breaking news
laxman died
-
నా కుమారుడిది హత్యే..
సాక్షి, ఒంగోలు సబర్బన్: ఒంగోలు నగరంలోని రైల్వేస్టేషన్ సమీపం ఓ కల్యాణ మండపం వద్ద జూన్ 30న అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన రామినేని లక్ష్మణ్ సత్యగోపీనాథ్ అలియాస్ లక్ష్మణ్ (32)ది హత్యేనని అతడి తల్లి శ్రీదేవి అనుమానం వ్యక్తం చేస్తోంది. లక్ష్మణ్ తాను నివాసం ఉంటున్న ఇంట్లోనే అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన సంగతి తెలిసిందే. అందులో భాగంగా లక్ష్మణ్ తల్లి రామినేని శ్రీదేవి స్థానిక కాపు కల్యాణ మండపంలో గురువారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి తన కుమారుడిది అనుమానాస్పద మృతి కాదని, హత్య జరిగి ఉంటుందని అనుమానం వ్యక్తం చేసింది. ఆమె కథనం ప్రకారం.. శ్రీదేవిది గుంటూరు జిల్లా దుగ్గిరాల. కుమారుడు లక్ష్మణ్ ఆమెతో గొడవపడి మూడేళ్ల క్రితం ఇల్లు వదిలి వచ్చాడు. ఆ తర్వాత కొంతకాలానికి తాను ఒంగోలులో ఉంటున్నానని తల్లికి చెప్పాడు. కొన్ని రోజుల క్రితం తల్లికి ఫోన్ చేసి తనపై హత్య కేసు ఉందని, జామీనుదారులను తీసుకొచ్చి తనను విడిపించుకెళ్లాలని తల్లిని వేడుకున్నాడు. తల్లి జామీనుదారులను తీసుకొచ్చి కుమారుడిని విడిపించుకుంది. అప్పటికే ఆమె కుమారుడు పలువురు స్నేహితులతో కలిసి చెడు అలవాట్లకు బానిసయ్యాడు. తన కుమారుడితో పాటు కొంతమంది అతడి స్నేహితులు, హిజ్రా హిరిణి అనేక సార్లు లక్ష్మణ్ తల్లి వద్దకు వెళ్లారు. తమకు డబ్బులు కావాలని ఆమెను బెదిరించారు. ఆమె కుమారుడి ఆస్తి వాటా ఇవ్వాలని హిరిణి డిమాండ్ చేసింది. మద్యం తాగివచ్చి మరీ గొడవ చేసేవారు. హిజ్రా హిరిణితో సహజీవనం చేస్తున్నానని తన కుమారుడు గతంలో తనతో తెగేసి చెప్పాడని తల్లి విలపించింది. గత నెల 28వ తేదీన తన కుమారుడు లక్ష్మణ్, హిజ్రా హిరిణి, ఆటో డ్రైవర్ కమ్ ఓనర్నని చెప్పుకొచ్చిన మరో వ్యక్తి తన వద్దకు వచ్చారన్నారు. డబ్బులు కావాలని గొడవ చేసినట్లు వెల్లడించారు. ఇదిలా ఉంటే జూన్ 30న హిరిణి ఇంట్లో తన కుమారుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందటం పలు అనుమానాలకు తావిస్తోందని శ్రీదేవి కన్నీటిపర్యంతమైంది. తన కుమారుడి అనుమానాస్పద మృతి విషయంలో తనకు అనుమానాలు ఉన్నాయన్నారు. తన కుమారుడితో పాటు తన వద్దకు వచ్చిన ఆ ఇద్దరిపై అనుమానం ఉందన్నారు. ఎస్పీ సిద్ధార్ధ కౌశల్ ప్రత్యేక చొరవ తీసుకొని తన కుమారుడి అనుమానాస్పద మృతి దర్యాప్తును పూర్తి స్థాయిలో విచారించి వాస్తవాలను నిగ్గు తేల్చాలని, తనకు న్యాయం చేయాలని ఆమె వేడుకుంది. -
రోడ్డు ప్రమాదంలో టీఆర్ఎస్ నేత మృతి
దండెపల్లి: వేగంగా వెళ్తున్న బస్సు,కారును ఢీ కొట్టడంతో టీఆర్ఎస్ నేత ఊరెల్లి లక్ష్మణ్ (58) మృతిచెందారు. ఈ సంఘటన అదిలాబాద్ జిల్లా దండెపల్లి మండలం ముత్యంపేటలో చోటుచేసుకుంది. సోమవారం అర్ధరాత్రి లక్సిట్టిపేట నుంచి నర్సాపూర్ వస్తున్న లక్ష్మణ్ కారును ఊట్నూరు నుంచి హైదరాబాద్ వెళ్తున్న బస్సు ముత్యంపేట వద్ద ఢీకొట్టింది. దీంతో ఆయన అక్కడికక్కడే మృతిచెందగా.. ఆయన వెంట ఉన్న వెంగళరావుకు గాయాలయ్యాయి. నాయకుడి మృతితో టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలుతీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు.