breaking news
ligalise
-
రాష్ట్రపతి, గవర్నర్ ఆమోదం లేకుండానే చట్టాలుగా ఆ 10 బిల్లులు
చెన్నై/న్యూఢిల్లీ: తమిళనాడు ప్రభుత్వానికి, గవర్నర్ ఆర్.ఎన్.రవికి మధ్య వివాదానికే గాక అంతిమంగా సుప్రీంకోర్టు చరిత్రాత్మక తీర్పుకు కారణమైన 10 బిల్లులు ఎట్టకేలకు చట్టంగా మారాయి. ఆ క్రమంలో మరో సంచలనానికి కారణమయ్యాయి. దేశ చరిత్రలోనే తొలిసారిగా గవర్నర్ గానీ, రాష్ట్రపతి గానీ ఆమోదించకుండానే చట్టంగా మారిన బిల్లులుగా చరిత్ర సృష్టించాయి! ఇది భారత శాసననిర్మాణ చరిత్రలోనే కనీవిని ఎరుగని సంఘటనగా నిలిచిపోనుంది. ఆ 10 బిల్లులను అసెంబ్లీ రెండోసారి ఆమోదించి పంపినా గవర్నర్ ఆమోదముద్ర వేయకుండా రాష్ట్రపతి పరిశీలనకు పంపడం, అది చట్టవిరుద్ధమని సుప్రీంకోర్టు తేల్చడం తెలిసిందే. వాటికి గవర్నర్ ఆమోదం లభించినట్టుగానే పరిగణిస్తున్నట్టు పేర్కొంటూ ఆర్టికల్ 142 కింద తనకు సంక్రమించిన విశేషాధికారాల ద్వారా ఏప్రిల్ 8న తీర్పు వెలువరించింది. దాంతో గవర్నర్ గానీ, రాష్ట్రపతి గానీ లాంఛనంగా ఆమోదించకుండానే సదరు 10 బిల్లులకు స్టాలిన్ సర్కారు చట్టబద్ధత కల్పించగలిగింది. తీర్పు పూర్తి ప్రతి శుక్రవారం రాత్రి అందుబాటులోకి రాగానే ఈ మేరకు గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. సుప్రీంకోర్టు తీర్పు ఆధారంగానే వాటికి చట్టరూపం కల్పిస్తున్నట్టు అందులో స్పష్టంగా పేర్కొంది. వీటిలో తమిళనాడు వర్సిటీలు, ఫిషరీస్ వర్సిటీ, వైస్ చాన్స్లర్ల బిల్లులు తదితరాలున్నాయి. దీన్ని చరిత్రాత్మక ఘటనగా డీఎంకే అభివర్ణించగా చరిత్ర సృష్టించడం తమ పార్టీ నైజమంటూ సీఎం స్టాలిన్ ఎక్స్‌లో పోస్టు చేశారు. రాజకీయాలకు అతీతంగా ఉండాలి రాష్ట్రస్థాయిలో ఒక బిల్లు చట్టంగా రూపొందాలంటే ముందుగా అసెంబ్లీ, తర్వాత గవర్నర్ ఆమోదం పొందాలి. గవర్నర్ దాన్ని ఆమోదించకుండా పెండింగ్‌లో పెట్టవచ్చు. రాష్ట్రపతి పరిశీలనకు పంపవచ్చు. లేదంటే అసెంబ్లీ పునఃపరిశీలన నిమిత్తం తిప్పి పంపవచ్చు. అసెంబ్లీ రెండోసారి ఆమోదించి పంపితే కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో మినహా గవర్నర్ విధిగా అనుమతి తెలిపాల్సిందే. అలాగాక రెండోసారి అసెంబ్లీ ఆమోదం పొందిన బిల్లులను తమిళనాడు గవర్నర్ రాష్ట్రపతి పరిశీలనకు పంపడాన్ని స్టాలిన్ సర్కారు 2023లో సుప్రీంకోర్టులో సవాలు చేసింది. దీనిపై కోర్టు గత మంగళవారం తీర్పు వెలువరించింది. గవర్నర్ చర్య రాజ్యాంగవిరుద్ధమని, ఆర్టికల్ 200కు ఉల్లంఘనేనని స్పష్టం చేసింది. గవర్నర్ పునఃపరిశీలనకు వచ్చిన 2023 నవంబర్ 18వ తేదీనే బిల్లులకు ఆమోదం లభించినట్టే పరిగణిస్తున్నట్టు పేర్కొంది. అంతేగాక, ‘‘ఇకపై గవర్నర్లు తమ వద్దకొచ్చే బిల్లులపై మూడు నెలల్లో నిర్ణయం తీసుకోవాలి. అదే బిల్లు రెండోసారి వస్తే నెలలోపు ఆమోదం తెలిపి తీరాలి’’ అని గడువు విధిస్తూ చరిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. తద్వారా గవర్నర్ వ్యవస్థను తక్కువ చేయడం తమ ఉద్దేశం కాదని ఈ సందర్భంగా ధర్మాసనం స్పష్టం చేసింది. ‘‘ఆ స్థానానికి ఉండే అత్యున్నత గౌరవానికి భంగం కలగకుండా చూసుకోవాల్సిన గురుతర బాధ్యత గవర్నర్లపై ఉంటుంది. ప్రథమ పౌరునిగా రాష్ట్ర ప్రయోజనాలే పరమావధి అని ప్రమాణం చేశాక రాజకీయ మొగ్గుదలలు తదితరాలకు అతీతంగా, రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా మెలగాలి. అలాగాక ప్రజలకు ప్రతిరూపమైన అసెంబ్లీ నిర్ణయాలకు విరుద్ధంగా నడుచుకోవడమంటే చేసిన ప్రమాణాన్ని ఉల్లంఘించడమే’’ అని స్పష్టం చేసింది. -
సెక్స్‌వర్కర్లకు చట్టబద్ధత కల్పించడం తప్పా?
