breaking news
laxmipuram
-
నిజాలు దాచి.. ‘బెల్ట్’ ఫుటేజీ మాయం!
రోజూ ఉండే షాపు.. ఈ రోజులేదు లక్ష్మీపురం హైవేకు దగ్గరలో రోజూ ఉండే బెల్ట్ షాపు ఈ రోజు లేదు. పేపర్లో ఆ షాపు ఫొటో రావడంతో మూసేసి వెళ్లిపోయారు. బెల్ట్ షాపు తొలగించాలని ఎవరికి చెప్పినా పట్టించుకోవడం లేదు. ప్రభుత్వం బెల్ట్ షాపులను నిషేధించాలి. – రాకేష్, లక్ష్మీపురంసాక్షి ప్రతినిధి కర్నూలు: లక్ష్మీపురంతోపాటు ఎన్‌హెచ్ 44 సమీపంలోని దాబాలు, ఇతర ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించాం.. ఎక్కడా బెల్ట్‌షాపులు లేవ్..! తాజాగా ప్రభుత్వ ప్రకటన ఇదీ!! మా గ్రామంలో 24 గంటలు మందు అమ్ముతున్నారు.. వైన్ షాపు లేకున్నా, నాలుగు బెల్ట్ షాపులు మాత్రం అందుబాటులో ఉన్నాయి!! బెల్ట్ షాపుల ఎదుట నిలుచుని లక్ష్మీపురం వాసులు చెబుతున్న నిఖార్సైన నిజాలివీ!! కర్నూలు జిల్లాలో వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సు ప్రమాదం దుర్ఘటన కనివీని ఎరుగని పెను విషాదం. చిన్నారులు సైతం బుగ్గి కావడంపై దేశమంతా కన్నీరు పెట్టింది. మద్యం భూతమే ఈ విషాదానికి కారణ భూతమైంది. విచ్చలవిడిగా, వేళాపాళా లేకుండా దొరుకుతున్న మద్యమే 20 ప్రాణాలు గాలిలో కలిసిపోవటానికి ప్రధాన కారణం. అధికారులు సైతం దీన్ని ధ్రువీకరించారు. దీన్ని కప్పిపుచ్చుతూ... అది బెల్ట్ షాపు మద్యం కాదని, ప్రమాదానికి కారణమైన బైకర్లు లైసెన్స్డ్ మద్యమే సేవించారంటూ, అక్కడే కొనుగోలు చేశారంటూ ప్రభుత్వం నిస్సిగ్గుగా సమర్థించుకోవడం తీవ్ర విస్మయం కలిగిస్తోంది. పెద్దటేకూరు సమీపంలోని రేణుక ఎల్లమ్మ వైన్స్‌లో రాత్రి 7 గంటలకు, 8.20 గంటలకు రెండు దఫాలు మద్యం కొనుగోలు చేశారని, ఆ ప్రాంతంలో బెల్ట్‌షాపులే లేవని ఎక్సైజ్ శాఖ ఆదివారం ఓ ప్రకటన విడుదల చేసింది. అయితే తమ ఊరిలో బెల్ట్ షాపులు ఉన్నాయని, గత రెండు రోజులుగా మాత్రమే మూసివేశారని లక్ష్మీపురం గ్రామస్తులే చెబుతున్నారు. దుర్ఘటన జరిగాక హడావుడిగా బెల్ట్ షాపులను మూసివేయడం, ఆ దుకాణాల ఎదుట సీసీ టీవీ ఫుటేజీని తొక్కిపెడుతుండటం పట్ల సర్వత్రా అనుమానాలు రేకెత్తుతున్నాయి. రెండు రోజులుగా బెల్ట్‌షాపు మూత.. మాయమైన సీసీ టీవీ ఫుటేజీ..! బైకర్లు శివశంకర్, ఎర్రిస్వామి ప్రమాదానికి ముందు అర్ధరాత్రి వరకూ ఇద్దరూ మద్యం సేవిస్తూనే ఉన్నారు. మూడోసారి పెద్దటేకూరు వైన్‌షాప్ వద్దకు