breaking news
machine learning startup
-
డిజిటల్ ప్రపంచంలో.. సంపద ఇలా భద్రం..
డిజిటల్ టెక్నాలజీ వినియోగం వేగవంతం కావడంతో కమ్యూనికేషన్, వ్యాపారాల నుంచి హెల్త్‌కేర్, వినోదం వరకు మన జీవితాలన్నింటిలో చాలా మార్పులు వస్తున్నాయి. కృత్రిమ మేథ, మెషిన్ లెర్ణింగ్ మొదలైనవి డేటా విశ్లేషణ, ఆటోమేషన్ వంటి అంశాల్లో విప్లవాత్మక మార్పులు తెస్తున్నాయి. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అప్లికేషన్స్ సౌకర్యవంతంగా ఉంటున్నాయి. రోబోటిక్స్, ఆటోమేషన్‌లాంటివి తయారీ, లాజిస్టిక్స్, వ్యవసాయం లాంటి రంగాల్లో పెను మార్పులు తెస్తున్నాయి. ఇవన్నీ సౌకర్యవంతంగా ఉంటున్నప్పటికీ వీటి వినియోగం విషయంలో బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. పర్సనల్ ఫైనాన్స్‌కి సంబంధించి పోర్ట్‌ఫోలియోలను ఆన్లైన్లో ట్రాకింగ్ చేయడం నుంచి పెట్టుబడుల వరకు అన్నీ కూడా ఫోన్ ద్వారానే చేసే వీలుంటోంది. అయితే, ఈ సౌకర్యం వెనుక మన డిజిటల్ భద్రతకు ముప్పులు కూడా పొంచి ఉంటున్నాయి. ఇన్వెస్టర్ల విషయానికొస్తే తమ పాస్వర్డ్లు లేదా యాప్‌లను సురక్షితంగా ఉంచుకోవడం ఒకెత్తైతే, ఏళ్లతరబడి ఆర్థిక ప్రణాళికలను సైబర్ నేరగాళ్ల నుంచి కాపాడుకోవడం మరో ఎత్తుగా ఉంటోంది. సైబర్ నేరగాళ్లు కేవలం పెద్ద వ్యాపారులు, సంపన్నులనే కాదు.. చిన్న చిన్న ఇన్వెస్టర్లను కూడా టార్గెట్ చేసుకుంటున్నారు. ఫిషింగ్, ర్యాన్సమ్వేర్లాంటివి ప్రయోగిస్తున్నారు. ఫిషింగ్ సంగతి తీసుకుంటే, ఆర్థిక సంస్థలు లేదా అడ్వైజర్ల నుంచి వచి్చనట్లుగా కనిపించేలా ఈమెయిల్స్, మెసేజీల్లాంటివి పంపిస్తారు. మిమ్మల్ని మాయ చేసి పాస్వర్డ్ల్లాంటి వ్యక్తిగత వివరాలు సేకరిస్తారు. ఆ తర్వాత మీ ప్రమేయం లేకుండానే మీ ఖాతాల్లోనుంచి విత్‌డ్రా చేసుకోవడం, ట్రేడింగ్ చేయడంలాంటివి చేసి ఖాతాలను కొల్లగొడతారు. ఇక ఐడెంటిటీ థెఫ్ట్ కేసుల్లో మీ వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలించి, మీ పేరు మీద రుణాలు తీసుకోవడం, మీ ఖాతాలను ఖాళీ చేయడంలాంటివి జరుగుతుంటాయి. ర్యాన్సమ్వేర్ దాడులు మరింత అధునాతనంగా ఉంటాయి. సైబర్ నేరగాళ్లు మీ ఖాతాలను స్తంభింపచేసి, తిరిగి మీ చేతికివ్వాలంటే డబ్బు కట్టాలంటూ బెదిరింపులకు దిగుతారు. మిమ్మల్ని నేరుగా టార్గెట్ చేయకపోయినా మీరు ఆధారపడే ఆర్థిక సేవలను లక్ష్యంగా చేసుకుని మీ లావాదేవీలకు అంతరాయం కలిగించవచ్చు. కొన్నిసార్లు క్రిమినల్స్ నేరుగా పెట్టుబడి ప్లాట్‌ఫాంలలోకి చొరబడి నిధులను దొంగిలించవచ్చు. తప్పుడు ట్రేడింగ్ చేసి నష్టపర్చవచ్చు. అలాగని ఇలాంటి పరిణామాల వల్ల డిజిటల్ సాధనాల మీద నమ్మకాన్ని కోల్పోనక్కర్లేదు. కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే చాలు ఇలాంటి సవాళ్లను అధిగమించవచ్చు. → మీ అకౌంట్లకు పటిష్టమైన పాస్‌వర్డ్‌లను వాడండి. తరచూ వాటిని అప్డేట్ చేస్తూ ఉండండి. పాస్‌వర్డ్‌లను భద్రపర్చుకునేందుకు ఒక పాస్ వర్డ్ మేనేజర్ వెబ్‌సైట్‌ను ఉపయోగించవచ్చు. → మల్టీ–ఫ్యాక్టర్ ఆథెంటికేషన్‌ను ఉపయోగించండి. వీలైన సందర్భాల్లో మీ ఫోన్‌కు వెరిఫికేషన్ కోడ్లు వచ్చేలా జాగ్రత్తలు తీసుకోండి. పర్సనల్ డివైజ్‌లను అన్‌లాక్ చేసేందుకు బయోమెట్రిక్స్‌ను ఎనేబుల్ చేయండి. → ఫిషింగ్, సోషల్ ఇంజినీరింగ్ దాడుల విషయంలో జాగ్రత్తగా ఉండండి. బ్యాంకులు, మ్యుచువల్ ఫండ్లు లేదా ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి వచి్చనట్లుగా అనిపించేలా మోసగాళ్లు ఈమెయిల్స్ లేదా మెసేజీలు పంపిస్తుంటారు. వ్యక్తిగత సమాచారాన్ని ఇచ్చేలా మిమ్మల్ని మభ్యపెట్టొచ్చు. అప్రమత్తత వహించండి. అనుమానం వస్తే వెంటనే ఆ సంస్థను అధికారిక మాధ్యమాల ద్వారా సంప్రదించండి. → డివైజ్‌లను భద్రంగా ఉంచుకోండి. విశ్వసనీయ ప్లాట్‌ఫాంలు, యాప్‌ల ద్వారానే ఆర్థిక లావాదేవీలు నిర్వహించండి. సాఫ్ట్వేర్, ఓఎస్‌లు, యాంటీవైరస్ ప్రోగ్రాంలను అప్డేటెడ్గా ఉంచండి. కీలకమైన డేటా చోరీ కాకుండా డివైజ్ ఎన్క్రిప్షన్ను ఎనేబుల్ చేయండి. డివైజ్‌ల స్క్రీన్‌ను లాక్ చేసి ఉంచండి. ఆటోలాక్ను ఎనేబుల్ చేయండి. సెషన్ హైజాక్ కాకుండా, ట్రాకింగ్‌ను, ఆటో–లాగిన్ రిసు్కలను నియంత్రించేందుకు బ్రౌజర్ నుంచి కుకీలను, హిస్టరీని తొలగించండి. → ఆర్థిక లావాదేవీల కోసం పబ్లిక్ వై–ఫైను వాడొద్దు. ప్రయాణాల్లో కీలకమైన అకౌంట్లు, ఆర్థిక సేవల ప్లాట్‌ఫాంలలోకి లాగిన్ అయ్యేందుకు సురక్షితమైన వీపీఎన్‌ను ఉపయోగించండి. → వ్యక్తిగత సమాచారాన్ని ఆన్లైన్లో షేర్ చేసుకోవడం తగ్గించుకోండి. మీ పుట్టిన రోజు లేదా ఆర్థిక వివరాలను సోషల్ మీడియాలో షేర్ చేసుకోకండి. సైబర్ నేరగాళ్ల బారిన పడే రిసు్కలు ఉన్నాయి.→ బ్యాంకు ఖాతా స్టేట్మెంట్లు, లావాదేవీలను తరచూ పరిశీలించండి. అనధికారిక లావాదేవీలేవైనా కనిపిస్తే సత్వరం గుర్తించొచ్చు. → కీలకమైన డాక్యుమెంట్ల వంటి వాటిని సురక్షితమైన, ఆఫ్‌లైన్ లొకేషన్లలో బ్యాకప్ తీసుకోండి. రాన్సమ్వేర్ రిసు్కలను తగ్గించుకోవచ్చు. → సైబర్ నేరగాళ్లు ఎప్పటికప్పుడు కొత్త పద్ధతుల్లో మోసాలు చేస్తున్నారు. ఇలాంటి వాటి గురించి ఆర్థిక సంస్థలు తరచుగా అప్డేట్లు, టిప్‌లు ఇస్తున్నాయి. వాటిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ, అప్డేట్గా ఉండాలి. -
యాపిల్ చేతికి... హైదరాబాద్ స్టార్టప్ టుప్లేజంప్
యాపిల్ స్టోర్, ప్రాసెస్, బిగ్‌డేటాకు ఊతం హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: అంతర్జాతీయ టెక్నాలజీ దిగ్గజం యాపిల్ హైదరాబాద్‌కు చెందిన మెషిన్ లెర్నింగ్ స్టార్టప్ ‘టుప్లేజంప్’ను సొంతం చేసుకుంది. డీల్ విలువ ఎంతనేది మాత్రం వెల్లడించలేదు. ఈ ఏడాది యాపిల్ ఇప్పటికే రెండు సంస్థల్ని కొనుగోలు చేసింది. మొదట పర్సిప్షోను, రెండు నెలల క్రితం తురీ అనే స్టార్టప్నూ కొనుగోలు చేసింది. టుప్లేజంప్ కొనుగోలుతో యాపిల్ స్టోర్, ప్రాసెస్, బిగ్‌డేటా విజువలైజేషన్ మరింత బలోపేతమవుతుందని