breaking news
Macau Open Grand Prix Gold tournament
-
'మకావు'లో సింధు కేక
మళ్లీ మన ‘రాకెట్’ మెరిసింది. రెండు వారాల క్రితం చైనా ఓపెన్ ప్రీమియర్ సూపర్ సిరీస్ టోర్నీలో సైనా నెహ్వాల్, శ్రీకాంత్ సాధించిన అపూర్వ విజయాలు మదిలో మెదులుతుండగానే... మరో తెలుగు తేజం పి.వి.సింధు తీపి కబురు అందించింది. మకావు ఓపెన్ గ్రాండ్‌ప్రి గోల్డ్ టోర్నమెంట్లో ఈ హైదరాబాద్ అమ్మాయి దిగ్విజయంగా తన టైటిల్‌ను నిలబెట్టుకుంది. ఈ ఏడాదిని విజయంతో సగర్వంగా ముగించింది. టైటిల్ నిలబెట్టుకున్న తెలుగు తేజం ⇒ ఫైనల్లో అలవోక విజయం ⇒ కెరీర్లో మూడో గ్రాండ్‌ప్రి గోల్డ్ టైటిల్ ⇒ రూ. 5 లక్షల 60 వేల ప్రైజ్‌మనీ సొంతం మకావు: నిలకడగా రాణిస్తే ఫలితాలు వాటంతట అవే వస్తాయని భారత బ్యాడ్మింటన్ స్టార్ పి.వి.సింధు నిరూపించింది. అపార ప్రతిభ సొంతమైనా... ఆటలో నిలకడలేమి కారణంగా ఈ హైదరాబాద్ అమ్మాయి ఈ సీజన్‌ను ఒక్క టైటిల్ కూడా నెగ్గకుండానే ముగిస్తుందా అనే అనుమానం కలిగింది. కానీ ఈ అనుమానాలన్నీ పటాపంచలు చేస్తూ ఈ సంవత్సరం చివరి గ్రాండ్‌ప్రి గోల్డ్ టోర్నమెంట్ మకావు ఓపెన్‌లో 19 ఏళ్ల సింధు చాంపియన్‌గా నిలిచింది. ఆదివారం జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో రెండో సీడ్, డిఫెండింగ్ చాంపియన్ సింధు 21-12, 21-17తో కిమ్ హ్యో మిన్ (దక్షిణ కొరియా)పై విజయం సాధించింది. విజేతగా నిలిచిన సింధుకు 9 వేల డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. 5 లక్షల 60 వేలు)తోపాటు 7 వేల ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. 45 నిమిషాలపాటు జరిగిన ఈ ఫైనల్లో సింధు ఆద్యంతం అద్భుత ఆటతీరుతో ఆకట్టుకుంది. కళ్లు చెదిరే స్మాష్‌లు... నెట్ వద్ద అప్రమత్తత... ర్యాలీల్లో పైచేయి... ఇలా ప్రతి అంశంలో ఈ తెలుగు తేజం తన ఆధిపత్యాన్ని చాటుకొని కొరియా అమ్మాయికి ఏ దశలోనూ తేరుకునే అవకాశం ఇవ్వలేదు. సెమీఫైనల్లో ప్రపంచ 19వ ర్యాంకర్ యూ సున్ (చైనా)ను ఓడించిన కిమ్ హ్యో మిన్ ఫైనల్లో మాత్రం సింధు దూకుడుకు అడ్డుకట్ట వేయడంలో విఫలమైంది. తొలి గేమ్ ఆరంభంలో సింధు 0-3తో వెనుకబడినా ఆ వెంటనే కోలుకొని స్కోరును 8-8 వద్ద సమం చేసింది. ఆ తర్వాత సింధు ఒక్కసారిగా విజృంభించి వరుసగా ఐదు పాయింట్లు నెగ్గి 13-8తో ఆధిక్యంలోకి వెళ్లింది. కిమ్ పుంజుకునేందుకు కృషి చేసినా సింధు అవకాశమివ్వకుండా ఈసారి వరుసగా ఆరు పాయింట్లు నెగ్గి 19-9తో ముందంజ వేసింది. అదే జోరులో తొలి గేమ్‌ను దక్కించుకుంది. రెండో గేమ్‌లో సింధుకు కాస్త పోటీ ఎదురైంది. ఒకదశలో ఇద్దరి మధ్య తేడా ఒక పాయింట్ ఉంది. కానీ కీలకదశలో ఈ హైదరాబాద్ అమ్మాయి పైచేయి సాధించి మూడు పాయింట్లు నెగ్గి 20-16తో ఆధిక్యాన్ని సంపాదించి, అదే ఉత్సాహంలో మరో పాయింట్ కైవసం చేసుకొని విజయాన్ని ఖాయం