breaking news
Lottery center
-
జాక్‌పాట్ కొట్టిన మెకానిక్.. లాటరీలో రూ.25 కోట్లు
మాండ్య: కర్ణాటకకు చెందిన స్కూటర్ మెకానిక్ ఒకరు జాక్‌పాట్ కొట్టేశారు. మాండ్య జిల్లా పాండవపురకు చెందిన అల్తాఫ్ పాషాకు కేరళ ప్రభుత్వం నిర్వహించే తిరుఓనమ్ లాటరీలో ఏకంగా రూ.25 కోట్లు దక్కాయి. కేరళలోని స్నేహితుడికి అప్పుడప్పుడు వెళ్లే అల్తాఫ్ ప్రతిసారీ అక్కడ లాటరీ టిక్కెట్ కొనడం అలవాటు. ఇటీవల అక్కడికి వెళ్లిన అల్తాఫ్ వయనాడ్ జిల్లా సుల్తాన్ బాతెరీలో రూ.500 పెట్టి టిక్కెట్ కొనుగోలు చేశారు. ఈ లాటరీ ఈ నెల 9న తిరువనంతపురంలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి డ్రా తీశారు. అల్తాఫ్‌ను మొదటి బహుమతి వరించింది. అల్తాఫ్ కొన్న టీజీ 43422 నంబర్ టిక్కెట్ ఒకటీ రెండూ కాదు ఏకంగా రూ.25 కోట్లు గెలుచుకున్న విషయాన్ని వయనాడ్ జిల్లా పనమారమ్‌లోని లాటరీ నిర్వాహకులు ఫోన్ చేసి చెప్పారు. మొదట్లో నమ్మలేదు. కానీ, ఆ తర్వాత నిజమేనని బంధువులు చెప్పడంతో ఎగిరి గంతేశారు. లాటరీ సొమ్ము కోసం కుటుంబంతో కలిసి తిరువనంతపురం వెళ్లారు. చేతిలో డబ్బులు లేకపోవడంతో ఇటీవలే ఆ టిక్కెట్‌ను తన పక్క దుకాణదారుకు అమ్మజూపగా, కొనేందుకు నిరాకరించాడని అల్తాఫ్ తెలిపారు. గంటలోనే లాటరీ విజేతగా నిలిచినట్లు తనకు సమాచారం అందిందన్నారు.‘బెంగళూరులో సెటిలవుతా.నా కూతురి పెళ్లి ఘనంగా చేద్దామనుకుంటున్నా. అప్పులన్నీ తీర్చేస్తా’అని అల్తాఫ్ ఆనందంతో చెప్పారు. రూ.25 కోట్ల మొత్తంలో అన్ని రకాల పన్నులు పోను అల్తాఫ్ చేతికి రూ.13 కోట్లు వస్తాయని చెబుతున్నారు. -
లాటరీ కేంద్రంపై పోలీసుల దాడి
హైదరాబాద్ : లాటరీల పేరుతో జనాన్ని మోసం చేస్తున్న కేంద్రంపై శుక్రవారం దాడి చేసిన పోలీసులు ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. నగరంలోని కుషాయిగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలోని లక్కీ ఎంటర్ప్రైజెస్ పేరుతో లాటరీలు నిర్వహిస్తుండటంతో పోలీసులు దాడి చేశారు. కేంద్రాన్ని నడుపుతున్న నిర్వాహకుడితో పాటు మరో వ్యక్తిని అదుపులోకి తీసుకున్న ఎస్వోటీ పోలీసులు పరారీలో ఉన్న ముగ్గురి కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు.