breaking news
Lpg vehicles
-
ఎల్పీజీ వాహన వినియోగాన్ని ప్రోత్సహించాలి
న్యూఢిల్లీ: వాహన కాలుష్యాన్ని అరికట్టే దిశగా చర్యలు తీసుకుంటున్న కేంద్ర ప్రభుత్వం ఆటో ఎల్పీజీ వంటి చౌకైన ప్రత్యామ్నాయాలపై కూడా దృష్టి సారించాలని ఇండియన్ ఆటో ఎల్పీజీ సంస్థల సమాఖ్య (ఐఏసీ) కోరింది. సబ్సిడీపై విక్రయించేందుకు విద్యుత్, హైబ్రీడ్ వాహనాల కోసం రూ. 10,000 కోట్ల స్కీమును ప్రకటించడం స్వాగతిస్తున్నామని, అదే సమయంలో ఆటో ఎల్పీజీ వాహనాల వినియోగాన్ని సైతం ప్రోత్సహించాలని విజ్ఞప్తి చేసింది. మిగతా ఇంధనాలతో పోలిస్తే మెరుగైన ఆటో ఎల్పీజీ వంటి గ్యాస్ ఇంధన వినియోగదారులకు కూడా సమాన అవకాశాలు కల్పించాలని పేర్కొంది. ఇందుకోసం సబ్సిడీలు ఇవ్వనక్కర్లేదని.. విధానాలపరంగా ఆటో ఎల్పీజీపై జీఎస్టీని తగ్గించడం తదితర చర్యలు తీసుకుంటే చాలని ఐఏసీ ఒక ప్రకటనలో పేర్కొంది. ‘ప్రపంచంలోనే అత్యంత కాలుష్యమయమైన నగరాల జాబితాలో కొన్ని భారతీయ నగరాలు కూడా ఉన్నాయి. ప్రస్తుతం దేశీయంగా 65 శాతం విద్యుదుత్పత్తి శిలాజ ఇంధనాల నుంచే జరుగుతోంది. ఇక ఎలక్ట్రిక్ వాహనాలు పూర్తి స్థాయిలో వినియోగంలోకి రావాలంటే మరో రెండు దశాబ్దాలు పట్టేసే అవకాశం ఉంది. నగరాల్లో స్వచ్ఛమైన గాలి కోసం 20 ఏళ్లు ఆగే పరిస్థితి ఉందా.. అంటే లేదనే చెప్పాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఇవాళ్టి రోజున కాలుష్య సమస్యను అరికట్టేందుకు తగు తక్షణ పరిష్కారమార్గాలు కనుగొనాల్సిన అవసరం ఉంది. ఇందుకు ఆటో ఎల్పీజీ ఒక మంచి ప్రత్యామ్నాయం‘ అని ఐఏసీ డైరెక్టర్ జనరల్ సుయశ్ గుప్తా తెలిపారు. -
సమ్మర్లో బైకులపై కేర్‌ఫుల్
మైదుకూరు(చాపాడు) : గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి ఎండలు మొదలయ్యాయి. గత రెండు నెలల్లోకంటే ఎక్కువగా మే నెలలో ఎండలు మండిపోతున్నాయి. సాయంత్రమవుతున్నా భానుడి ప్రతాపం ఏ మాత్రం తగ్గటం లేదు. ఈ తరుణంలో ప్రతి ఒక్కరూ తాము ఎండ తాపం నుంచి ఏ విధంగా సేద తీరాలనే ఆలోచిస్తుంటారు. కానీ ప్రజల ఆవసరాల కోసం వినియోగించే వాహనాలపై యజమానులు తగిన శ్రద్ధ చూపాలని, లేకపోతే ఎండలకు వాహనాలు తెబ్బతినటమే కాకుండా.. పెట్రోల్, డీజిల్, గ్యాస్ వంటి ఇంధనాలపై మరింత అధనంగా ఖర్చు చేయాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు ఆటో మొబైల్ నిపుణులు. ► ద్విచక్ర వాహనాలు ఎక్కువ సేపు ఎండలో ఉండటం వల్ల ట్యాంకుల్లోని పెట్రోల్, డిజిల్ సూర్యార్పణం అయిపోతుంది. వాహనాల కలర్ కూడా షేడ్ అయి, కొత్త బండి కూడా పాత బండిలాగా కన్పిస్తుంది. ► వాహనాలు పార్క్ చేసేటప్పుడు వాటిపై తప్పనిసరిగా కవర్లు కప్పి ఉంచాలి, రాత్రి సమయాల్లో పెట్రోలు పట్టించుకోవటం మేలు. ఆ సమయంలో ఎండతీవ్రత తక్కువగా ఉండి పెట్రోలు ఎక్కువగా ఆవిరి కాకుండా ఉంటుంది. ► అధిక వేడి వల్ల టైర్లలో తరచూ గాలి తగ్గిపోతూ ఉంటుంది. గమనించి సరైన మోతాదులో గాలి నింపుకోవాలి. గాలి తక్కువ ఉండి ఎక్కువ కాలం వాహనాన్ని నడిపితే టైర్ల మన్నిక తగ్గిపోతుంది. ► వేసవిలో ద్విచక్ర వాహనాల్లో సుదూర ప్రయాణాలు చేయకపోవటం మంచిది. తప్పనిసరి పరిస్థితుల్లో చేయాల్సి వస్తే ప్రతి 50 కిలో మీటర్లకొకసారి బండిని 15 నిమిషాలు ఆఫ్ చేయాలి. దీని వల్ల ఇంజిన్ చల్లబడి అధిక మన్నిక వస్తుంది. ► ఎండ వల్ల ఇంజిన్ ఆయిల్ త్వరగా తన శక్తిని కోల్పోతుంది. దీని వల్ల ఇంజిన్ మన్నిక తగ్గుతుంది. కాబట్టి ఇంజిన్ ఆయిల్‌ను 15 రోజులకొకసారి చెక్ చేసుకోవాలి. వారంలో ఒకసారైనా బ్రేక్ షూలు, రబ్బర్ విడి భాగాలు చెక్ చేసుకోవాలి. అధిక వేడి వల్ల రబ్బర్ విడి భాగాలు త్వరగా పాడవుతాయి. ► రే డియేటర్లో నీళ్లను తరచూ చెక్ చేసుకోవాలి. నిర్లక్ష్యం చేస్తే ఇంజిన్ సీజ్ అయ్యే ప్రమాదం ఉంది. రేడియేటర్లలో నీళ్లకంటే కూలెంటు ఆయిల్ వాడటం మంచిది. ఇంజిన్ ఆయిల్ తగ్గే ప్రమాదం ఉండటంతో అప్పుడప్పుడూ అయిల్ లెవెల్ చెక్ చేసుకోవాలి. ► ఎండాకాలం పూర్తయ్యే వరకు కొత్త టైర్లు వాడాలి. సెకండ్ హ్యాండ్, చైనా, బటన్ టైర్ల జోలికి వె ళ్లకపోవటం మంచిది. ► ఇప్పుడొస్తున్న వాహనాలన్నీ ఫ్యూజులు, కంప్యూటర్లతో అనుసంధానం చేయబడి ఉంటున్నాయి. కావున వాహనంలోని వైరింగ్ వ్యవస్థను ప్రతి 15 రోజులకోసారి క్షుణ్నంగా చెక్ చేసుకోవాలి. ► ఎల్పీజీ వాహనలు ఉపయోగించే వారు ఈ వేసవిలో వాటికి దూరంగా ఉండటం మంచిది. అధిక ఉష్ణోగ్రతల వల్ల గ్యాస్ అధిక పీడనానికి గురయ్యే ప్రమాదం ఉంది. తప్పనిసరి పరిస్థితుల్లో వాడాల్సి వస్తే ఉదయం, సాయంత్రం వేళల్లో వాడటం మంచిది.