breaking news
Masabtyank
-
ప్రేమించి.. పెళ్లి తర్వాత వేధించి
భార్య, అత్తింటి వారిపై దాడి ముగ్గురికి తీవ్ర గాయాలు గోల్కొండ: ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యపై భర్త హత్యాయత్నం చేశాడు. హుమాయూన్‌నగర్ పోలీసులు తెలిపిన వివరాలు.. మాసబ్‌ట్యాంక్ పోచమ్మబస్తీకి చెందిన యాదయ్య కుమారుడు శివకుమార్(25), అదే బస్తీలో వాంబే గృహ సముదాయంలో నివసిస్తున్న ఉషారాణి కూతురు మనీషలు మే 1వ తేదీన రహస్యంగా యాదగిరిగుట్టలో పెళ్లి చేసుకున్నారు. పెళ్లయిన పదిహేను రోజుల నుంచి శివకుమార్ భార్యను హింసించడం మొదలు పెట్టాడు. దీంతో మనీష తల్లివద్దకు వచ్చేసింది. కక్ష పెంచుకున్న శివకుమార్ జూన్‌లో మనీష ఇంటిపై దాడిచేసి ఫర్నిచర్ ధ్వంసం చేశాడు. ఈ విషయంపై మనీష పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు వస్తే, చస్తానంటూ విద్యుత్ తీగలను పట్టుకునే ప్రయత్నం చేశాడు. దీంతో గత్యంతరం లేక పోలీసులు వెనుదిరిగారు. ఈ సంఘటన తర్వాత కూడా శివకుమార్ పలుమార్లు మనీష, ఆమె కుటుంబ సభ్యులపై కూడా దాడిచేసే ప్రయత్నం చేశాడు. ఈ విషయంపై మనీష పశ్చిమ మండలం డీసీపీకీ ఫిర్యాదు చేసింది. కాగా మంగళవారం రాత్రి 8 గంటలకు శివకుమార్ మనీష ఇంటికి వచ్చి గొడవకు దిగాడు. నువ్వు ఏ పని చేయడం లేదు, కష్టించి సంపాదించే వరకు మనీషను పంపేది లేదని ఆమె తల్లి ఉషారాణి స్పష్టం చేసింది. దీంతో రెచ్చిపోయిన శివకుమార్ మనీష, ఆమె తల్లిని కొట్టి పారిపోయాడు. వెంటనే ఈ విషయంపై మనీష హుమాయూన్‌నగర్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పోలీసులు అతడ్ని అదుపులోకి తీసుకున్నారు. పోలీస్‌స్టేషన్‌లో నానా హంగామా చేసిన శివకుమార్ తలను లాకప్ గోడలకు కొట్టుకుంటూ ఆత్మహత్య చేసుకుంటానంటూ బెదిరించాడు. దీంతో పోలీసులు రాత్రి రెండు గంటల సమయంలో అతడ్ని వదిలేశారు. నేరుగా రాత్రి 3 గంటల ప్రాంతంలో మనీష ఇంటికి వెళ్లాడు. రోకలి పట్టుకొని భర్తను ఎదిరించబోయిన మనీషను పిడిగుద్దులు గుద్దుతూ ఆమె చేతిలోని రోకలిని లాక్కొని హత్యాయత్నం చేశాడు. అడ్డువచ్చిన ఉషారాణి, మనీష అమ్మమ్మ మధురవీణలపై కూడా దాడి చేశాడు. ముగ్గురి తలలు పగిలి తీవ్ర రక్తస్రావమైంది. విషయం తెలుసుకున్న పోలీసులు గాయపడ్డ వారిని ఉస్మానియాకు తరలించి శివకుమార్‌ను అదుపులోకి తీసుకున్నారు. -
కమాన్ రాక్‌స్టార్స్
దక్కన్ పీఠభూమిలో ఠీవీగా నిల్చున్న భాగ్యనగరంలో హిల్స్‌కు కొదవేం లేదు. కాంక్రీట్ వనంలా మారిన బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ వదిలిపెడితే.. నగర శివార్లకు వెళ్తే.. ఇప్పటికీ.. ఎన్నో బండరాళ్లు సహజమైన అందాలతో దర్జాగా నిల్చుని ఉన్నాయి. ఉలి అలికిడి లేకుండానే వెలిసిన ఈ రాళ్ల సోయగాన్ని కాపాడే ల క్ష్యంతో కొన్ని సంస్థలు రాకథాన్, రాక్వాక్, రాక్ క్లయింబింగ్ వంటి ఈవెంట్లు నిర్వహిస్తున్నాయి. ఇందులో భాగంగా ఈ రోజు శంషాబాద్ దగ్గర్లోని వైట్ క్వార్ట్జ్ క్లిఫ్ దగ్గర రాక్వాక్ నిర్వహిస్తోంది ద సొసైటీ టు సేవ్ రాక్స్. మాసబ్‌ట్యాంక్‌లోని ఎన్ఎమ్డీసీ ప్రధాన ద్వారం దగ్గర రాక్స్టార్లంతా జట్టుకట్టి ఉదయం 7.30 గంటలకు అక్కడ్నుంచి మెయిన్స్పాట్కు బయల్దేరుతారు. ఇందులో పాల్గొనేవారు సొంత వాహనాలు తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఫోన్: 9866019402, 9848418085