విభజన భయంతో ఆగిన గుండెలు
సాక్షి నెట్వర్క్: రాష్ట్రం ముక్కలవుతుందనే భయంతో సీమాంధ్ర జిల్లాల్లో ప్రాణాలొదిలేస్తున్న వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. శనివారం ఒక్కరోజే ఎనిమిది మంది మృత్యువాత పడ్డారు. తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరానికి చెందిన పెయింటర్ విప్పర్తి రజని(37), తాళ్లరేవు మండలం గోవలంకకు చెంది రైతు కూలీ కె.వి.వి.సత్యనారాయణ(52) శనివారం మధ్యాహ్నం గుండెపోటుతో మరణించారు. అల్లవరం మండలం తుమ్మలపల్లిలోబొంతు రాజేంద్రప్రసాద్ (48) శనివారం మధ్యాహ్నం గ్రామంలో జరిగిన కేసీఆర్ దిష్టిబొమ్మ శవయాత్ర, ఆందోళనల్లో పాల్గొన్న అనంతరం ఇంటికి తిరిగి వచ్చి సాయంత్రం గుండెపోటుతో మృతి చెందాడు. విభజనపై ఆందోళన ఉధృతం అవుతుండటంతో ఉద్వేగానికి గురై పశ్చిమగోదావరి జిల్లా గోపాలపురం మండలం దొండపూడి గ్రామానికి చెందిన వ్యవసాయకూలీ దేశాబత్తుల గొంతెమ్మ(47) గుండెపోటుతో మరణించింది. అనంతపురం జిల్లా ఓబుళదేవరచెరువుకు చెందిన వెంకటరమణ(70), పెద్దపప్పూరు మండలం చీమలవాగుపల్లికి చెందిన షరీఫ్(45) గుండెఆగి కన్నుమూశారు. రాష్ట్ర విభజన నిర్ణయాన్ని తట్టుకోలేక కర్నూలు జిల్లా వికలాంగుల సంక్షేమ సంఘం తుగ్గలి మండల కోశాధికారి చెన్నంపల్లి రంగన్న(37) శనివారం తెల్లవారు జామున గుండెపోటుతో మృతి చెందారు. అదేవిధంగా కొత్తపల్లి మండలం ప్రాతకోటకు చెందిన వెంకటసుబ్బయ్య(49) గుండెపోటుతో మరణించారు.