breaking news
lawyers summit
-
International Lawyers Conference 2023: భారతీయ భాషల్లో భారత చట్టాలు
న్యూఢిల్లీ: దేశంలో అమల్లో ఉన్న చట్టాలను అందరికీ సులభంగా అర్థమయ్యే రీతిలో భారతీయ భాషల్లో రచించడానికి కేంద్ర ప్రభుత్వం నిజాయితీగా కృషి చేస్తోందని ప్రధాని మోదీ చెప్పారు. ఆయన శనివారం ఢిల్లీలో బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో అంతర్జాతీయ న్యాయవాదుల సదస్సును ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... ప్రపంచవ్యాప్తంగా సైబర్ ఉగ్రవాదం, మనీ లాండరింగ్ నేరాలు విపరీతంగా పెరిగిపోతుండడం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. విధ్వంసకర కార్యకలాపాల కోసం అరాచక శక్తులు కృత్రిమ మేధ(ఏఐ)ను వాడుతున్నాయని చెప్పారు. ముష్కరుల కార్యకలాపాలకు, సైబర్ నేరాలకు అడ్డుకట్ట వేయడానికి దేశాలన్నీ చట్టాలకు లోబడి కలిసికట్టుగా పనిచేయాలని సూచించారు. దేశాల మధ్య అమల్లో ఉన్న ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ వ్యవస్థల తరహాలోనే సైబర్ ఉగ్రవాదాన్ని అంతం చేయడానికి గ్లోబల్ ఫ్రేమ్‌వర్క్ రూపొందించుకోవాలని చెప్పారు. 2047 నాటికి దేశం పూర్తిగా అభివృద్ధి చెందాలన్న లక్ష్యంతో భారత్ కృషి చేస్తోందని, ఇందుకోసం బలమైన, నిష్పక్షపాతంతో కూడిన న్యాయ వ్యవస్థ కావాలని చెప్పారు. రెండు రూపాల్లో చట్టాలు కక్షిదారులకు న్యాయం చేకూర్చడంలో న్యాయ ప్రక్రియ, చట్టాలను రాసేందుకు ఉపయోగించిన భాష కీలక పాత్ర పోషిస్తాయని ప్రధాని మోదీ ఉద్ఘాటించారు. చట్టాలు రెండు రూపాల్లో ఉండాలని ప్రభుత్వం భావిస్తోందని చెప్పారు. న్యాయ నిపుణులు ఉపయోగించే భాషలో, సామాన్య ప్రజలు ఉపయోగించే భాషలో చట్టాలు ఉండాలన్నారు. ప్రజల భాషలో చట్టాలు ఉన్నప్పుడు వారు వాటిని సొంతం చేసుకుంటారని తెలిపారు. చట్టాలను సామాన్య ప్రజలకు అర్థమయ్యేలా సులభతరంగా మార్చే ప్రక్రియ కొనసాగుతోందని వివరించారు. అది పూర్తి కావడానికి సమయం పడుతుందన్నారు. డేటా ప్రొటెక్షన్ చట్టంతో ఈ ప్రక్రియకు శ్రీకారం చుట్టామని వివరించారు. కక్షిదారులకు తీర్పు కాపీలను వారి మాతృభాషలో అందజేయాలన్న సుప్రీంకోర్టు నిర్ణయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ స్వాగతించారు. భారత న్యాయ వ్యవస్థను కాపాడడంలో జ్యుడీíÙయరీ, బార్ కౌన్సిల్ సాగిస్తున్న కృషి ప్రశంసనీయమని చెప్పారు. భారత స్వాతంత్య్ర పోరాటంలో ఎంతోమంది న్యాయవాదులు ముందంజలో నిలిచారని గుర్తుచేశారు. అంతర్జాతీయ న్యాయవాదుల సదస్సులో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్, కేంద్ర న్యాయ శాఖ మంత్రి అర్జున్‌రామ్ మేఘ్వాల్, యూకే న్యాయ సహాయ శాఖ మంత్రి అలెక్స్ చాక్ కె.సి., భారత అటార్నీ జనరల్ ఆర్.వెంటకరమణి, సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా, బార్ కౌన్సిల్ చైర్మన్ మిశ్రా తదితరులు పాల్గొన్నారు. న్యాయవాదుల పాత్ర మారాలి: జస్టిస్ చంద్రచూడ్ నేటి ప్రపంచీకరణ శకంలో అంతర్జాతీయంగా న్యాయరంగంలో సవాళ్లను ఎదుర్కొనే దిశగా న్యాయవాదుల పాత్ర మార్పు చెందాలని సీజేఐ జస్టిస్ చంద్రచూడ్ సూచించారు. ఆధునిక పరిజ్ఞానాన్ని లాయర్లు అందిపుచ్చుకోవాలన్నారు. ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ వంటి అంశాల్లో సాంకేతికపరమైన మార్పులను కక్షిదారులు, ప్రభుత్వాలు అందిపుచ్చుకొనేలా లాయర్లు కృషి చేయాలని సీజేఐ తెలిపారు. -
ప్రారంభమైన రాష్ట్రస్థాయి న్యాయాధికారుల సదస్సు
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రస్థాయి న్యాయాధికారుల సదస్సు మారియట్ హొటల్లో ప్రారంభమైంది. ఈ సదస్సులో సత్వర న్యాయసేవలు, అనుసరించాల్సిన మార్గాలపై చర్చిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ సదస్సుకు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ ఏఆర్ దవే, జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ ఎస్వి రమణ, హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బోంస్లే, రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, కేసీఆర్ హాజరయ్యారు.