వెళ్లే ఓపిక లేక లక్ష్మీపురంలోని బెల్ట్‌షాపులో మద్యం కొనుగోలు చేసినట్లు స్థానికులు చెబుతున్నారు. శుక్రవారం తెల్లవారుజామున ప్రమాదం జరగడం.. మద్యం సేవించి లక్ష్మీపురం నుంచి బైకర్లు బయలుదేరారని మీడియాలో రావడంతో అక్కడి బెల్ట్ షాపును శనివారం మూసేశారు. ఆదివారం కూడా దుకాణం తెరవలేదు! ‘సాక్షి’ ప్రచురించిన కథనం నేపథ్యంలో కొందరు అధికారులు లక్ష్మీపురం బెల్ట్‌షాపు వద్ద ఉన్న సీసీ ఫుటేజ్‌ని ఆగమేఘాలపై స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. రెండురోజులుగా బెల్ట్‌షాపు మూతపడటం, సీసీటీవీ ఫుటేజీలను అధికారులు తీసుకెళ్లడంతో లక్ష్మీపురం బెల్ట్‌షాపులోనే వారు మద్యం కొనుగోలు చేశారనే అనుమానాలు బలపడుతున్నాయి. లక్ష్మీపురంలో తన తల్లిని చూసేందుకు ఎర్రిస్వామి వెళుతుంటాడు. మూడో దఫా లక్ష్మీపురం బెల్ట్‌షాపులో మద్యం సేవించారా? లేదా? అనేది విచారణలో పోలీసులు తేల్చాల్సి ఉంది. లక్ష్మీపురంలో బెల్ట్‌షాపు ఉందా? లేదా? అని పరిశీలించేందుకు వెళ్లిన ‘సాక్షి’తో పలువురు మాట్లాడారు.పెట్రోల్ బంక్‌లో శివశంకర్ ఉన్న సీసీ ఫుటేజీ విడుదల చేసిన అధికారులు... లక్ష్మీపురంలో అతను మద్యం కొన్నాడని స్థానికులు చెబుతున్నా... అక్కడి సీసీ ఫుటేజీని బయటపెట్టలేరా? గుడి, బడి పక్కన బెల్ట్ షాపులు లక్ష్మీపురంలో హైవే, గుడి, బడి పక్కన బెల్ట్ షాపులున్నాయి. ఒకవైపు సీఎం బెల్ట్ షాపు పెడితే బెల్ట్ తీస్తానని చెబుతున్నారు. వాస్తవంగా అందుకు భిన్నంగా పరిస్థితులు ఉన్నాయి. మద్యం తాగి బైక్ నడపడంతోనే రోడ్డు ప్రమాదం జరిగి 20 మంది చనిపోయారు. – నారాయణరెడ్డి, లక్ష్మీపురం 24 గంటలు మందు అమ్ముతున్నారు మా గ్రామంలో 24 గంటలూ మందు అమ్ముతున్నారు. వైన్ షాపు లేకున్నా నాలుగు బెల్ట్ షాపులు అందుబాటులో ఉన్నాయి. చిన్న పిల్లలు కూడా మద్యం సేవిస్తున్నారు. రోడ్ల పక్కనే తాగుతుండడంతో రాకపోకల సమయంలో మహిళలు ఇబ్బంది పడుతున్నారు. ఈ విషయాన్ని పోలీసులు, ఎక్సైజ్ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం శూన్యం. చంద్రబాబునాయుడు ఏపీని మద్యాంధ్ర ప్రదేశ్‌గా మార్చారు. – రాజమోహన్‌రెడ్డి, లక్ష్మీపురం మా ఊరి బెల్ట్ షాపుల్లో నిత్యం మందు దొరుకుతుంది మా గ్రామంలో ఉన్న బెల్ట్ షాపుల్లో నిత్యం మందు దొరుకుతుంది. అర్ధరాత్రైనా, మధ్యరాత్రైనా, తెల్లవారుజామునైనా మందుకు కరువు ఉండదు. అయినా