breaking news
manyata
-
సంజయ్‌దత్ కుటుంబానికి క్యాన్సర్ శాపం
‘మున్నాభాయ్ ఎంబిబిఎస్’లో రోగాన్ని మందులతో కంటే మాటలతో ఎక్కువ నయం చేయాలంటాడు సంజయ్‌దత్. ఇప్పుడు ఆ నటుడు మందులకు అంతగా లొంగని కేన్సర్ బారిన పడ్డాడు. సంజయ్‌దత్‌కు లంగ్ కేన్సర్ నిర్థారితం అయ్యిందని మీడియాలో వార్తలు వచ్చాయి. సంజయ్‌దత్ కుటుంబానికి క్యాన్సర్ ఒక శాపం అనవచ్చు. తల్లి, ఇద్దరు భార్యలు దాని బారిన పడ్డారు. కొందరు దానిని జయించారు. సంజయ్‌దత్ కూడా జయిస్తాడనే ఆశ. ‘మున్నాభాయ్ ఎం.బి.బి.ఎస్’ చేసి ఉండకపోతే సంజయ్‌దత్ భారతీయ ప్రేక్షకులకు ఇంత ఇష్టుడై ఉండేవాడు కాదు. ఆ తర్వాత వచ్చిన ‘లగేరహో మున్నాభాయ్’తో అతడు తన పాత ఇమేజ్ను అంతా చెరిపేసుకోని బాలీవుడ్లో అత్యంత ముఖ్యమైన నటుడు అయ్యాడు. ‘ఖల్నాయక్’ సమయంలో అతడు టాడా కేసులో చిక్కుకుని జైలుకు వెళ్లినప్పుడు చిలువలు పలువలుగా కథనాలు రాసిన మీడియా తర్వాతి కాలంలో శిక్ష పూర్తి చేయడానికి సంజయ్‌దత్ పూణె జైలులో ఉన్నప్పుడు ఎంతో సానుభూతితో రాశాయి. సాధారణ జనం సంజయ్‌దత్ అనుభవించింది చాలు అతణ్ణి తొందరగా విడుదల చేస్తే బాగుంటుంది అని అనుకున్నారు కూడా. 2014లో జైలు నుంచి విడుదలైన సంజయ్‌దత్ మునుపటి సంజయ్‌దత్ ఎంతకీ కాలేకపోయాడనే చెప్పాలి. ఆ ఉడుకు, వేగం తగ్గాయి. సినిమాల సంఖ్య కూడా తగ్గింది. ఫ్యామిలీతోటి ఎక్కువ గడుపుతూ అతడు చేసిన సినిమాలలో తాజాగా ‘సడక్2’ ఈ నెలాఖరున డిజిటల్ రిలీజ్‌కు సిద్ధమైంది. సంజయ్‌దత్‌ను మరోసారి ఏదో ఒక తెర మీద చూడాలని అభిమానులు అనుకుంటున్నప్పుడు హటాత్తుగా ఆయన అనారోగ్యం వార్త బయటకు వచ్చింది. ఆగస్టు 8 నుంచి ఆగస్టు 8 నుంచి సంజయ్‌దత్ వార్తలు రావడం మొదలయ్యాయి. ఛాతీలో అసౌకర్యం వల్ల ఆయన ముంబైలో లీలావతి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాడు. అయితే ఆగస్టు 10 సోమవారం ఆయన డిశ్చార్జ్ అయ్యాడు. తనకు కోవిడ్ నెగెటివ్ వచ్చిందని, కాని పని నుంచి కొంత బ్రేక్ తీసుకోవాలని అనుకుంటున్నానని ఆయన ట్వీట్ చేశాడు. ఆ తర్వాతి నుంచి ఆయన లంగ్ కేన్సర్ వార్తలు బయటకు వచ్చాయి. ప్రసిద్ధ సినిమా జర్నలిస్ట్ కోమల్ నహతా ‘సంజయ్‌దత్‌కు లంగ్ కేన్సర్ నిర్థారితం అయ్యింది. ఆయన ఆరోగ్యం కోసం ప్రార్థిద్దాం’ అని ట్వీట్ చేశాడు. సంజయ్‌దత్‌కు కేన్సర్ స్టేజ్ 3 లెవల్లో ఉందని చెబుతున్నారు. ఆయన కుటుంబం వైద్యం కోసం అతి త్వరలో అమెరికా వెళ్లనుంది. నర్గీస్‌దత్ నుంచి సంజయ్‌దత్‌కు తల్లి నర్గిస్ దత్తో ఎక్కువ అనుబంధం. కొడుకును సూపర్‌స్టార్‌గా చూడాలని ఆ నటి అనుకుంది. సంజయ్‌దత్ ఆ ప్రయత్నాల్లో ఉండి సినిమా మొదలెడుతుండగా ఆమె 1980లో పాంక్రియాటిక్ కేన్సర్ బారిన పడింది. ఇది సంజయ్‌దత్‌ను చాలా డిస్ట్రబ్ చేసింది. తను డ్రగ్స్ బారిన పడటానికి తల్లి అనారోగ్యం కూడా ఒక కారణం అని అతడు చెప్పుకున్నాడు. భర్త సునీల్‌దత్ అమెరికాలో ఆమెకు వైద్యం చేయించినా ఫలితం దక్కలేదు. 