breaking news
maddi Anjaneya swamy
-
అతని వివరాలు తెలియజేస్తే సాయం చేస్తా: సంపూర్ణేష్‌బాబు
సాక్షి, జంగారెడ్డిగూడెం రూరల్: గురవాయిగూడెంలోని శ్రీమద్ది ఆంజనేయస్వామిని సినీ హీరో సంపూర్ణేష్‌బాబు మంగళవారం దర్శించుకున్నారు. స్వామి వారి దర్శనం అనంతరం అర్చకులు వేద ఆశీర్వచనం అందజేశారు. ఈఓ ఆకుల కొండలరావు స్వామివారి ప్రసాదాన్ని, చిత్రపటాన్ని ఆయనకు అందజేశారు. మంగళవారం కావడంతో అధిక సంఖ్యలో భక్తులు స్వామి వారిని దర్శించుకున్నారు. సంపూర్ణేష్‌బాబుకి స్వామివారి ప్రసాదాన్ని అందిస్తున్న ఆలయ ఈఓ వివరాలిస్తే సాయం చేస్తా జంగారెడ్డిగూడెం: సినీ హీరో, బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్‌బాబు జంగారెడ్డిగూడెంలో సందడి చేశారు. స్థానిక బైనేరు వద్ద ఉన్న పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయానికి వెళ్లి స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా సంపూర్ణేష్‌బాబు మాట్లాడుతూ తనను ఈ ప్రాంతానికి ఆహ్వానించిన స్వర్ణకార సంఘ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. తాను నటించిన చిత్రం ఈ నెలలో ఒకటి విడుదల కానుందని, అలాగే రెండు సినిమాలు షూటింగ్ దశలో ఉన్నాయన్నారు. స్వర్ణకార సభ్యులు టి.నరసాపురానికి చెందిన ఒక వ్యక్తి ఆర్థిక పరిస్థితి బాగాలేదని, సహాయపడాలని కోరగా, అతని వివరాలు తనకు తెలియజేస్తే సాయం చేస్తానని సంపూర్ణేష్‌బాబు హామీ ఇచ్చారు. స్వర్ణకార సంఘం అధ్యక్షులు భోగేశ్వరరావు, ఈఓ ఆకుల కొండలరావు, వాడపల్లి శ్రీనివాస్, తుపాల సాయికృష్ణ పాల్గొన్నారు. -
ఈ గుడికి చెట్టే శిఖరం!
మద్ది ఆంజనేయస్వామి చెట్టునే ఆలయ శిఖరంగా చేసుకుని ఆ చెట్టు పేరు మీదే మద్ది ఆంజనేయస్వామిగా వెలిసి దేశంలోనే ప్రముఖ హనుమద్ క్షేత్రంగా పేరుగాంచిన ఆలయం శ్రీమద్ది ఆంజనేయస్వామి దేవస్థానం. పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం మండలం గుర్వాయిగూడెం గ్రామంలో పచ్చని పొలాల మధ్య ఎర్రకాలువను ఆనుకుని మద్దిచెట్టు తొర్రలో వెలిసిన స్వయంభూ క్షేత్రం మద్ది ఆంజనేయస్వామి ఆలయం. 50 సంవత్సరాల క్రితం చిన్న చెట్టు తొర్రలో ఉన్న ఈ దేవాలయం ప్రస్తుతం ప్రముఖ దేవాలయాల జాబితాలో స్థానం సంపాదించుకుంది. స్థలపురాణం పచ్చనిపొలాల నడుమ మద్దివృక్షం కింద ఒక చేతిలో ఫలం, మరో చేతిలో గదతో దర్శనమిచ్చే ఈ స్వామివారు ఇక్కడ స్వయంభూగా అవతరించడం వెనక చాలా లోతైన పురాణ గాథ ఉంది. మద్వాసురుడు అనే రాక్షసుడు త్రేతాయుగంలో రావణసైన్యంలో ఉండేవాడు. రాక్షసుడైనప్పటికీ మద్వాసురుడు ఆధ్యాత్మిక చింతనతో జీవించేవాడు. రామ రావణ యుద్ధంలో రాముని వైపు పోరాడుతున్న ఆంజనేయస్వామి వారిని చూసిన మద్వాసురుడు అస్త్రసన్యాసం చేసి ‘‘హనుమా హనుమా’’ అంటూ తనువు చాలించాడు. అతడే ద్వారయుగంలో మ«ధ్వకుడుగా జన్మించాడు. ఈ యుగంలో కౌరవ, పాండవుల యుద్దంలో కౌరపక్షాన పోరాడుతున్న మధ్వకుడు ఆర్జునునిజెండాపై ఉన్న శ్రీ ఆంజనేయస్వామి వారిని చూసి పూర్వజన్మ స్మృతితో ప్రాణత్యాగం చేశాడు. కలియుగంలో మద్వుడుగా జన్మించి ఆంజనేయస్వామి వారి దర్శనం కోసం అనుక్షణం పరితపించేవాడు. నిత్యం ఎర్రకాలువలో