అధికారులెవరూ పట్టించుకోవడంలేదు. – పేరిపోగు ప్రతాప్, లక్ష్మీపురంఎక్కడా తనిఖీలు చేయడం లేదుమా ఊరు పరిధిలో నాలుగు బెల్ట్ షాపులు ఉన్నాయి. గతంలో ఎక్సైజ్ వాళ్లు కంట్రోల్ చేసేవాళ్లు. ఇప్పుడు అవేమి జరగడంలేదు. నేరుగా వైన్ షాపు వారే మద్యాన్ని తెచ్చి బెల్ట్ షాపులకు ఇచ్చిపోతున్నారు. ఎక్కడ తనిఖీలు చేయడంలేదు. అందుబాటులో ఉండడంతో విచ్చల విడిగా మందు తాగుతున్నారు. బ్రిడ్జిలు, స్కూళ్లు, పార్కుల్లో తాగుతున్నారని ఫిర్యాదు చేసినా పోలీసులు స్పందించడంలేదు. – సత్యంరెడ్డి, గ్రామస్తుడు, లక్ష్మీపురం చిన్న పిల్లలు కూడా తాగుతున్నారు లక్ష్మీపురంలో మద్యం అమ్మకాలు పబ్లిక్‌గా జరుగుతున్నాయి. ఏకంగా వైన్ షాపు వారే వచ్చి ఇళ్లలో అమ్మే వారికి బాటిళ్లు ఇచ్చిపోతున్నారు. పోలీసులు పట్టించుకోవడంలేదు. చిన్న పిల్లలు కూడా మద్యం తాగి పెడదారి పడుతున్నారు. – నేసే శేఖర్, లక్ష్మీపురం ఈ రోజు తెరవలేదు... లక్ష్మీపురంలో నీళ్లకు ఇబ్బంది ఉంది కానీ మందుకు ఇబ్బంది లేదు. వైన్ షాపు లేకున్నా ఎప్పుడు చూసినా బెల్ట్ షాపులు అందుబాటులో ఉంటున్నాయి. మొత్తం నాలుగు బెల్ట్ షాపులు ఉన్నాయి. ఈ రోజు ఒక్క షాపు కూడా తెరవలేదు. – తెలుగు సుంకన్న, లక్ష్మీపురం బెల్ట్ షాపులను నిర్మూలించాలిమహిళల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని బెల్ట్ షాపులను నిర్మూలించాలి. ప్రభుత్వం తరచూ తనిఖీ చేస్తే కట్టడి చేయవచ్చు. ఆ పని చేయడంలేదు. తాగిన మైకంలో ఎవరు ఏం చేస్తున్నారో అర్థం కావడంలేదు. మందు తాగి బండి నడపడం వల్లే ప్రమాదం జరిగి 20 మంది చనిపోయారు. ఇప్పటికైనా ప్రభుత్వం బెల్ట్ షాపులపై పునరాలోచన చేయాలి. – దూడల తిరుపాలు, లక్ష్మీపురం అనర్థాలపై అవగాహన కల్పించాలి మద్యాన్ని ఎక్కువగా తీసుకోవడం ద్వారా కలిగే అనర్థాలపై అవగాహన కలి్పంచాలి. అదే సమయంలో బెల్ట్ షాపులను తొలగించాలి. పిల్లల నుంచి పెద్ద వారి వరకు మందు తాగుతుంటే కాలం ఎటు పోతుందో అర్థం కావడంలేదు. – మాసుంసాహెబ్, లక్ష్మీపురం మద్యం ఖాళీ సీసాలతో హంద్రీ కలుషితంపబ్లిక్ ప్లేసుల్లో మందు తాగడాన్ని అరికట్టాలి. హైవే పక్కన, స్కూళ్ల సమీపంలో మందు తాగడంపై నిఘా వేసి ఉంచాలి. ఇళ్ల మధ్య కూడా రాత్రిళ్లు తాగుతున్నారు. హంద్రీనది మద్యం ఖాళీ సీసాలతో కలుషితం అవుతోంది. – చంద్రశేఖర్, లక్ష్మీపురం -
పండగ వేళ కార్మికులపై శరాఘాతం
