లంచ్ భేటీతో తెరపడేనా..?
సాక్షి, న్యూఢిల్లీ : భారత ప్రధాన న్యాయమూర్తిపై నలుగురు సీనియర్ న్యాయమూర్తుల బహిరంగ ఆరోపణల నేపథ్యంలో నెలకొన్న సంక్షోభానికి తెరపడే సంకేతాలు చోటుచేసుకున్నాయి. రెబెల్ న్యాయమూర్తులతో మంగళవారం ప్రధాన న్యాయమూర్తి సమావేశం కావడం,వారు లేవనెత్తిన అంశాలను పరిశీలించేందుకు సంసిద్ధత వ్యక్తం చేయడంతో సానుకూల పరిష్కారం లభిస్తుందన్న అంచనాలు వెల్లడయ్యాయి. మరోవైపు సీనియర్ న్యాయమూర్తులు జస్టిస్ జే. చలమేశ్వర్, జస్టిస్ రంజన్ గగోయ్, జస్టిస్ మదన్ బీ లోకూర్, జస్టిస్ కురియన్ జోసెఫ్‌లతో ప్రధాన న్యాయమూర్తి బుధవారం మధ్యాహ్న భోజన భేటీ అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.
లంచ్ భేటీలో చాలావరకూ సంక్షోభానికి పరిష్కారం లభిస్తుందని భావిస్తున్నారు. సోమవారం వాడివేడిగా జరిగిన తేనీరు భేటీ అనంతరం నలుగురు సీనియర్ న్యాయమూర్తులతో ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రా సానుకూల వాతావరణంలో సమావేశం కావడం మరోవైపు నేటి విందు భేటీతో క్రమంగా సంక్షోభానికి తెరపడవచ్చన్న వాదన వినిపిస్తోంది. ప్రతి వారం ఓ న్యాయమూర్తి ఇంట్లో జరిగే విందుకు ఆ జడ్జీ ప్రాంతానికి చెందిన వంటకాలతో విందు ఇవ్వడం పరిపాటిగా వస్తోంది.
ఈ క్రమంలో బుధవారం విందు సమావేశంలో సామరస్య వాతావరణంలో చర్చలు జరుగుతాయని భావిస్తున్నారు. కేసుల కేటాయింపుపై ఓ పారదర్శక వ్యవస్థ ఏర్పాటు చేసేలా సీనియర్ జడ్జీలు తెచ్చిన ప్రతిపాదనపైనా సమావేశంలో ఓ అంగీకారానికి రావచ్చని భావిస్తున్నారు.