ప్రపంచంలో ఇంత రిస్క్ ఎవరూ చేయలేదా?
కథానాయికలు చెట్ల చుట్టూ తిరుగుతూ పాటలు పాడటానికే పనికొస్తారా? అదేం కాదు.. అవకాశం ఇస్తే రౌడీల అంతు కూడా చూస్తారు. త్వరలో విడుదల కానున్న ‘కొచ్చడయాన్’లో దీపికా పదుకొనే ఆ పనే చేశారు.
ఇందులో పది నిమిషాల పాటు సాగే ఓ పోరాట సన్నివేశంలో ఆమె చాలా రిస్క్ తీసుకున్నారు. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా ఏ కథానాయికా చేయనంత రిస్క్‌ని దీపికా చేశారని చిత్రబృందం అంటున్నారు. హాలీవుడ్ చిత్రం ‘లారా క్రాఫ్ట్’లో ఏంజెలినా జోలీ చేసిన పోరాట దృశ్యాలకన్నా దీపికా చేసినవి కఠినమైనవట.
‘అయ్యో ఆడపిల్ల కదా...’ అని ప్రత్యేక సదుపాయాలు ఇవ్వడంగానీ, కొంచెం రిస్క్ తగ్గించడం కానీ చేయలేదు. దీపికా కూడా వెనకడుగు వేయడానికి ఇష్టపడలేదు. ఎంత క్లిష్టమైనా ఫర్వాలేదని ఆ పోరాట దృశ్యాలను చేశారు. ఫైట్స్ చిత్రీకరించే ముందు దీపికా బాగా రిహార్సల్ చేశారని, అద్భుతంగా చేసి ‘డేర్ డెవిల్’ అనిపించుకున్నారని సమాచారం. దీపికా క్రీడా నేపథ్యం ఉన్న కుటుంబానికి చెందిన అమ్మాయి అనే విషయం తెలిసిందే. ఆమె తండ్రి ప్రకాష్ పదుకొనే, చెల్లెలు అనీషా ఇద్దరూ క్రీడాకారులే. దీపిక కూడా బ్యాడ్మింటన్ బాగా ఆడతారు.
చదువుకొనే రోజుల్లో జాతీయ స్థాయిలో ఆడారట. క్రీడాకారులకు మంచి ఫిట్నెస్ ఉంటుంది కాబట్టి, దీపిక ఈ క్లిష్టమైన ఫైట్స్ చేయగలిగారని చిత్రదర్శకురాలు సౌందర్య అంటున్నారు. తను నటించే సినిమాల్లో క్లిష్టమైన పోరాటాలు చేయాలని దీపిక ఎప్పటి నుంచో కల కంటున్నారట. ఆ కల ‘కొచ్చడయాన్’తో నెరవేరిందని, భవిష్యత్తులోనూ ఇలాంటి అవకాశం వస్తే తప్పకుండా చేస్తానని దీపిక అన్నారు.