చల్లపల్లి (అవనిగడ్డ), కృష్ణాజిల్లా : పండగ వేళ కేసీపీ యాజమాన్యం తమ కార్మికులపై శరాఘాతం లాంటి నిర్ణయం తీసుకుంది. ఫ్యాక్టరీలో పని చేస్తున్న కార్మికుల్లో 206 మందికి లే–ఆఫ్ వర్తింపచేస్తూ ప్రకటించింది. ఈ మేరకు కేసీపీ ఆవరణలోని గేటు వద్ద బోర్డులు ఏర్పాటు చేసింది. కర్మాగారంలో పర్మినెంట్ పద్ధతి కింద పని చేస్తున్న 69 మంది కార్మికులు, క్రషింగ్ సీజనల్ పర్మినెంట్ పద్ధతిపై పని చేస్తున్న 137 మంది కార్మికులకు లే–ఆఫ్ వర్తింపచేశారు. మరో 46 మంది పర్మినెంట్ కార్మికులకు లే–ఆఫ్ వర్తింపచేయకుండా ఉపశమనం కల్పించారు. సోమవారం నుంచే అమలు.. పారిశ్రామిక వివాదాల చట్టం 1947లోని సెక్షన్ 2 (కేకేకే) ప్రకారం లక్ష్మీపురంలోని కేసీపీ షుగర్స్ కర్మాగారంలోని ఉద్యోగులకు ధ్రువీకరించిన స్టాండింగ్ ఆర్డర్స్ క్లాజ్ 7(బి) ప్రకారం సోమవారం నుంచి లే–ఆఫ్ ప్రకటిస్తూ బోర్డు ఏర్పాటు చేసింది. లే–ఆఫ్ వర్తింపచేయని 46 మంది పరి్మనెంట్ కార్మికులను ఉయ్యూరులోని కేసీపీ షుగర్స్‌లో వినియోగించుకోనున్నట్లు తెలిసింది. నష్టాలు కారణం.. రెండు సంవత్సరాలుగా చెరకు లభ్యత లేకపోవటంతో కర్మాగారం మనుగడ ప్రశ్నార్థకంగా మారిందని కేసీపీ యాజమాన్యం ఓ ప్రకటనలో పేర్కొంది. రెండేళ్లలో దేశవ్యాప్తంగా పంచదార నిల్వలు అధికంగా పేరుకుపోవటంతో పాటు, కేసీపీ లక్ష్మీపురం కర్మాగారం పరిధిలో ఉత్పత్తి అవుతున్న చెరకు పరిమాణం ఫ్యాక్టరీ సామర్థ్యాని కంటే చాలా తక్కువగా ఉంటోందని తెలిపింది. దీంతో కర్మాగారంలో క్రషింగ్ కొనసాగిస్తే ఆరి్థకంగా తీవ్రమైన నష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుందన్న కారణంగా తాత్కాలికంగా ఇక్కడి చెరకు పంటను ఉయ్యూరు కర్మాగారానికి తరలించి క్రషింగ్ చేయటానికి తీసుకున్న నిర్ణయం అమలులో భాగంగా లక్ష్మీపురం కర్మాగారంలోని కార్మికులకు లే–ఆఫ్ వర్తింప చేసినట్లు వివరించింది. -
‘కేసులు పెట్టలేను.. వాళ్లు లేకుండా బతకలేను’
లక్ష్మీపురం(గుంటూరు): తీవ్ర మనోవేదన భరించలేకపోతున్నానని, చావడానికి అనుమతివ్వాలని కోరుతూ ఓ రిటైర్డ్ ప్రభుత్వోద్యోగి గుంటూరు అర్బన్ ఎస్పీకి పోలీస్ గ్రీవెన్స్‌లో విన్నవించుకున్నాడు. జగన్నాథరావు 1978లో కుటుంబ సభ్యులను ఎదిరించి కులాంతర వివాహం చేసుకున్నాడు. తల్లిదండ్రులు, అన్నదమ్ములు అతన్ని మొదట్లో వెలివేసినా తర్వాత దగ్గరై కొంత ఆస్తి ఇచ్చారు. దానిని