breaking news
malupu movie
-
ఆ రోజు రాత్రి ఏం జరిగింది?
ఓ యథార్థ ఘటన ఆధారంగా యాక్షన్ థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కిన చిత్రం ‘మలుపు’. సీనియర్ దర్శకుడు రవిరాజా పినిశెట్టి తన పెద్ద కుమారుడు సత్యప్రభాస్ పినిశెట్టి దర్శకత్వంలో రెండో కుమారుడు ఆది పినిశెట్టి హీరోగా నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 19న విడుదల కానుంది. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ-‘‘నా జీవితంలో జరిగిన ఓ సంఘటన ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించాను. ప్రతి సన్నివేశం ఆసక్తికరంగా అనుకోని మలుపులతో సాగుతుంది. డిసెంబరు 31 రాత్రి ఏం జరిగిందనే అంశం ఈ చిత్రానికి హైలైట్‌గా నిలుస్తుంది’’ అని చెప్పారు. ‘‘ ‘రుక్మిణి’ తర్వాత నేను నిర్మించిన స్ట్రయిట్ తెలుగు చిత్రం ఇదే. టెక్నికల్‌గా హై స్టాండర్డ్స్‌లో ఉంటుంది. ఎక్కడా రాజీపడకుండా చిత్రీకరించాం’’ అని నిర్మాత తెలిపారు. నటునిగా నాకు ‘వైశాలి’ కంటే ఈ చిత్రం మంచి పేరు తీసుకొస్తుందన్న నమ్మకం ఉందని హీరో ఆది అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: ప్రసన్-ప్రవీణ్-శ్యామ్, కెమెరా: షణ్ముగ సుందరం. -
ఈ ‘మలుపు’ మంచి గెలుపు కావాలి
యుముడికి మొగుడు, చంటి, పెదరాయుడు... ఇలా పలు విజయవంతమైన చిత్రాలకు దర్శకత్వం వహించిన రికార్డ్ రవిరాజా పినిశెట్టిది. ఇప్పుడాయన పెద్దకొడుకు సత్యప్రభాస్ తండ్రిలాగా మెగాఫోన్ పట్టారు. తొలి ప్రయత్నంగా తన తమ్ముడు, ‘గుండెల్లో గోదారి’ ఫేమ్ ఆది పినిశెట్టి హీరోగా తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో ఓ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. తెలుగులో ‘మలుపు’, తమిళంలో ‘యాగవరాయనుమ్ నా కాక్క’ పేరుతో రవిరాజా పినిశెట్టి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ఫస్ట్ లుక్‌ను నిర్మాత సి. కల్యాణ్, ప్రచార చిత్రాన్ని దర్శకుడు కె.రాఘవేంద్రరావు, డిజిటల్ ప్రచార చిత్రాన్ని గుణ్ణం గంగరాజు ఆవిష్కరించారు. ఈ ‘మలుపు’ సత్యప్రభాస్, ఆదికి గెలుపు కావాలని ఈ సందర్భంగా రాఘవేంద్రరావు శుభాకాంక్షలు అందించారు. ‘రాశీ మూవీస్’ నరసింహారావు, దర్శక, నిర్మాత సాగర్, నటుడు నారాయణరావు తదితరులు ప్రచార చిత్రాలు బాగున్నాయని పేర్కొన్నారు. రవిరాజా పినిశెట్టి మాట్లాడుతూ-‘‘నటుడిగా ఆది ఇప్పటికే నిరూపించుకున్నాడు. దర్శకునిగా సత్యప్రభాస్ తొలి అడుగు వేశాడు. ఇది నా తొలి చిత్రం అయ్యుంటే నేనింత బాగా తీసి ఉండేవాణ్ణి కాదేమో’’ అన్నారు. అన్నయ్య దర్శకత్వంలో నాన్న నిర్మించిన ఈ చిత్రంలో నటించడం ఆనందంగా ఉందని ఆది చెప్పారు. ఈ సినిమా కోసం రెండేళ్లు కష్టపడ్డామనీ, బాగా తీశాననే నమ్మకం ఉందని సత్యప్రభాస్ అన్నారు.