దిగి స్నానమాచరించి ఆంజనేయస్వామి కోసం తపస్సు చేసేవాడు. ఒకరోజు స్నానంచేసి, ఒడ్డుకు చేరబోతున్న మద్వుడు వయోభారంతో తూలి కాలువలో పడిపోబోయాడు. అప్పుడు ఎవరో తనను చెయ్యి పట్టుకుని ఆపినట్లు అనిపించింది. ఎవరా అని చూస్తే, వానరం ఒకటి తన చేయి పట్టుకుని ఒడ్డుకు తీసుకువచ్చి ఒక ఫలాన్ని ఇచ్చింది. అది మొదలు ఆ వానరం రోజూ మద్వుడికి సపర్యలు చేస్తూ ఫలాన్ని ఇచ్చి వెళుతుండేది. ఒకనాడు మద్వుడికి ఆ వానరం ఆంజనేయస్వామిలా గోచరించింది. ‘నేను ఎంత పాపిష్టివాడిని! ఇంతకాలం స్వామివారితో సపర్యలు చేయించుకున్నానా!’ అని బాధపడ్డాడు. ఇంతలో స్వామి ప్రత్యక్షమై ‘‘మద్వా ఇందులో నీ తప్పేమీ లేదు. నీ భక్తికి మెచ్చి నేనే నీకు సేవలు చేశాను కాబట్టి విచారించక వరం కోరుకో’’ అన్నాడు. మద్వుడు ‘‘స్వామీ మీరు ఎల్లప్పుడూ నా చెంత ఉండేలా వరం ప్రసాదించండి’’ అని ప్రార్థించాడు. అప్పుడు స్వామి ‘‘నీవు మద్దిచెట్టుగా అవతరించు. నేను నీ సమీపంలో శిల రూపంలో ఒక చేతిలో ఫలం, మరో చేతిలో గదతో వెలుస్తాను. మనిద్దరినీ కలిపి మద్ది ఆంజనేయస్వామిగా భక్తులు పిలుస్తారు’’ అని చెప్పినట్లు స్థలపురాణం. ప్రదక్షిణలతో పరవశించే దైవం కోరిన కోర్కెల తీరాలంటూ శ్రీమద్ది ఆంజనేయస్వామి వారి ఆలయం చుట్టూ 108 ప్రదక్షిణలు చేస్తుంటారు. రాష్ట్ర నలుమూలల నుంచి భక్తులు ఈ క్షేత్రాన్ని వస్తుంటారు. ముఖ్యంగా వివాహ విషయంలో ఆటంకాలు ఏర్పడిన వారు ఈ స్వామి వారి ఆలయం చుట్టూ 108 సార్లు ప్రదక్షిణలు చేస్తే వెంటనే వివాహం జరుగుతుందని భక్తుల విశ్వాసం. దీక్షల దేవుడు శబరిమలైలో అయ్యప్ప స్వామి మాలధారణకు ఎంత విశిష్టత ఉందో, గుర్వాయిగూడెం శ్రీమద్ది ఆంజనేయస్వామి వారి హనుమద్దీక్షలకు అంత ప్రాముఖ్యత ఉంది. ఏటా హనుమజ్జయంతి, కార్తీక మాసంలో రాష్ట్ర వ్యాప్తంగా హనుమద్ దీక్షలు చేపట్టిన హనుమత్ దీక్షాధారులు శ్రీమద్ది క్షేత్రంలో స్వామి వారి సన్నిధిలో ఇరుముడులు సమర్పిస్తుంటారు. స్వామిని సందర్శించాకనే... గోదావరి జిల్లాల్లో ఏపని మొదలు పెట్టాలన్నా ఈ దేవస్థానాన్ని సందర్శించి ఆ పని మొదలుపెట్టడం ఆనవాయితీ. ఈ ప్రాంతం నుంచి సినీరంగంలో స్థిరపడిన నటులు, దర్శకులు తమ సినిమా ప్రారంభంలో ఈ దేవస్థానాన్ని దర్శించి పూజలు చేయడం ఆనవాయితీ. అదే విధంగా రాజకీయ నాయకులు ఎన్నికల సమయంలో తప్పనిసరిగా దేవస్థానాన్ని సందర్శించి ప్రచారం ప్రారంభించడం అనేక సంవత్సరాలుగా ఆనవాయితీగా వస్తోంది. ఈ ఆలయానికి ఇలా వెళ్లాలి పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం మండలం గుర్వాయిగూడెం శ్రీమద్ది ఆంజనేయస్వామి వారి ఆలయానికి చేరుకోవాలంటే హైదరాబాద్ నుంచి జంగారెడ్డిగూడెం బస్సు ద్వారా చేరుకోవచ్చు. విజయవాడ, ఏలూరు, రాజమండ్రి నుంచి జంగారెడ్డిగూడెంకు బస్సు సర్వీసులు ఉన్నాయి. రైలు ద్వారా చేరాలనుకునేవారు ఏలూరు రైల్వే స్టేషన్ నుంచి జంగారెడ్డిగూడేనికి బస్సు ద్వారా చేరుకోవచ్చు. గన్నవరం విమానాశ్రయం నుంచి 100 కిలోమీటర్ల దూరంలో గల ఈ దేవాలయం చేరుకోవడానికి అనేక రవాణా సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి. – అచ్యుత రాము, సాక్షి, జంగారెడ్డిగూడెం, ప.గో.జిల్లా