జగన్నాథరావు భార్య పేరుతో రిజిస్టర్ చేశాడు. అయితే 2011 జూన్‌లో ఆయన భార్య అతనిపై 498ఎ కేసు పెట్టడంతో పాటు కట్టుబట్టలతో ఇంట్లోంచి బయటకు పంపింది. నరసరావుపేట, గుంటూరు, విజయవాడ, హైదరాబాద్‌లో ఉన్న అతని ఇళ్లు స్వాధీనం చేసుకుంది. ‘నాకు నా భార్యాబిడ్డలంటే చాలా ఇష్టం.. వారిపై నేను కేసులు పెట్టలేను.. వాళ్లు లేకుండా బతకలేను.. తీవ్ర మనోవేదనతో నరకయాతన అనుభవిస్తున్నా.. నాకు మరణించేందుకు అనుమతివ్వండి’ అంటూ అర్బన్ ఎస్పీ సీహెచ్ విజయరావుకు గ్రీవెన్స్‌లో ఫిర్యాదు చేశాడు. -
లక్ష్మీపురంలో బయటపడ్డ గుహలు
గిద్దలూరు: ప్రకాశం జిల్లా అర్థవీడు మండలం లక్ష్మీపురంలో పురాతన కాలం నాటి గుహలు బయటపడ్డాయి. కొంత కాలంగా గుప్తనిధుల తవ్వకాల కోసం కొందరు తిరుగుతూ ఉండటంతో ఇవి బయటపడ్డాయి. దాదాపు 45 గుహలు ఉన్నాయి. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. -
వరికోత మిషన్‌లో పడి వ్యక్తి మృతి
దుగ్గొండి(వరంగల్): వరికోత మిషన్‌లో పడి ఓ వ్యక్తి మృతిచెందిన సంఘటన వరంగల్ జిల్లా దుంగ్గొండి మండలం లక్ష్మీపురంలో సోమవారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ట్రాక్టర్ డ్రైవర్ తాల్లపల్లి సాంబయ్య(38) వరికోత మిషన్ సమీపంలో నిల్చొని ఉన్న సమయంలో అతన్ని గుర్తించని మిషన్ డ్రైవర్ అతని పై నుంచి మిషన్‌ను పోనిచ్చాడు. దీంతో అందులో పడ్డ సాంబయ్య అక్కడికక్కడే మృతిచెందాడు. -
లక్ష్మీపురం కేసీపీ షుగర్స్‌కు జాతీయ భద్రత అవార్డు
చల్లపల్లి: లక్ష్మీపురం కేసీపీ షుగర్స్ కర్మాగారానికి కేంద్ర కార్మిక శాఖ నుంచి జాతీయ ¿¶ ద్రతా అవార్డు లభించింది. శుక్రవారం ఢిల్లీలో కేంద్ర కార్మిక, ఉపాధి శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ చేతులమీదుగా కేసీపీ లక్ష్మీపురం కర్మాగార ప్రాసెసింగ్ మేనేజర్ జి.శంకరరావు అందుకున్నారు. కర్మాగారంలో ప్రమాదాలు జరగకుండా కట్టుదిట్టమైన నియంత్రణ చర్యలు తీసుకున్నందుకు గాను లక్ష్మీపురం కేసీపీ కర్మాగారానికి స్కీం నెంబరు –3 విభాగంలో విన్నర్‌గా, స్కీం నెంబరు –4లో రన్నర్‌గా బహుమతులు లభించాయి. ఇప్పటికి 11సార్లు ఈ అవార్డులను సాధించింది. ఈ సందర్భంగా కర్మాగార ఉద్యోగులను కేసీపీ లక్ష్మీపురం, ఉయ్యూరు చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ జి.వెంకటేశ్వరరావు అభినందించారు. -
ఆస్తి తగాదాలతో అన్నను చంపేశాడు..