1981లో నర్గిస్ మరణించింది. ఆ తర్వాతే సంజయ్‌దత్ తొలి సినిమా ‘రాకీ’ విడుదలైంది. తల్లి పడ్డ క్యాన్సర్ బాధ సంజయ్‌దత్‌ను చాలాకాలం వెన్నాడింది. తర్వాత భార్య రిచాశర్మ సంజయ్‌దత్ నటి రిచా శర్మను 1987లో వివాహం చేసుకున్నాడు. రిచా శర్మ చాలా హిట్ సినిమాలలో నటించింది. ఆమె కుటుంబం ఆమెరికాలో స్థిరపడి ఉంది. అయితే కూతురు త్రిశాల పుట్టిన కొన్నాళ్లకు రిచా శర్మకు బ్రెయిన్ ట్యూమర్ వచ్చింది. రిచాశర్మ వైద్యం కోసం సంజయ్ దత్ కుమార్తెతో కలిసి అమెరికాకు అనేకసార్లు రాకపోకలు సాగించాడు. కాని ఫలితం దక్కలేదు. 1996లో 32 ఏళ్ల వయసులో రిచాశర్మ మరణించింది. కూతురు త్రిశాల అమ్మమ్మ, నాయనమ్మల దగ్గరే పెరగడానికి అమెరికాలో ఉండిపోయింది. సంజయ్‌దత్, మాన్యత, ఇద్దరు పిల్లలు ఆ తర్వాత మాన్యత నటి మాన్యతను 2008లో సంజయ్‌దత్ పెళ్లి చేసుకున్నాడు. రెండేళ్లకు వారికి ట్విన్స్ పుట్టారు. అబ్బాయి. అమ్మాయి. ఆ తర్వాత ఒకవైపు టాడా కేసు నడుస్తూ ఉంటే మరోవైపు సినిమాల్లో నటిస్తూ సంజయ్ బిజీగా ఉన్నాడు. తీర్పు వెలువడ్డాక జైలు శిక్ష అనుభవించడానికి వెళ్లిపోయాడు. అయితే ఈలోపు 2013లో మాన్యత లివర్ ట్యూమర్‌తో బాధ పడిందనే వార్తలు వచ్చాయి. ఆమె దానితో పోరాడే సమయంలో సంజయ్‌దత్ భార్య అనారోగ్య కారణంగా పరోల్ పొందేవాడు. అయితే మాన్యత ఆ ట్యూమర్ నుంచి బయటపడింది. ఇప్పటి పరిస్థితి సంజయ్‌దత్ జీవితం అనూహ్య పరిణామాల జీవితం. నాటకీయ జీవితం. అందుకే అతని జీవితం ఆధారంగా రణ్‌బీర్ కపూర్ హీరోగా ‘సంజూ’ సినిమా వచ్చి పెద్ద హిట్ అయ్యింది. సంజయ్‌దత్ కోసం బాలీవుడ్ ఎన్నో కేరెక్టర్లు రాస్తోంది. సంజయ్‌దత్ చేయాల్సిన సినిమాలూ చాలానే ఉన్నాయి. 61 ఏళ్లు అంటే ఇంకా పదేళ్లపాటు నటించవచ్చు. కాని ఈలోపు ఈ అనారోగ్య వార్త. సంజయ్ తన శరీరాన్ని చాలా అబ్యూస్ చేసుకున్నాడు. డ్రగ్స్, స్మోకింగ్, ఆల్కహాల్... ఇవన్నీ ఏళ్ల తరబడి అతడి దశలవారీ వ్యసనాలుగా ఉన్నాయి. వాటి పర్యవసానమే ఇప్పటి అనారోగ్యం కావచ్చు. కాని సంజయ్ ఎన్నో పోరాటాలు కూడా చేశాడు. వచ్చిన ప్రతికూలతలకు ఎదురొడ్డి నిలిచాడు. క్యాన్సర్‌ను జయించి తిరిగి వస్తాడనే ఆశ. అతని భార్య కూడా అదే ట్వీట్ చేసింది. ‘మీ అందరి అభిమానానికి కృతజ్ఞతలు. అన్ని చెడుకాలాలు వెళ్లినట్టే ఈ చెడుకాలం కూడా వెళ్లిపోతుంది’ అని ప్రకటన చేసింది. నిజంగా ఈ చెడుకాలం గడిచిపోయాలనే ప్రతి ఒక్క సినీ అభిమాని ఆకాంక్ష. – సాక్షి ఫ్యామిలీ -
సంజయ్ దత్ కు మరో 30 రోజుల పెరోల్ పొడిగింపు
