పరిణీతి చోప్రా.. ఏడ్చేసింది!
బాలీవుడ్ హీరోయిన్ పరిణీతి చోప్రా ఉన్నట్టుండి ఒక్కసారిగా కన్నీళ్లు పెట్టింది. నీరజ్ ఘేవన్ దర్శకత్వంలో వచ్చిన 'మసాన్' సినిమా చూసి ఆమె కన్నీరు ఆపుకోలేకపోయిందట. థియేటర్లో సినిమా చూసేటప్పుడు ఏకధాటిగా ఏడుస్తూనే ఉన్నానని పరిణీతి చెప్పింది. బుధవారం రాత్రి బాలీవుడ్ హీరో హీరోయిన్లు కొందరి కోసం ఈ సినిమాను ప్రత్యేకంగా ప్రదర్శించారు. విమర్శకుల ప్రశంసలు అందుకుంటున్న మసాన్ సినిమాకు 4.5 రేటింగ్ వచ్చింది.
ఈ సినిమాలో రిచా ఛద్దా, విక్కీ కౌశల్, సంజయ్ మిశ్రా, శ్వేతా త్రిపాఠి తదితరులు నటించారు. అంతర్జాతీయంగా కూడా ఈ సినిమాకు ప్రశంసలు, అవార్డులు వచ్చాయి. కేన్స్ చలన చిత్రోత్సవంలో కూడా అవార్డులు సాధించింది. సినిమా శుక్రవారం విడుదల కావాల్సి ఉన్నా, గడిచిన మూడు రోజులుగా బాలీవుడ్ ప్రముఖుల కోసం ప్రత్యేకంగా ప్రదర్శిస్తూనే ఉన్నారు. రాజ్‌కుమార్ హిరానీ, కబీర్ ఖాన్, షబనా ఆజ్మీ, దియా మీర్జా.. ఇలా ప్రతి ఒక్కళ్లూ ఈ సినిమాను ప్రశంసిస్తూనే ఉన్నారు. రిచా ఛద్దా చాలా అద్భుతంగా చేసిందని, విక్కీ నటన చూసి కదిలిపోయానని, ఇది కచ్చితంగా సూపర్ హిట్ అవుతుందని పరిణీతి చెప్పింది.