లక్సెట్టిపేట్(ఆదిలాబాద్): ఆస్తి పంపకాల్లో తేడాలు..ఆ అన్నదమ్ముల మధ్య చిచ్చుపెట్టాయి. గొడవ ముదిరి ఒకరి ప్రాణం తీసేదాకా వెళ్లింది. ఆదిలాబాద్ జిల్లా లక్సెట్టిపేట్ మండలం లక్ష్మింపూర్ గ్రామంలో బుధవారం సాయంత్రం ఈ ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన శంకరయ్య, గంగయ్య అన్నదమ్ములు. తమకు సంక్రమించిన ఆస్తి పంపకాల్లో వారి మధ్య విభేదాలు తలెత్తాయి. ఈ నేపథ్యంలోనే బుధవారం సాయంత్రం గొడవపడ్డారు. ఆవేశంతో ఉన్న గంగయ్య అన్న శంకరయ్య(45)ను రోకలిబండతో కొట్టి చంపాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
మూడు వాహనాలు ఢీ..ఇద్దరు మృతి
గుంటూరు: గుంటూరు జిల్లా నర్సారావుపేట మండలం లక్ష్మీపురం వద్ద మంగళవారం తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా, మరో ఇద్దరికి తీవ్ర గాయాలు అయ్యాయి. రోడ్డు పక్కనే ఆగి ఉన్న లారీని వెనుక నుంచి వచ్చిన ఓ గ్యాస్ ట్యాంకర్ ఢీకొంది. అదే సమయంలో కర్నూలు నుంచి ఉల్లిపాయల లోడుతో పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడేనికి వెళుతున్న లారీ గ్యాస్ ట్యాంకర్‌ను ఢీకొంది. ఈ ప్రమాదంలో ఉల్లిపాయల లారీలో ఉన్న ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఇద్దరికి తీవ్ర గాయాలు అయ్యాయి. మృతులను పశ్చిమగోదావరి జిల్లా పెద్దవేగి మండలం చక్రాయిగూడెం గ్రామానికి చెందిన క్లీనర్ మహేశ్(20), కర్నూలు జిల్లా నందవరం మండలం జగ్గాపురం గ్రామానికి చెందిన ఉల్లిపాయల రైతు బోగి వీరాస్వామి (55)గా గుర్తించారు. గాయపడిన డ్రైవర్ ప్రసాద్, వీరన్నను చికిత్స కోసం నర్సారావుపేట ఏరియా ఆస్పత్రికి తరలించారు. -
ఆ ఎస్సై దెయ్యమై తిరుగుతున్నాడు!!
'నెల రోజుల క్రితం ఆత్మహత్యచేసుకున్న ఎస్సై దెయ్యమై తిరుగుతున్నాడు. గ్రామంలోని పిల్లాజల్లా అందరినీ భయపెడుతున్నాడు' అంటూ విశాఖ జిల్లా గోపాలపురంలోని లక్ష్మీనగర్ గ్రామస్తులు హడావుడి చేశారు. అంతటితో ఆగకుండా సదరు ఎస్సై ఇంటిముందు మంట పెట్టి, గ్రామం విడిచి వెళ్లిపోవాల్సిందిగా ఇంటిముందు బైఠాయించారు. మూఢనమ్మకాలకు పరాకాష్టలాంటి ఈ ఘటన శనివారం రాత్రి చోటుచేసుకుంది. దీంతో భయాందోళనకు గురైన ఎస్సై వీరాంజనేయుడు కుటుంబ సభ్యులు సాయం కోసం పోలీసులను ఆశ్రయించారు. లక్ష్మీపురం గ్రామానికి చెందిన వీరాంజనేయుడు ఎంబీఏ పూర్తిచేసి 2008లో ఎస్సై ఉద్యోగంలో చేరాడు. ఓ కేసు పరిష్కారం అనంతరం ఎస్ఐ ఆంజనేయులు డబ్బులు డిమాండ్ చేస్తున్నారని వంగర మండలం అరసాడ గ్రామానికి చెందిన కడుమల సత్యనారాయణ 2014 అక్టోబర్ 24న ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో అదే రోజు ఏసీబీ అధికారులు వీరాంజనేయులుపై నిఘా వేసి లంచం తీసుకుంటుండగా పట్టుకున్నారు. అయితే తాను నిర్దోషినని, కొందరు రాజకీయనాయకులు కావాలనే తననీ కేసులో ఇరికించారని సూసైడ్ నోట్ రాసి గత ఏప్రిల్ నెలలో వీరాంజనేయుడు రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. అసలే కొడుకును కోల్పోయిన ఆ కుటుంబం ఇప్పుడు గ్రామస్తుల వికృతచర్యలతో కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది. -