చేసుకుంది. సింధు కెరీర్లో ఇది మూడో గ్రాండ్‌ప్రి గోల్డ్ టైటిల్. గతేడాది ఆమె మలేసియా ఓపెన్, మకావు ఓపెన్ టైటిల్స్‌ను సాధించింది. ఈ ఏడాది సింధు ప్రపంచ చాంపియన్‌షిప్‌లో, ఆసియా చాంపియన్‌షిప్‌లలో కాంస్య పతకాలు గెలిచింది. కామన్వెల్త్ గేమ్స్, ఆసియా క్రీడల్లో, ఉబెర్ కప్‌లోనూ కాంస్య పతకాలు సొంతం చేసుకుంది. ఇండియన్ ఓపెన్ గ్రాండ్‌ప్రి గోల్డ్ టోర్నీలో రన్నరప్‌గా నిలిచింది. స్విస్ ఓపెన్‌లో సెమీస్‌లో ఓడిన సింధు... డెన్మార్క్ ఓపెన్, ఆస్ట్రేలియన్ ఓపెన్, సింగపూర్ ఓపెన్లలో మాత్రం క్వార్టర్ ఫైనల్స్‌లో వెనుదిరిగింది. ఒకే అంతర్జాతీయ టోర్నీని వరుసగా రెండుసార్లు గెల్చుకున్న రెండో భారతీయ క్రీడాకారిణిగా సింధు నిలిచింది. గతంలో సైనా నెహ్వాల్ ఈ ఘనతను మూడుసార్లు సాధించింది. సంతోషంగా ఉంది విజయంతో 2014 సంవత్సరాన్ని ముగించడం సంతోషంగా ఉంది. వరుసగా రెండో ఏడాది మకావు గ్రాండ్‌ప్రి గోల్డ్ టైటిల్‌ను గెల్చుకోవడం చాలా ఆనందంగా అనిపిస్తోంది. నా ప్రత్యర్థి ఫైనల్‌కు ముందు అగ్రశ్రేణి క్రీడాకారిణులను ఓడించింది. కాబట్టి ఆమెను బలహీన ప్లేయర్‌గా చెప్పలేం. వరుస గేమ్‌లలో మ్యాచ్ ముగిసినా ఆమె గట్టి పోటీ ఇవ్వడంతో గెలుపు కోసం శ్రమించాల్సి వచ్చింది. నా ఆట పట్ల సంతృప్తిగా ఉన్నాను. కెరీర్లో గుర్తుంచుకోదగ్గ విజయాలు ఈ ఏడాది నాకు లభించాయి. వరల్డ్ చాంపియన్‌షిప్‌లో, ఆసియా క్రీడల్లో కాంస్యం గెలిచాను. కొన్ని పరాజయాలు ఉన్నా ఎలాంటి బాధ లేదు. గ్లాస్గోలో స్వర్ణంతో పాటు ఏషియాడ్‌లో వ్యక్తిగత పతకం గెలవాల్సింది. మరింత కష్టపడి వచ్చే సంవత్సరం ఇంకా మెరుగైన ఫలితాలు సాధిస్తాను. - పీవీ సింధు -
ఫైనల్లో సింధు
మకావు: అంతర్జాతీయస్థాయిలో నిలకడగా రాణిస్తున్న భారత బ్యాడ్మింటన్ స్టార్ పి.వి.సింధు తన కెరీర్లో మరో టైటిల్‌పై గురి పెట్టింది. మకావు ఓపెన్ గ్రాండ్‌ప్రి గోల్డ్ టోర్నమెంట్లో ఈ హైదరాబాద్ అమ్మాయి వరుసగా రెండో ఏడాది ఫైనల్లోకి దూసుకెళ్లింది. డిఫెండింగ్ చాంపియన్ హోదాలో బరిలోకి దిగిన సింధు సెమీఫైనల్లో అలవోక విజయంతో టైటిల్ పోరుకు అర్హత సాధించింది. ఎనిమిదో సీడ్ బుసానన్ ఒంగ్‌బుమ్‌రుంగ్‌పాన్ (థాయ్‌లాండ్)తో శనివారం జరిగిన సెమీఫైనల్లో రెండో సీడ్ సింధు 21-14, 21-15తో గెలిచింది. ఆదివారం జరిగే ఫైనల్లో ప్రపంచ 91వ ర్యాంకర్ కిమ్ హ్యో మిన్ (దక్షిణ కొరియా)తో సింధు అమీతుమీ తేల్చుకుంటుంది. రెండో సెమీఫైనల్లో కిమ్ హ్యో మిన్ 15-21, 24-22, 21-10తో ఏడో సీడ్ సున్ యు (చైనా)పై సంచలన విజయం సాధించింది. ఇప్పటికి రెండు (మకావు ఓపెన్, మలేసియా ఓపెన్) గ్రాండ్‌ప్రి గోల్డ్ టోర్నీ టైటిల్స్ నెగ్గిన సింధు... ప్రపంచ చాంపియన్‌షిప్‌లో రెండు కాంస్యాలు, ఆసియా చాంపియన్‌షిప్‌లో కాంస్యం, ఆసియా క్రీడల్లో కాంస్యం, కామన్వెల్త్ క్రీడల్లో కాంస్యం, ఉబెర్ కప్‌లో కాంస్యం సాధించింది. గతంలో బుసానన్‌తో ఆడిన నాలుగు పర్యాయాల్లోనూ నెగ్గిన సింధుకు ఐదోసారి కూడా అంతగా పోటీ ఎదురుకాలేదు. 