కోర్టుకెక్కాయి. అంతర్జాతీయ మ్యాచ్‌లు, ఐపీఎల్ మ్యాచ్‌ల నిర్వహణపై జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని త్రిసభ్య బెంచ్ మహారాష్ట్ర, కర్ణాటక, జార్ఖండ్, హిమాచల్ సంఘాల పిటిషన్లను విచారించింది. ప్రస్తుత టెస్టు సిరీస్‌కు ఈ రాష్ట్రాలు వేదికలవగా... బీసీసీఐ పరిపాలక కమిటీని ఒప్పందం మేరకు డబ్బులు విడుదల చేయాలని మిశ్రా నేతృత్వంలోని సుప్రీం బెంచ్ ఆదేశించింది. హెచ్పీసీఏ తరఫున అదనపు సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు. శనివారం నుంచి జరిగే నాలుగో టెస్టు నిర్వహించేందుకు తక్షణం రూ.2.5 కోట్లు ఇచ్చేందుకు సీఓఏ నిరాకరిస్తుందని చెప్పారు. దీనిపై సుప్రీం బెంచ్ తన తీర్పులో ఒప్పందాన్ని గౌరవించి నడుచుకోవాలని, నిధులు ఇవ్వాలని సీఓఏకు ఆదేశాలు జారీ చేసింది. ‘ఇరు పక్షాల మధ్య ఒక్కసారి ఒప్పందం జరిగాక దాన్ని బోర్డు గౌరవించాల్సిందే. నిధులు ఇవ్వడం ద్వారా బీసీసీఐ తమ నిబద్ధతను చాటుకోవాలి’ అని తన తీర్పులో పేర్కొంది. బీసీసీఐ, రాష్ట్ర సంఘాల ఆఫీస్ బేరర్ల పదవీ కాలం విషయంలో జస్టిస్ ఆర్.ఎమ్. లోధా కమిటీ సిఫార్సులను కచ్చితంగా అమలు చేయాల్సిందేనని స్పష్టం చేసింది. లోధా సిఫార్సు ప్రకారం తమ రాష్ట్ర క్రికెట్ సంఘంలో తొమ్మిదేళ్ల పాటు ఆఫీస్ బేరర్‌గా కొనసాగిన వ్యక్తి బీసీసీఐ పదవికి అనర్హుడని తేల్చింది. రైల్వేస్, సర్వీసెస్, అసోసియేషన్ ఆఫ్ యూనివర్సిటీస్ తరఫున అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీ వాదనలు వినిపించారు. ఒక రాష్ట్రానికి ఒక ఓటు వల్ల కీలకమైన రైల్వేస్ హక్కు కోల్పోవడం ఎంతవరకు సమంజసమని ఆయన వాదించారు. దీనిపై సుప్రీం కోర్టు స్పందిస్తూ తదుపరి విచారణలో వాదనలు వింటామని స్పష్టం చేసింది. అలాగే బీసీసీఐ మాజీ అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్ ‘తప్పుడు అఫిడవిట్’ విషయంలోనూ తదుపరి విచారణలోనే తేలుస్తామని సుప్రీం బెంచ్ చెప్పింది. ఐపీఎల్ మ్యాచ్‌లకూ... వచ్చే నెల 5 నుంచి జరిగే ఐపీఎల్ మ్యాచ్‌ల కోసం సంబంధిత వేదికలైన రాష్ట్ర సంఘాలకు నిధులు ఇవ్వాలని సీఓఏని సుప్రీం కోర్టు ఆదేశించింది. ఐపీఎల్ విషయంలో బోర్డుకు, ఫ్రాంచైజీలకు, సంఘాలకు మధ్య త్రైపాక్షిక ఒప్పందం జరిగింది. మ్యాచ్‌లు సజావుగా జరిగేందుకు ఈ ఒప్పందాన్ని బోర్డు గౌరవించాల్సి వుంటుంది. కాబట్టి నిధులు విడుదల చేయాలని సీఓఏకు స్పష్టం చేసింది.