కంపెనీ ప్రతినిధి తెలిపారు. సత్యప్రకాశ్ బుద్ధవరపు, రోహిత్ రాయ్ కలిసి 2013లో టుప్లేజంప్ను ప్రారంభించారు. కొనుగోలు అనంతరం టుప్లేజంప్ వెబ్సైట్ పనిచేయడం మానేసింది. టుప్లేజంప్ టీమ్‌కు అపాచి స్పార్క్ ప్రాసెసింగ్ ఇంజిన్, కాసెండ్రా ఎస్‌క్యూఎల్ డేటాబేస్, అపాచి కఫ్కా డిస్ట్రిబ్యూటెడ్ హై-త్రోపుట్ సబ్‌స్క్రైబ్ సిస్టమ్స్ల్లోనూ పరిచయం ఉంది. మే నెలలో దేశంలో పర్యటించిన యాపిల్ సీఈఓ టిమ్ కుక్ హైదరాబాద్‌లో యాపిల్ మాప్స్ డెవలప్మెంట్ సెంటర్‌ను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించడం తెలిసిందే. -
లండన్ స్టార్టప్ ను ట్విట్టర్ కొనుగోలు
న్యూయార్క్ : మైక్రో బ్లాగింగ్ వెబ్ సైట్ ట్విట్టర్, లండన్ కు చెందిన 18నెలల స్టార్టప్ మ్యాజిక్ పోని టెక్నాలజీని కొనుగోలు చేసింది. మిషన్ లెర్నింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సామర్థ్యాలను విస్తరించేందుకు ట్విట్టర్ ఈ కొనుగోలు చేపట్టింది. నిలిచిపోయిన వృద్ధిని పెంచడం కోసం ప్రముఖ మ్యూజిక్ స్ట్రీమింగ్ సర్వీసు సౌండ్ క్లౌడ్ లో 700లక్షల డాలర్ల పెట్టుబడులు ప్రకటించిన తర్వాతి వారంలోనే ఈ కొనుగోలును ప్రకటించడం విశేషం. మిషన్ లెర్నింగ్ సామర్థ్యాలను విస్తరించుకోవడం కోసం మ్యాజిక్ పోని కొనుగోలు సాయపడుతుందని, 2014లో ఇమేజ్ సెర్చ్ స్టార్టప్ మ్యాడ్ బిట్స్ కొనుగోలుతో ఈ విస్తరణ ప్రారంభించామని ట్విట్టర్ సీఈవో జాక్ డోర్సే బ్లాగ్ లో పోస్టు చేశారు. 2015 జూన్ లో మరో మిషన్ లెర్నింగ్ స్టార్టప్ వెట్ ల్యాబ్ ను కొనుగోలు చేసినట్టు పేర్కొన్నారు. మ్యాజిక్ పోని టెక్నాలజీ కొనుగోలుకు ట్విట్టర్ ఎంతమొత్తంలో చెల్లించబోతుందో పేర్కొనలేదు. అయితే బోనస్ లతో కలిపి దాదాపు 1500లక్షల డాలర్లను ట్విట్టర్ ఆ కంపెనీకి చెల్లించస్తుందని టెక్నాలజీ వెబ్ సైట్ టెక్ క్రంచ్.కామ్ తెలిపింది. లైవ్, వీడియోల్లో తమ బలాన్ని విస్తరించేందుకు, ఉత్తేజపూర్వకమైన సృజనాత్మక అవకాశాలను అందిపుచ్చుకోవడానికి మ్యాజిక్ పోని టెక్నాలజీ ద్వారా ట్విట్టర్ కు ద్వారాలు తెరుచుకుంటాయని కంపెనీ పేర్కొంది. ప్రపంచ స్థాయి ప్రతిభతో లెర్నింగ్ టీమ్స్ బలాన్ని నిరంతరంగా పెంచడం కోసం ఇది ట్విట్టర్ కు సహకరిస్తుందని డోర్సే తెలిపారు. లోతైన లెర్నింగ్ రీసెర్చ్ అనేది తమ ప్రపంచాన్ని మెరుగుపరుస్తుందని, తమ పనిని, లెర్నింగ్స్ ను కమ్యూనిటీలతో పెంచుకోవడం కోసం తోడ్పడుతుందని డోర్సే పేర్కొన్నారు. మరోవైపు నుంచి ఈ మైక్రోబ్లాగింగ్ సైట్ ను టెక్నాలజీ దిగ్గజం గూగుల్ సొంతంచేసుకోబోతుందని రూమర్లు చక్కర్లు కొడుతున్నాయి. ట్విట్టర్ ను సొంతం చేసుకునే రేసులో గూగుల్ ముందంజలో ఉందని, దాని తర్వాతి స్థానంలో ప్రపంచ మీడియా ప్లేయర్ కంకాస్ట్ పోటీపడుతుందని తెలుస్తోంది. అంతేకాక ఇంటర్నెట్ ఆధారిత సంస్థ యాహులోనైనా దీన్ని విలీనం చేయాలని ట్విట్టర్ ఎగ్జిక్యూటివ్ లు ఆ కంపెనీతో సంప్రదింపులు జరిపినట్టు రిపోర్టులు వచ్చాయి.