42 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో సింధు పదునైన స్మాష్‌లతో ఆకట్టుకుంది. తొలి గేమ్ ఆరంభంలో బుసానన్ 5-2తో ముందంజ వేసినా సింధు తేరుకున్నాక పరిస్థితి మారిపోయింది. స్కోరును సమం చేయడంతోపాటు సింధు 13-9తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఆ తర్వాత స్కోరు 15-14 వద్ద ఉన్నపుడు ఒక్కసారిగా చెలరేగిన ఈ హైదరాబాద్ అమ్మాయి వరుసగా ఆరు పాయింట్లు నెగ్గి గేమ్‌ను సొంతం చేసుకుంది. రెండో గేమ్‌లోనూ సింధు తన ఆధిపత్యాన్ని కొనసాగించింది. స్కోరు 12-12 వద్ద సమంగా ఉన్నపుడు సింధు మళ్లీ విజృంభించి వరుసగా ఆరు పాయింట్లు సాధించి 18-12తో ఆధిక్యంలోకి వెళ్లింది. అదే జోరులో రెండో గేమ్‌తోపాటు మ్యాచ్‌లో విజయాన్ని దక్కించుకుంది. పురుషుల సింగిల్స్ సెమీఫైనల్లో భారత యువతార హెచ్ఎస్ ప్రణయ్ 16-21, 21-16, 12-21తో వింగ్ కీ వోంగ్ (హాంకాంగ్) చేతిలో పోరాడి ఓడిపోయాడు. గంటపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో ప్రణయ్ సంధించిన స్మాష్‌లకు వింగ్ కీ వోంగ్ అద్భుతమైన డిఫెన్స్‌తో జవాబిచ్చాడు. మూడో గేమ్‌లో సుదీర్ఘంగా సాగిన పలు ర్యాలీల్లో వింగ్ కీ వోంగ్ పైచేయి సాధించి ప్రణయ్ ఆశలను వమ్ము చేశాడు. -
సింధు టైటిల్ నిలబెట్టుకునేనా!
మకావు: హాంకాంగ్ ఓపెన్‌లో నిరాశాజనక ఆటతీరు కనబర్చిన బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు ఇప్పుడు కొత్త సవాల్‌కు సిద్ధమైంది. మంగళవారంనుంచి ప్రారంభం కానున్న మకావు ఓపెన్ గ్రాండ్ ప్రి గోల్డ్ టోర్నీలో ఆమె రెండో సీడ్‌గా బరిలోకి దిగుతోంది. ఈ టోర్నీ డిఫెండింగ్ చాంపియన్, ప్రస్తుతం ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 10వ స్థానంలో ఉన్న సింధు తొలి రౌండ్లో హుంగ్ షీ హన్ (చైనీస్ తైపీ)తో తలపడుతుంది. లక్షా 20 వేల డాలర్ల ప్రైజ్‌మనీ గల ఈ టోర్నీలో భారత్‌నుంచి తొమ్మిది మంది షట్లర్లు బరిలోకి దిగుతున్నారు. మరో భారత క్రీడాకారిణి పీసీ తులసి కూడా చైనీస్ తైపీకే చెందిన సు య చింగ్‌ను మొదటి రౌండ్లో ఎదుర్కొంటుంది. పురుషుల విభాగం తొలి రౌండ్లో అజయ్ జైరాం... కజుమస సకాయ్ (జపాన్)తో, హెచ్ఎస్ ప్రణయ్... షి కు చున్ (చైనీస్ తైపీ)తో పోటీ పడతారు. యాంగ్ చి చీ (చైనీస్ తైపీ)ని సౌరభ్‌వర్మ ఎదుర్కోనుండగా, అరవింద్ భట్‌కు క్వాలిఫయర్‌తో ఆడే అవకాశం దక్కింది. హైదరాబాద్‌కు చెందిన సాయిప్రణీత్ కూడా ఈ టోర్నీలో తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాడు. వూన్ కాక్ హాంగ్ (మలేసియా)తో ప్రణీత్ మొదటి మ్యాచ్ ఆడతాడు. పురుషుల డబుల్స్‌లో అక్షయ్ దివాల్కర్-ప్రణవ్ చోప్రా జోడి కూడా బరిలో నిలిచింది.