1993 ముంబై పేలుళ్ల కేసులో శిక్ష అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ మరో 30 రోజులపాటు పెరోల్ ను మహారాష్ట్ర ప్రభుత్వం పొడిగించింది. భార్య మాన్యత అనారోగ్యం పాలుకావడంతో గత డిసెంబర్ 6 తేదిన ఒక నెలపాటు పెరోల్ ను మంజూరు చేసింది. వాస్తవానికి 30 రోజుల పెరోల్ గడువు మంగళవారంతో పూర్తికానుంది. అయితే తన భార్య అనారోగ్యంతో బాధపడుతోందని సంజయ దత్ చేసిన విజ్క్షప్తికి పూణే డివిజనల్ కమిషనర్ ప్రభాకర్ దేశ్ ముఖ్ మరో 30 రోజులపాటు పెరోలు గడువును పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. అక్రమ ఆయుధాలు కలిగిఉన్నారనే ఆరోపణలపై సంజయ్ దత్ కు ఐదేళ్ల జైలు శిక్షను సుప్రీం కోర్టు విధించిన సంగతి తెలిసిందే. మాన్యత లివర్ క్యాన్సర్ తో బాధపడుతూ ముంబైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరిన సంగతి తెలిసిందే. -
సంజయ్ దత్ సతీమణి ఆస్పత్రిలో చేరిక!
సంజయ్ దత్ సతీమణి మాన్యత బుధవారం ముంబైలోని గ్లోబల్ ఆస్పత్రిలో చేరారు. మాన్యత హృదయ, కాలేయ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న సంగతి తెలిసిందే. మాన్యతకు కొన్ని వైద్య పరీక్షలు నిర్వహించాల్సి ఉందని గ్లోబల్ ఆస్పత్రి హృదయ, కాలేయ వైద్య నిపుణుడు డాక్టర్ అజయ్ చఘులే తెలిపారు. వైద్య పరీక్షల అనంతరం మాన్యతకు సర్జరీ చేయాల్సిన అవసరం ఉందా లేదా అనే విషయం తెలుస్తుందన్నారు. మాన్యత ఆరోగ్యం క్షీణించడంతో సంజయ్ దత్ 30 రోజుల పెరోల్ పై విడుదలయ్యారు. ముంబై బాంబు పేలుళ్ల కేసులో పూణేలోని ఎర్రవాడ జైలులో సంజయ్ దత్ శిక్ష అనుభవిస్తున్న సంగతి తెలిసిందే. -
సంజయ్ దత్‌కు మళ్లీ పెరోల్.. విడుదల!
బాలీవుడ్ బ్యాడ్‌బాయ్ సంజయ్‌దత్ మరోసారి పెరోల్ మీద విడుదలయ్యాడు. అనారోగ్యంతో బాధపడుతున్న తన భార్య మాన్యతను చూసుకోడానికి అనుమతించాలని అతడు కోరడంతో నెలరోజుల పాటు పెరోల్ మీద విడుదల చేశారు. దీంతో ఎర్రవాడ సెంట్రల్ జైలు నుంచి దత్ విడుదలై ముంబై చేరుకున్నాడు. తన భార్యకు గుండెల్లో నెప్పిగా ఉందని, ఉన్నట్టుండి నెల రోజుల నుంచి బరువు కూడా తగ్గిపోతోందని దత్ చెప్పాడు. ఆమె కాలేయంలో పెద్ద కణితి ఉందని, అలాగే ఆమె హృదయస్పందన కూడా సరిగా లేదని కార్డియాలజిస్టు అజయ్ చౌఘలే తెలిపారు. దీంతో మాన్యతను చూసుకోడానికి వీలుగా సంజూబాబాకు మరోసారి పెరోల్ ఇచ్చారు. ఇంతకుముందు కూడా ఆరోగ్య కారణాలతోనే సంజయ్ దత్‌కు 15 రోజుల పెరోల్ ఇచ్చి, దాన్ని మరో 15 రోజులు పొడిగించారు. దీంతో అక్టోబర్ నెలంతా సంజయ్‌దత్ జైలు బయటే ఉన్నారు. ముంబై పేలుళ్ల కేసులో సంజయ్ దత్‌కు 42 నెలల జైలుశిక్ష పడింది. వాస్తవానికి ఐదేళ్ల శిక్ష పడినా, అప్పటికే 18 నెలల జైలుజీవితం ముగియడంతో మిగిలిన 42 నెలలు మాత్రమే శిక్ష వేశారు.