జగన్‌ను విమర్శించే హక్కు లేదు
లక్ష్మీపురం (గుంటూరు) : శాసనసభ శీతాకాల సమావేశాల్లో ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోరాడిన వైఎస్సార్ సీపీ అధినేత, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డిని విమర్శించే హక్కు టీడీపీ నేతలకు లేదని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్ అన్నారు. సభలో ఓర్పు, సహనంతో మాట్లాడి ప్రజల పక్షాన నిలిచారన్నారు. గుంటూరులోని పార్టీ జిల్లా కార్యాలయంలో బుధవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అసెంబ్లీ సమావేశాల్లో టీడీపీ శాసన సభ్యులు చంద్రబాబు ఆదేశాల మేరకు జగన్ మోహన్‌రెడ్డిని కించపరిచేందుకు పూర్తి స్థాయిలో ప్రయత్నించారని మర్రి మండిపడ్డారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్.రాజశేఖరరెడ్డి, విపక్ష నేత జగన్ మోహన్‌రెడ్డిని ప్రతి సందర్భంలో లక్ష్యంగా చేసుకుని రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడ్డారని ఆరోపించారు. సభలో జగన్ ప్రజా సమస్యలపై టీడీపీని నిలదీసిన తీరును అంతటా మెచ్చుకుంటున్నారని చెప్పారు. స్పీకర్ అతి తక్కువ సమయం ఇచ్చినప్పటికీ రాజధాని రైతులు, కూలీల కోసం పూర్తి పోరాటం చేశారని అన్నారు. ఐకేపీ యానిమేటర్లు, కాంట్రాక్టు ఉద్యోగుల సమస్యలనూ ప్రస్తావించారన్నారు. రుణమాఫీపై చంద్రబాబు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని జగన్ కోరారన్నారు. ఈ సందర్భంలో రైతుల ఆత్మహత్యలను జగన్ ప్రస్తావించి ఆయా కుటుంబాలను ఓదారుస్తానని చెప్పడంతో భయపడిన ముఖ్యమంత్రి, మృతుల కుటుంబాలకు పరిహారం ఇస్తామని చెప్పారన్నారు. తుళ్లూరులో పంటలు పండించేందుకు నీళ్లు కృష్ణా నుంచి లేదా వేరే చోట నుంచి రావనే విషయాన్ని చంద్రబాబు తెలుసుకోవాలన్నారు. కేసులు మీరే పెట్టించారు.... ఏ సందర్భం లేకుండా టీడీపీ నాయకులు జగన్మోహన్రెడ్డిపై ఉన్న కేసులు గురించి ప్రస్తావించడం సిగ్గుచేటని మర్రి రాజశేఖర్ ధ్వజమెత్తారు. అప్పట్లో టీడీపీ నాయకులు కాంగ్రెస్‌తో కుమ్మక్కయి కేసులు పెట్టించిన విషయాన్ని మర్చిపోతే ఎలా అని ప్రశ్నించారు. తిరిగి ఆ కేసులు గురించి మాట్లాడడం దారుణమన్నారు. విలేకరుల సమావేశంలో వైఎస్సార్ సీపీ సేవాదళ్ కన్వీనర్ కొత్తా చిన్నపరెడ్డి, ఎస్సీసెల్ జిల్లా కన్వీనర్ బండారు సాయిబాబు పాల్గొన్నారు. మర్రి క్రిస్మస్ శుభాకాంక్షలు చిలకలూరిపేట: ప్రేమ, శాంతి, సహనానికి క్రిస్మస్ పండుగ చిహ్నమని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్ చెప్పారు. జిల్లాలోని క్రైస్తవులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. అంతా సుఖ సంతోషాలతో పండుగ జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఏసుక్రీస్తు బోధనలను పాటించాలని కోరారు.