న్యూఢిల్లీ: భారత దేశంలో వేశ్యవృత్తికి చట్టబద్ధత కల్పించాలంటూ ఇప్పటి వరకు ఎన్నోసార్లు తెరమీదకు వచ్చిన డిమాండ్ ఇది. పలు మహిళా, సామాజిక సంఘాలు ఇప్పటికీ ఎన్నోసార్లు ఈ డిమాండ్‌ను తీసుకొచ్చినా అధికారంలోవున్న భారత ప్రభుత్వం ఎన్నడూ సానుకూలంగా స్పందించలేదు. ఇప్పుడు ఇదే డిమాండ్తోని హిమాచల్‌లోని ‘నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ (నిఫ్ట్)’ కాలేజీకి చెందిన ఆరుగురు విద్యార్ధులు ఓ వినూత్న ప్రాజెక్టును చేపట్టారు. ఈ ప్రాజెక్ట్‌కు శ్రీకారం చుట్టిన నిఫ్ట్ ఫైనల్ ఇయర్ విద్యార్థి 23 ఏళ్ల అమిత్ చౌహాన్ దీనికి ‘నాత్ ఉట్రాయ్’ అని పేరు పెట్టారు. అమిత్, తనతోపాటు చదువుకుంటున్న మరో ఐదుగురు విద్యార్థులతో కలసి ఈ ప్రాజెక్టును చేపట్టి ఇంతవరకు దేశంలోని ఎంతోమంది వేశ్యలను ఇంటర్వ్యూ చేశారు. ఛిద్రమైన వారి జీవితాలకు సంబంధించిన కథలను ప్రపంచం దృష్టికి తీసుకరావడం వారి ప్రాజెక్ట్ ముఖ్య లక్ష్యం. ఇందులో భాగంగా వారు ఆరుగురు వేశ్యకథలను డాక్యుమెంటరీగా తీస్తున్నారు. వాటినే వచ్చే జనవరి నెలలో పుస్తకంగా విడుదల చేస్తామని అమిత్ మీడియాకు తెలిపారు. తాము ఎంపిక చేసిన ఆరుగురు వేశ్యలలో ముగ్గురు రాజస్థాన్‌కు, మరో ముగ్గురు ఢిల్లీ రెడ్‌లైట్ ఏరియాకు చెందిన వారని ఆయన చెప్పారు. తాము కలుసుకున్న వేశ్యల్లో ఎక్కువ మంది పిల్లా పాపలతో కాపురాలు చేస్తున్నారని, వారికి బడికి కూడా పంపించి చదివిస్తున్నారని, ఇదంతా కూడా వారు తమ శరీరాలను తాకట్టు పెట్టే సంపాదిస్తున్నారని తెలిపారు. భారత్‌లో వేశ్యవృత్తికి చట్టబద్ధత లేకపోవడం వల్ల వారిని దళారులు మోసం చేస్తున్నారని, విటులు హింసిస్తున్నారని, ఎయిడ్స్ లాంటి మహమ్మారి సోకకుండా ముందు జాగ్రత్త చర్యలు విటులు తీసుకోవడం లేదని, దేశంలో ఆడపిల్లల అక్రమ రవాణా కూడా పెరిగిపోతోందని అమిత్ ఆవేదన వ్యక్తం చేశారు. వేశ్యవృత్తికి చట్టబద్ధతను కల్పించినట్లయితే ఈ సామాజిక సమస్యల నుంచి విముక్తి కల్పించవచ్చని, వేశ్యల డేటాను నమోదు చేయడం, దళారుల ప్రమేయాన్ని అరికట్టడం, ఆడవాళ్ల అక్రమ రవాణాను అరికట్టడం సాధ్యమని, ఆరోగ్య సూత్రాలను పాటించడం, వ్యాపార నియమాలను నిర్దేశించడం సాధ్యమవుతుందని ఆయన వాదిస్తున్నారు. చట్టబద్ధత కల్పించడమంటే వృత్తిని ప్రోత్సహించడం కాదని, నియంత్రించడం అనీ, అమాయకులను దౌర్జన్యంగా ఆ వృత్తిలోకి దింపకుండా నిరోధించడమని ఆయన చెప్పారు. 2014లో జాతీయ మహిళా కమిషన్ చైర్పర్సన్ లలితా కుమార మంగళం కూడా ఇలాంటి అభిప్రాయలనే వ్యక్తం చేశారు. వేశ్యవృత్తికి చట్టబద్ధత కల్పిస్తే వారి జీవన ప్రమాణాలను మెరుగుపర్చవచ్చని, వృత్తిని నియత్రించవచ్చని ఆమె చెప్పారు. దేశంలో 16 రాష్ట్రాల నుంచి రెండున్నర లక్షల మంది సభ్యులు గల అఖిల భారత సెక్స్ వర్కర్ల సంఘం అధ్యక్షురాలు భారతీ దేవీ కూడా ఎప్పటి నుంచో ఇదే డిమాండ్ చేస్తున్నారు.